విశాఖ ఉక్కు బీఆర్ఎస్ విజయమేనా?

తెలంగాణ ప్రభుత్వం, ‘విశాఖ ఉక్కు’ ప్రైవేటు పరం కాకుండా చూసేందుకు, నడుం బిగించింది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం, విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం చేసేందుకు సిద్దమై, పావులు కదుపుతుంటే, తెలంగాణ ప్రభుత్వం ఆ ప్రయత్నాలను అడ్డుకునేందుకు, ముందు కొచ్చింది. ఆంధ్రులకు జరుగుతున్న అన్యాయానికి మనసు చెదిరిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్  సాహసోపేతమైన సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రుల హక్కుగా కొట్లాడి తెచ్చుకున్న విశాఖ ఉక్కును  ప్రధాని మోదీ ప్రభుత్వం ఏ ఆదానీకో, అంబానీకో ధారాదత్తం చేయకుండా అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం విశాఖ ఉక్కు  ‘బిడ్’  ప్రకియలో పాల్గొనాలని నిర్ణయించింది.   కొద్ది రోజుల క్రితం తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ .ఈ ప్రకటన చేసినప్పటి నుంచి  బీఆర్ఎస్ మంత్రులు, నాయకులు ఇదే పాట పాడుతున్నారు .రాజకీయ, మీడియా వర్గాల్లోనూ ఇదే చర్చ జరుగుతోంది. అంతే కాదు లేడికి లేచిందే పరుగు అన్నట్లుగా  తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్పొరేషన్ అధికారులను విశాఖకు పంపింది. అక్కడి పరిస్థితులను పరిశీలించడంతో పాటుగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ  అధికారులతో చర్చలు జరుపుతోంది. మరో వంక విశాఖ ఉక్కును  తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్లే బీఆర్ఎస్ వర్గాలు ప్రచారం చేసేస్తున్నాయి. ముఖ్యమంత్రి దొడ్డ మనసును ..ఆహా ఓహో అంటూ కీర్తిస్తున్నారు. మరో వంక విపక్షాలు తాదూర కంత లేదు మెడకో డోలు  అని ఎగతాళి చేస్తున్నారు.  బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఏమైందని ప్రశ్నిస్తున్నాయి. రాష్త్రంలో మూత పడిన సిర్పూర్ పేపర్ మిల్లు, ఆజంజాహి మిల్లు, రేయాన్ ఫ్యాక్టరీలను తెరిపిస్తానని ఇచ్చిన హామీలను అమలు చేయడం చేతగాని కేసీఆర్ ప్రభుత్వం విశాఖ ఉక్కు  ప్రైవేట్ పరం కాకుండా బిడ్డింగ్ దాఖలు చేస్తాననడం చూస్తుంటే ఆశ్చర్యమేస్తోందని విపక్షాలు విరుచుకు పడుతున్నాయి.  అయితే అసలు విషయం ఏమంటే, విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి సిద్దం గాలేదు.  విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కొత్తగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇదే విషయాన్ని   గురువారం(ఏప్రిల్ 13) విశాఖలో పర్యటించిన కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్‌సింగ్‌ కులస్తే మరో మారు స్పష్టం చేశారు. వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను ఇప్పటికిప్పుడు ప్రైవేటుపరం చేయాలని భావించడం లేదని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్‌సింగ్‌ కులస్తే స్పష్తం చేశారు. అయితే, ఈ ప్రకటనకు తెలంగానా ప్రభుత్వం చూపిన చొరవకు సంబంధం ఉండలేదా అనే విషయం పక్కన పెడితే  తెలంగాణ మంత్రులు మాత్రం క్రెడిట్ ను తమ ఖాతాలో వేసుకున్నారు. కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై  గట్టిగా మాట్లాడింది ముఖ్యమంత్రి కేసీఆరేనని తెలిపారు. తెగించి కొట్లాడాం కాబట్టే కేంద్రం తాత్కాలికంగా వెనక్కి తగ్గిందన్నారు.  కేసీఆర్‌ దెబ్బ అంటే అలా ఉంటుందని వ్యాఖ్యానించారు.అయితే  నిజానికి కేంద్ర ఇంతవరకు తీసుకున నిర్ణయంలో వెనక్కి పోయిందా అంటే లేదు. ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకోలేదు.  నిజానికి, ఇటీవల కేంద్ర ప్రభుత్వం కేవలం ముడి పదార్థాలు లేదా మూలధనం సమకూర్చేందుకు ఆసక్తి వ్యక్తీకరణ (ఈవోఐ) ప్రకటన మాత్రమే చేసింది. వివరాలోకి వెళితే.. విశాఖ ఉక్కులో ‘కావేరి’ పేరుతో ఉన్న బ్లాస్ట్‌ ఫర్నేస్‌-3 ఏడాదిన్నర కాలంగా మూతపడి ఉంది. ముడి పదార్థాలకు అవసరమైన నిధులు లేక దానిని మూసేశారు. ఇప్పుడు పరిస్థితి మరింత దిగజారింది. మిగిలిన రెండు బ్లాస్ట్‌ ఫర్నే్‌సలు నడిపేందుకు అవసరమైన ముడిపదార్థాలూ సమీకరించలేని దుస్థితి ఏర్పడింది. అన్ని దారులూ మూసుకుపోవడంతో విశాఖ ఉక్కు యాజమాన్యం కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. ఎవరైనా ముడి పదార్థాలు సరఫరా చేస్తే… దానికి బదులుగా తయారుచేసిన స్టీల్‌ని ఇస్తాం  అంటూ గత నెలలో ఈవోఐ జారీ చేసింది. తనకు అవసరమైన వనరులను సొంతంగా సమకూర్చుకునే క్రమంలో విశాఖ ఉక్కు యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పడు కూడా ఆ ప్రక్రియ కొనసాగుతుందనే కేంద్ర మంత్రి  స్పష్టం చేశారు. అంటే  కేంద్రం వెనకడుగు వేసిందనే వాదనలో వాస్తవం లేదని అంటున్నారు.  నిజానికి  ఈ బీడ్ లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొన్నా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తెలంగణ ప్రభుత్వానికి దక్కే ఆస్కారం లేదు.  కేవలం కేంద్ర ప్రభుత్వంపై బురదజల్లి రాజకీయ లబ్ది పొందే ప్రయత్నంలో భాగంగానే బీఆర్ఎస్ డ్రామా ఆడుతోందని బీజేపీ, ఇతర ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. అంతే కాదు, ప్రతి నెలా ఉద్యోగుల జీతాలు ఇవ్వలేని దుస్థితిలో ఉన్న  కేసీఆర్ ప్రభుత్వానికి విశాఖ స్టీల్ ప్లాంట్  కొనుగోలు చేసే స్థోమత గాని, ఆర్ధిక వెసులుబాటుగాని లేదని విపక్షాలు, ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. వీటన్నటికీ మించి  కేసీఆర్ ప్రభుత్వమే కాదు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థా కూడా పెట్టుబడుల ఉపసంహరణలో పాల్గొనే అవకాశం లేదు. 2022 ఏప్రిల్ 19న ఈ మేరకు కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. వ్యూహాత్మక రంగాలలోని ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణతో కేంద్ర, రాష్ట్ర, ఉమ్మడి రంగాలలోని ప్రభుత్వ రంగ సంస్థలు ఏవి కూడా పాల్గొనరాదని ఈ ఉత్తరువు స్పష్టం చేసింది. సో.. భవిష్యత్ సంగతి ఏమో కానీ  ప్రస్తుతానికి అయితే  తెలంగాణ ప్రభుత్వం కానీ, తెలంగాణ ప్రభుత్వం తరపున సింగరేణి కానీ, బిడ్ లో పాల్గొనే అవకాశమే లేదు.  భవిష్యత్ లో కేంద్రంలో భారాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చి  కేసేఆర్ ప్రధాన మంత్రి అయిన తర్వాత చట్టాన్ని  సవరిస్తే ఏమో కానీ  ప్రస్తుత చట్టాల ప్రకారం విశాఖ స్టీల్ ప్లాంట్ క్రయ విక్రయాల్లో తెలంగాణ  ప్రభుత్వమే కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా వేలు పెట్టే అవకాశం లేదు. అయితే ఇవ్వన్నీ  సుమారు నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉన్న కేసేఆర్ కు తెలియదా? ఎనిమిదేళ్ళుగా మంత్రిగా ఉన్న కేటీఆర్ కు తెలియదా అంటే తెలుసు.  అందరికీ అన్నీ తెలుసు. అందుకే  కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు, రాష్టంలో తమ ఇమేజ్ పెంచుకునేందుకు, తండ్రీ కొడుకులు సంయుక్తంగా ఆడుతున్న రాజకీయ డ్రామా గా విపక్షాలు ముఖ్యంగా బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు.  అంతేకాదు  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కిరణ్‌కుమార్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖ ఉక్కుకు సొంత గనులు లేవని, బయ్యారం గనులు కేటాయించాలని కేంద్రాన్ని కోరారు. అప్పుడు ఎంపీగా ఉన్న కేసీఆర్‌ ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు.   తెలంగాణ బొగ్గును ఆంధ్రకు దోచి పెడతారా? బయ్యారం గనులు ఇచ్చేందుకు ఒప్పుకోం  అని తేల్చి చెప్పారు. ఇప్పుడు అదే కేసీఆర్‌ ప్రభుత్వం సింగరేణి ద్వారా విశాఖ ఉక్కును కాపాడతామని చెబుతుండటం చూస్తే..ఒకదాని వెంట ఒకటిగా చుట్టుముడుతున్న సమస్యల సుడిగుండం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు చేసే ప్రయత్నంగానే విపక్షాలే కాదు, విజ్ఞత ఉన్న ప్రతి ఒక్కరు భావిస్తున్నారు.

