దళిత సీఎంపై మాట తప్పింది నిజమే.. ఏడేండ్లకు ఒప్పుకున్న కేసీఆర్
posted on Nov 8, 2021 @ 4:22PM
తెలంగాణ వస్తే దళితుడే ముఖ్యమంత్రి... ఇదీ ఉద్యమ సమయంలో కేసీఆర్ చేసిన ప్రకటన. ఒక సభలో కాదు వందలాది సభల్లో ఇదే మాట చెప్పారు కేసీఆర్. కాని తెలంగాణ ఏర్పడ్డాకా మాట మార్చారు. 2014లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగా.. దళిత ముఖ్యమంత్రి ప్రకటన పక్కనపెట్టి తానే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీనిపై గత ఏడున్నర ఏండ్లుగా విమర్శలు వస్తూనే ఉన్నాయి. దళిత సంఘాలతో పాటు విపక్షాలు సమయం వచ్చినప్పుడల్లా కేసీఆర్ ను ప్రశ్నిస్తూనే ఉన్నాయి. అయితే ఇంతకాలం ఈ విషయంపై సైలెంట్ గా ఉంటూ వస్తున్నారు కేసీఆర్.
తాజాగా దళిత ముఖ్యమంత్రి విషయంలో కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. ఏడున్నర ఏండ్ల తర్వాత అసలు నిజం ఒప్పుకున్నారు. తెలంగాణకు దళితుడి ముఖ్యమంత్రిని చేస్తానని తాను చెప్పింది నిజమేనని అంగీకరించారు. దళితున్ని ముఖ్యమంత్రి ఎందుకు చేయలేదో కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి, చేయకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయని అన్నారు.తామే దళితున్ని ముఖ్యమంత్రి చేయనివ్వలేదని కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీయే స్వయంగా ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు.
దళితున్ని ముఖ్యమంత్రి చేయకపోయినా ప్రజలు తన నిర్ణయాన్ని స్వాగతించారని చెప్పారు కేసీఆర్. రెండోసారి కూడా టీఆర్ఎస్ పార్టీకే ప్రజలు అధికారం కట్టబెట్టారని చెప్పారు. తెలంగాణలో తాను ఏ మూలకు వెళ్లినా ప్రజలు గెలిపించారని వెల్లడించారు. ఎక్స్‌పైర్ అయిన మెడిసిన్ లాగా దళితున్ని సీఎం చేస్తానని చెప్పి చేయలేదని అంటున్నారు, ఆ తర్వాత కూడా ప్రజలు నాకే అధికారం కట్టబెట్టారని గుర్తుచేస్తూ బీజేపీ నేతలను ఎద్దేవా చేశారు సీఎం కేసీఆర్.