ఉద్యోగుల జేబులకు సర్కారు చిల్లు.. జగనన్న దోపిడీ మామూలుగా లేదుగా...
posted on Nov 11, 2021 @ 5:03PM
దాచుకున్న సొమ్మును దోచుకుంటారా? ఇది ఎవరు, ఎవరిని ఆడుగుతున్న ప్రశ్నో తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు. ఎందుకంటే, ఈ ప్రశ్న అడుగు తున్నది, ఏ ప్రైవేటు చిట్ ఫండ్ కంపెనీనో కాదు, అడుగుతున్నది చట్టాల గురించి తెలియని సామాన్యులు కాదు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు అడుగుతున్న ప్రశ్న ఇది. ఇంకా కొంచెం క్లియర్’గా చెప్పాలంటే, ఉద్యోగుల జేబుల్లో వైసీపీ ప్రభుత్వం చేతులు పెట్టిందని, ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
నిజం. ఓ వంక పీఆర్సీ విషయంలో ఉద్యోగ సంఘాలతో దాగుడుమూతలు ఆడుతున్న ప్రభుత్వం, గుట్టు చప్పుడు కాకుండా, ఉద్యోగుల జీపీఎఫ్ కింద దాచుకున్న సొమ్ములో కొంత తీసుకుని వాడేసుకుంది. సరే, జగనన్న ఏ వైఎస్సార్ పథకం మీట నొక్కేందుకో అవసరమై ప్రభుత్వం ఉద్యోగుల జేబులు కత్తిరించిందే అనుకుందాం, కానీ, అదే విషయం ఉద్యోగ సంఘాలకు ముందుగా చెప్పి వారి అనుమతితో తీసుకుంటే అదో రకం, కానీ అదేమీ లేదు. అక్టోబర్ 28-30 తేదీలలో జీపీఎఫ్ నుంచి కొంత సొమ్మును ఉపసంహరించుకున్నట్లు ‘మెసేజ్’లు వస్తే కానీ, ఉద్యోగులకు ఆ విషయమే తెలియదు.
ఇది ఇంకెవరో చెబితే, ఇంకెవరో ఆరోపిస్తే ఏమో కానీ, స్వయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు, కే ఆర్ సూర్యనారాయణ, సంఘం కార్యవర్గ సమావేశం వేదిక నుంచి చేసిన ఆరోపణ. కాదుకాదు వ్యక్తపరిచిన ఆవేదన.
దేశంలో ఎక్కడా లేని వింతలూ విడ్డూరాలు ఏపీలో మాత్రమే జరుగుతున్నాయి ఇది మరొక ఉదాహరణగా నిలుస్తుందని ఉద్యోగ సంఘల నాయకులు అంటున్నారు. అలాగే, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన వైసీపీ ప్రభుత్వం ఎలాంటి అడ్డదారులు తొక్కేందుకు సిద్ధంగా ఉందనేందుకు కూడ, ఈ జేబు కత్తెర ఉదంతం మరో ఉదాహరణగా నిలుస్తుందని, ఉద్యోగ సంఘాల నాయకులు అంటున్నారు. నిజానికి ఇది, ఆర్థిక శాఖ, సీఎంఎఫ్ఎస్ అధికారాలు చేసిన ఆర్ధిక నేరంగా ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు సుర్యనారాయణ ప్రభుత్వం మీద తీవ్రమైన అభియోగం మోపారు. అంతే కాదు, ఇందుకు బాధ్యులైన సంబంధిత అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, కేసులు నమోదు చేయాలని లేదంటే, తామే పోలీసు కంప్లైంట్ ఇస్తామని హెచ్చరించారు. అలాగే, ఉద్యోగులకు తెలియకుండా వారి జీపీఎఫ్ ఖాతాలోంచి ఒక్క రూపాయి తేసుకున్నా ఆది బ్రీచ్ అఫ్ ట్రస్ట్ కింద నేరం అవుతుందని ఆర్థిక శాఖ వ్యవహారాల్లో అనుభవం ఉన్న రిటైర్డ్ అధికారులు పేర్కొంటున్నారు. అంతేకాదు, ప్రభుత్వం మీద విశ్వాసంతో దాచుకున్న సొమ్మును ప్రభుత్వమే దోచుకోవడం అంటే, కంచే చేను మేయడంతో సమానమని అంటున్నారు. కాగా, ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు సుర్యనారయణ, జీపీఎఫ్ నుంచి తీసుకున్న సొమ్మును తక్షణం డిపాజిట్ చేయాలని, అదే విధంగా జీపీఎఫ్ ను ప్రభుత్వం ప్రత్యేక అకౌంటులో చూపించాలని డిమాండ్ చేశారు.
అదలా ఉంటే, గడచిన రెండున్నర ఏళ్లుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు ఏవీ పరిష్కరించకపోగా, ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో ఇబ్బందికరంగా వ్యవహరిస్తోందని నేతలు అసంతృప్తిని వ్యక్త పరుస్తున్నారు. ముఖ్యంగా పీఆర్సీ విషయంలో ప్రభుత్వం ఎటూ తేల్చకుండా, ఇదిగో అదిగో అంటూ దాటవేత ధోరణి అవల్బిస్తోందని ఉద్యోగ సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తపరుస్తున్నరు. మరోవైపు, అధికారులలో కూడా రాజకీయ నాయకత్వం పట్ల అసంతృప్తి క్షణక్షణాభివృద్ధి చెందుతోంది. ముఖ్యమంత్రి, మంత్రులు చేసిన తప్పులకు తాము కోర్టులకు సంజాయిషీ ఇచ్చుకోవలసి రావడం అధికారులు ఆవమానంగా భావిస్తున్నారు. దీంతో అసలే అంతంత మాత్రంగా ఉన్న పరిపాలన మరింతగా అస్తవ్యస్తం మయ్యే ప్రమాదం ఉందని పరిశీలకులు ఆందోళన వ్యక్త పరుస్తున్నారు. అంతే కాకుండా అధికార యంత్రాంగంల అసంతృప్తి ఆందోళన రూపం దాల్చే ప్రమాదం కూడా కొట్టి వేయలేమని అంటున్నారు.