సుఖేష్’ సంచలనం.. ఇక కవిత అరెస్టేనా?

 ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు హాలీవుడ్, బాలీవుడ్; సస్పెన్సు థ్రిల్లర్  సినిమాలను మరిపించే ట్విస్టులతో నడుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో అభియోగాలు ఎదుర్కుంటున్న ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా  సహా రాజకీయ సంబందాలున్న ఓ ఆరడజను మందికి పైగా ప్రముఖులు  అరెస్ట్ అయ్యారు. ఇదే క్రమంలో అనుమనితురాలుగా ఇప్పటికే మూడు సార్లు ఈడీ విచారణకు హాజరైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్  కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా రేపో మాపో అరెస్ట్ అవుతారన్న ప్రచారం జరుగుతోంది.  అదలా ఉంటే తాజాగా  మనీలాండరింగ్ కేసులో తీహార్ జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ ఈ కేసుకు సంబంధించి వరుస లేఖలతో సంచలనాలకు తెర తీస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా మరోసారి జైలు నుంచి సుఖేష్ లేఖను విడుదల చేశారు. అయితే ఈసారి లేఖతో పాటు వాట్సప్ చాటింగ్ ను బయటపెట్టాడు.  కవితక్క..టీఆర్ఎస్ అనే నంబర్ తో సుఖేష్ చాట్ చేయడం కలకలం రేపుతోంది. ఈ లేఖలో కవితతో చాట్ చేసిన విషయాలు అంటూ సుఖేష్ పేర్కొనడం గమనార్హం. ఇక తాజాగా సుఖేష్ తో పరిచయం, చాటింగ్ పై సీఎం కేసీఆర్ కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రియాక్ట్ అయ్యారు.  బీఆర్ఎస్ పార్టీపై కావాలనే ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారు. సుఖేష్ తో తనకు ఎలాంటి పరిచయం లేదన్న కవిత..కేసీఆర్ ను ఎదుర్కొలేకే తనపై దాడి చేస్తున్నారన్నారు. ఫేక్ చాట్ లతో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. తమ కుటుంబాన్ని బద్నామ్ చేయాలని చూస్తున్నారని కవిత అన్నారు. తీహార్ జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ ఇటీవల వరుస లేఖలతో ప్రకంపనలు సృష్టిస్తున్నాడు.  కాగా సుఖేష్ ఇలా లేఖ రిలీజ్ చేయడం కొత్తేమి కాదు. గతంలో కూడా తన న్యాయవాది ద్వారా సుఖేష్ పలు లేఖలను రిలీజ్ చేశారు. తాను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో వాట్సప్ , టెలిగ్రామ్ లో చాట్ చేసిన 700 పేజీల లేఖను రిలీజ్ చేశాడు. అందులో సీఎం కేజ్రీవాల్ చెప్పినట్టు రూ.75 కోట్లను హైదరాబాద్ బీఆర్ఎస్ కార్యాలయం వద్ద  రేంజ్ రోవర్ కారులో ఉన్న ఏకే అనే వ్యక్తికి డబ్బులు ఇచ్చినట్టు చెప్పుకొచ్చారు. ఆ రేంజ్ రోవర్ కారు నెంబర్ 6060 అని లేఖలో సుఖేష్ పేర్కొన్నాడు. అయితే సుఖేష్ కేజ్రీవాల్ చాట్ ను బయటపెట్టిన కొన్నిరోజులకు ఎమ్మెల్సీ కవితతో చాట్ అంటూ సుఖేష్ లేఖతో పాటు చాట్ స్క్రీన్ షాట్స్ రిలీజ్ చేయడం ప్రకంపనలు సృష్టిస్తుంది.కాగా, ఈలేఖ పై బీజేపీ ఎమ్మెల్యే ఈడీ, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఢిల్లీ లిక్కర్ కుంభకోణం మరో మలుపు తిరిగింది. మరింత సంచలనంగా మారింది.

