రైతులపై 'లాఠీ' కావరం.. ఇదేమి రాజ్యం.. పోలీస్ రాజ్యం..
posted on Nov 11, 2021 @ 4:09PM
అమరావతి కోసం మేముసైతమంటూ తరలివచ్చారు వారంతా. రాజధాని రైతుల మహా పాదయాత్రకు సంఘీభావంగా వేలాది మంది దండు కట్టారు. అమరావతి రైతులతో కదం కదం కదిపారు. జై అమరావతి.. జైజై అమరావతి.. నినాదాలతో హోరెత్తించారు.
మహా పాదయాత్రకు ఇలా పెద్ద ఎత్తున ప్రజాదరణ వెల్లువెత్తడాన్ని చూసి పాలకులు తట్టుకోలేకపోయారు. పోలీసులను ప్రజల మీదకు ఉసిగొల్పారు. పై నుంచి ఆదేశాలు అందినట్టున్నాయి.. ఖాకీలు రంగంలోకి దిగిపోయారు. ఎలక్షన్ కోడ్.. అదీ ఇదీ అంటూ రూల్స్ పేరుతో కఠిన ఆంక్షలు విధించారు. పాదయాత్రలో 157 మంది అమరావతి రైతులు మినహా.. బయటి వారెవరూ పాల్గొన వద్దంటూ.. ఎవరూ సంఘీభావం తెలుపొద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. కానీ, ప్రజా ఉద్యమాన్ని ఆంక్షలతో అడ్డుకోగలరా? ఖాకీల బలగంతో రైతులను ఏకాకులు చేయగలరా? అది ముమ్మాటికీ అసాధ్యం. అందుకే, రాజధాని రైతులకు మద్దతుగా పెద్ద సంఖ్యలో స్థానికులు తరలివచ్చారు. అది చూసి ఓర్వలేని ఖాకీలు.. అదే అదనుగా.. లాఠీలకు పని చెప్పారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం చదలవాడను రణరంగంగా మార్చేశారు.
ప్రజా దండుపై లాఠీఛార్జి చేశారు. బారికేడ్లతో అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసు వలయాన్ని చేధించుకుంటూ స్థానికులు ముందుముందుకు కదిలారు. పోలీసులు లాఠీలతో దొరికిన వారిని దొరికినట్టు చితకబాదారు. మహిళలనూ వదలకుండా లాఠీలతో విరుచుకుపడ్డారు.
ఖాకీల దెబ్బలకు ఆళ్ల నాగార్జున చెయ్యి విరిగిపోయింది. హాస్పిటల్‌కి తీసుకెళితే.. చెయ్యంతా సిమెంట్ పట్టీలు వేశారు. దెబ్బలు బాగా తగిలాయని డాక్టర్లు చెబుతున్నారు. పోలీసులు ఇంతలా కొట్టడమేంటని చికిత్స చేసిన వైద్యులే ఆశ్చర్యపోతున్నారు.
ఏపీలో ప్రజాస్వామ్యం పత్తా లేకుండా పోయిందని.. రెండేళ్లుగా అంతా పోలీస్ రాజ్యం.. రాజారెడ్డి రాజ్యాంగమే నడుస్తోందని మరోసారి తేలిపోయింది. రైతుల పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న వారిపై పోలీసులు లాఠీఛార్జ్ చెయ్యడం దారుణమంటున్నారు. హైకోర్టు పర్మిషన్‌తో అమరావతి రైతులు చేస్తున్న మహా పాదయాత్రను నీరుగార్చడానికే ఇలా స్థానికులపైకి ఖాకీలను రెచ్చగొడుతున్నారని మండిపడుతున్నారు.
న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకూ.. రాజధాని రైతులు చేపట్టిన మహా పాదయాత్ర జగన్ సర్కారుకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నట్టుంది. అందుకే పోలీసుల్ని ప్రయోగించి పాదయాత్రకి అడుగడుగునా ఆటంకాలు కల్పించే కుట్రలు చేస్తున్నారని అంటున్నారు. కవరేజ్‌కి వచ్చిన మీడియా ప్రతినిధుల్ని సైతం అడ్డుకుంటుండటం.. పాలకుల అభద్రతాభావానికి నిదర్శనం. ప్రకాశం జిల్లా చదవలవాడలో పోలీసులు సృష్టించిన బీభత్సం.. లాఠీలతో విరుచుకుపడటం.. చెయ్యి విరిగేలా చితకబాదడం చూసి.. ఏపీలో పోలీస్ రాజ్యం అమలు చేస్తున్నారంటూ అంతా మండిపడుతున్నారు.
అంత దారుణంగా కొట్టి.. ఖాకీలు సాధించిందేంటి? జగన్ కళ్లలో ఆనందం చూడటం మినహా చేసిందేంటి? రైతుతో కన్నీళ్లు పెట్టించిన ఏ పాలకుడూ బాగుపడినట్టు చరిత్రలో లేదు. రైతులపై పడిన ప్రతీ లాఠీ దెబ్బకు సమాధానం చెప్పాల్సిన.. శిక్ష అనుభవించాల్సిన రోజు తప్పక వస్తుంది. కాకపోతే కాస్త ఆలస్యం అవుతుంది కావొచ్చు అంతే. చదలవాడలో ఖాకీల ఓవరాక్షన్ మినహా జరిగిందేమీ లేదు. అమరావతి రైతుల మహా పాదయాత్ర అంతే ఉత్సాహంగా ముందుకు సాగుతోంది.. స్థానికులు వందలాదిగా తరలివచ్చి రాజధాని రైతులకు సంఘీభావం చెబుతూనే ఉన్నారు. అమరావతి ఉద్యమం ఆగేది కాదు. పోలీసుల సాయంతో ఆపగలిగేది అంతకన్నా కాదు. జై అమరావతి.. జైజై అమరావతి.