పంచ్ ప్రభాకర్‌పై సీబీఐ యాక్షన్.. ఇంటర్‌పోల్ బ్లూ నోటీస్..
posted on Nov 11, 2021 @ 4:40PM
పంచ్ ప్రభాకర్‌కు స్ట్రాంగ్ పంచ్ పడే టైమ్ దగ్గర పడింది. విదేశాల్లో నక్కి.. నోటికొచ్చినట్టు కూసినందుకు తగిన శాస్త్రి జరిగే సమయం ఆసన్నమైంది. ఏకంగా న్యాయవ్యవస్థను, జడ్జిలను కించపరిచేలా పంచ్ ప్రభాకర్ చేసిన కామెంట్లుకు కఠిన శిక్ష పడే రోజులు దగ్గర పడ్డాయి. ప్రభాకర్‌ను పట్టుకోచ్చి.. కోర్టు బోనులో నిలబెట్టడంలో ఇన్నాళ్లూ ఉదాసీనంగా వ్యవహరించిన సీబీఐకి ఇటీవల హైకోర్టు గట్టిగా మొట్టికాయలు వేయడంతో.. సీబీఐ దారికొచ్చింది. వెంటనే సీరియస్ యాక్షన్‌లోకి దిగిపోయింది. పంచ్ ప్రభాకర్‌ను ఫారిన్ నుంచి రప్పించేలా.. పకడ్బందీ ఉక్కు బిగించింది.
పంచ్ ప్రభాకర్ అరెస్ట్‌కు సీబీఐ రంగం సిద్ధం చేసింది. పంచ్ ప్రభాకర్‌పై ఇంటర్ పోల్ ద్వారా సీబీఐ బ్లూ నోటీసును జారీ చేసింది. అతిత్వరలోనే ప్రభాకర్‌ను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. గత విచారణ సందర్భంగా పంచ్ ప్రభాకర్‌ను పది రోజుల్లో అరెస్టు చేయాలని సీబీఐకి హైకోర్టు డెడ్‌లైన్ విధించింది. ఆలోగా అరెస్టు చేయకపోతే.. విచారణ కోసం సీబీఐకి సంబంధంలేకుండా ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్)ను ఏర్పాటు చేస్తామని హెచ్చరించింది. ఆ డెడ్‌లైడ్ ముగియక ముందే.. ఇంటర్‌పోల్ ద్వారా సీబీఐ బ్లూ నోటీసులు పంపించడంతో ప్రభాకర్‌కు పంచ్ పడటం ఖాయంగా కనిపిస్తోంది.
మరోవైపు, ఏపీ హైకోర్టు జడ్జీలపై, న్యాయాధికారులపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో మరో ఐదుగురిపై సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఇప్పటి వరకూ మొత్తం 11 మంది నిందితులపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. అవుతు శ్రీధర్‌రెడ్డి, జలగం వెంకట సత్యనారాయణ, గూడ శ్రీధర్‌రెడ్డి, శ్రీనాథ్ సుస్వరం, దరిస కిషోర్ రెడ్డి, అజయ్ అమృత్‌లపై విడివిడిగా సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేసింది.