మద్యంతో ‘రెండు ముక్కలాట’.. అప్పుల కోసం జగనన్న కొత్త ఎత్తులు!
posted on Nov 11, 2021 @ 3:11PM
అప్పు.. రెండక్షరాల ఈ చిన్న పదమే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి తారక మంత్రం. ఓ వంక ఆర్ధిక మంత్రి ఢిల్లీలో తిష్ట వేసి, అప్పు కోసం నానా తిప్పలు పడుతున్నారని వార్తలొస్తున్నాయి. మరోవంక, రాష్ట్ర ప్రజల తాగుడు సామర్ధ్యాన్ని, దాని నుంచి వచ్చే ఆదాయాన్ని ముందుగానే, తాకట్టు పెట్టి తెచ్చుకున్నఅప్పు కిస్తీ కట్టేందుకు, అదే దారిలో కొత్త అప్పు తెచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త దారులు వెతుక్కుంటోంది. రేపన్న ఆలోచన లేకుండా ఈ పూటగడిస్తే చాలన్న రీతిలో ఆర్థిక, పన్ను విధానాలను ‘తత్కాల్’ ప్రాతిపదికన తిరగ రాస్తోంది. రాష్ట్ర ఖజానాకు రావలసిన వ్యాట్ ఆదాయాన్ని వ్యూహాత్మకంగా కొత్త అప్పు, పద్దులోకి సర్దు బాటు చేసే, టక్కరి విద్యను చూపుతోంది.
ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 9న రెండు జీవోలు (312, 313) విడుదల చేసింది. సహజంగానే, ఆచారంగా కీలక జీవోలను దాచి పెడుతున్న జగన్ రెడ్డి ప్రభుత్వం, ఈ జీవోలను కూడా మూడో కంటికి కనిపించకుండా దాచిపెట్టింది. అయితే, ఎలాగో, ఈ చీకటి జీవోలు వెలుగులోకి వచ్చాయి. అలా వెలుగులోకి వచ్చిన ఈ సీక్రెట్ జీవోల సారాశం చూసి, ఆర్థిక నిపుణులే ఆశ్చర్య పోతున్నారు.
ఇక విషయంలోకి వస్తే, అప్పుల చేయండంలో అన్ని విధాలా ఆరితేరిన జగన్ రెడ్డి ప్రభుత్వం, ఇప్పటికే రాబోయే పాతిక సంవత్సరాల పాటు మద్యంపై వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చింది. అయితే, తెచ్చిన అప్పులు తెచ్చినట్లుగా బటన్ నొక్కి పందేరం చేస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వానికి ఎన్ని అప్పులు తెచ్చినా, ఎప్పుడు పరకడుపే. సో కొత్త అప్పుల కోసం జగన్ సర్కార్, మేదస్సునంతా ఉపయోగించి, వింత ఆలోచన ఆలోచన అనాలో వికార, వికృత ఆలోచన అనాలో తెలియదు గానీ, ఒక మోసపూరిత, కొత్త ఆలోచన అయితే చేసింది.
ఆర్థిక నిపుణలకు కూడా అంతు చిక్కని ఈ వింత ఆలోచన పర్యవసానంగా మద్యంపై విధిస్తున్న ‘వ్యాట్’ ఆదాయాన్ని ప్రభుత్వం ముక్కలు చేసింది. రాష్ట్ర ఖజానాకు రావలసిన వాటాకు గండి కొట్టి, బేవరేజెస్ కార్పొరేషన్ ఆదాయం పెంచే విధంగా వ్యాట్ ఆదాయాన్ని పంకాలు చేసింది. ఇప్పుడు.. జారీ చేసిన జీవో నెంబర్ 312, 313 ద్వారా మద్యంపై వచ్చే వ్యాట్ ఆదాయంలో చిన్న ముక్క ఆదాయం రాష్ట్ర ఖజానాకు జమ అవుతుంది. పెద్ద ముక్క ఆదాయం మాత్రం ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్‌లో జమ అవుతుంది. చిన్న ముక్కకు ‘వ్యాట్’ అనే పేరును కొనసాగిస్తున్నారు. పెద్ద ముక్కను ‘స్పెషల్ మార్జిన్’లో కలిపేశారు. గతంలో 0.5 శాతం మాత్రమే ఉన్న స్పెషల్ మార్జిన్ ద్వారా రూ.60 కోట్లు మాత్రమే బేవరేజెస్ కార్పొరేషన్‌కు దక్కేవి. ఇప్పుడు మారిన పద్ధతిలో అది కాస్తా రూ.6వేల కోట్లకు చేరనుంది. ఇలా బేవరేజెస్ కార్పొరేషన్‌కు కొత్తగా వస్తున్న ఆదాయాన్ని చూపించి... బ్యాంకుల నుంచి మరిన్ని అప్పులు తెచ్చుకుంటారన్న మాట! ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా 2022 మార్చిలోగా, అంటే రాబోయే నాలుగు నెలల్లో రూ.25,000 కోట్ల అప్పుగా తెచ్చుకునేందుకే ఈ కసరత్తు జరిగినట్లు తెలుస్తోంది.