జీవితం చెక్కిన మానవతామూర్తి అంబేడ్కర్

ఏప్రిల్ 14.. స్వతంత్ర భారత చరిత్రలో ఇదొక మరపురాని రోజు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బీమ్ రావ్ అంబేడ్కర్ జయంతి. ప్రతి ఏటా ఈ రోజున దేశ వ్యాప్తంగా అంబేడ్కర్  జయంతి వేడుకలు ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సంవత్సరం కూడా అదే విధంగా అంబేడ్కర్ జయంతి వేడుకలను దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు.  ఇక తెలంగాణ విషయానికి వస్తే, ఈఏడాది వేడుకలకు మంరింత ప్రత్యేకత తోడైంది. గత సంవత్సరం అంబేడ్కర్ 125 జయంతి వేడుకల సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, దేశంలో ఎక్కడ లేని విధంగా హైదరాబాద్  లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అంబేద్కర్ పేరున నూతనంగా నిర్మించిన సెక్రటేరియట్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఈ రోజు ( ఏప్రిల్ 14) న ఆవిష్కరిస్తున్నారు.  అయితే విగ్రహాన్ని అవిష్కరించడం ఒకటైతే, అంబేడ్కర్’ ఆశయాలను ముందుకు తీసుకుపోవడం మరొక విషయం. ముఖ్యంగా అంబేడ్కర్  రాజ్యాంగానికి కాలం చెల్లిందనే భావన వ్యక్తమవుతున్న నేపధ్యంలో,ఈ జయంతి వేడుకలను కేవలం వేడుకలుగానే కాకుండా అంబేడ్కర్  ఆశలు, ఆశయాలతో పాటుగా, రాజ్యాంగం మంచి చెడులపై వివేచనతో కూడిన చర్చజరిగితే అది మంచిందనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తపరుస్తున్నారు. నిజానికి అంబేడ్కర్  రాజ్యాంగాన్ని సమీక్షించ వలసిన సమయం వచ్చిందని, ఎవరో కాదు,తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గతంలో చాలా దృఢమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంతే కాదు  దేశంలో అతి పెద్ద మార్పు రావలసిన అవసరం ఉందని, అందుకు అంబేడ్కర్  రాజ్యాంగం స్థానంలో కొత్త రాజ్యాంగం రావలసిన అవసరం ఉందని కూడా అన్నారు. అప్పట్లో  ముఖ్యమంత్రి కేసేఅర్ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర విమర్శకు గురయ్యాయి.  అయితే అప్పట్లో  కేసేఆర్, అంబేడ్కర్  పై వ్యాఖ్యలు చేసిన సమయ సందర్భాలను పక్కన  పెట్టి,  స్వయంగా అంబేడ్కర్  రాజ్యాంగాన్నితగల బెట్టాలని అన్నారని తమ వాదనను గట్టిగా సమర్ధించుకున్నారు. అయితే,అదే కేసీఆర్  ఈరోజు అంబేద్కర్ జయంతి సందేశంలో మాత్రం రాజ్యాంగ ప్రస్తావన చేయలేదు. వివాదాల జోలికి వెళ్ళలేదు. సందర్భోచితంగా, అంబేడ్కర్  గోప్పతాన్ని మెచ్చుకున్నారు.   దేశ భవిష్యత్ కు సంబంధించి గొప్ప ఆలోచనలు చేస్తూ గెలుపు శిఖరాలకు చేరుకున్న విశ్వ మానవుడు అంబేద్కర్  అని కొనియాడారు.  సమాజంలో అజ్ఞానాంధకారాలను చీల్చి జ్ఞానపు వెలుగులు అందించిన మేధావి  అంబేడ్కర్ అని అన్నారు.  అలాగే, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా  ఇచ్చిన సందేశంలో  కేసీఆర్, గతానికి భిన్నంగా  సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత రాజ్యాంగ నిర్మాతగా దేశ గమనాన్ని మార్చటంలో ఆయన పోషించిన పాత్ర చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఎంతటి కష్టమైన పనైనా చిత్తశుద్ధితో … పట్టుదలతో ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీ లేదని అంబేడ్కర్ జీవితం నేర్పిస్తుంది. అడ్డంకులను ఆత్మవిశ్వాసంతో ఆయన ఎదుర్కొని జీవించిన విధానం ఎంతోమందికి మార్గదర్శకం.  అని పేర్కొన్నారు.  ఆయన రచనలు, ప్రసంగాలు   ఆలోచింపజేస్తాయి.దేశంలో సమాన హక్కుల కోసం జీవితాంతం పరితపించి ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రూపొందించారు.నేడు అణగారిన వర్గాలు అనుభవిస్తున్న ఫలాలు అంబేద్కర్ సమకూర్చినవే అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ కొనియాడారు.అయితే కేసీఆర్ ఎప్పుడు ఏమన్నారు అనే విషయాన్ని పక్కన పెడితే, రాజ్యాంగ నిర్మాతగానే కాకుండా, అంబేడ్కర్ ఒక మనిషిగా, మానవతా వాదీగా చరిత్ర పుటల్లోనే  కాదు, భారతీయుల హుదయాల్లో చిరస్మరణీయంగా నిలిచి పోతారు.  ప్రధాని నరేంద్ర మోడీ అన్నట్లుగా జీవితం చెక్కిన సంపూర్ణ మానవతామూర్తి అంబేడ్కర్. అవును, 1891 ఏప్రిల్ 14న మది ప్రదేశ్ లో జన్మించిన అంబేద్కర్,జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు. దళితుడైన కారణంగా అంబేడ్కర్ ను అంటరానివాడిగా చూశారు. స్కూల్కు వెళ్లినా వేరేగా కూర్చోవల్సిన పరిస్థితి. ఒక్కోసారి క్లాసులో కూర్చోనిచ్చేవారు కాదు.ఇన్ని కష్టాల మధ్య అంచెలంచెలుగా ఎదిగిన అంబేడ్కర్.. ఒక గొప్ప ఆర్థిక వేత్తగా, న్యాయకోవిదునిగా, సామాజిక కార్యకర్తగా, రాజకీయ నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. భారత రాజ్యాంగాన్ని రచించిన కమిటీకి నాయకత్వం వహించిన ఘనత అంబేడ్కర్ సొంతం. అందుకే, ఎవరు ఏమన్నా ఆయన జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం 

బీఆర్ఎస్‌లోకి జేడీ!

సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వి.వి.లక్ష్మీనారాయణ భారత రాష్ట్ర సమితిలో చేరనున్నారా? ఆ దిశగా ఆయన అడుగులు పడుతున్నాయా? అంటే తాజా పరిణామాల నేపథ్యంలో అవుననే ఓ చర్చ అయితే పోలిటికల్ సర్కిల్‌లో ఊపందుకొందని తెలుస్తోంది.  తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గింది. ఇది తెలంగాణ సీఎం కేసీఆర్ చేపట్టిన చర్యల వల్లేనంటూ  జేడీ లక్ష్మీనారాయణ ట్విట్టర్ వేదికగా గులాబీ బాస్‌కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్‌లో పాల్గొనాలంటూ సీఎం కేసీఆర్‌కు ఆయన సూచించారు. ఈ నేపథ్యంలో జేడీ లక్ష్మీనారాయణ.. కారు పార్టీలో చేరనున్నారనే కథనాలు అయితే పోలిటికల్ సర్కిల్‌లో తెగ షికారు చేస్తున్నాయి. మరోవైపు ఆంధ్ర్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ పార్టీని నడిపించేందుకు కాపు సామాజికవర్గాన్ని లక్ష్యంగా చేసుకొని ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఆ క్రమంలో ఇప్పటికే అదే సామాజిక వర్గానికి చెందిన ఐఏఎస్ మాజీ అధికారి తోట చంద్రశేఖర్‌కి ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా నియమించారీ కేసీఆర్. ఇక వివి లక్ష్మీనారాయణ సైతం అదే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో.. ఆయన కూడా బీఆర్ఎస్‌ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గతంలో ఏపీ బీజేపీ చీఫ్‌గా కన్నా లక్ష్మీనారాయణ ఉన్న సమయంలో జేడీ లక్ష్మీనారాయణ కమలం పార్టీలో చేరేందుకు ప్రయత్నించారు. కానీ నాటి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని అగ్రనేతలు.. దేశ రాజధాని హస్తినలోని కమలం పార్టీ నేతలపై తీవ్ర ఒత్తిడి తీసుకు వచ్చి.. జేడీ లక్ష్మీనారాయణ చేరికను అడ్డుకున్నారు.  కానీ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో చేరతారని భావిస్తున్న జేడీ లక్ష్మీనారాయణకు... బీఆర్ఎస్ పార్టీ నేతలు స్వాగతం పలుకుతారా? ఓ వేళ.. ఆయనకు స్వాగతం పలికేందుకు వారు సిద్దంగా ఉన్నా.. ఏపీలోని అధికార జగన్ పార్టీలోని అగ్రనేతలు మళ్లీ రంగంలోకి దిగి టీఆర్ఎస్ పార్టీ అధినేతపై తీవ్ర ఒత్తిడి తీసుకు రావడం ద్వారా జేడీ లక్ష్మీనారాయణ రాకను అడ్డుకుంటారా? అంటే మాత్రం వేచి చూడాల్సిందే అనే అభిప్రాయం అయితే పోలిటికల్ సర్కిల్‌లో వ్యక్తమవుతోంది.

తెలుగువారి ఉక్కు సంకల్పం.. విశాఖ ఉక్కు

విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అనే నినాదం పుట్టి ఇప్పటికి 50 ఏళ్లు. ప్రస్తుత పరిణామాలు అందరికీ తెలిసినా 50 ఏళ్ల కిందటి విషయాలు కొందరికే తెలుసు. అసలు విశాఖ ఉక్కు వెనుక కథ ఎన్ని మలుపులు తిరిగిందో తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది.  అది 1963 సంవత్సరం సంగతి.  అంగ్లో అమెరికన్ కన్సార్టియమ్ విశాఖలో ఓ భారీ పరిశ్రమకు అవకాశాలు మెండుగా ఉన్నాయని నివేదిక తయారు చేసి కేంద్రం ముందు ఉంచింది.  విశాఖలో నైకా కేంద్రం ఉండటం ఒక కారణమైతే.. ఉత్తరాంధ్ర వెనుకబాటు ఇంకో కారణం. ఇక్కడ ఉపాధి అవకాశాలు పెంచడం ఆ నివేదిక ఉద్దేశం.  అనేక సమావేశాల తరువాత విశాఖలో ఉక్కు కర్మాగారం స్థాపనకు కన్సార్టియం మొగ్గు చూపింది.  ఈ ప్రతిపాదనపై 1965 జులై 3న భారత పార్లమెంటులో చర్చ జరిగింది.  1966 జులై నెలలో కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం విశాఖ ఉక్కు ప్రతిపాదనపై ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. అయితే అసెంబ్లీతీర్మానంపై తిరిగి పార్లమెంటులో జరిగిన చర్చలో అప్పటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్లాంట్ స్థాపన సాధ్యం కాదని ప్రధాని ఇందిగా గాంధీ ప్రకటించారు.  ప్రధాని ప్రకటనతో ఆంధ్రప్రదేశ్ భగ్గుమంది. రాష్ట్రం నలుమూలలా ఆందోళనలు ప్రారంభం అయ్యాయి.  తెన్నేటి విశ్వనాథం, పుచ్చలపల్లి సుందరయ్య, గౌతు లచ్చన్న, చండ్ర రాజేశ్వరరావు, నల్లమల గిరిప్రసాద్, తరిమెల నాగిరెడ్డి, వావిలాల గోపాలకృష్ణయ్య లాంటి మహామహులు ఆందోళనలకు నాయకత్వం వహించారు. ప్రజలు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినదించారు. ఆందోళనకారులపై తుపాకులు గర్జించాయి. పోలీసుల తూటాలకు 32 ప్రాణాలు నేలకొరిగాయి. విజయవాడ, గుంటూరులలో ఐదుగురు చొప్పున మరణించగా, విజయనగరంలో ఇద్దరు, కాకినాడ, వరంగల్, రాజమండ్రి, సీలేరు, పలాస, జగిత్యాలల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 32 మంది ప్రాణాలు వదిలారు. అక్టోబర్ 15, 1966న అమృతరావు ఆమరణ నిరాహార దీక్ తో ఆందోళనలు తారస్థాయికి చేరాయి. దీంతో ఇందిరాగాంధీ ప్రభుత్వం దిగిరాక తప్పలేదు.  21 రోజుల దీక్ష తరువాత విశాఖ ఉక్కుకు ఇందిర ఆమోదించారు.  దీంతో తెలుగు ప్రజలు కలలు గన్న విశాఖ ఉక్కుకు 1971 జనవరి20న ఇందిరా గాంధీ శంకుస్థాపన చేశారు.  ప్లాంట్ నిర్మాణంలో అప్పటి రష్యా సాంకేతికతను వినియోగించారు. ఇంత చరిత్రకలిగిన విశాఖ ప్లాంట్ కు కురుపాం రాజవంశీయులు ఆరువేల ఎకరాల స్థలాన్ని విరాళంగా ఇవ్వడం అప్పటి పాలక వర్గాల పెద్ద మనసుకు నిదర్శనం.  తదనంతర పరిణామాలలో 1992లో విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రధాని పీవీ నరసింహరావు జాతియిక అంకితం చేశారు.

