పేటీఎమ్ బ్యాచ్‌లు.. చంద్రుకు చంద్రబాబు కౌంటర్..
posted on Dec 15, 2021 @ 1:33PM
జస్టిస్ చంద్రు. జై భీమ్ సినిమాతోనే కాదు.. ఏపీ హైకోర్టుపై సంచలన వ్యాఖ్యలతోనూ వార్తల్లో నిలిచారు. న్యాయవాదిగా, న్యాయమూర్తిగా పని చేసిన ఆయనే.. హైకోర్టు జడ్జిలు, తీర్పులపై అసంబద్ధ ఆరోపణలు చేశారు. చంద్రు కామెంట్లపై ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా, టీడీపీ అధినేత చంద్రబాబు.. జస్టిస్ చంద్రుపై మండిపడ్డారు.
చంద్రబాబు ఏమన్నారంటే...
"ఒక జడ్జి ఎక్కడ్నుంచో ఇక్కడికి వచ్చి రాజ్యాంగ ఉల్లంఘన అంటున్నారు.. రాష్ట్రంలో ఉన్న దారుణ పరిస్థితులు వీళ్లకు పట్టవా? ఏపీలో ఆత్మహత్యలు, అల్లకల్లోలం ఆ జడ్జీలకు కనపడదా?.. ఒక నేరస్థుడికి ఇలాంటి వాళ్లు సపోర్ట్ చేయవచ్చా?.. రిటైర్ అయిన తర్వాత వీళ్లకి పదవులు కావాలి.. అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒకాయన సుప్రీంకోర్టు జడ్జ్‌గా పని చేశారు. ఆయన కుమారుడికి ఏపీలో పదవి తీసుకుని జగన్‌ను పొగుడుతున్నారు.. రాష్ట్రంలో కొందరు పేటీఎమ్ బ్యాచ్‌లుగా తయారయ్యారు.." అని చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
జస్టిస్ దేవానంద్ స్ట్రాంగ్ కౌంటర్...
ఇప్పటికే జస్టిస్ చంద్రు ఆరోపణలను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఖండించారు. ఎంతో మంది ప్రాథమిక హక్కులను కాపాడుతున్నామని, జస్టిస్ చంద్రు ఆరోపణలు నిరాధారమైనవని తప్పుబట్టారు. మొత్తం హైకోర్టును ఎలా నిందిస్తారని చంద్రును దేవానంద్ నిలదీశారు. ఒక డాక్టర్‌ని పోలీసులు రోడ్డుపై విచక్షణారహితంగా కొట్టారు.. హక్కుల గురించి పోరాడాలంటే విశాఖకు వెళ్లి మంచి డైరెక్టర్‌తో సినిమా తీయించండని చంద్రును ఎద్దేవా చేశారు జస్టిస్ దేవానంద్. హైకోర్టు న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదిస్తుంటే సీబీఐ విచారణకు ఆదేశించడం తప్పా? అని జస్టిస్ బట్టు ప్రశ్నించారు.
జస్టిస్ చంద్రు అసలేమన్నారంటే...
ఏపీ హైకోర్టు తన పరిధి దాటి వ్యవహరిస్తోందని చంద్రు ఆరోపించారు. ప్రభుత్వం.. శత్రువులు, ప్రత్యర్థులతో కాదు న్యాయవ్యవస్థతో యుద్ధం చేస్తోందని జస్టిస్ చంద్రు వ్యాఖ్యానించారు. అమరావతి భూస్కామ్‌లో ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేస్తే హైకోర్టు స్టే ఇచ్చిందని, కోర్టులు న్యాయం చేయాల్సిందిపోయి ఏదో చేయడానికి ప్రయత్నిస్తోందని.. కొందరు హైకోర్టు జడ్జిలు అమరావతిలో భూములు కొన్నారని.. విచారణ సమయంలో ఆ జడ్జీలు తప్పుకోకుండా వారే అడ్డుకుంటున్నారంటూ సంచలన కామెంట్లు చేశారు జస్టిస్ చంద్రు.