మృత్యువుతో పోరాడి ఓడిన కెప్టెన్ వరుణ్ సింగ్..
posted on Dec 15, 2021 @ 1:24PM
మృత్యువుతో వారం రోజులు పోరాడారు. చివరికి ఓడిపోయారు. తుది శ్వాస విడిచారు. తమిళనాడులోని కూనూరు సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడి, చికిత్స పొందుతున్న భారత వాయు సేన (ఐఏఎఫ్) గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ బుధవారం ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 14కు చేరింది.
కెప్టెన్ వరుణ్ సింగ్ మరణ వార్తను ఐఏఎఫ్ ట్విటర్ వేదికగా వెల్లడించింది. గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ అమరుడైనందుకు తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఆయన 2021 డిసెంబరు 8న తమిళనాడులోని కూనూరు వద్ద జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారని, చికిత్స పొందుతూ బుధవారం తుది శ్వాస విడిచారని ఐఏఎఫ్ తెలిపింది. వరుణ్ కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తామని ప్రకటించింది. ఆయన మృతిపట్ల ప్రగాఢ సంతాపం తెలిపింది. డిసెంబరు 8న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక సహా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ హెలికాప్టర్లో ప్రయాణించినవారిలో కేవలం వరుణ్ సింగ్ మాత్రమే తీవ్రంగా కాలిన గాయాలతో బెంగళూరులో చికిత్స పొందారు.
ఐఏఎఫ్ గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వరుణ్ సింగ్ ఆత్మగౌరవం, ధైర్యసాహసాలు, అత్యంత వృత్తి నైపుణ్యాలతో దేశానికి సేవ చేశారని నివాళులర్పించారు. ఆయన తుది శ్వాస విడిచినందుకు తాను తీవ్ర ఆవేదన చెందినట్లు తెలిపారు. ఆయన చేసిన సేవలను మన దేశం ఎన్నటికీ మర్చిపోదని పేర్కొన్నారు. వరుణ్ సింగ్ కుటుంబ సభ్యులకు, మిత్రులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ప్రధాని నరేంద్ర మోడీ.