అమ్మ జగనన్న.. ఎయిడెడ్ స్కూల్స్ విలీనం వెనక ఇంత స్కెచ్ ఉందా?
posted on Nov 10, 2021 @ 7:36PM
ఈ సంవత్సరం పద్మ పురస్కారాలు అందుకున్న ప్రముఖుల్లో మన బాలు (ఎస్పీ బాల సుభ్రమణ్యం) సహ చాలామంది ప్రముఖులున్నారు. అంతమంది ప్రముఖులలో ఒక సామాన్యుడు కూడా ఉన్నారు. కర్ణాటక మంగళూరుకు చెందిన నెత్తిన బట్ పెట్టుకుని పండ్లు అమ్ముకునే 68 ఏళ్ల హరేకాలా హజబ్బ అనే పండ్ల వ్యాపారి కూడా రాష్ట్రపతి నుంచి పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. మరి ఆయనకు ఎందుకు అంతటి గౌరవం దక్కిందో తెలుసా? ఆయన గ్రామీణ పిల్లలకు చదువు అందించాలనే ఆశయంతో తమ జీవితం మొత్తం కష్టపడి సంపాదించిన డబ్బుతో మంగళూరు హరేకాలా-న్యూపడ్పు గ్రామంలో ఓ పాఠశాలను నిర్మించారు. అందుకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆయన్ని పద్మశ్రీ తో సత్కరించింది.
ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి ప్రభుత్వం విలీనం పేరిట విక్రయానికి బాటలు వేస్తున్న ఎయిడెడ్ విద్యాసంస్థలు అన్నీ కూడా ఒకప్పుడు ఇలాంటి పుణ్యపురుషులు స్థాపించిన సరస్వతీ ఆలయాలే.. ప్రభుత్వం ప్రమేయం లేకుండా దాతలు ఏర్పాటు చేసినవే. అంతే కాదు,అనేక ఎయిడెడ్ విద్యాసంస్థలకు దేవాలయాలకు ఇచ్చినట్లుగా దాతలు కోట్ల రూపాయల విలువైన భూములు ఇతర స్థిరాస్తులు విరాళంగా ఇచ్చారు. అదొక పవిత్ర కార్యంగా భావించి ముందుముందు నిర్వహణ వ్యయానికి కూడా లోటు లేకుండా, ముందుస్తు ఏర్పాట్లు చేశారు. అయితే చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరిన విధంగా సిబ్బంది జీతాల వరకు భరించే నెపంతో ప్రభుత్వం విద్యా సంస్థల యాజమన్య వ్యవహరాలలో వేలు పెట్టింది. నిజానికి, అప్పటి ప్రభుత్వాలకు ముందుముందు గుడిని గుడిలో లింగాన్ని కూడా మింగే కుక్కమూతి పిందెల పాలన వస్తుందని ఉహించి ఉండక పోవచ్చును. కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎయిడెడ్ విద్యాసంస్థలపై కన్నేసింది. దాతల దాతృత్వంతో ఏర్పడిన ఎయిడెడ్ పాఠశాలలు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2,500 వరకు ఉన్నాయి. సుమారు రెండులక్షల మంది వరకు విద్యార్ధులు ఎయిడెడ్ స్కూల్స్ లో చదువుతున్నారు. ఇందులో కొన్ని ప్రత్యేక వృత్తి, ప్రవృత్తికి సంబంధించిన పాఠశాలలు. విద్యాసంస్థలు ఉన్నాయి.
ఇప్పుడు జగన్ రెడ్డి ప్రభుత్వం ఎయిడెడ్ పాఠశాలలను ప్రభుత్వంలో విలీనం చేస్తూ జీవో. 46నుజారీచేసింది. కేవలం పాఠశాలలను మాత్రమే కాదు, పాఠశాలల ఆస్తులను కూడా ప్రభుత్వానికి అప్పగించాలని, లేకుంటే సిబ్బందిని వెనక్కి ఇచ్చేయాలని మెలిక పెట్టింది. ఒకవేళ ఉపాధ్యాయుల్ని వెనక్కి ఇచ్చేస్తే ఎయిడెడ్ పాఠశాలలు ప్రైవేటుగా మారిపోతాయి. పైగా, విద్యార్థుల నుంచి ఫీజులు కూడా వసూలుచేసుకోవచ్చని ప్రభుత్వమే చెప్పేసింది. గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో రూ.10వేలు నుంచి మొదలుపెట్టి...నగరాల్లో రూ.15వేల వరకు వసూలుచేసుకోవాలని సూచించింది.అయితే, తరిచి చూస్తే, జగన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న విలీన నిర్ణయం. ఓ వంక ఎప్పుడో, ఎవరో దాతలు ఇచ్చిన కోట్ల రూపాయల విలువైన ఆస్తులకు రక్షణ లేకుండా చేస్తుంది మరో వంక ఫీజులు పెంచుకునే వెసులు బాటుకు బాటలు వేస్తోంది. అయితే కేవలం ఎయిడెడ్ విద్యా సంస్థల ఆస్తులను కబళించే ఎత్తుగడతో పాటుగా, ఇంకా ఇతర ఎత్తుగడలు, దుష్టపన్నాగాలు ఉన్నాయని అంటున్నారు.