కోడి కత్తి కేసులో కుట్ర లేదు.. కోర్టుకు చెప్పిన ఎన్ఐఏ

కోడికత్తి దాడి కేసులో కుట్ర కోణం లేదని జాతీయ దర్యాప్తు బృందం (ఎన్ఐఏ) స్పష్టం చేసింది. ఈ కేసులో లోతైన దర్యాప్తు జరపాలంటే జగన్ ఎన్ఐఏ కోర్టులో దాకలు చేసిన పిటిషన్ ను కొట్టివేయాలని కోరింది. ఈ కేసులో ఎలాంటి కుట్ర కోణం లేదనీ.. ఇదంతా సమయం వృధా వ్యవహారమనీ ఎన్ఐఏ కుండ బద్దలు కొట్టింది. ఈ కేసులో నిందితుడిగా గత నాలుగేళ్లుగా జైల్లో ఉన్న జనపల్లి శ్రీను తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడు కాదని పేర్కొంది. దీంతో తన హత్యకు కుట్ర అంటూ విపక్ష నేతగా పట్టుబట్టి సాధించుకున్న ఎన్ఐఏ దర్యాప్తు జగన్ నాడు చెప్పిన దాంట్లో వాస్తవం లేదని తేల్చింది.  కోడికత్తి కేసులో మరింత లోతైన దర్యాప్తు జరపాలంటే జగన్ దాఖలు చేసుకున్న పిటిషన్ కు ఎన్ఐఏ కౌంటర్ వేసింది.  ఎయిర్ పోర్టులోని ఫ్యూజన్ రెస్టారెంట్ ఓనర్‌కు   ఈ ఘటనతో సంబంధం లేదని స్పష్టం చేశారు. గత వాయిదాలో సీఎం జగన్ తరపు న్యాయవాది రెండు పిటిషన్ లు దాఖలు చేశారు. విచారణకు రాకుండా మినహాయింపు ఇవ్వాలని, అలాగే కోడి కత్తి కేసులో కుట్ర కోణాన్ని వెలికి తీయడంలో ఎన్ఐఏ విఫలమైందనీ, మరింత లోతైన విచారణ చేపట్టేలా ఎన్ ఐ ఏ ను ఆదేశించాలని ఆ  పిటిషన్లలో కోరారు. అయితే కుట్ర లేదని ఎన్ఐఏ తేల్చేసింది. అయితే విపక్షాలు మాత్రం కోడి కత్తి కేసు ఒక కుట్ర అంటూ ఆరోపణలు గుప్పిస్తున్నాయి. వాస్తవానికి నాడు విశాఖ విమానాశ్రయంలో అప్పటి విపక్ష నేత జగన్ పై ఎలాంటి దాడీ జరగలేదనీ, కేవలం సానుభూతి కోసం ఆడిన నాటకమని ఆరోపిస్తున్నాయి.  సానుభూతి కోసం కుట్ర పూరితంగా జరిగిన ఉత్తుత్తి దాడి అంటున్నాయి.  ఇలా ఉండగా ఎన్ఐఏ కోర్టు కోడికత్తి కేసు తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. 

రాహుల్ సారథ్యంలో విపక్షాల ఐక్యత సాధ్యమేనా?

