జయహో భారత్ బయోటిక్.. కొవాగ్జిన్ కు లాన్సెట్ జర్నల్ కితాబు ..
“భారత్ బయోటెక్ సంస్థ తయారుచేసిన కోవాగ్జిన్ కోవిడ్ టీకా అత్యంత సమర్థంగా పని చేస్తుంది. పూర్తిగా సురక్షితమైనది” ఇది లాన్సెట్ జర్నల్ తాజా నివేదిక సారాంశం ఇది. లాన్సెట్ జర్నల్’ సైన్సు పేరు చెప్పుకుని అశాస్త్రీయ సమాచారాన్ని అందించి సొమ్ములు చేసుకునే మరో మామూలు చెత్త పత్రిక కాదు. వైద్య ప్రపంచం, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైద్యులు, వైద్య శాస్త్ర వేత్తలు సంపూర్ణంగా విశ్వసించే విశేష వైద్య పత్రిక (మెడికల్ జర్నల్) లాన్సెట్ జర్నల్.
ఇంగ్లాండ్ లో 1823 లో మొదలైన లాన్సెట్ జర్నల్’ ఇంచుమించుగా 200 సంవత్సరాలుగా ప్రపంచ వైద్య శాస్త్ర రంగంలో జరిగిన పరిశోధనలు, అవిష్కరణలకు వేదికగా నిలిచిన జర్నల్, లాన్సెట్ జర్నల్. శాస్త్ర పరిశోధనలకు,శాస్త్ర వేత్తలకు తలమానికంగా నిలిచిన పత్రిక లాన్సెట్ జర్నల్. ఈ పత్రికలో వచ్చిన ప్రతి పరిశోధనా వ్యాసం, ప్రతి వ్యాసంలోని ప్రతి అక్షరం నూటికి రెండువందల పాళ్ళు విశ్వశించ వచ్చనే విశ్వాసాన్ని పత్రిక సొంతం చేసుకుంది. అంతే కాదు, ఈ నివేదికపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ అండ్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) డైరెక్టర్ బలరాం భార్గవ్ హర్షం వ్యక్తం చేశారు.
లాన్సెట్ జర్నల్’ కోవాగ్జిన్ కోవిడ్ టీకాకు సంబందించి ఇంకా అనేక విషయాలను, విశేషాలను కూడా ఇచ్చింది. కోవాగ్జిన్ కోవిడ్ టీకా రెండు డోసులు తీసుకున్న వారిలో ఈ వ్యాక్సిన్ 77.8 శాతం సామర్థ్యంతో పని చేస్తోందని తెలిపింది. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న 2 వారాల్లో యాంటీబాడీలు సమృద్ధిగా వచ్చాయని, దుష్ప్రభావాలు కనబడలేదంది. కోవాగ్జిన్ తీసుకుంటే కరోనా తీవ్రంగా సోకకుండా 93.4%, సాధారణంగా సోకకుండా 77.8%తో పని చేస్తోందని తెలిపింది. డెల్టా వేరియెంట్ నుంచి 65.2% సామర్థ్యంతో రక్షణ కల్పిస్తోందని పేర్కొంది. టీకా ఇచ్చిన వారంలో తలనొప్పి, అలసట, జ్వరం, ఇంజెక్షన్ ఇచ్చిన చోట నొప్పి తప్ప ఎలాంటి రియాక్షన్లు లేవని స్పష్టం చేసింది.
గత ఏడాది నవంబర్ 16 నుంచి ఈ ఏడాది మే 17 వరకు మూడోదశ ప్రయోగాలు జరిగాయి. భారత్‌లోని 25 ఆస్పత్రుల్లో 18–97 ఏళ్ల 16,973 మందికి టీకాను ప్రయోగాత్మకంగా ఇచ్చారు. టీకా తీసుకున్న తర్వాత కరోనా సోకిన వారు ఆస్పత్రి పాలవడం, మరణించడం జరగలేదని లాన్సెట్ జర్నల్ తెలిపింది. ఈ నివేదికపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ అండ్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) డైరెక్టర్ బలరాం భార్గవ్ హర్షం వ్యక్తం చేశారు.