ఇలా జగన్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆ వినూత్న ‘రెండు ముక్కలాట’లో మద్యం అమ్మకాలపై వచ్చే వ్యాట్ ఆదాయం ఇక బక్కచిక్కనుంది. ఆ గణాంకాలు చూస్తే... 2020-21లో మద్యంపై సుమారు రూ.12,000 కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో అదనపు రిటైల్ ఎక్సైజ్ పన్ను (ఏఆర్‌ఈటీ) రూ.3,000 కోట్లు. ఇది నేరుగా ఏపీఎ్‌సడీసీకి చేరి అక్కడి నుంచి అప్పుల అసలు, వడ్డీ చెల్లింపుల కింద బ్యాంకులకు వెళ్లిపోతుంది. మిగిలిన రూ.9,000 కోట్లలో 3 వేల కోట్లు మాత్రమే ఖజానాకు వెళుతుంది. మిగిలిన రూ.6,000 కోట్లు బేవరేజెస్ కార్పొరేషన్‌కు దక్కుతుంది. ఈ ఆదాయం ద్వారా భారీగా అప్పు తెచ్చుకోవచ్చని జగన్ ప్రభుత్వం ఆశగా ఎదురు చూస్తోంది.
ఇప్పటి వరకు స్పెషల్ మార్జిన్ కింద మొత్తం ఎక్సైజ్ ఆదాయంలో 0.5 శాతం మాత్రమే బేవరేజెస్ కార్పొరేషన్‌కి దక్కేది. అంటే... 2020-21లో రూ.60 కోట్లు స్పెషల్ మార్జిన్ కింద అందాయి. ఇప్పుడు ఈ రెండు జీవోలతో స్పెషల్ మార్జిన్ రూ.60 కోట్ల నుంచి ఏకంగా రూ.6,000 కోట్లకు పెరిగింది. నిబంధనల ప్రకారం... స్పెషల్ మార్జిన్ ఆదాయాన్ని బేవరేజెస్ కార్పొరేషన్ అభివృద్ధి కోసం మాత్రమే వాడాలి. కొత్తగా అప్పులు తెచ్చుకోవడం కోసం కాదు. మరోవైపు... వచ్చిన ఆదాయంలో రెండు వంతులను స్పెషల్ మార్జిన్ కింద కార్పొరేషన్‌కు జమ చేయడం రాజ్యాంగ విరుద్ధం. సిబ్బంది జీతాలు, నిర్వహణకు, భవనాల అద్దెలు, ఇతర ఖర్చుల కోసం ఎక్సైజ్ ఆదాయంలో 6 శాతాన్ని బేవరేజెస్ కార్పొరేషన్‌కు ప్రభుత్వం అందిస్తుంది. అది కూడా ఆదాయం మొత్తం తొలుత రాష్ట్ర ఖజానాకు వచ్చిన తర్వాత మాత్రమే! అంతే తప్ప, కార్పొరేషన్ నేరుగా మినహాయించుకోవడానికి వీల్లేదు. అంటే, ఈ జంట జీవోల పుణ్యాన మద్యం పై వ్యాట్ తగ్గినట్లు కనిపిస్తుంది. కానీ, తగ్గదు. మందు బాబులు, నిన్న ఎంత చెల్లించారో ఈరోజు, రేపు కూడా అంతే చెల్లించక తప్పదు. అయినా, ప్రభుత్వ ఖజానాకు వచ్చే ఆదాయంమాత్రం తగ్గిపోతుంది. బేవరేజెస్ కార్పొరేషన్ ఆదాయం పెరుగుతుంది.. ఆ ఆదాయం తాకట్టు పెట్టి ప్రభుత్వం మరింత అప్పు తెచ్చుకుటుంది.. సంక్షేమం బటన్ నొక్కి ఓట్లు కొనుక్కుంటుంది. అప్పు తడిసి మోపెడై రాష్ట్రం దివాలా తీస్తుంది. ఇదొక విష వలయం.. జగనన్న సృష్టిస్తున్న విష వలయంలో చిక్కుకున్న రాష్ట్రం ఇంకా మిగులున్న జగన్ రెడ్డి పాలనలో ఏ తీరాలకు చేరుతుందో.. ఎంత అప్పులో కూరుకుపోతుందో ఉహించడం కూడా కష్టమే అంటున్నారు నిపుణులు.