కుప్పంలో లోకేశ్.. మహా పాదయాత్రపై లాఠీ.. సూర్యాపేటలో జై భీమ్.. టాప్‌న్యూస్ @1pm
posted on Nov 11, 2021 @ 11:44AM
1. కుప్పం రాజకీయ రణక్షేత్రంలోకి నారా లోకేశ్ ఎంట్రీ ఇస్తున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ రెండు రోజుల పాటు కుప్పంలో పర్యటించనున్నారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో లోకేష్ పాల్గొంటారు. స్థానిక టీడీపీ నేతలకు ఎలక్షన్ వ్యూహాలపై దిశానిర్దేశ్యం చేయనున్నారు నారా లోకేశ్.
2. విశాఖలో పలు చోట్ల ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. మారిటైం బోర్డ్ చైర్మన్ కాయలు వెంకట్ రెడ్డి, కె.వి.ఆర్ గ్రూప్, స్కైలైన్ అపార్ట్‌మెంట్ నిర్మిస్తున్న వైష్ణవి బిల్డర్స్, గౌతు శివాజీ అల్లుడు, వెంకన్న చౌదరి సర్‌దాత్ నెస్ట్‌కు చెందిన రియల్ ఎస్టేట్, వారికి చెందిన కంపెనీలపై, వారి బంధువుల ఇళ్లలో ఐటి అధికారులు సోదాలు చేస్తున్నారు. 20 బృందాలు తనిఖీలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
3. బెదిరింపులతో ఉద్యోగుల హక్కులు ఎలా కాలరాస్తారని టీడీపీ ప్రశ్నిస్తోంది. కంట్రోల్‌లో ఉండవలసిన అవసరం ఉద్యోగ సంఘ నాయకులకు ఎందుకు వచ్చిందని నిలదీస్తోంది. సీపీఎస్ పేరుతో ఇంకెన్నాళ్ళు కాలయాపన చేస్తారో జగన్ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. పీఆర్సీ ఒక్కటే కాదు 100పైగా సమస్యలకు పరిష్కారమెప్పుడో ప్రభుత్వం చెప్పాలన్నారు. ఎయిడెడ్ ఉద్యోగుల భవితవ్యం ఏమిటో తేల్చాలంటున్నారు.
4. ఉద్యోగుల సమస్యలపై ఉద్యోగ సంఘాలు దూకుడు పెంచాయి. హెల్త్ సెక్రటరీ ముద్దాడ రవిచంద్రతో ఏపీ జేఏసీ అమరావతి నేతలు భేటీ అవుతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులకు ఉన్న సమస్యలపై 40 డిమాండ్లతో వినతిపత్రం ఇవ్వనున్నారు. బోధన డాక్టర్లలకు పీఆర్సీ 2016 నుంచి అమలు చేయాలని, కోవిడ్ సమయంలో తీసుకున్న వైద్యులకు రెండేళ్లకే ప్రొహిబిషన్ ఇవ్వాలని, వైద్య విధాన పరిషత్‌లో పనిచేస్తున్న డాక్టర్లకు టైం బౌండ్ ప్రమోషన్‌లు ఇవ్వాలని, స్టాఫ్ నర్సులు, ఏఎన్‌ఎంల సమస్యలు తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.
5. ఏపీలో ‘విద్య వద్దు - మద్యం ముద్దు’ అన్నట్టు జగన్మోహన్ రెడ్డి పాలన ఉందని బీజేపీ నేత లంకా దినకర్ విమర్శించారు. ముఖ్యమంత్రి అనాలోచిత నిర్ణయంతో ఎయిడెడ్ పాఠశాలల్లో పిల్లల చదువులు రోడ్డున పడ్డాయన్నారు. సీఎంకు మద్యం దుకాణాల నిర్వాహణపై ఉన్న మక్కువ.. విద్యాలయాల నిర్వాహణపై లేదన్నారు. అదనపు అప్పు కోసం మద్యం రేట్లు పెంచి మద్యం వినియోగదారులతో ఆ అప్పు కట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
6. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు నుంచి రాజధాని రైతుల పదకొండవ రోజు మహాపాదయాత్ర ప్రారంభమైంది. పాదయాత్రకు రాజధాని రైతులను మాత్రమే పోలీసులు అనుమతిస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి స్థానికులు రాకుండా ఎక్కడికక్కడ బారీకేడ్లు ఏర్పాటు చేశారు. పాదయాత్ర ఆసాంతం పోలీసులు భారీగా మోహరించారు. పోలీసులు లాఠీచార్జి చేయడంపై రైతుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
7. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నందున అమరావతి రైతుల మహా పాదయాత్రలో ఇతరులు ఎవ్వరూ పాల్గొన కూడదని ఆదేశాలు జారీ చేశారు పోలీసులు. ఆ మేరకు అమరావతి జీఏసీ నేతలకు పోలీసులు నోటీసులు ఇవ్వడంపై జేఏసీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీలకతీతంగా సాగుతున్న యాత్రకు తమకు నోటీసులు ఎలా ఇస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. ఇక, హైకోర్టు అనుమతి ఉన్న ఈ పాదయాత్రకు ఎన్నికల కోడ్ అడ్డంకి కాదన్నారు టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర.
8. హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం రేపుతోంది. ఆసీఫ్ నగర్‌లో పోలీసులు భారీగా డ్రగ్స్‌ను పట్టుకున్నారు. ముగ్గరు ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. పట్టుబడిన డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారనే దిశగా ఆరా తీస్తున్నారు. ఏపీ నుంచి వచ్చాయా? లేక, స్థానికంగానే తయారు చేస్తున్నారా? అని విచారిస్తున్నారు.
9. జై భీమ్ సినిమా తర్వాత గిరిజనుల్లో కాస్త ధైర్యం వచ్చింది. తాజాగా, సూర్యాపేట జిల్లాలోని ఆత్మకూర్(ఎస్) పోలీస్ స్టేషన్ ముందు రామోజీ తండావాసుల ఆందోళనకు దిగారు. దొంగతనం అనుమానంతో రామోజీ తండాకు చెందిన గుగులోతు వీరశేఖర్‌ను పోలీస్ స్టేషన్‌లో కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వీరశేఖర్‌తో పోలీస్ స్టేషన్ ముందు 200 మంది గిరిజనులు ఆందోళనకు దిగారు. ఎస్ఐపై దాడికి యత్నించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
10. అనంతపురం జిల్లా ఎస్‌ఎస్‌బీఎన్ కళాశాలకు యాజమాన్యం మరో రెండు రోజుల పాటు సెలవు ప్రకటించింది. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో ముందుగా రెండు రోజుల పాటు సెలవు ప్రకటించిన యాజమాన్యం.. హాలిడేస్‌ను మరో రెండు రోజులు పొడిగించింది. ఎస్ఎస్‌బిఎన్ కళాశాల ప్రధాన గేటు ముందు స్పెషల్ పార్టీ పోలీసులు భారీగా మోహరించారు.