సెక్యులర్ ఫ్రంటే శ్రీరామ రక్ష.. కామ్రేడ్ పినరయ్ జోస్యం
posted on Dec 15, 2021 @ 2:33PM
దేశం నెత్తి మీద నుంచి ఓ పెద్ద బరువు దిగిపోయింది. కామ్రేడ్ పినరయ్ విజయన్ ఆ బరువును ఇట్టే దించేశారు. కేంద్రంలో ఏడేళ్ళుగా తిష్టేసుకు కూర్చున్న బీజేపీ ప్రభుత్వాని గద్దేదించడం ఎలా? మోడీ మూడోసారి ప్రధాని కుర్చీలో కూర్చోకుండా చేయడం ఎలా? అని అందరినీ వేధిస్తున్న ప్రశ్నకు పినరయ్ సింపుల్ గా సమాధానం ఇచ్చారు. వామపక్షాల సారధ్యంలో ఏర్పడే సెక్యులర్ ఫ్రంట్ బీజేపీనే
గద్దెదించుతుందని విజయన్ ధీమా వ్యక్త పరిచారు.
దేశంలో బీజేపీకి రాజకీయ ప్రత్యామ్నాయం ఏది అనే విషయంలో అనేక చర్చలు నడుస్తున్నాయి. కొందరు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో కూటమి ఏర్పడుతుందని అంటున్నారు. కొందరేమో కాంగ్రెస్ లేని కూటమి, ఆత్మ లేని దేహం అంటున్నారు. మమతా బెనర్జీ అయితే కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏ, ఈజ్ నో మోర్’ అంటున్నారు. కాంగ్రెస్ లేకుండా బీజేపీ ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తామని మమతా బెనర్జీ ఏకంగా శపథమే చేశారు. కొద్ది రోజుల క్రితం దేశంలో బీజేపీ, కాంగ్రెస్‌లకు వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హడావిడి చేశారు కానీ, ఆ తర్వాత మెత్త బడ్డారు. ఇప్పుడు మళ్ళీ దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల ఫ్రంట్ అంటూ ప్రయత్నాలు ప్రారంభించారు.
ఈ మధ్యే కాంగ్రెస్ లేకుండా బీజేపీ ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తామని బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ శపథం చేస్తున్నారు. అయితే ఇవేవీ కావని, భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా సెక్యూలర్ ప్రత్యామ్నాయం లెఫ్ట్ పార్టీల ఆధ్వర్యంలోనే ఏర్పడుతుందని కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ అన్నారు. అయితే, విజయన్ కూడా ఎందుకనో కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ చేసుకున్నారు. బీజేపీ ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు చేసే అవకాశం కాంగ్రెస్‌కు లేదని, ఒకవేళ ఏర్పాటు చేసినప్పటికీ ప్రజలు ఆదరించరని ఆయన అన్నారు. జైపూర్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రసంగంలో రాహుల్ ప్రసంగంలోని హిందూ, హిందుత్వ పదాలను ఉదహరిస్తూ ఆయన ఈ విషయాన్ని నొక్కి చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ సెక్యూలరిజాన్ని కాకుండా సాఫ్ట్ హిందుత్వ గురించి మాట్లాడుతోందని, దీంతో ప్రజలకు ఇప్పటికి కాంగ్రెస్‌పై ఉన్న నమ్మకం సన్నగిళ్లిపోయిందని విజయన్ అన్నారు.
రాహుల్ గాంధీ మాటల్లోని సాఫ్ట్ హిందుత్వ స్టాండ్‌ను కాంగ్రెస్ ఎప్పటి నుంచో అనుసరిస్తూ వస్తోంది. కాకపోతే జైపూర్‌లో రాహుల్ గాంధీ ఈ విషయాన్ని మరోసారి ప్రస్తావించారంతే. కాంగ్రెస్ పట్ల ప్రజలు నమ్మకాన్ని కోల్పోయారు. కార్యకర్తల్లో కూడా ఆ పార్టీపై నమ్మకం పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీకి వ్యతిరేకంగా ‘సెక్యూలర్ ప్రత్యామ్నాయం’ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయలేదు. సెక్యూలరిజం కాకుండా హిందూయిజం గురించి కాంగ్రెస్ మాట్లాడడం తన ఉనికిని మరింత తగ్గించుకోవడమే. కాంగ్రెస్‌కు ఇంతకంటే పెద్ద తప్పు అవసరం లేదని విజయన్ అన్నారు. అయితే ప్రశాంత్ కిశోర్ పౌరోహిత్యంలో బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడి కూటమి ఏర్పాటుకు సాగుతున్న యజ్ఞం మూడు కూటములు,ఆరు ఫ్రంట్లుగా వర్ధిల్లుతోంది.