అవును ఆయన ఏసు దేవుడే..
posted on Dec 15, 2021 @ 3:45PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో సంక్షేమ పథకాలు ఇంత చక్కగా అమలు కావడానికి కారణం ఏమిటి? అధికారంలోకి వచ్చే ముందు ఆయన సాగించిన సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల కష్టాలు చూసి, మనసు కరిగి, గుండె తరిగి, అధికారంలోకి వచ్చిన తర్వాత, చేతి వెముకలు తీసి పక్క పెట్టి, సంక్షేమ పందారం పెద్ద ఎత్తున చేస్తున్నారని, అనుకుంటున్నారా? అవును మీరే కాదు, మనందరం కూడా ఇంత కాలం అలాగే అనుకుంటూ వచ్చాం. కానీ,కాదు. జగనన్న దాతృత్వ ఆలోచన వెనుక ఉన్న అసలు రహాస్యం అయన క్రైస్తవాన్ని అనుసరించడమేనని రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు.
కృష్ణా జిల్లా ముసునూరు మండలం కాట్రేనిపాడు గ్రామంలోని క్రైస్తవ చర్చిలో సెమీ క్రిస్మస్ వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రైస్తవాన్ని అనుసరిoచటం వల్లనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగ ఫలాలను సమానంగా అందించగలిగే ఆలోచన ముఖ్యమంత్రి జగన్‌కు కలిగిందని సుచరిత తెలిపారు. కులం వేరు, మతం వేరు ఎవరైనా వారి వారి విశ్వాసానుసారం మతమార్పిడి చేసుకోవచ్చని పేర్కొన్నారు. నిజం, సుచరిత చెప్పింది సువార్త అంత సత్యం.
నిజానికి జగన్మోహన్ రెడ్డి, ఏసు మార్గంలోనే రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. క్రైస్తవ మిషనరీలు మత మార్పిడులకు అనుసరించే విధానాలనే, జగన్ రెడ్డి ఓటు బ్యాంక్ రాజకీయాలకు అనువుగా మలచుకుని ఆచరిస్తున్నారు. ఏసు మార్గాన్నే అనుసరిస్తున్నారు. క్రైస్తవ సంస్థలు తాయిలాలు ఎరగా వేసి మత మార్పిడులను ప్రోత్సహించడం అనాదిగా వస్తున్న ఆచారం. ఇప్పటికీ ఒక్క ఏపీలోనే కాదు, దేశ మంతటా క్రైస్తవ సంస్థలు చేస్తున్నది అదే. అందుకోసమే పాస్టర్లను నియమించి, ప్రచారం సాగిస్తున్నాయి. జగన్ రెడ్డి కూడా అదే చేస్తున్నారు. అయితే, క్రైస్తవ సంస్థలు, మిషనరీలు కేవలం మత మార్పిడుల మీద దృష్టి పెడితే, జగన్ రెడ్డి ఓట్ల కోసం తాయిలాలు ఎరవేస్తున్నారు. అదొక్కటే తేడా మిగిలినదంతా సేమ్..టూ.. సేమ్. అంటున్నారు. అందుకే కొందరు జగన్ రెడ్డిని ముద్దుగా, ప్రేమగా ఏసు రెడ్డి అని కూడా పిలుచు కుంటారు.