కుప్పకూలుతున్న ఆర్థిక వ్యవస్థ.. ఏపీలో త్వరలో ఎమర్జెన్సీ?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అడుగడుగునా ఎదురు దెబ్బలు తగులు తున్నాయి. అవమానాలు ఎదురవుతున్నాయి. రెండు మూడు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం సిగ్గుతో తలవంచుకునేలా జగన్ సర్కారు ముఖాన తలుపులు వేసింది. రాష్ట్రం దివాళా దారిలో పోతోందనే అర్థం వచ్చేలా, అదనపు రుణం పొందేందుకు అర్హత కోల్పోయిందని ప్రపంచం అంతటికీ తెలిసే విధంగా చాటింపు వేసింది. మూలధనం వ్యయం లక్ష్యాలను చేరుకోవడంలో జగన్ రెడ్డి ప్రభుత్వం వెనకబడినట్లు కేంద్రం లెక్కలు చెప్పింది.
ప్రస్తుత (2021-22) ఆర్థిక సంవత్సరంలో ఇంతవరకు మూలధన వ్యయంలో 26 శాతం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందని, రాష్ట్రంలో ఆస్తులను సృష్టించడంలో రాష్ట్రం వెనకబడిందని, అందుకే అదనపు రుణానికి ‘నో ఛాన్స్’ అంటూ తేల్చి చెప్పింది. ఆ విధంగా కేంద్రం అంతో ఇంతో అప్పు వేస్తుందని ఆశగా తలుపు తట్టిన జగన్ రెడ్డి ప్రభుత్వం ముఖం మీదనే కేంద్రం తలుపులు వేసింది.
తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖకు ఏ కంపెనీ కూడా వైద్య పరికరాలు సరఫరా చేయవద్దు అంటూ వైద్య పరికరాల ఉత్పత్తి దారుల జాతీయ యూనియన్ (ఏఐఎంఈడీ) తన అధికారిక వెబ్‌సైట్‌లో ‘రెడ్ నోటీస్’ జారీ చేసింది. వైద్య పరికరాలు సరఫరా చేసే కంపెనీలు.. ఆంధ్రాతో అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఆ నోటీసులో గట్టి సూచనలు చేసింది. జాతీయ స్థాయిలో ఇప్పుడు ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఇంతవరకు అంతో ఇంతో మిగిలుందని అనుకుంటున్న ముఖ్యమత్రి జగన్ రెడ్డి ప్రభుత్వ పరువు పూర్తిగా తుడిచి పెట్టుకు పోయిందని రాజకీయ వర్గాలు బావిస్తున్నాయి. రాష్ట్రంలోనే కాదు, జాతీయ స్థాయిలో జగన్ ప్రభుత్వ పరువుతో పాటుగా, రాష్ట్రం పరువు, రాష్ట్ర ప్రజల పరువు కూడా చుక్క మిగలకుండా చక్కగా తుడిచి పెట్టుకు పోయిందని, విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే, ‘ఇంతటితో అయి పోలేదని అసలు కథ ముందుందని ఏపీ ప్రభుత్వ అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రముఖ ఆంగ్ల పత్రిక, ‘ఎకనమిక్ టైమ్స్’ ప్రచురించిన కథనం ప్రకారం, ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోవడం, రాష్ట్రంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి (ఫైనాన్సియల్ ఎమర్జెన్సీ) విధించడం అనివార్యమయ్యే పరిస్థితులు తలెత్తడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదు ఎవరో వ్యక్తపరిచిన అభిప్రాయం కాదు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులే,రాష్ట్ర అర్తిఅక్ వ్యవస్థ కుప్ప కూలడం తధ్యమని, అయితే ఎప్పుడు, అనేదే ప్రశ్నఅంటున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఓటి పడవలో ప్రయాణం సాగిస్తోంది. సో... పడవ మునకేయడం, ఖాయం. అయితే ఎప్పుడు, నవంబర్ చివరకే మునకేస్తుందా, సంవత్సరం చివరి వరకు సాగుతుందా అనేది ఇప్పుడు, మన ముందున్నప్రశ్న అని అధికారులు అంతర్గత చర్చల్లో చర్చిస్తున్నట్లు సమాచారం. అది ముందుముందు పుట్టే అప్పుల మీద ఆధారపడి ఉంటుందని, అధికారులు అంటున్నారు. ఇక ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఎప్పుడైనా రాష్ట్రంలో అర్తిక ఎమర్జెన్సీ విధించే అవకాశం ఉందని, సీనియర్ అధికారులే చెపుతున్నారని పత్రిక సమాచారం. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం 2021 – 22 లో రాష్ట్ర రెవిన్యూలోటు కనీవినీ ఎరుగని రీతిలో, ఎకంగా. 662.80 శాతానికి చేరుకుంది.ద్రవ్య లోటు 107.79 శాతానికి చేరింది.