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో  ‘హస్త’ రేఖలు మారి పోయాయి. కాంగ్రెస్ పార్టీకి  మళ్ళీ మంచి రోజులు వస్తాయనే ఆశలు ఊపిరి  పోసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీలో, పార్టీ అభిమానుల్లో జోష్ పెరిగింది. ముఖ్యంగా, కాంగ్రెస్ పట్ల ప్రేమ కంటే, కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ పట్ల వ్యతిరేకత కోణంలో  రాజకీయాలను విశ్లేషించే రాజకీయ పండితులు ఆ ఆశలను సజీవంగా ఉంచే విధంగా విశ్లేషణలు వినిపించారు.    అదే సమయంలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా  కాంగ్రెస్ ఫస్ట్ ఫ్యామిలీ బయటి వ్యక్తి, మల్లికార్జున ఖర్గే ఎన్నిక  కావడం అంతవరకు పార్టీ భవిష్యత్ పట్ల ఆశలు వదులుకున్న జీ 23 నేతలు సహా, అంతవరకు స్తబ్దుగా ఉన్న నాయకులు, కార్యకర్తలు కూడా కొంత క్రియాశీలంగా మారారు. అదే క్రమంలో హిమచల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో కాంగ్రెస్ పార్టీలో నిజంగానే కొత్త ఉత్సాహం కనిపించింది. అయితే  భారత్ జోడో యాత్ర పూర్తిచేసుకుని విదేశీ యాత్రలకు వెళ్ళిన రాహుల్ గాంధీ, బ్రిటన్ లో చేసిన  వ్యాఖ్యలు దేశంలో దుమారం లేపాయి. ముఖ్యంగా భారత దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, అయినా అమెరికా,  యూరప్ దేశాలు  పట్టించుకోవడం లేదని చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్నే రేపాయి. భారతీయ జనతా పార్టీ ( బీజేపీ) రాహుల్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పు పట్టింది. భారత అంతర్గత వ్యవహారాల్లోకి విదేశాల జోక్యాన్ని రాహుల్ గాంధీ ఆహ్వానించారని ఆరోపించింది. అందుకు ఆయన దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని పార్లమెంట్ లోపల వెలుపల కూడా డిమాండ్ చేసింది. అదే సమయంలో కాంగ్రెస్ సారథ్యంలోని ప్రతిపక్ష పార్టీలు అదానీ- హిడెన్ బర్గ్ వివాదంపై జేపీసీకి డిమాండ్ చేయడంతో పార్లమెంట్ రెండవ విడత బడ్జెట్ సమావేశాలు, పూర్తిగా తుడిచి పెట్టుకు పోయాయి. రూ.45లక్షల కోట్ల బడ్జెట్  ఒక్క నిముషం చర్చ లేకుండానే ‘సభ’ ఆమోదం పొందింది.  అదలా ఉంటే.. అదే సమయంలో  ప్రధాని మోడీ ఇంటి పేరుకు  నేర చరితులకు సంబంధం అంటకడుతూ, ‘అందరు దొంగల ఇంటి పేరు మోడీనే ఎందుకుంటుందంటూ రాహుల్ గాంధీ ఎప్పుడో 2019లో చేసిన వ్యాఖ్యలు రాహుల్ గాంధీ మెడకు ఉచ్చు బిగించాయి.  ఈ వ్యాఖ్యల పై దాఖలైన కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా నిర్దారిస్తూ తీర్పు నిచ్చింది.  రెండేళ్ల  జైలుశిక్ష విధించింది. రాహుల్ గాంధీ దోషిగా తేలిన పర్యవసానంగా, అయనపై అనర్హత వేటు పడింది. లోక్ సభ సభ్యత్వం రద్దయింది. ఇప్పడు ఇందుకు సంబందించి సుప్రీం కోర్టులో కేసు నడుస్తోంది. సుప్రీం కోర్టు తీర్పు ఆధారంగా రాహుల గాంధీ వ్యక్తిగత, రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. సూరత్ కోర్టు విధించిన రెండేళ్ళ జైలు శిక్షను సుప్రీం కోర్టు థృవీకరిస్తే, రాహుల్ గాంధీ ప్రస్తుత సభ్యతం కోల్పోవడమే కాకుండా మరో ఎనిమిదేళ్ళ పాటు ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను కూడా కోల్పోతారు. సుప్రీం కోర్టు సూరత్ కోర్టు విధించన శిక్షను రెండు సంవత్సరాల కంటే  తక్కువ కాలానికి తగ్గిస్తే, అనర్హత వేటు తొలిగి పోతుంది. ఆయన వాయనాడ్ ఎంపీగా కొనసాగుతారు. ఎన్నికల్లోనూ పోటీ చేసందుకు అర్హత పొందుతారు. అయితే, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ కష్టాలు అక్కడితో తీరి పోతాయా అంటే అలాంటి సంకేతాలు కనిపించడం లేదు. రాహుల్ గాంధి పాదయాత్ర ‘సక్సెస్’ తర్వాత కూడా ఆయన నాయకత్వానికి ఇంటా బయట ఎక్కడా సంపూర్ణ  ఆమోదం లభించడం లేదు. రాహుల్ నాయకత్వం పై ప్రజల విశ్వాసం సంగతి పక్కన పెట్టినా, కాంగ్రెస్ నాయకులకు, మిత్ర పక్షాలకు సైతం రాహుల్ నాయకత్వం పై పూర్తి భరోసా విశ్వాసం ఏర్పడలేదు.  నరనరాల్లో కాంగ్రెస్ రక్తం నింపుకున్నా కేంద్ర మాజీ మంత్రి ఏకే అంటోనీ కుమారుడు అనిల్ కె అంటోనీ, కాంగ్రెస్ పార్టీలో పుట్టి, కాంగ్రెస్ పార్టీలో ఎదిగిన  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, స్వాతంత సమర యోధుడు,రాజాజీగా పేరొందిన, స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త. స్వతంత్ర భారతదేశపు మొదటి, చివరి గవర్నర్ జనరల్. చక్రవర్తి రాజగోపాలాచారి మనవడు సి ఆర్ కేశవన్ ఒకే వారంలో రోజుల తేడాలో కాంగ్రెస్ ను వదిలి బీజేపీలో చేరారు.  నిజానికి ఇక్కడ కాంగ్రెస్ నాయకులు బీజేపీలో చేరటం విశేషం కాదు. బీజేపీ సిద్ధాంతాలు నచ్చి లేదా మోదీ పాలన బ్రహ్మాండం అనుకుని వారు బీజేపీలో చేరితే అది వేరే విషయం. అయితే, ఇక్కడ ఆ ముగ్గురిలో ఏ ఒక్కరు కూడా బీజేపీ నచ్చి బీజేపీలో చేరలేదు. కాంగ్రెస్ నచ్చక, రాహుల్ గాంధీ నాయకత్వం నచ్చక, ఇక కాంగ్రెస్ పార్టీని బతికించడం అయ్యే పని కాదని మరో గత్యంతరం లేక బీజేపీలో చేరారు. నిజానికి ఈ ముగ్గురు మాత్రమే కాదు, కపిల్ సిబల్, గులాన్ నబీ ఆజాద్, చౌదరి  బీరేంద్ర సింగ్,కెప్టెన్ అమరీందర్ సింగ్, రావ్ ఇంద్రజిత్ సింగ్, జ్యోతిరాదిత్య సింధియా, జితిన్ ప్రసాద, ఆర్పీఎన్ సింగ్, హార్దిక్ పటేల్  ఇలా చెప్పుకుంటూ పోతే, ఈ స్కోర్ సెంచరీ దాటేస్తుంది. ఇంతమందిలో ఏ ఒక్కరూ కూడా కాంగ్రెస్ సిద్ధాంతాలు లేదా విధానాలు నచ్చక పార్టీని వదిలి పోలేదు. రాహుల్ గాంధీ నాయకత్వం నచ్చక, అయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవం సాధ్యం కాదన్న నిర్ణయానికి వచ్చి  మనసు  రాయి చేసుకుని మరీ  కాంగ్రెస్ ను వదిలి పెట్టి పోయారు.   అలాగే, అదానీ వ్యవహారంలో రాహుల్ గాంధీ తీసుకున్న స్టాండ్ తో విభేదించి ఎన్సీపీ అధినేత శరద్ పవార్, తృణమూల్ అధినాయకురాలు మమతా బెనర్జీ కాంగ్రెస్ కు దూరంగా అడుగులు వేస్తున్నారు. అలాగే, సావర్కార్’ ను అవమానిస్తూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై శివసేన ( ఉద్దవ్ థాక్రే) భగ్గు మంది. ఇలా మిత్ర పక్షాలు రాహుల్ కారణంగా కాంగ్రెస్ కు దురమవుతున్నాయి. అందుకే, మళ్ళీ సోనియా గాంధీ తెరమీదకు వచ్చి, బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్ష్లాలు కలసిరావాలని పిలుపు నిచ్చారు. కానీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో పని చేసేందుకు ప్రతిపక్షాలు సిద్ధంగా లేవు. అందుకే, విపక్షాల ఐక్యతకు రాహుల్ గాంధీనే అవరోధం అనే అభిప్రాయం బలపడుతోందని పరిశీలకులు అంటున్నారు.

