జగన్‌కు సజ్జల సలహాదారా? కుట్రదారా?
posted on Dec 15, 2021 @ 12:02PM
అధికారంలోకి వస్తే వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తా. ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన హామీ ఇది. మరి, అధికారంలోకి వచ్చి ఎన్ని వారాలైంది? సీపీఎస్ రద్దు ఏమైంది? అంటూ ప్రభుత్వ ఉద్యోగులు గట్టిగానే నిలదీస్తున్నారు. పీఆర్సీ ఎపిసోడ్‌లో మరోసారి సీపీఎస్ రద్దు రచ్చగా మారింది. వెంటనే ప్రభుత్వ సలహాదారు సజ్జల రంగంలోకి దిగిపోయారు. మీడియా ముందుకొచ్చి.. సీపీఎస్ గురించి తెలియకుండానే జగన్ హామీ ఇచ్చారంటూ.. జగనన్న ఇమేజ్ మొత్తం డ్యామేజ్ చేసిపారేశారు. ఈ ఒక్కమాటతో జగన్‌కు ఏమీ తెలీదనే విషయం అందరికీ తెలిసిపోయింది. ఆయనవి ఉత్తుత్తి గాలిమాటలనే మేటర్ లీక్ అయిపోయింది. చంద్రబాబు పదే పదే ఆరోపిస్తున్నట్టు.. జగన్‌ది అనుభవరాహిత్యమనే సంగతి తేలిపోయింది.
సీపీఎస్ గురించి తెలియకుండానే జగన్ హామీ ఇచ్చారనడం.. సీపీఎస్ రద్దు చేయాలంటే రాష్ట్ర బడ్జెట్ కూడా సరిపోదని సజ్జల చెప్పడం ఏపీలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. జగన్‌ను కాపాడే ప్రయత్నంలో అసలు గుట్టు బయటపెట్టారనే చర్చ నడుస్తోంది. ఇంతకీ, సజ్జల అలా చెప్పడానికి జగన్ అనుమతి ఇచ్చారా? లేక, సజ్జలనే ఫ్లో లో నిజం కక్కేశారా? అనుకోకుండా నోరు జారారా? అనుకునే నోటి నుంచి ఆ మాట వచ్చిందా? జగన్‌కు అసలేమీ తెలీదా? ఆయన గుట్టంతా సజ్జలకు తెలుసా? ఇలా రకరకాల టాక్స్ నడుస్తున్నాయి.
జగన్ మోనార్క్. ఎవరినీ నమ్మరు. ఎవరి మాటా వినరు..అని అంటారు. తల్లిని, చెల్లినే దూరం పెట్టారు. తనతో జైలుకెళ్లి వచ్చిన ఏ2ను తాడేపల్లికి రానివ్వడం లేదు. ఆయన తన నీడను కూడా నమ్మరు. కానీ, సజ్జలతో మాత్రం బాగానే సఖ్యతగా ఉంటున్నారు. తన మీడియాలో పనిచేసే ఉద్యోగి నుంచి.. ఇప్పుడు ప్రభుత్వ సలహాదారు వరకూ.. సజ్జలకు బాగానే బూస్ట్ ఇచ్చారు. జగన్ మనసెరిగి.. సజ్జలనే అన్నీ తానై ముందుకొస్తుంటారు. పార్టీ తరఫునా.. ప్రభుత్వం తరఫునా.. సీఎం తరఫునా.. అన్ని విషయాలూ ఆయనే మాట్లాడుతుంటారు. ప్రస్తుతం పీఆర్సీపై ఉద్యోగులంతా రగిలిపోతుంటే.. జగన్‌ను వెనకేసుకొచ్చేందుకు ఈయన ముందుకొచ్చారు. ఆ ఫ్లోలో జగన్‌కు అంతగా అవగాహన లేదనే నిజాన్ని బయటపెట్టేశారని అంటున్నారు.
అసలే జగన్ మోనార్క్. అలాంటిది తనపైనే కామెంట్ చేస్తే ఊరుకుంటారా? అస్సలు ఊరుకోరు. తాడేపల్లిలో ఇప్పుడు అదే జరుగుతోందని తెలుస్తోంది. సీపీఎస్ రద్దుపై తనకు అవగాహన లేకుండా హామీ ఇచ్చానంటూ.. సజ్జల చేసిన వ్యాఖ్యలపై సీఎం జగన్ సీరియస్ అయినట్టు సమాచారం. సజ్జల ఓవరాక్షన్‌పై పిలిచి క్లాస్ ఇచ్చారని చెబుతున్నారు. చంకన పెట్టుకుంటే.. చులకన చేస్తావా? అంటూ సజ్జలకు జగన్ నుంచి షెంటింగ్స్ పడ్డాయట. ఈ ఒక్కమాట పొలిటికల్‌గా ఎంత డ్యామేజ్ చేస్తుందో తెలీదా? అంటూ గట్టిగానే మందలిచ్చారట. ఇంతగా నమ్మితే.. చేసింది ఇదా అని మండిపడ్డారట జగన్.
జగన్‌ను మొదటి నుంచీ తప్పుదారి పట్టిస్తున్నది సలహాదారు సజ్జలనే అని అంటుంటారు. మాట తప్పడు.. మడమ తిప్పడు.. అనే ఇమేజ్ నుంచి అమరావతి, మూడు రాజధానులు.. పీఆర్సీ, సీపీఎస్ వరకూ.. అధికారంలోకి వచ్చాక మాట తప్పుడు.. మడమ తిప్పుడు.. వ్యవహారాలే ఎక్కువ. వీటన్నిటికీ సజ్జల సలహాలే కారణమని చెబుతారు. ఎవరి మాటా వినని జగన్.. ఒక్క సజ్జల మాటే వింటుండటం వల్లే ఈ దుష్పరిణామాలని ఆరోపిస్తున్నారు. యూటర్న్ నిర్ణయాలు, రివర్స్ పాలనలో జగన్‌తో పాటు సజ్జలకూ ఎంతోకొంత భాగస్వామ్యం ఉందని అంటున్నారు. తాజా, సీపీఎస్ ఎపిసోడ్‌లో సజ్జల కామెంట్స్.. ఆ ఇద్దరికీ బాగా డ్యామేజ్ చేసినట్టే. త్వరలోనే ముఖ్యమైన మంత్రి పదవికి ఎసరు పెట్టిన సజ్జలకు ఇది శరాఘాతమే. ఎంపీ రఘురామ అన్నట్టు.. ఆయన సజ్జలనా? కుట్రలు చేసే బిజ్జలనా?