అలాగని రాష్రానికి ఆదాయం లేకుండా పోయిందని అనుకునే వీలులేదు. పన్నులు పెరగడంతో రెవెన్యూ ఆదాయం పెరుగుతోంది, కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్స్ రూపంలో రావలసినదానికంటే ఎంతో కొంత ఎక్కువగానే వస్తోంది. అయినా, ఇవేవీ కూడా రాష్ట్ర ఆర్థిక పతనాన్ని ఆపలేక పోతున్నాయని అధికారాలు అంటున్నారు. అంతేకాదు, ఆదాయ మార్గాలన్నీ మూసకు పోయాయి. ఖజానాకు డబ్బులు చేర్చే కాలువలు ఎండి పోయాయని ఏపీ ఆర్థిక శాఖ అధికారులు పేర్కొన్నట్లు పత్రిక పేర్కొంది. అలాగని, రాష్ట్ర ఆదాయం అడుగంటి పోయిందని కాదు.. ఆదాయం ఉంది, ఆర్ధిక క్రమశిక్షణ లోపించిందని అధికారులు అంటున్నారు. కాగ్ నివేదిక ప్రకారం, రూ.38,914.18 కోట్ల ఋణంతో కలుపుకుని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు మాసాలలో రాష్ట్ర ఆదాయం, 1,04,804.91 కోట్లుగా ఉంది. అయితే ఆదాయంలో సగం, (రూ.50, 419.15 కోట్లు) సంక్షేమ పథకాలు, ఉచితాల పేరిట కరిగిపోతే, ఉద్యోగుల జీతాలు, సబ్సిడీలు, పాత అప్పుల మీద చెల్లించే వడ్డీలు అన్నీ కలుపుకుంటే, కాగ్ నివేదిక ప్రకారం, మొత్తం ఖర్చు రూ.1,04,723.91 కోట్లకు చేరింది. అంటే నిండా వందకోట్లు కూడా, అభివృద్ధి కార్యక్రంలకు మిగలలేదు.
రాష్ట్ర ప్రభుత్వం 2021-22 వార్షిక బడ్జెట్’లో రూ.5,000.08కోట్ల రెవిన్యూ లోటును అంచనావేసింది.అయితే, ఏప్రిల్ – సెప్టెంబర్ మద్య కాలంలోనే, రెవిన్యూ లోటు రూ.33,140.62కోట్లకు (662.80శాతం)చేరింది. అదలా ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం తొలి ఆరు మాసాలలోనే వార్షిక లక్ష్యం, రూ.37,029.79 కోట్లకు మించి రూ.39,914.18 కోట్లు అప్పు చేసింది. నిజానికి గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే, ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ప్రభుత్వ ఆదాయం రూ.19,986.17 కోట్లు పెరిగింది. అయినా, బడ్జెట్’ లో ప్రతిపాదించిన రూ. 30,571.53 కోట్లు పెట్టుబడి వ్యయంలో కేవలం రూ.6,419.51 కోట్లు మాత్రమే మొదటి ఆరు నెలల్లో ఖర్చు చేసింది, అంటే, అర్తిక వ్యవస్థ పట్టాలు తప్పి పరుగులు తీస్తోందని వేరే చెప్పనక్కర్లేదు. ప్రభుత్వం దృష్టి మొత్తం నగదు బదిలీ మీదనే కేంద్రీకృతం కావడంతో ఆర్థిక శాఖతో సహా ఏ ప్రభుత్వ శాఖ కూడా అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆలోచించడమే లేదని, అధికారులు అంటున్నారు. గత సంవత్సరం బడ్జెట్’లో కాపిటల్ వర్క్స్ కోసంగా రూ.29,300.42 కోట్లు కేటాయిస్తే, అందులో ఖర్చు చేసింది రూ.18,385.49 కోట్లు మాత్రమే.
ఈ నేపధ్యంలోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సమీక్షించిన ఆర్థిక శాఖ అధికారులు, రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ కుప్ప కూలేది ఖాయం అనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఎటొచ్చి ఎప్పుడన్న విషయంలోనే సమావేశంలో ప్రదంగా చర్చ జరిగిందని సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు.ఆలాగే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్దంలో పరిస్థితి కొంత మెరుగు పడవచ్చని, కొందరు ధికారులలో చిన్ని చిన్నిఆశలు ఉన్నా, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఒంటెద్దు పోకడలు కొనసాగిస్తే మాత్రం, కుబేరుడే దిగివచ్చిన ఎపీని కాపాడలేని ఈ పరిస్థితిలో కేంద్రం జోక్యం చేసుకుని ఆర్ధిక ఎమర్జెన్సీ విధించడం ఒక్కటే, రాష్ట్రాన్ని రక్షించే తారక మంత్రం అవుతుందని అధికారులు అంటున్నారు. అదే జరిగితే, ఆర్థిక అత్యవసర పరిస్థితి కారణం కేంద్ర పాలన విధించిన తొలి రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర సృష్టిస్తుంది. ఆ ఘనత ఒక్క ఛాన్స్ జగన్ రెడ్డికే దక్కుతుంది.