మాజీ గవర్నర్ నరసింహన్‌కు తీవ్ర అస్వస్థత.. కేసీఆర్ పరామర్శ..
posted on Dec 15, 2021 @ 10:55AM
ఈఎస్ఎల్ నరసింహన్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు, విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్‌గా చేసిన వ్యక్తి. సుదీర్ఘకాలం గవర్నర్‌గా కొనసాగిన ఐపీఎస్. విభజన చిక్కుముడులను జాగ్రత్తగా హ్యాండిల్ చేశారు. కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య సమన్వయకర్తగా మెప్పించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో చాలా సన్నిహితంగా మెదిలారు. నెలకోసారి అన్నట్టు.. సీఎం కేసీఆర్ రాజ్‌భవన్ వెళ్లేవారు. నరసింహన్, కేసీఆర్ కుటుంబాల మధ్య మంచి సంబంధాలు ఉండేవి. గవర్నర్‌గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఏపీల్లో చెరగని ముద్ర వేశారు ఈఎస్ఎల్ నరసింహన్.
గవర్నర్ పదవి నుంచి వైదొలిగాక.. తన సొంత రాష్ట్రమైన తమిళనాడులోని చెన్నైకే పరిమితమయ్యారు. అప్పటి నుంచి అక్కడే ఉంటున్నారు. తాజాగా, మాజీ గవర్నర్ నరసింహన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యంతో చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరారు. ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. రెండు నెలల క్రితం నరసింహన్ దంపతులకు కొవిడ్ సోకింది. నాలుగు రోజులు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాక కోలుకున్నారు. ప్రస్తుతం పోస్ట్ కొవిడ్ సింప్టమ్స్ తో నరసింహన్ ఆసుపత్రి పాలయ్యారని తెలుస్తోంది.
విషయం తెలిసి.. మంగళవారం చెన్నైలో ఉన్న కేసీఆర్ నరసింహన్‌ను పరామర్శించేందుకు హాస్పిటల్‌కు వెళ్లారు. కానీ, ఐసీయూలో ఉండటం, నరసింహన్ స్పందించే పరిస్థితి లేకపోవడంతో వైద్యులు ఆయనను కలిసేందుకు కేసీఆర్‌కు అనుమతి ఇవ్వలేదు. దీంతో, నరసింహన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. క్షేమంగా కోలుకోవాలని ఆకాంక్షించారు. నరసింహన్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాలని కోరారు.