సీఎం ఇంటిముందు పద్మశ్రీ అవార్డీ ధర్నా.. ఎందుకంటే...
posted on Nov 11, 2021 @ 10:47AM
మంగళవారం పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. బుధవారం నేరుగా ముఖ్యమంత్రి ఇంటి ముందు ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ నిరసన తెలిపారు. కేవలం పద్మశ్రీ అవార్డు మాత్రమే కాదు.. అంతకుముందు అర్జున అవార్డు, పలు జాతీయ, అంతర్జాతీయ పతకాలూ గెలుచుకున్నారు. ఆ స్థాయి వ్యక్తి.. అలా సీఎం ఇంటి ముందు ధర్నా చేయడం హరియాణాలో కలకలం రేపింది. యావత్ దేశం ఇప్పుడు అటువైపు దృష్టి సారించింది. ఇంతకీ ఏం జరిగిందంటే...
పారా రెజర్ల్ వీరేందర్ సింగ్. మంగళవారం రాష్ట్రపతి భవన్‌లో పౌర అవార్డుల ప్రదానోత్సవంలో ‘పద్మశ్రీ’ తీసుకున్నారు. బుధవారం హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఇంటి ముందు పారా అథ్లెట్లకు న్యాయం చేయాలంటూ నిరసన చేపట్టారు. తాను పొందిన అర్జున అవార్డు, పద్మ పురస్కారం, ఇతర మెడల్స్‌ని వెంట తీసుకొచ్చి సీఎం నివాసం ముందు కూర్చొని నిరసన తెలిపారు. ఆ విషయాన్ని ట్విటర్‌లోనూ పోస్ట్ చేశారు.
‘‘గౌరవనీయులైన ముఖ్యమంత్రి ఖట్టర్ గారు! కేంద్రం మాకు (పారా అథ్లెట్లకు) సమాన హక్కులు కల్పిస్తున్నప్పుడు హరియాణా ప్రభుత్వం మాత్రం ఎందుకు ఇవ్వడం లేదు? బధిర క్రీడాకారులకు పారా క్రీడాకారులతో సమాన హక్కులు కల్పించేంత వరకు మీ నివాసమైన ఢిల్లీ హరియాణా భవన్ ఫుట్‌పాత్ నుంచి కదలను’’ అంటూ ట్వీట్ చేశారు.