షోయబ్ అక్తర్‌పై 100 కోట్ల పరువునష్టం దావా.. ముదిరిన పీటీవీ వివాదం..
posted on Nov 8, 2021 @ 5:41PM
షోయబ్ అక్తర్ వర్సెస్ పీటీవీ. వరల్డ్ కప్ ప్రారంభంలో జరిగిన వివాదం.. కప్ ముగియకుండానే బాగా ముదిరిపోయింది. పాకిస్తాన్ టెలివిజన్‌లో షోయబ్ కామెంటరర్‌గా ఉండటం.. పీటీవీ యాంకర్‌తో మాటామాటా పెరగడం.. షో మధ్యలోనుంచే అక్తర్ వెళ్లిపోవడం తెలిసింది. ఆ వివాదం ఇప్పుడు పరువునష్టం దావా వరకూ దారి తీయడం మరింత కలకలం రేపుతోంది.
టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌పై పాక్ విజయం తర్వాత పీటీవీలో మ్యాచ్‌పై విశ్లేషణ కార్యక్రమం జరిగింది. అందులో అక్తర్ చేసిన వ్యాఖ్యలపై హోస్ట్ నియాజ్ మాట్లాడుతూ.. ‘‘మీరు కొంచెం మొరటుగా మాట్లాడుతున్నారు. మరీ అంత ఓవర్ స్మార్ట్ పనికిరాదు. మీరిక ఇక్కడి నుంచి వెళ్లొచ్చు’’ అన్నారు. యాంకర్ మాటలకు ఫీల్ అయిన అక్తర్.. లైవ్ నుంచి వెళ్లిపోయారు. పోతూ పోతూ పీటీవీ అనలిస్ట్ ఉద్యోగానికి అక్కడే రాజీనామా చేసి వెళ్లిపోయారు.
కట్ చేస్తే.. ఇప్పుడు అక్తర్‌కు 100 కోట్ల పరువునష్టం నోటీసులు పంపించింది పీటీవీ. చర్చ జరుగుతుండగా లైవ్‌లో రాజీనామా చేయడం నిబంధనల ఉల్లంఘన కిందికి వస్తుందని తెలిపింది. అక్తర్ రాజీనామా కారణంగా చానల్‌కు ఆర్థికంగా నష్టం వాటిల్లిందని చెబుతోంది. ముందస్తు సమాచారం లేకుండా టీ20 ప్రపంచకప్ కోసం దుబాయ్ వెళ్లిపోయాడని.. క్రికెటర్ హర్భజన్ సింగ్‌తో కలిసి ‘ఇండియన్ టీవీ’లో కనిపించాడని, ఇది పీటీవీకి కోలుకోలేని దెబ్బ అంటూ నోటీసులో తెలిపింది. జరిగిన నష్టానికి గాను పీటీవీకి రూ.100 కోట్లు చెల్లించాలని.. దాంతోపాటు మూడు నెలల జీతానికి సమానమైన రూ. 33,33,000 కూడా కట్టాలంటూ నోటీసులు ఇచ్చింది. లేదంటే పీటీసీ తీసుకునే చట్టపరమైన చర్యలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది.
పీటీవీ నుంచి నోటీసులు అందుకున్న షోయబ్ అక్తర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన గౌరవ మర్యాదలను కాపాడలేకపోయిన పీటీవీ ఇప్పుడు తనకు నోటీసులు పంపిందంటూ ట్వీట్ చేశారు. తాను స్వతహాగా ఫైటర్‌నని, తాను కూడా చట్టబద్ధంగా పోరాడతానని తేల్చి చెప్పారు.