వన్డేలకు కెప్టెన్ గా ఉంటానని చెప్పినా తీసేశారు! విరాట్ కోహ్లీ సంచలనం..
posted on Dec 15, 2021 @ 3:13PM
భారత క్రికెట్ టీమ్ లో గందరగోళం నెలకొందన్న వార్తలు మరింత నిజమయ్యాయి. టెస్ట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లీనే అలాంటి సంకేతమిచ్చారు. బీసీసీఐలో కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలపై స్పందించిన కోహ్లీ.. కీలక విషయాలు చెప్పారు. వన్డే కెప్టెన్సీ నుంచి తనను తప్పించడం, రోహిత్ శర్మతో విభేదాలు, బీసీసీఐ తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు విరాట్ కోహ్లీ.
సౌతాఫ్రికా టూర్ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన విరాట్.. కెప్టెన్సీ నుంచి తప్పించడంపై తొలిసారి స్పందించాడు. తనను కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్నట్టు కేవలం గంటన్నర ముందే చెప్పారని చెప్పాడు. టెస్ట్ జట్టు ఎంపిక సమయంలోనే సెలెక్టర్లు వన్డే కెప్టెన్సీపై తనతో మాట్లాడారని చెప్పారు కోహ్లీ. అయితే తనతో టెస్టు జట్టు గురించి చీఫ్ సెలెక్టర్ మాట్లాడారని.. అంతా అయిపోయాక.. వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించాలని ఐదుగురు సెలెక్టర్లు నిర్ణయించారని చెప్పారని తెలిపారు. వన్డే కెప్టెన్లీ నుంచి తప్పించడంపై తనకు ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నారు కోహ్లీ.
టీ20 వరల్డ్ కప్ తర్వాత టీ20లకు కెప్టెన్ గా ఉండనన్న తన నిర్ణయాన్ని బీసీసీఐ స్వాగతించిందని చెప్పాడు విరాట్ కోహ్లీ. మరోమారు ఆలోచించకుండా తన నిర్ణయాన్ని అంగీకరించిందని, చాలా మంచి నిర్ణయమంటూ మెచ్చుకుందని గుర్తు చేశాడు. ఆ సమయంలోనే వన్డేలు, టెస్టులకు నాయకత్వం వహిస్తానంటూ బీసీసీఐకి చెప్పానన్నాడు. ఈ విషయంలో తాను చాలా స్పష్టంగా ఉన్నానని తెలిపాడు. అయితే, తాను వేరే ఫార్మాట్లకు నాయకత్వం వహించలేనని సెలెక్టర్లు భావిస్తే తానేమీ చేయలేనన్నాడు. వన్డేలో ఆడట్లేదన్న విషయంపైనా కోహ్లీ క్లారిటీ ఇచ్చేశాడు. సౌతాఫ్రికాతో వన్డేలూ ఆడుతున్నానని తేల్చి చెప్పాడు. చాలా మంది అబద్ధాలు రాస్తున్నారని, తానెప్పుడూ విశ్రాంతి కావాలంటూ ఎవరినీ అడగలేదని కోహ్లీ స్పష్టం చేశారు.
రోహిత్ చాలా మంచి నాయకుడని, జట్టును సమర్థవంతంగా, వ్యూహాత్మకంగా నడిపించడంలో దిట్ట అని కోహ్లీ కొనియాడాడు. రాహుల్ ద్రావిడ్ ఓ గొప్ప వ్యక్తి అన్నాడు. తన వంతుగా జట్టును ముందుకు నడిపించేందుకే తాను కృషి చేస్తానని, వన్డేలు, టీ20ల్లో రోహిత్ కు వంద శాతం అండగా నిలుస్తానని స్పష్టం చేశాడు. తనకు, రోహిత్ కు మధ్య ఎలాంటి విభేదాలు లేవని తేల్చి చెప్పాడు. రెండేళ్లుగా ఇదే విషయం చెబుతున్నానని, చెప్పి చెప్పి అలసిపోయానని అన్నాడు. తనను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడంపై బీసీసీఐ చెబుతున్న కారణాలను అర్థం చేసుకోగలనని తెలిపాడు. జట్టును హీన స్థితికి తీసుకెళ్లేలా తన నిర్ణయాలుండవని విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు.