ఏపీలో ఆర్థిక ఎమర్జెన్సీ తప్పదా? వైసీపీ ఎంపీ రాగాలు అందుకేనా?
posted on Dec 15, 2021 @ 10:57AM
పార్లమెంట్ ఉభయ సభల్లో, వైసీపీ సభ్యుల బీద అరుపులు, ఆర్తనాదాలు దేనికి సంకేతం? పెద్దల సభలో ఉత్తరప్రదేశ్’కు ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ సభ్యుడు జీవిఎల్ నరసింహ రావు, ఏపీ ఆర్థిక పరిస్థితి గురించి ప్రశ్నించడం, అందుకు విపులంగా, వివరంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన సమాధానం ఏమి సూచిస్తోంది? అదే క్రమంలో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ఎంపీలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమావేశం, డిసెంబర్ 28 విజయవాడలో బీజేపీ భారీ బహిరంగ సభ సన్నాహలు, దేనికి సంకేతం? ఈ పరిణామాలను దేనికదిగా చూడాలా,లేక ఒకదానితో ఒకటి ముడిపడిన పరిణామాలుగా భావించాలా? అసలు ఢిల్లీలో ఏమి జరగుతోంది? ఎపీలో రేపు ఏమి జరగబోతోంది?
ఈ ప్రశ్నలు కొంత గంభీరంగా కనిపించినా, రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు. మాత్రం ఇదేమీ అనూహ్య పరిణామం కాదనే అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దినదిన ప్రవర్థమానంగా దిగాజారుతూనే వుంది. ప్రతిపక్ష పార్టీలను పక్కన పెట్టినా, ఆర్థిక రంగ నిపుణులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాళా దిశగా పరుగులు పరుగులు తీస్తోందని హెచ్చరిస్తూనే ఉన్నారు. చివరకు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) కూడా ఎప్పటికప్పుడు అక్షింతలు వేస్తునే వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం రెవిన్యూ వ్యయాన్ని తగ్గించుకోవాలని లేదంటే అప్పులు పెరిగి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అద్వాన్నస్థితికి చేరుతుందని ఒకటికి రెండు సార్లు హెచ్చరించింది. రాష్ట్ర ప్రభుత్వం 2019 - 20 తెచ్చిన అప్పుల్లో 80 శాతం రెవిన్యూ వ్యయాలకే వెచ్చించడాన్ని కాగ్ తప్పుబట్టింది. దాని వల్ల ఆస్తుల కల్పన ప్రక్రియ కుంటుపడిందని పేర్కొంది. తెచ్చిన రుణాల్ని ఆస్తుల కల్పనకు బదులు, ఇలా రెవెన్యూ వ్యయాల కోసం ఎక్కువ వెచ్చించడం వల్ల భవిష్యత్తులో రాష్ట్రం తీర్చాల్సిన రుణ భారం బాగా పెరిగిపోతుందని కాగ్ ఆందోళన వ్యక్తంచేసింది.
రాష్ట్ర ప్రభుత్వం చేసిన బడ్జెటేతర రుణాలను పద్దుల్లో చూపకపోవడం వల్లే ప్రభుత్వం చెల్లించాల్సిన అప్పులు ఎఫ్‌ఆర్‌బీఎం చట్టానికి లోబడే ఉన్నట్లు కనిపిస్తున్నాయని, వాటినీ పరిగణనలోకి తీసుకుని ఉంటే నిర్దేశిత పరిధులను దాటేసి ఉండేవని తెలిపింది. ప్రభుత్వం తనకు వచ్చే ఆదాయంపై వాస్తవిక అంచనాలు రూపొందించుకోవడంలోనూ, రెవెన్యూ వ్యయ నియంత్రణలోనూ విఫలమైందని, అందుకే రెవెన్యూ లోటు గణనీయంగా పెరిగిందని పేర్కొంది. ఇప్పుడు పెద్దల సభలో జీవీఎల్ అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇదే సమాధానం ఇచ్చారు.ఏపీ ప్రభుత్వం ఆర్థిక నిర్వహణలో పూర్తిగా విఫలమైనదని కుండ బద్దలు కొట్టారు. ఏపీ ప్రభుత్వం రెవిన్యూ వ్యయాన్ని నియంత్రించలేక పోవడం వలన 14 ఆర్థిక సంఘం కాల వ్యవధి మొత్తంతో పాటు, 15 వ ఆర్థిక సంఘం తొలి సంవత్సరం 2020-21లోనూ రెవిన్యూ లోటు, గ్రాంటు మంజూరు చేసినా ఏపీ రెవిన్యూ లోటులో పెరుగుదల కనిపించిందని చెప్పారు, అంటే, ఏపీ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు చిట్కాలు సరిపోవని, శస్త్ర చికిత్స అవసరమని చెప్పకనే చెప్పారు.
