బెజవాడ టూ జబల్పూర్.. హోంమంత్రి సుచరితకి రఘురామ ఖతర్నాక్ షాక్..
posted on Nov 9, 2021 @ 11:03AM
ఎంపీ రఘురామకృష్ణరాజు తెలుసుగా. ఆయన టార్గెట్ ఒక్కటే. తన పార్టీని మాగ్జిమమ్ డ్యామేజ్ చేయడమే. జగన్‌కు నిద్ర లేకుండా చేసేలా కేసుల మీద కేసులు వేయడమే. ప్రభుత్వ లోటుపాట్లను, పథకాల్లో డొల్లతనాన్ని, పాలనలో తప్పుడు విధానాలను నిత్యం ఎండగట్టడమే ఆయన పని. జగన్‌కి, విజయసాయికి, వైసీపీకి చుక్కలు చూపిస్తూ.. ఎక్కడ తప్పు కనిపిస్తే చాలు.. ఆ పాయింట్ పట్టుకొని ఎందాకైనా వెళతారు. చివరి వరకూ పోరాడుతారు. ఓటమిని అస్సలు ఒప్పుకోరు. గతంలో ఏ1, ఏ2ల బెయిల్ రద్దు చేసి జైలుకు తరలించాలంటూ సీబీఐ కోర్టులో కేసులు వేసి గట్టిగా ట్రై చేశారు. ఆ తర్వాత హైకోర్టును ఆశ్రయించారు. ఇలా వదల బొమ్మాళీ అంటూ వైసీపీ వెంటే పడుతున్నారు రఘురామ. తాజాగా, ఏపీ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరితకు ఖతర్నాక్ షాక్ ఇచ్చారు రఘురామ కృష్ణరాజు.
ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి మేకతోటి సుచరిత భర్త మేకతోటి దయాకర్ ఇటీవల విజయవాడ ఐటీ కమిషనర్‌గా వచ్చారు. ఆయన బాధ్యతలు స్వీకరించే రోజు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ప్రభుత్వం మనదే.. పట్టుకునే ఐటీ అధికారీ మనోడే అంటూ సంబరాలు చేసుకున్నారు. ఈ విషయం రఘురామకు తెలిసింది. క్షణం ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగిపోయారు. నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు ఫిర్యాదు చేశారు. ఐటి కమీషనర్ గా హోం మంత్రి మేకతోటి సుచరిత భర్త దయాసాగర్ ని విజయవాడలో నియమించటం సర్వీస్ రూల్స్ కు వ్యతిరేకం అని కంప్లైంట్ చేశారు. ఆయన జాయినింగ్ రోజు పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు స్వాగతం పలికిన ఫోటోలు కూడా జత పరిచారు. కట్ చేస్తే.. ఐటీ కమిషనర్ మేకతోటి దయాకర్‌ను విజయవాడ నుంచి మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్‌కు బదిలీ చేశారు. రఘురామ దెబ్బకు వైసీపీ శ్రేణుల ఉత్సాహమంతా నీరుగారిపోయింది.
కేంద్ర హోంశాఖకు రూల్స్ తెలీవని అనుకోలేం. వైసీపీ పెద్దల లాబీయింగ్‌తోటే మేకతోటి దయాకర్‌ను విజయవాడ బదిలీ చేసి ఉంటారని అంటున్నారు. అంత స్ట్రాంగ్ రిఫరెన్స్ ఉన్నా కూడా.. రఘురామ ఎంట్రీతో అదంతా తుస్సుమందంటే మామూలు విషయం కాదు. అంటే, కేంద్రంలో వైసీపీ పెద్దల కంటే.. రఘురామ వెయిటే ఎక్కువ అన్నట్టేగా? అంతేగా..! అంతేగా...!!