జగన్‌రెడ్డి ఒరిస్సా టూర్ వెనుకు ఇంత స్కెచ్ ఉందా?
posted on Nov 11, 2021 @ 6:06PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒరిస్సా వెళ్ళారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్’ తో భేటీ అయ్యారు. అధికారికంగా ముఖ్యమంత్రి ఒరిస్సా వెళ్ళింది, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసింది, ఉభయ రాష్ట్రాల సాగు నీటి సమస్యలు, రెండు రాష్టాల మధ్య అపరిష్కృతంగా ఉన్న ఇతర సమస్యలపై చర్చించేందుకే కావచ్చును, కానీ, అది నిజామా అంటే, కాదంటున్నారు. సహజంగా నీటి సమస్యలు, జల వివాదాలు లేదా కొన్ని పత్రికలలో వచ్చిన గంజాయి లింకుల వ్యవహారమే అయినా లేక మావోల సమస్య మరో సమస్య అయినా నేరుగా ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చలు జరగవు. ముందు వివిధ స్థాయిల్లో అధికారుల మధ్య, ఆ తర్వాత మంత్రుల స్థాయిలో చర్చలు జరుగుతాయి. చివరాఖరులో, అవసరం అనుకుంటే, ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చలు జరుగుతాయి. కానీ, ఇక్కడ అదేమీ లేదు.
ముఖ్యమంత్రుల భేటీకి ముందు ఏ స్థాయిలోనూ ఎలాంటి చర్చలు జరగలేదు. అధికారుల స్థాయిలో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగిన సమాచారం కూడా ఉన్నట్లు లేదు. ఒక్క సారిగా, ముఖ్యమంత్రి ప్రత్యేక ఫ్లైట్ ఎక్కి భువనేశ్వర్’లో దిగారు. అఫ్కోర్స్ ముందుగా ఒరిస్సా సీఎం అప్పాయింట్మెంట్ తీసుకోవడం, ఇతర ప్రోటోకాల్ ఫాలో అయ్యారు అనుకోండి, అయినా జగన్ రెడ్డి ఒరిస్సా పర్యటన పూర్తిస్థాయి అధికార పర్యటన అయితే కాదనే, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. స్వామి కార్యంతో పాటుగా స్వకార్యం కూడా చక్కబెట్టుకునే ఉద్దేశంతోనే, జగన్ రెడ్డి ఒరిస్సా వెళ్లి వచ్చారని విశ్వసనీయ వర్గాల భోగట్టా. అంతే కాదు, స్వామి కార్యం, స్వకార్యంతో పాటుగా, పొరుగు రాష్ట్రం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దూతగానూ జగన్ రెడ్డి ఒరిస్సా పర్యటన సాగిందని అటు అమరావతి ఇటు హైదరాబాద్ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇటీవల కాలంలో కేంద్రంతో కాలు దువ్వేందుకు ఉబలాట పడుతున్నారు. మరోవంక కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఏమి చేస్తుందో, అనే భయంతో షేక్ అవుతున్నారు. ఈ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ మరింత ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. ఈ నేపధ్యంలోనే, రాజకీయ టక్కుటమార గజకర్ణ గోకర్ణ విద్యలు తెలిసిన కేసీఆర్, రక్షణ కవచం ఏర్పరచుకునే ప్రయత్నాలలో పడ్డారని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. అందులో భాగంగానే కేసీఆర్ వరసగా రెండు రోజులు.. గంటలకు గంటలు ప్రెస్మీట్లు పెట్టి, ఎదో చేద్దామని ప్రయత్నించారు. అది కాస్తా బూమరాంగ్ అయింది. అలాగే ఇప్పుడు ఉత్తరాది - దక్షిణాది విబేధాలను సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దక్షణాది రాష్ట్రాల ప్రధాని అభ్యర్ధిగా ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పేరును తెర మీదకు తెచ్చేందుకు కేసీఆర్ ప్రణాళిక సిద్డం చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే, కేసీఆర్ ఒకే పడవలో ప్రయాణిస్తున్న మంచి మిత్రుడు జగన్ రెడ్డిని తమ దూతగా ఒరిస్సా పంపారని, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ రెండు రోజుల మారథాన్ ప్రెస్ మీట్’ లో చూచాయగా ఫెడరల్ ఫ్రంట్ ప్రస్తావన చేయడం, అలాగే, రాయలసీమ పట్ల ప్రేమను వొలక పోయడం, చేపల పులుసు సంగతులు గుర్తు చేసుకోవడంవంటి ఉదంతాలను విశ్లేషకులు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. ఇదంతా కేసీఆర్ ఆత్మ రక్షణ వ్యూహంలో భాగంగా తెర మీదకు తెస్తున్న ‘ఫ్రంట్’కు సంకేతాలని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, కేసీఆర్, జగన్ రెడ్డి నైజం తెలిసిన నవీన్ పట్నాయక్, కేసీఆర్ దూతగా జగన్ రెడ్డి చేసిన ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారని భువనేశ్వర్ నుంచి వస్తున్న సమాచారం.