నిజానికి ఇవేవీ కొత్త విషయాలు కాదు, ఎప్పటినుంచో రాష్ట్ర వ్యవహారాలతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ అదే మొత్తుకుంటున్నారు. అయినా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎవరి మాటలు పట్టించుకోలేదు. అందిన మేరకు అప్పులు తెచ్చి పప్పు బెల్లాల్లా పందారం చేశారు. చివరకు ఇప్పుడు ఇక అప్పులు కూడా పుట్టని పరిస్థితి ఎదురుకావడంతో లోక్ సభలో వైసీపీ పక్ష నేత మిదున్ రెడ్డి, ఆదుకోండి ప్లీజ్ అంటూ కేంద్రాన్ని వేడుకున్నారు. నిజానికి, మిదున్ రెడ్డి ఇలా, లోక్ సభ వేదికగా కేంద్రాన్ని వేడుకోవడం,కన్నీరు కార్చడం ఇదే మొదటి సారి కాదు, ఇదే సమావేశాల్లో ఇంతకు ముందోసారి కూడా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కుడా లేదని, కేంద్రమే ఆదుకోవాలని ప్రధానిని వేడుకున్నారు. అలాగే, రాజ్యసభలో వైసీపీ పక్ష నేత విజయసాయి రెడ్డి కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అద్వాన్నంగా ఉందని, కేంద్రమే ఆదుకోవాలని మొర పెట్టుకున్నారు.
అయితే ఇప్పుడు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అసలేం బాగులేదని అధికార పార్టీ సభ్యులు పార్లమెంట్ వేదికగా దేశానికి తెలియ జేయడం, ప్రభుత్వ స్పందన, ఇతర సంబంధిత పరిణామాలను గమనిస్తే, కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ విషయంలో కీలక నిర్ణయం ఏదో తీసుకునేందుకు సిద్ధంగా ఉందని,అనుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే అటు నుంచి ఇటు నుంచి కూడా ఒకే సారి ఉభయ సభల్లో ఏపీ ఆర్థిక పరిస్థితి ప్రస్తావనకు వచ్చిందని అంటున్నారు. అందుకే మిదున్ రెడ్డి ఆదుకోండని ప్రధాని మోడీని, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్’ను వేడుకుంటూనే,రాష్ట్ర విభజన నాటి ముచ్చట్లు మొదలు, చాలా విషయాలు చెప్పు కొచ్చారు. ఏపీ ప్రజలకు ఇష్టం లేకున్నా యూపీఏ, ఎన్డీఏ కలిసి రాష్ట్రాన్ని విభాజించాయని, అదేదో నిన్నో మొన్నో జరిగినట్లు చెప్పు కొచ్చారు. విభజన హామీల ప్రస్తావన తెచ్చారు. ముఖ్యంగా ఇంతవరకు గడచిన రెండున్నర సంవత్సరాలలో ఏనాడు మాట వరసకైనా మాట్లాడని ప్రత్యేక హోదా,పోలవరం ప్రాజెక్ట్ ప్రాస్తావన తీసుకొచ్చారు.ప్రత్యేక హోదా తప్ప మరో గత్యంతరం లేదని, ఇచ్చితీరాలనే అర్థం వచ్చేలా గొంతు పెద్దగాచేసి మరీ మాట్లాడారు. అలాగే, మిధున్ రెడ్డి, ఇంతకాలానికి ఎలా గుర్తించారో ఏమో కానీ, పోలవరమ ప్రాజెక్ట్, ‘ఏపీ ప్రజల జీవన రేఖ’ అని గుర్తించారు. సవరించిన అంచనాలను ఆమోదించి ప్రాజెక్ట్ పూర్తి చేయాలని అన్నారు.
అంటే వినవస్తున్న మాటలు చోటు చేసుకుంటున్న పరిణామాలను గమనిస్తే, ఏపీలో ఏదో జరగబోతోందని అనుమానించ వలసి వస్తోంది ..అదేమిటి ? ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న విధంగా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ఎమర్జెన్సీ విదిస్తుందా? రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే కోరుకుంటోందా? లేక ఇంకేదైనా జరగబోతోందా .. ప్రస్తుతానికి ఇది సమాధానం లేని ప్రశ్న .. రేపు ఏమి జరుగుతోందో చూడవలసిందే అంటున్నారు విశ్లేషకులు.