విశాఖ స్టీల్ ప్రైవేటీకరణపై కేంద్రం వెనకడుగు

కేంద్రం బీఆర్ఎస్ కు ఝలక్ ఇచ్చిందో.. లేక టీఆర్ఎస్ దెబ్బకు వెనకడుగు వేసిందో కానీ మొత్తనికి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తాత్కాలికంగానైనా సరే పక్కన పెట్టేసింది. నిన్న మొన్నటి వరకూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అనివార్యం అంటూ.. పార్లమెంటు వేదికగా సైతం ప్రకటనలు గుప్పించిన కేంద్రంలోని మోడీ సర్కార్ ఇప్పుడు ఆ విషయాన్ని పక్కన పెట్టడానికి కారణం మాత్రం బీఆర్ఎస్ బిడ్డింగ్ అంటూ చేసిన హడావుడే అనడంలో సందేహం లేదు. బీఆర్ఎస్ ఏపీలో అడుగుపెట్టడానికి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఒక అస్త్రంగా మారకూడదన్న ఉద్దేశమే కేంద్రం వెనక్కు తగ్గడానికి కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  మొత్తం మీద విశాఖ స్టీల్ ను అడ్డంగా అమ్మేస్తున్నా కదలిక లేని జగన్ సర్కార్ అంటూ హరీష్ చేసిన విమర్శలకు కేంద్రం నిర్ణయం చెక్ పెట్టింది. బిడ్డింగ్ కోసం పరిశీలన అంటూ బీఆర్ఎస్ అధినేత చేసిన హడావుడి కూడా కేంద్రం నిర్ణయంతో చప్పబడిపోయేలా చేసింది. ప్రస్తుతానికి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో ముందుకు వెళ్లే ఉద్దేశం లేదంటూ కేంద్ర మంత్రి ఫగన్ సింగ్ కులస్తే విశాఖ వేదికగా విస్పష్ట ప్రకటన చేశారు.  ఇప్పటికిప్పుడు విశాఖ స్టీల్ ను ప్రైవేటు సంస్థలకు అమ్మే ప్రక్రియ చేయడం లేదనీ,   ఆర్ఐఎన్ఎల్‌ను బలోపేతం చేస్తున్నామని చెప్పారు.  విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రస్తుతానికి ముడి సరకు పెంపొందించే ప్రక్రియపై ఫోకస్ చేసినట్లు వివరించారు . ఆ వివరణతో ఊరుకోకుండా పనిలో పనిగా తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. విశాఖ స్టీల్ కొనుగోలుకు బిడ్డింగ్ అంటూ తెలంగాణ సర్కార్ చేస్తున్న హడావుడి అంతా బూటకమని ఎద్దేవా చేశారు.   

హు కిల్డ్ బాబాయ్? ఎప్పటికైనా తేలేనా?

వైఎస్ వివేకా హత్య కేసు..ఎన్ని ట్విస్టులు, ఎన్ని మలుపులు.. ఇవన్నీ కూడా హత్య కేసు ఎప్పటికీ తేలకూడదన్న ఉద్దేశంతో ఒక ప్రణాళిక ప్రకారం రచించిన వ్యూహంలో భాగమేనన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమౌతున్నాయి. ఒక నేరం ఎప్పటికీ రుజువు కాకుండా చేయడం ఎలా అంటే వైఎస్ వివేకా హత్య కేసులో ఇప్పటికీ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు న్యాయస్థానాలను ఉపయోగించుకుంటున్న తీరును ఉదాహరణగా చూపవచ్చు.   వంద మంది నేరస్థులు  తప్పించుకున్నా ఫరవాలేదు ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అంటారు. అయితే ఆ మాటకు అర్ధం మాత్రం నేరస్థులెవరైనా తప్పించుకు పోవచ్చు అని మాత్రం కాదు.  అయితే ఈ నాలుగేళ్ల కాలంలో వైఎస్ వివేకా హత్యకు మోటివ్ ఎమిటి? లబ్ధి పొందింది ఎవరు? వెనుక ఉన్న రాజకీయం ఏమిటి? అన్నది దాదాపుగా జనానికి అవగతమైపోయింది. నాలుగేళ్లనాడు వివేకా హత్య జరిగిన మరుక్షణం ఆయన గుండెపోటుతో మరణించారంటూ.. అప్పటి విపక్ష నాయకులు (ఇప్పుడు వారు అధికారంలో ఉన్నారు) ఊరూవాడా ఏకమయ్యేలా ప్రచారం చేశారు. అలా ప్రచారం చేస్తున్న గంటల వ్యవధిలోనే వివేకా మరణానికి గుండెపోటు కారణం కాదు గొడ్డలి పోటన్నది వెల్లడైంది. అంటే గుండెపోటు ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టేసి.. అప్పటి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, ఆయన కుమారుడిపై ఆరోపణలు గుప్పించారు. నారాసుర రక్త చరిత్ర అంటూ గగ్గోలు పెట్టారు. మొత్తం మీద అప్పటి ఎన్నికలలో ఈ ప్రచారం ప్లస్ అయ్యింది.  2019 ఎన్నికలలో వైసీపీ విజయం సాధించి రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టింది. అప్పటి వరకూ సొంత బాబాయ్ ను అత్యంత దారుణంగా, కిరాతకంగా హత్య చేశారు. ఈ హత్య కేసు విచారణ రాష్ట్ర పోలీసులతో కాదు, సీబీఐతో చేయించాలని డిమాండ్ చేసిన వారు.. అధికారం చేపట్టగానే సీబీఐ విచారణ అవసరం లేదంటూ ప్లేటు ఫిరాయించారు.  జగన్ సీఎం అయిన తరువాత వివేకా హత్య కేసు దర్యాప్తు వేగం పుంజుకుంటుందని అంతా భావించారు. అయితే అందుకు భిన్నంగా కేసు దర్యాప్తు సాగింది. దీనితో తన తండ్రి హంతకులు ఎవరన్నది తేలాల్సిందే అంటూ వివేకా కుమార్తె సునీత్ న్యాయస్థానాలను ఆశ్రయించి సీబీఐ దర్యాప్తును సాధించుకున్నారు. దీంతో వివేకా హత్య కేసు దర్యాప్తు సవ్యంగా సాగడం ఆరంభమైంది. అంతే వెంటనే గతంలో తాము చేసిన నారాసుర రక్త చరిత్ర ఆరోపణలను పూర్తిగా మరిచిపోయిన వైసీపీ అగ్రనాయకత్వం ఆరోపణాస్త్రాలను వివేకా అల్లుడు అంటు కుమార్తె డాక్టర్ సునీత భర్తపై ఎక్కు పెట్టారు. అలాగే కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. బెదరించారు. కేసులు పెట్టారు. దీంతో ఏపీలో అయితే కేసు దర్యాప్తు సవ్యంగా జరగదని భావించిన డాక్టర్ సునీత మరోమారు సుప్రీంను ఆశ్రయించి కేసు దర్యాప్తును పొరుగు రాష్ట్రానికి బదలాయించేలా  ఉత్తర్వలు సాధించారు.  అంతే వెంటనే  వైఎస్ వివేకా రెండో పెళ్లి అంటూ మరో ప్రచారం తెరపైకి తెచ్చారు. కేసు తెలంగాణకు మారిన తరువాత దర్యాప్తు వేగం పుంజుకుంది. తీగ లాగి డొంక వద్దకు వచ్చేసింది.  వివేకా హత్య కేసులో సూత్రధారులు, పాత్ర ధారులు ఎవరన్నది ఇహనో ఇప్పుడో వెల్లడి కావడం ఖాయమన్న భావన అందరిలోనూ నెలకొంది.   ఆ దశలో అప్పటి వరకూ కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న రాం సింగ్ ను తొలగించారు. దీని వెనుక ముఖ్యమంత్రి జగన్ హస్తిన పర్యటన మర్మం ఏదో ఉందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. సరే అదలా ఉంటే ఇప్పుడు తాజాగా వివేకా క్యారక్టర్ ను అశాసినేట్ చేసేలా మరో కథనం బయటకు వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సునీల్ యాదవ్ తల్లిని వివేకా లైంగిక వేధింపులకు గురి చేయడంతో ఆగ్రహించి సునీల్ యాదవే వివేకాను గొడ్డలి పోటుతో హత్య చేశారని మరో కథనాన్ని బయటకు తెచ్చారు. నారాసుర రక్త చరిత్ర, వివేకా రెండో పెళ్లి, ఆస్తి కోసం అల్లుడే ఈ హత్య చేశాడు వంటి వన్నీ వెనక్కు నెట్టి ఇప్పుడు వివేకా లైంగిక వేథింపుల కారణంగానే హత్యకు గురయ్యాడంటే కొత్త వాదనను తెరమీదకు తెచ్చారు.  ముందు ముందు మరెన్ని వాదనలు తెరమీదకు వస్తాయో అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అసలింతకీ హుకిల్డ్ బాబాయ్ అన్న ప్రశ్నకు ఎప్పటికైనా సమాధానం దొరుకుతుందా అంటే ఏమీ చెప్పలేని పరిస్థితి. అసలు వివేకా హత్య కేసులో సూత్రధారులు, పాత్రధారుల గుట్టు బయటకు వస్తుందా? అంటే ఏమో అన్న సమాధానమే వస్తోంది. 

