షర్మిల 72 గంటల దీక్షకు నో పర్మిషన్.. అయినా, తగ్గేదే లే..
posted on Nov 11, 2021 @ 2:40PM
వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల.. ప్రజా ప్రస్థాన యాత్ర చేస్తున్నారు. తెలంగాణలో సుదీర్ఘ పాదయాత్ర చేపట్టారు. ఊరూరా ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. నేనున్నానంటూ ధైర్యం చెబుతున్నారు. ఓవైపు పాదయాత్ర చేస్తూనే.. ప్రతీ మంగళవారం నిరుద్యోగ దీక్షకు కూర్చొంటున్నారు. తాజాగా, రైతుల పక్షాన 72 గంటల దీక్షకు దిగుతానని ప్రకటించారు. షర్మిల ప్రకటన.. కేసీఆర్ సర్కారును షేక్ చేసినట్టుంది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగిపోయారు. షర్మిల తలపెట్టిన 72 గంటల దీక్షకు అనుమతి నిరాకరించారు. పోలీసులు కొర్రీలు పెట్టినా.. షర్మిల మాత్రం తన పంతం వీడలేదు. దీక్షా స్థలం మార్చేశారు అంతే.
వైఎస్ షర్మిల 72 గంటల దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. రాష్ట్రంలో పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ 72 గంటలపాటు దీక్ష చేయడానికి నిర్ణయించారు. శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు దీక్ష చేయాలనుకున్నారు. ఇందిరా పార్క్ వేదికగా తలపెట్టిన షర్మిల దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఎందుకంటే..
కేంద్రం తీరుకు నిరసనగా శుక్రవారం ఇందిరా పార్క్ దగ్గర టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు దీక్ష చేయనున్నారు. టీఆర్ఎస్ దీక్షకు అనుమతి ఇచ్చినందున.. షర్మిల దీక్షకు అనుమతి ఇవ్వలేమంటూ పోలీసులు తేల్చి చెప్పారు. దీంతో దీక్షా వేదిక మార్చేశారు షర్మిల. కామారెడ్డి నియోజకవర్గంలో దీక్ష చేయాలని నిర్ణయించారు.