తీన్మార్ మల్లన్నను జైలులో చంపాలని చూశారా?
posted on Nov 8, 2021 @ 8:46PM
తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్.. తెలంగాణలో కొన్ని రోజులుగా ఈ పేరు హాట్ టాపిక్. తన క్యూ న్యూస్ ఛానెల్ ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వంపై యుద్ధం చేస్తున్నారు తీన్మార్ మల్లన్న. ప్రభుత్వ వైఫల్యాలు, అధికార పార్టీ నేతల అక్రమాలను బట్టబయలు చేస్తున్నారు. గులాబీ లీడర్లను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాడు మల్లన్న. రాష్ట్రంలో ఎక్కడ అవినీతి జరిగినా దాని వెనుక ఎవరున్నారు..? ఏం చేశారు..? ఎంత నొక్కేశారు..? ఫుల్ డేటేల్స్ తో ప్రజల ముందు పేట్టేవాడు. ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపుతూ టీఆర్ఎస్ నేతలకు కంట్లో నలకలా చుక్కలు చూపించాడు. అంతేకాదు నల్గొండ- వరంగల్- ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు చుక్కలు చూపించి.. దాదాపుగా గెలిచినంత పని చేశారు తీన్మార్ మల్లన్న.
తీన్మార్ మల్లన్న తనకు కంట్లో నలుసుగా మారారని భావించిన కారు పార్టీ.. అతన్ని టార్గెట్ చేసింది. అప్పుడే లక్ష్మికాంతశర్మ అనే జ్యోతిష్యుడి కేసు తెరపైకొచ్చింది. డబ్బుల కోసం బెదిరించాడంటూ మల్లన్నపై ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆగస్టులో మల్లన్నను అరెస్ట్ చేశారు. మల్లన్న జైలులో ఉండగా ఒకదాని తర్వాత మరో కేసు తెరపైకి వచ్చాయి. ఆయనకు బెయిల్ రావడం కొత్త కేసులో మళ్లీ జైలుకు వెళ్లడం జరుగుతోంది. మల్లన్నపై ఇప్పటివరకు 38 కేసులు నమోదు కాగా అందులో 6 కేసులను హైకోర్టు కొట్టివేసింది. మిగతా 32 కేసుల్లో 31 కేసులకు బెయిల్ మంజూరైంది. తన భర్తపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మల్లన్న భార్య హోంమంత్రి అమిత్ షాను సైతం కలిసి ఫిర్యాదు చేసింది. జాతీయ బీసీ కమిషన్ కూడా కేసుల విషయంలో ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా మరోసారి మల్లన్నకు బెయిల్ మంజూరైంది.
73 రోజుల జైలు జీవితం తర్వాత బయటకొచ్చారు తీన్మార్ మల్లన్న. ఈ సందర్భంగా ఆయన సంచలన ప్రకటన చేశారు. జైలులో తనని చంపాలని చూశారని అన్నారు. చంచల్ గూడ జైలులో సీఎం కేసీఆర్ బాధితులు 500 మంది వరకు ఉన్నారని పూర్తి వివరాలు త్వరలోనే బయటపెడతానని చెప్పారు. తెలంగాణ యావత్ ప్రజానీకానికి ప్రశ్నించే గొంతుకను 73 రోజులు జైలులో పెట్టారని అన్నారు మల్లన్న. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఒక అరాచకాన్ని క్రియేట్ చేయాలని చూశారని ఆరోపించారు. ఆఖరికి బయటకొస్తున్న చివరి నిమిషం వరకు అడ్డుకునే అడ్డుకునే ప్రయత్నం చేశారని చెప్పారు. అయినా.. 73 రోజులు ఉన్నోడికి ఇంకో పది రోజులు లెక్కనా..? 33 కేసులు ఉన్నోడికి ఇంకో మూడు లెక్కనా..? అంటూ దీటైన సమాధానం ఇచ్చారు. తప్పు చేసినోడే భయపడతాడన్న ఆయన.. తాను ఏ తప్పు చేయలేదు కాబట్టే బయటకొచ్చానని వివరించారు.
న్యాయస్థానాల మీద తనకు నమ్మకం ఉందన్న మల్లన్న.. కేసులపై నిష్పక్షపాతంగా విచారణ జరగాలని ఈ వ్యవహారంపై డిఫమేషన్ సూట్ వేస్తున్నట్లు తెలిపారు. ఎవరెవరు ఇందులో పాలు పంచుకున్నారో వాళ్లు తప్పకుండా ప్రతిఫలం అనుభవించాల్సిందేనని హెచ్చరించారు. అతి త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని.. తాను బయటకు రావాలని కోరుకున్న వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వారిపక్షాన పోరాడతానని చెప్పారు. ఎప్పటిలాగే క్యూన్యూస్ లో మార్నింగ్ న్యూస్ ప్రోగ్రాం చేస్తానని స్పష్టం చేశారు తీన్మార్ మల్లన్న.