ఒమిక్రాన్‌పై WHO వార్నింగ్.. ఇండియాకు బిగ్ వర్రీ!
posted on Dec 15, 2021 @ 3:23PM
ఆల్ఫా. బీటా. డెల్టా. ఇవన్నీ ఓ లెక్క.. ఒమిక్రాన్ ఇంకోలెక్క. ఒమిక్రాన్ డేంజరస్ వేరియంట్ అని.. అసాధారణ రీతిలో వ్యాపిస్తోందని.. ప్రపంచ ఆరోగ్య సంస్థ- WHO హెచ్చరించింది. ఇప్పటికే 77 దేశాలకు విస్తరించిందని.. త్వరలోనే మరిన్ని దేశాలపై పంజా విసరడం ఖాయమని తెలిపింది. ప్రపంచ దేశాలు ఒమిక్రాన్ కట్టడికి తగు చర్యలు చేపట్టాలని సూచించింది. ఒమిక్రాన్ స్వల్ప వ్యాధి మాత్రమేనంటూ నిర్ధారణకు రావద్దని.. అలా అనుకుంటే చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని WHO హెచ్చరించింది.
ఒమిక్రాన్ వేరియంట్ వెలుగు చూసిన దక్షిణాఫ్రికాలో ఇప్పటికే సామాజిక వ్యాప్తి నెలకొన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. అమెరికాలో బయటపడుతోన్న కేసుల్లో 3శాతం ఈ రకమే ఉంటున్నాయి. యూరప్‌లోనూ ఆస్పత్రిలో చేరికలు పెరుగుతున్నాయి. మరోసారి కఠిన ఆంక్షలు విధించే యోచనలో బ్రిటన్ ప్రభుత్వం ఉంది.
ఒమిక్రాన్ వేరియంట్‌ను అడ్డుకోవడంలో వ్యాక్సిన్‌లు అంత సమర్థవంతంగా పని చేయట్లేదని అధ్యయనాలు చెబుతున్నాయి. తాజాగా ఫైజర్ కంపెనీ రిలీజ్ చేసిన యాంటీవైరల్ ట్యాబ్లెట్.. ఒమిక్రాన్ వేరియంట్‌పై సమర్థంగా పనిచేస్తోందని తుది ఫలితాల విశ్లేషణలో వెల్లడైంది.
మరోవైపు, ఇండియాలో ఒమిక్రాన్ కేసులు సెంచరీ దిశగా దూసుకుపోతుండటం తీవ్ర ఆందోళనకర అంశం. ఇప్పటికీ దేశంలో వ్యాక్సిన్ తీసుకోని వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. రెండు డోసులు కంప్లీట్ కాని వారి సంఖ్య మరింత అధికం. వ్యాక్సిన్‌ల ప్రభావం ఒమిక్రాన్‌పై అంతంతమాత్రమేనని చెబుతుండటం.. ఇండియాలో కేసులు పెరుగుతుండటం డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. ఇక, ఇప్పటికే ఏపీలో ఓ కేసు వెలుగు చూడగా.. తాజాగా తెలంగాణలో రెండు ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు బయటపడటం కలకలం రేపుతోంది. ప్రజలు మాస్క్‌లు ధరించడం.. సామాజిక దూరం పాటించడం తప్పనిసరి.