ప్రశ్నించిన జర్నలిస్టులపై బండ బూతులా! ఇదేందయా కేసీఆర్..
posted on Nov 8, 2021 @ 11:51AM
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. హుజురాబాద్ ఓటమి షాక్ లో ఉన్నారో, వరి కొనుగోలు చేయడం లేదంటూ రైతులు చేస్తున్న ఆందోళనలతో టెన్షన్ లో ఉన్నారో తెలియదు కాని.. ప్రెస్ మీట్ లో తన అక్కసంతా వెళ్లగక్కారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ప్రధాని మోడీని సన్నాసి అంటూ మాట్లాడారు. ఇక తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ను దారుణంగా టార్గెట్ చేశారు. నాలుక కోస్తానని హెచ్చరించారు. నాలుగు ముక్కలు చేస్తామంటూ భయపెట్టారు. విపక్ష నేతలపై విరుచుకుపడిన కేసీఆర్.. జర్నలిస్టులపైనా తన అక్రోశం వెళ్లగక్కారు. తనను ప్రశ్నించిన వారిపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఇదే ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది.
ప్రగతి భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన సీఎం కేసీఆర్ ను కొందరు జర్నలిస్టులు కొన్ని సమస్యలపై ప్రశ్నించారు. అందులో భాగంగానే ఓ జర్నలిస్ట్ ప్రశ్న వేశాడు. దీంతో ఒక్కసారిగా ఆవేశంలో ఊగిపోయారు కేసీఆర్. తనను ఇబ్బందికర ప్రశ్న వేశారనే కోపంతో తీవ్రంగా స్పందించారు. నీ బోడముండ వాదన అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జర్నలిస్టును వ్యక్తిగతంగా సంభోదిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లొట్టపీసు వాదన అంటూ హేళన చేశారు. తలాతోక లేని వాదన, గాడిద అంటూ విరుచుకుపడ్డారు. నీకు జ్ఞానం లేదంటూ నేరుగా జర్నలిస్టును ఉద్దేశించి కామెంట్ చేశారు కేసీఆర్.
ప్రెస్ మీట్ లో జర్నలిస్టును టార్గెట్ చేస్తూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అడిగిన ప్రశ్నకు సరిగా సమాధానం చెప్పలేకే ముఖ్యమంత్రి అలా చిందులు వేశారనే చర్చ జరుగుతోంది. సీఎం తీరుపై జర్నలిస్టు సంఘాలు మండిపడుతున్నాయి. ప్రెస్ మీట్ లో జర్నలిస్టులు ప్రశ్నలు అడగడం సహజమని, వాటికి హుందాగా సమాధానం చెప్పాలి కాని.. ఇలా బెదిరించేలా మాట్లాడం ఏంటని జర్నలిస్టు సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. మీట్ ది ప్రెస్ లో జర్నలిస్టుల ప్రశ్నలకు సమాధానం చెప్పకపోయినా ఫర్వా లేదు కాని.. ప్రెస్ మీట్ లో అలా ఉండదని అంటున్నారు. సీఎంవో ఆహ్వానిస్తేనే ప్రెస్ మీట్ కు జర్నలిస్టులు వచ్చారన్న సంగతి ముఖ్యమంత్రి గుర్తు పెట్టుకుంటే మంచిదని అంటున్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ తన వైఖరి మార్చుకుని జర్నలిస్టులపై దాడి చేయడం మానుకోవాలని సూచించారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు.
జర్నలిస్టులను ఉద్దేశించి సీఎం కేసీఆర్ మాట్లాడిన మాటలపై విపక్షాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. వరుసగా తగలుతున్న షాకులపై మైండ్ బ్లాంక్ అయిన కేసీఆర్... ఇలా అడ్డగోలుగా మాట్లాడుతున్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. మరోసారి జర్నలిస్టులను కించపరిచేలా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.