టీకా వేసుకోకుంటే ఉద్యోగం ఊస్టింగే!
posted on Dec 15, 2021 @ 12:04PM
కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తోంది.సౌతాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త వైరస్ ఇప్పటికే 60 దేశాలకు వ్యాపించింది. ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరిగిపోతుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఏప్రిల్ నాటికి 50 వేల నుంచి 75 వేల మరణాలు నమోదు కావొచ్చని ఆరోగ్య సంస్థలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ కట్టడికి పలు దేశాలు, సంస్థలు కఠిన చర్యలకు దిగుతున్నాయి.
ఒమిక్రాన్ అలజడి నేపథ్యంలో గూగుల్ సంచలన నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ వేయించుకోని ఉద్యోగులను జాబ్ లో నుంచి తీసేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు గూగుల్ సర్క్యులర్ ను జారీ చేసింది. దాని ప్రకారం ఉద్యోగులంతా తమ తమ వ్యాక్సినేషన్ వివరాలను డిసెంబర్ 3 నాటికి సమర్పించాలని, టీకా వేసుకోని వారెవరైనా ఉంటే వచ్చే ఏడాది జనవరి 18లోపు వ్యాక్సిన్ వేయించుకోవాలని డెడ్ లైన్ పెట్టింది. టీకా సర్టిఫికెట్లను సమర్పించాలని ఆదేశించింది. వ్యాక్సిన్ వేయించుకోకుంటే ముందుగా జీతాల్లో కోత పెడతామని, పదే పదే చెప్పినా వినకుంటే ఉద్యోగంలోంచి తీసేస్తామని గూగుల్ హెచ్చరించింది.
కొవిడ్ టీకా తీసుకోకుంటే మొదటి 30 రోజుల పాటు పెయిడ్ అడ్మినిస్ట్రేషన్ లీవ్ కింద ఉద్యోగికి సెలవు ఇస్తామని, ఆ తర్వాత కూడా వ్యాక్సిన్ వేసుకోకుంటే ఆరు నెలల పాటు జీతం లేని వ్యక్తిగత సెలవుల్లోకి పంపిస్తామని హెచ్చరించింది. అప్పటికీ వినకుంటే సంస్థ నుంచి బయటకే పంపించేస్తామని వార్నింగ్ ఇచ్చింది.తమ ఉద్యోగుల భద్రతకు వ్యాక్సినేషనే కీలకమని ఇప్పటికే చెప్పామని, ఉద్యోగులంతా వ్యాక్సిన్ వేసుకునేందుకు తాము చేయాల్సిందంతా చేస్తున్నామని గూగుల్ అధికార ప్రతినిధి చెప్పారు. తమ సంస్థ టీకా విధానాలపై కచ్చితంగా నిలబడతామని తేల్చి చెప్పారు.