విరాట్ కోహ్లీకి బైబై.. వరల్డ్ కప్ లో భారత్ చెత్త షో
posted on Nov 8, 2021 @ 9:33PM
టీట్వంటీ వరల్డ్ కప్ నుంచి ఇంటికి చేరింది టీమ్ ఇండియా. అందరి అంచనాలకు తలకిందులు చేస్తూ పేలవమైన ఆట తీరుతో లీగ్ దశలోనే నిష్క్రమించింది. టాప్ ఫెవరెట్ గా దుబాయ్ లో అడుగు పెట్టిన కోహ్లీ సేన... దాయాది పాకిస్తాన్ చేతిలో తొలి మ్యాచ్ లోనే చిత్తుచిత్తుగా ఓడిపోయింది. తర్వాత కివీస్ తోనూ పరాజయం పాలై సెమీస్ ఆశలు చేజార్చుకుంది. చివరి మూడు మ్యాచ్ ల్లో పసికూనలపై ఘన విజయాలు సాధించింది కోహ్లీసేన. ట్వీటంటీ వరల్డ్ కప్ లో లీగ్ దశలోనే నిష్క్రమించిన టీమ్ ఇండియా.. ఇద్దరు ప్లేయర్లకు వీడ్కోలు పలికింది.
టీ20 ప్రపంచకప్ టోర్నీని భారత్ ఘన విజయంతో ముగించింది. నామమాత్రమైన ఆఖరి మ్యాచ్‌లో నమీబియాపై టీమ్‌ఇండియా 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. బ్యాటర్లు, బౌలింగ్‌లో ఆధిపత్యం కనబరిచిన భారత్ సునాయాస విజయంతో ఇంటిముఖం పట్టింది. వరుసగా మూడు విజయాలు సాధించినా సెమీస్ బెర్తు సాధించలేకపోయింది. గ్రూప్-2 నుంచి పాక్, కివీస్ సెమీస్‌కు చేరుకున్నాయి. టీ20 ప్రపంచకప్ తర్వాత టీ20 జట్టు పగ్గాలను వదిలేస్తానని ప్రకటించిన కోహ్లీకి, హెడ్ కోచ్‌గా పదవీకాలం ముగిసిన రవిశాస్త్రికి ఘన వీడ్కోలు చెప్పినట్టైంది.
నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియాను భారత్ బౌలర్లు 132/8 పరుగులకే కట్టడి చేశారు. అనంతరం టీమ్‌ఇండియా కేవలం ఒక్క వికెట్‌ను మాత్రమే కోల్పోయి 15.2 ఓవర్లలో 136 పరుగుల చేసి విజయం గెలుపొందింది. ఓపెనర్లు రోహిత్ శర్మ 56, కేఎల్ రాహుల్ 54 పరుగులు చేశారు. ఓపెనర్లు తొలి వికెట్‌కు అర్ధశతక (86) భాగస్వామ్యం నిర్మించారు. అయితే రోహిత్ ఔటైనా.. పరుగుల వేగం మాత్రం తగ్గలేదు. అనంతరం సూర్యకుమార్ తో కలిసి రాహుల్ లాంఛనాన్ని పూర్తి చేశాడు. నమీబియా బౌలర్ ఫ్రైలింక్ ఒక వికెట్ తీశాడు.
నమీబియా బ్యాటర్లలో మైకెల్ 14, క్రెయిగ్ డకౌట్, ఎరాస్మస్ 12, జాన్ నికోల్ 5, స్మిత్ 9, ఫ్రైలింక్ 15*, రుబెన్ 13* పరుగులు చేశారు. 47 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన నమీబియాను కెప్టెన్ ఎరాస్మస్‌తో కలిసి వైజ్ కాస్త ఆదుకున్నాడు. అయితే స్వల్ప వ్యవధిలో వికెట్లను కోల్పోవడంతో ఇబ్బందుల్లో పడింది. చివర్లో ఫ్రైలింక్, రుబెన్ ధాటిగా ఆడటంతో నమీబియా స్కోరు 130 దాటింది. భారత బౌలర్లలో జడేజా 3, అశ్విన్ 3, బుమ్రా 2 వికెట్లు పడగొట్టారు