అయితే ఇక్కడ అసలు విషయం ఏమంటే, కోవాగ్జిన్ గురించి మనదేశంలో చాలా చాలా దుష్ప్రచారం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ వ్యతిరేక రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు, అదే కోవకు చెందిన జాతీయ స్థాయి పత్రికలు, మీడియా సంస్థలు కోవాగ్జిన్ అభివృద్ధి చేసిన భారత్ బయోటెక్ సంస్థకు రాజకీయాలను అంట గట్టాయి. తెలుగు రాష్ట్రాలకు గర్వకారణంగా నిలిచిన భారత్ బయోటెక్ సంస్థకు స్థానిక పత్రికలు కులం రంగు పులిమి అబాసుపాలు చేసే ప్రయత్నం చేశాయి. పద్మభూషణ్ శేఖర్ గుప్తా (ది ప్రింట్ సంపాదకులు) అంతటి ప్రముఖ జర్నలిస్ట్ సహా ఇతర జర్నలిస్టులు కోవాక్సిన్ టీకా, అశాస్త్రీయం అనే అసత్య ప్రచారం చేసిన సంగతి తెలిసిందే..దేనిపై జాతీయ స్థాయిలో తీవ్ర చర్చ, దుమారం చెలరేగింది.
భారత్ బయోటెక్ చైర్మన్ కృష్ణ ఎల్లా అన్నట్లుగా, ప్రధాని మోడీ టీకా తీసుకోగానే, కొందరు రాజకీయ నాయకులు, కోవాగ్జిన్ కు కొత్త పేరు పెట్టారు. మోడీ వాక్సిన్, బీజేపీ వాక్సిన్ అంటూ దుష్ర్సచారం చేశారు. ఇంకో ఇంకో విషయంలో మీడియా అమ్ముడు పోయినా, రాజకీయ విశ్వాసాల ప్రాతిపదికిన మోడీ వ్యతిరేకతతో అసత్యాలను,అర్థ సత్యాలను ప్రసారం, ప్రచారం చేసినా అదో రకం, కానీ, కోవిడ్’తో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్న సమయంలో కూడా మీడియా ‘కోవాగ్జిన్’ వినియోగ అనుమతికి ఆటంకాలు కలిగించే విధంగా అడ్డు పుల్లలు వేసిన తీరు పట్ల వైద్య ప్రపంచం విస్మయం వ్యక్తప్రుస్తోంది. ఇది అత్యంత దుర్మార్గం, జర్నలిజం విలువలకు తిలోదాకలు ఇవ్వడమే అవుతుందని అంటున్నారు. పత్రికలు, మీడియా పోషించిన పాత్ర కారణంగా కోవాగ్జిన్’కు అనుమతి ఆలస్యం అయింది. ఫలితంగా సకాలంలో వాక్సిన్ అందక, అనేక మంది ప్రాణాలు కోల్పోయారు, అనే ఆవేదన శాస్త్ర వేత్తలు వ్యక్త పరుస్తున్నారు.
ఈ నేపద్యంలో, భారత్ బయోటెక్ చైర్మన్ కృష్ణ ఎల్లా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మెడికల్ జర్నల్‌లో కోవాగ్జిన్ ఫలితాలు వచ్చాయంటే అదెంత సమర్థంగా పని చేస్తోందో అర్థమవుతుందన్నారు. కోవాగ్జిన్‌పై లాన్సెట్ నిపుణుల పరిశోధనల్లో తేలిన అంశాలు టీకా అభివృద్ధిలో తమ చిత్తశుద్ధిని, డేటా ఇవ్వడంలో పారదర్శకతను వెల్లడిస్తోందని అన్నారు. కాగా లాన్సెట్ జర్నల్ ఈ నివేదిక ప్రాథమికమైనదని, మరింత డేటా వచ్చాక పూర్తి నివేదిక ప్రచురిస్తామని వివరించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి ఇటీవల అనుమతులిచ్చిన విషయం తెలిసిందే.