మహా పాదయాత్రలో లాఠీఛార్జ్.. రైతులకు గాయాలు.. లోకేశ్ ఫైర్
posted on Nov 11, 2021 @ 1:58PM
ఇదేమి రాజ్యం.. పోలీస్ రాజ్యం.. రాజారెడ్డి రాజ్యాంగం.. అనే విషయం మరోసారి బయటపడింది. అమరావతి రైతులు చేస్తున్న మహా పాదయాత్రలో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. పాదయాత్రను అడ్డుకోవడానికి మొదటి నుంచీ ప్రయత్నిస్తుండగా.. తాజాగా ఎలక్షన్ కోడ్ పేరుతో కఠిన ఆంక్షలు విధించారు. పాదయాత్రలో అమరావతి రైతులు మినహా మరెవరూ హాజరుకావొద్దని.. వారికి సంఘీభావం తెలుపొద్దని ఆదేశాలు జారీ చేశారు. కానీ, ప్రజా ఉద్యమాన్ని ఆంక్షలతో అడ్డుకోగలరా? పాదయాత్రలో అదే జరిగింది. రాజధాని రైతులకు మద్దతుగా పెద్ద సంఖ్యలో స్థానికులు తరలివచ్చారు. ఇదే అదనుగా.. పోలీసులు లాఠీలకు పని చెప్పి.. తీవ్ర ఉద్రిక్తత రాజేశారు. అసలేం జరిగిందంటే...
ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం చదలవాడలో జరుగుతున్న రాజధాని రైతుల మహాపాదయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రైతులు చేస్తున్న పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు వస్తున్న స్థానికులను పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వారిపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు.
పోలీసులు అడ్డుపెట్టిన తాళ్లను నెట్టుకుని మరీ స్థానికులు ముందుకు వచ్చారు. అమరావతి రైతులకు సంఘీభావం ప్రకటించేందుకు వస్తే అడ్డుకోవడానికి మీరెవరంటూ పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. పోలీసులను నెట్టుకుంటూ ముందుకు వెళ్లి మరీ రైతులకు స్థానికులు సంఘీభావం తెలిపారు. చదలవాడ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. పోలీసుల లాఠీఛార్జ్‌లో పలువురుకి గాయాలయ్యాయి. ఓ రైతు చేయి విరిగినట్టు తెలుస్తోంది.
చదలవాడ దగ్గర రైతుల మహాపాదయాత్రలో పోలీసుల లాఠీఛార్జ్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ మండిపడ్డారు. పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న వారిపై పోలీసులు లాఠీఛార్జ్ చెయ్యడం దారుణమన్నారు. పోలీసుల దాడిలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని డిమాండ్ చేశారు. న్యాయస్థానాల ఉత్తర్వులను ధిక్కరిస్తూ ఉద్యమకారులపై లాఠీఛార్జ్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకూ అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర జగన్ సర్కారుకి కంటిమీద కునుకు లేకుండా చేస్తోందని లోకేశ్ అన్నారు. పోలీసుల్ని ప్రయోగించి పాదయాత్రకి అడుగడుగునా ఆటంకాలు కల్పించడం న్యాయమా? అని ప్రశ్నించారు. హైకోర్టు అనుమతితో చేస్తున్న పాదయాత్రకి ఖాకీల ఆంక్షలు ఎందుకో? అని నిలదీశారు. కవరేజ్‌కి వచ్చిన మీడియా ప్రతినిధుల్ని ఎందుకు ఆపుతున్నారని అడిగారు. పలువురు పాత్రికేయులను పోలీసులు అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు నారా లోకేశ్.