ఎయిడెడ్ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుల జీతాల కోసంగా ప్రభుత్వం ప్రతి సంవత్సరం సుమరు రూ.680కోట్లు గ్రాంట్ రూపంలో ఇస్తోంది. కేవలం రూ.680కోట్ల కోసమే ప్రభుత్వం, ఎయిడెడ్ పాఠశాలల విలీనం నిర్ణయం తీసుకుందని అనుకోలేము. ఈ నిర్ణయంతో సుమారు 6,954మంది ఉపాధ్యాయులు ప్రభుత్వంలో విలీనమైపోయారు. అంటే వీరికి ఎయిడెడ్‌లో ఉండగా ఇచ్చిన జీతాన్నే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో విలీనం చేసుకున్నాక ఇస్తారు. అదే సమయంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగాల్ని భర్తీ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. కానీ ప్రభుత్వం తగ్గించుకున్న ఈ భారం...విద్యార్థుల తల్లిదండ్రులపైనే పడుతుంది. అంతేకాదు..ఈ భారానికి మూడు, నాలుగింతలు వారిపై పడే అవకాశాలున్నాయి. ఇలా ఒకే దెబ్బకు అనేక పిట్టలు అన్న ‘గొప్ప’ ఆలోచనతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది అంటున్నారు.
అలాగే ఇటీవల కొవిడ్ కారణంగా ఆదాయాలు పడిపోయి, చాలామంది తల్లి దండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలలో చేర్చారు. సుమారు సుమారు 2.6లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో గతం కంటే ఎక్కువగా చేరారని ప్రభుత్వమే చెప్తోంది. ఇప్పుడు ప్రభుత్వ వైఖరితో షాక్ తిన్న పలు ఎయిడెడ్ విద్యాసంస్థలు తమ పాఠశాలల్ని మూసేస్తామని ప్రకటించాయి. గుంటూరు జిల్లాలో ఇప్పటికే 300లకు పైగా ఎయిడెడ్ పాఠశాలల్ని మూసేశారు. మరోవైపు విశాఖపట్నం, కృష్ణా జిల్లాల్లోను పలు పాఠశాలలు మూసేశారు. భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇలా మూసేసిన పాఠశాలల్లోని పిల్లల్ని దగ్గరిలోని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చుకుంటామని ప్రభుత్వం అంటోంది. కానీ దగ్గరలో ప్రభుత్వ పాఠశాలలు లేకుంటే దూరాలకు వెళ్లాల్సిందే.వాస్తవానికి ఎయిడెడ్ విద్యాసంస్థల్లో చదివే లక్షలమందిని ప్రభుత్వంలో చేర్చుకునేంత సామర్ధ్యం లేదు. కాబట్టి, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్ధులను మెల్లగా మళ్ళీ ప్రైవేటు స్కూల్స్’కు పంపే కుట్ర ఉందేమో అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపధ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా విలీనానికి వ్యతిరేకంగా ఆందోళనలు ఉపందుకున్నాయి. అనంతపురంలో ఎస్ఎస్బిఎన్ ఎయిడెడ్ కళాశాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం విద్యార్థులు ఆందోళన చేయగా నిలువరించేందుకు పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. ఈ ఘటనలో ఒక విద్యార్ధిని తీవ్రంగా గాయ పడ్డారు. ఈనేపధ్యంలోనే విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌కు ఎయిడెడ్ నిరసనల సెగ తగిలింది. అనంతపురంలో విద్యార్థులపై లాఠీచార్జి, ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు మంత్రిని నిలదీశారు.మరో వంక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గాయపడిన ఎస్ఎస్బిఎన్ కళాశాల విద్యార్థులను పరామర్శించేందుకు అనంతపూర్ చేరుకున్నారు.
ఎయిడెడ్ కళాశాలలను ప్రైవేటీకరించటం వల్ల ఫీజుల భారంపై విద్యార్థుల అభిప్రాయాలు తీసుకోనున్నారు. ఈ ముఖాముఖిలో వామపక్ష పార్టీల నేతలు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాల్గొంటారు. మొత్తానికి ఎయిడెడ్ వివాదం... జగన్ ప్రభుత్వం వ్యవస్థలనునాశనం చేసేందుకు సాగిస్తున్న వికృత విన్యాసాలకు మరో మచ్చు తునకగా నిలుస్తుంది.