వాగులో బస్సు బోల్తా.. 9 మంది మృతి! గోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం..
posted on Dec 15, 2021 @ 1:12PM
పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జంగారెడ్డిగూడెం సమీపంలో ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి జల్లేరు వాగులో పడింది. బస్సు డివైడర్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రయాణికులు మృతి చెందగా... మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రమాద సమయంలో బస్సులో 47 మంది ప్రయాణికులు ఉన్నారని తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఘటన జరిగిన వెంటనే బస్సు కిటికీల నుంచి దూకి పలువురు ప్రయాణికులు ప్రాణాలు కాపాడుకున్నారు. బస్సు వేలేరుపాడు పేట నుంచి జంగారెడ్డిగూడెం వెళ్లుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు వాగులో పడిన వెంటనే స్థానికులు, వాహనదారులు, పోలీసులు, సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. జల్లేరు వాగులోకి ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురై డ్రైవర్‌తో సహా పలువురు మృతి చెందటం అత్యంత బాధాకరమన్నారు. సంఘటన సమీపంలో ఉన్న పార్టీ శ్రేణులు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం వెంటనే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించటంతో పాటు బాధిత కుటుంబాలను అన్ని విధాల ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనలో చనిపోయినవారి కుటుంబ సభ్యులకు చంద్రబాబు తన ప్రగాడ సానూభూతిని తెలియజేశారు.