ఎమ్మెల్సీ టికెట్లు ఎవరికి? ఉద్యమ నేతలకా? ఉద్యమ ద్రోహులకా?
posted on Nov 11, 2021 @ 6:19PM
ఒకేసారి 19 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు. అందులో ఎమ్మెల్యేలు ఎన్నుకునే ఎమ్మెల్సీ స్థానాలు ఆరు. మరో 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీట్లు. ఒకటి గవర్నర్ కోటా నామినేటెడ్ సీటు. బహుశా ఇటీవల కాలంలో ఒకేసారి ఇన్ని ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగడం ఇదే మొదటిసారి కావచ్చు. ఇలా ఒకటి తక్కువ 20 స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరగడమే ఒక విశేషం అనుకుంటే, అన్ని స్థానాలు, ఏదో జరగరానిది జరిగితే తప్పించి ఖాయంగా అధికార తెరాస ఖాతాలో చేరే స్థానాలే కావడం మరో విశేషంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవంక ఈ సారి టికెట్ మిస్ అయితే రానున్న రెండేళ్ళల్లో మరో అవకాశానికి ఆస్కారం లేదని అధికార పార్టీ అశావహులు బావిస్తున్నారు. పార్టీ టిక్కెట్ కోసం ఎవరికి వారు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
తెరాస ముఖ్యనాయకులు ఎక్కడికెళితే అక్కడ ఆశావహులు ప్రత్యక్ష మవుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు చావైనా, సంబురం అయినా సందర్భం ఏదైనా, ఎక్కడికి వెళ్ళినా, ‘ఒక్క ఛాన్స్ ప్లీజ్’ అంటూ ఆశావహులు వెంటపడుతున్నారట. ఈసారి ఎమ్మెల్సీ టికెట్ ఆశిస్తున్న వారిలో మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి వంటి పలువురు ప్రముఖులతో పాటుగా, ముఖ్యమంత్రి కుమార్తె కల్వకుంట్ల కవిత. హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా అంతకు ముందు ఎమ్మెల్సీ బిస్కెట్ వేసి పార్టీలోకి తీసుకున్న పాడి కౌశిక్ రెడ్డి, ఎల్.రమణ వంటి అనేక మంది సీనియర్ రాజకీయ నాయకులు ఉన్నారు. అలాగే, ఉద్యమాకాలం నుంచి పార్టీని అంటి పెట్టుకుని ఉన్న, ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకుడు దేవీశ్రీ ప్రసాద్’వంటి ఉద్యమ నాయకులు టిక్కెట్ ఆశిస్తున్నవారిలో ఉన్నారు. మరో వంక దేవీశ్రీ ప్రసాద్’కు టికెట్ ఇవ్వాలని, బ్రాహ్మిణ్ ఆఫిషియల్స్ అండ్ ప్రోఫీషియల్స్ వెల్ఫేర్ అసోసియేషన్’ ముఖ్యమంత్రి కేసీఆర్’కి విజ్ఞప్తి చేసింది.
ముఖ్యమంతి కేసీఆర్ అభ్యర్దుల ఎంపికఫై గట్టి కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో రాజకీయ లెక్కలు వేగంగా మారుతున్ననేపధ్యంలో ముఖ్యమంత్రి అభ్యర్ధుల ఎంపిక విషయంలో అన్ని కోణాలలో అలోచించి నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. ఈసారి ఒకరిద్దరు తప్ప పాతవారికి అవకాశం ఉండక పోవచ్చని అంటున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా ప్రత్యేకంగా పైకొచ్చిన, ఉద్యమ నాయకులు వర్సెస్’ ఉద్యమ ద్రోహులు చర్చకు సమాధానంగా.. ఉద్యమ నాయకులకు ఈసారి పెద్ద పీట వేస్తారనే చర్చ జరుగుతోంది. అయితే, చివరకు ఏమి జరుగుతుంది? ఎవరిని అదృష్టం వరిస్తుంది? అనేది ఒకటి రెండు రోజుల్లోనే తేలిపోనుంది.