జగన్ ఫేక్ సీఎం.. పీఆర్సీపై జేఏసీ యాక్షన్.. ప్రభాకర్‌కు సీబీఐ పంచ్.. టాప్‌న్యూస్ @7pm
posted on Nov 11, 2021 @ 5:48PM
1. జగన్‌రెడ్డి ఒక ఫేక్ ముఖ్యమంత్రి అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఫోర్జరీ సంతకాలతో వైసీపీ నేతలు ఏకగ్రీవాలు చేసుకుంటున్నారని ఆరోపించారు. అభ్యర్థులు కోర్టుకెళ్తే సీఎం, మంత్రులు జైలుకెళ్లాల్సి వస్తుందని చంద్రబాబు హెచ్చరించారు. నామినేషన్లను బలవంతంగా ఉపసంహరింపజేశారని.. ప్రశ్నించే వారిపై బెదిరింపులు, దాడులకు పాల్పడుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
2. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం చదలవాడ దగ్గర రైతుల మహా పాదయాత్రలో పోలీసుల లాఠీఛార్జ్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ మండిపడ్డారు. పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న వారిపై పోలీసులు లాఠీఛార్జ్ చెయ్యడం దారుణమన్నారు. లాఠీఛార్జ్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకూ అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర జగన్ సర్కారుకి కంటిమీద కునుకు లేకుండా చేస్తోందన్నారు.
3. అసలు పీఆర్సీ ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి ఉందా? ఆ ఆలోచన ప్రభుత్వానికి ఉంటే నివేదిక కాపీ ఎందుకు ఇవ్వడంలేదని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు ప్రశ్నించారు. పీఆర్సీలో కొన్ని శాఖలకు అన్యాయం జరిగితే గతంలో మరో కమిటీ వేయించుకున్న చరిత్ర ఉందన్నారు. ప్రభుత్వంతో శుక్రవారం నాటి సమావేశంలో నివేదిక కాపీ కోసం పట్టుపడతామని చెప్పారు.
4. సీఎం జగన్‌కు ఉద్యోగులపై చిన్నచూపు ఎందుకు? అని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. సమస్యలు పరిష్కరించమంటే జీతం ఇస్తున్నాం కదా అని మాట్లాడతారా అని నిలదీశారు. సీపీఎస్ రద్దు, పీఆర్సీ అమలు, డీఏ బకాయిల హామీలు ఏమయ్యాయి? అని ప్రశ్నించారు. ఉద్యోగుల జీపీఎఫ్ సొమ్ము దారి మళ్లింపు సిగ్గుచేటన్నారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు.
5. మెడికల్ కాలేజీ విషయంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ఎయిమ్స్‌కు స్థలం ఇవ్వలేదని బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. బీబీనగర్‌లో ఎయిమ్స్ కోసం 24 ఎకరాల స్థలం కేటాయించామని తెలిపారు. వరి, సిలిండర్, కేసీఆర్ కిట్ ఇలా అన్ని అంశాల్లో బీజేపీవి అబద్ధాలేనని చెప్పారు. దుష్ప్రచారంలో బీజేపీ నేతలు గోబెల్స్‌ను మించిపోతున్నారని హరీష్‌రావు దుయ్యబట్టారు.
6. మద్యపాన నిషేధంపై సీఎం జగన్ క్లారిటీ ఇవ్వాలని ఎంపీ రఘురామకృష్ణరాజు డిమాండ్ చేశారు. మద్య నిషేధం చేయక పోతే ఓట్లు అడగనని ఎన్నికల్లో జగన్ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. మద్యంపై ఆదాయాన్ని తాకట్టు పెట్టి రుణాలు తెస్తున్నారని విమర్శించారు. ఎయిడెడ్ స్కూళ్లపై వైసీపీ నేతల వింత పోకడలు పోతున్నారని తప్పుబట్టారు. సంఖ్యాబలం లేకపోయినా సీపీఐ, టీడీపీ నేతల పోరాటం చిరస్మరణీయమని రఘురామ కొనియాడారు.
7. హైదరాబాద్ ఇందిరాపార్కు దగ్గర వైఎస్ షర్మిల తలపెట్టిన 72 గంటల దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఆ స్థలంలో శుక్రవారం టీఆర్ఎస్ దీక్షకు ఇప్పటికే అనుమతి ఇచ్చామని పోలీసులు చెప్పారు. దీంతో కామారెడ్డి నియోజకవర్గంలో దీక్ష చేయాలని షర్మిల నిర్ణయించారు. శుక్రవారం నుంచి మూడు రోజులపాటు దీక్ష చేయనున్నారు షర్మిల.
8. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ నేతలపై పోలీసుల వేధింపులు కొనసాగుతున్నాయి. ప్రచారానికి అనుమతులు తీసుకోవాలంటూ ఆంక్షలు పెట్టి టీడీపీ అభ్యర్థులను ఇబ్బంది పెడుతున్నారు. దీంతో, చిత్తూరు జిల్లా కుప్పం డీఎస్పీ సర్క్యులర్, ఆంక్షలపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలయింది. కుప్పం నగర పంచాయతీ ఎన్నికల్లో ప్రచారంపై అక్కడ డీఎస్పీ విధించిన ఆంక్షలపై హైకోర్టు సీరియస్ అయింది. డీఎస్పీ ఇచ్చిన సర్క్యులర్‌ను హైకోర్టు కొట్టివేసింది.
9. పంచ్ ప్రభాకర్ అరెస్ట్‌కు సీబీఐ రంగం సిద్ధం చేసింది. పంచ్ ప్రభాకర్‌పై ఇంటర్ పోల్ ద్వారా సీబీఐ బ్లూ నోటీసును జారీ చేసింది. అతిత్వరలోనే ప్రభాకర్‌ను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు, ఏపీ హైకోర్టు జడ్జీలపై, న్యాయాధికారులపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో మరో ఐదుగురిపై సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఇప్పటి వరకూ మొత్తం 11 మంది నిందితులపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది.
10. హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్‌ను పోలీసులు పట్టుకున్నారు. దాదాపు 14.2 కేజీల డ్రగ్స్‌ను పోలీసులు సీజ్ చేసారు. హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియాకు డ్రగ్స్‌ను ముఠా తరలిస్తున్నది. ఫొటో ఫ్రేమ్స్‌లో డ్రగ్స్‌ను దాచి ముఠా పార్శిల్ చేసింది. బేగంపేట ఇంటర్ నేషనల్ పార్శిల్స్ ఆఫీస్‌లో డ్రగ్స్‌ను పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ విలువ రూ.5.5 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.