దగ్గు, జ్వరం కాదు.. రాత్రిళ్లు చెమటలు.. ఒమిక్రాన్ కొత్త లక్షణాలు..
posted on Dec 15, 2021 @ 4:06PM
ఒమిక్రాన్. ఒమిక్రాన్. ఒమిక్రాన్. ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతున్న పేరు. డెల్టా కంటే ఈ వేరియంట్ చాలా డేంజరస్ అంటున్నారంతా. డెల్టా కంటే 20 రెట్లు ఎక్కువగా వ్యాపిస్తుందని చెబుతున్నారు. ఆఫ్రికన్ కంట్రీస్‌లో కేసులు కూడా అదే రేంజ్‌లో నమోదు అవుతున్నాయి. తాజాగా సరిహద్దులు దాటేసి.. మన దేశంలోకీ అడుగుపెట్టింది ఒమిక్రాన్.
ఇంతకీ ఒమిక్రాన్ లక్షణాలు ఏంటి? కొవిడ్‌లానే జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు, గొంతు నొప్పి, తల నొప్పి, వాసన కోల్పోవడం.. లాంటివేనా? లేక, మరేమైనా కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయా? అనేది ఆసక్తికరం. ఒమిక్రాన్ సోకిన బాధితుల్లో డెల్టా కంటే భిన్నమైన లక్షణాలు కన్పిస్తున్నాయని దక్షిణాఫ్రికాకు చెందిన ఓ డాక్టర్ వెల్లడించారు. ఈ వేరియంట్ బారిన పడిన కొందరు రాత్రిళ్లు విపరీతమైన చెమటలతో బాధపడుతున్నారని అన్నారు.
"ఒమిక్రాన్ బారిన పడిన వారిలో భిన్నమైన లక్షణాలు కన్పిస్తున్నాయి. కొవిడ్-19 లక్షణాలైన దగ్గు, తరచూ ముక్కు కారడం, గొంతు నొప్పి, తీవ్రమైన జ్వరం వంటివి ఒమిక్రాన్ వేరియంట్ బాధితుల్లో లేవు. ఒమిక్రాన్ సోకినవారు ఎక్కువగా తీవ్రమైన తలనొప్పి, ఒళ్లునొప్పులు, స్వల్ప జ్వరం, అలసట, గొంతులో దురదతో బాధపడుతున్నారు" అని డాక్టర్ ఏంజెలిక్ కాట్జీ ఓ అంతర్జాతీయ మీడియాకు వెల్లడించారు.
వ్యాక్సిన్ తీసుకోనివారిలో తలనొప్పి, ఒళ్లు నొప్పులు విపరీతంగా ఉంటున్నాయని.. కొందరు బాధితుల్లో మాత్రం అసాధారణ లక్షణాలు కన్పిస్తున్నాయని డాక్టర్ ఏంజెలిక్ అన్నారు. "ఒమిక్రాన్ వేరియంట్ సోకిన బాధితులకు అలసట, బలహీనతతో పాటు రాత్రిపూట విపరీతమైన చెమటలు పడుతున్నాయి. ఎంతలా అంటే ఈ చెమట కారణంగా వారి దుస్తులు, బెడ్ కూడా తడిసిపోతున్నట్టు వారు చెబుతున్నారు. చాలా మందిలో ఈ లక్షణం కన్పిస్తోంది" అని ఆ డాక్టర్ వెల్లడించారు. గొంతు గరగర కూడా ఎక్కువగా ఉంటోందన్నారు. డెల్టా సోకిన వారు వాసన కోల్పోగా.. ఒమిక్రాన్ సోకిన బాధితుల్లో ఆ లక్షణం కన్పించట్లేదని తెలిపారు. అయితే, మందులతో ఒమిక్రాన్ నుంచి కోలుకుంటున్నట్టు చెప్పారు.