కర్నాటకలో హంగే.. ప్రభుత్వ ఏర్పాటులో జేడీఎస్ కీలకం?

కర్నాటకకర్ణాటక శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న పీపుల్స్ పల్స్ ప్రీపోల్ సర్వే  రాష్ట్రంలో హంగ్ ఏర్పడుతుందన్న సంకేతాలను ఇచ్చింది. రాష్ట్రంలో ఏ పార్టీకీ మేజిక్ ఫిగర్ సాధించి అధికార పగ్గాలు చేపట్టే అవకాశాలు లేవని పేర్కొంది. వచ్చె నెల 3వ తేదీన కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. అదే నెల 10న ఓట్ల లెక్కింపు.. ఫలితాల విడుదల ఉంటుంది. ఈ నేపథ్యంలో కర్నాటకలో ఏ పార్టీ అధికారం చేపడుతుంది? ఏపార్టీ ప్రతిపక్షానికే పరిమితమౌతుంది అంటే.. ఇప్పటికిప్పుడు జనం నాడిని బట్టి హంగ్ వినా మరో అవకాశం లేదన్న మాటా వినపడుతోంది. పీపుల్స్ పల్స్ ప్రీ పోల్ సర్వే కూడా అదే చెప్పింది. రాష్ట్రంలో అధికార   బీజేపీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ మధ్య పోటీ నువ్వా నేనా అనే విధంగా ఉంటుందని సర్వే పేర్కొంది. ఈ పోరులో కాంగ్రెస్ పార్టీ స్వల్ప ఆధిక్యత సాధించినా.. అది అధికార పగ్గాలను అందుకునేందుకు అవసరమైన సంఖ్యా బలం సాధించడానికి కూతవేటు దూరంలోనే నిలిచిపోతుందని సర్వే పేర్కొంది. ఈ పరిస్థితుల్లో కింగ్ మేకర్ పాత్ర పోషించే జేడీఎస్ కీలకమౌతుందని సర్వే పేర్కొంది.  ఔను రాష్ట్రంలో జరిగేది ముఖాముఖీ పోరే అయినా.. ఏవో కొన్ని స్థానాలను ఖాతాలో వేసుకోగలిగే పాటి బలం ఉన్న జేడీఎస్ ఏ పార్టీ వైపు మొగ్గు చూపితే ఆ పార్టీకే రాష్ట్రంలో అధికార పగ్గాలు అందుకునే అవకాశాలు మెరుగ్గా ఉంటాయని పీపుల్స్ పల్స్ సర్వే పేర్కొంది.   వాస్తవానికి కర్ణాటకలో హంగ్ అసెంబ్లీ, సంకీర్ణ ప్రభుత్వాలు కొత్త కాదు. అలాగే, అలాంటి పరిస్థితి వచ్చిన ప్రతిసారీ జేడీఎస్  కీలకంగా మారుతోంది.  2018 ఎన్నికల తర్వాత కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. 224 మంది సభ్యులున్న సభలో బీజేపీ 106 స్థానాల్లో విజయం సాధించి, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. కానీ మేజిక్ ఫిగర్ (113) చేరుకోలేక పోయింది. దీంతో  78 సీట్లున్న కాంగ్రెస్ పార్టీ మద్దతుతో కేవలం 37 సీట్లు మాత్రమే గెలిచిన జేడీఎస్ ముఖ్యమంత్రి కుర్చీ పట్టుకు పోయింది.   కుమార స్వామి ముఖ్యమంత్రిగా, జేడీఎస్, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కొలువు తీరింది. ఆ తరువాత సంకీర్ణంలో చిచ్చు కారణంగా కుమార స్వామి సర్కార్ కూలిపోయింది.  15 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బీజేపీలో చేరి, ఆ తరువాత ఉప ఎన్నికల్లో గెలిచారు. ఆ విధంగా సంవత్సరం తిరక్కముందే బీజేపీ పూర్తి మెజారిటీతో యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది,  ఆతర్వాత యడ్యూద్యూరప్ప స్థానంలో బ‌స‌వ‌రాజు బొమ్మై ముఖ్యమంత్రిగా వచ్చారు. సరే, ఆ చరిత్రను అలా ఉంచితే, వచ్చే నెల జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో కూడా అదే పునరావృతం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది.  ఇక పీపుల్స్ పల్స్ తాజా సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీత రాష్ట్రంలో 95 నుంచి 105 స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉంది. అలాగే బీజేపీ 90 నుంచి 100 స్థానాలలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. జేడీఎస్ పాతిక నుంచి ముఫ్ఫై స్థానాలలో గెలుపొందుతుందని సర్వే పేర్కొంది. బీజేపీపై ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉన్నా దానిని పూర్తి స్థాయిలో అందిపుచ్చుకోవడంలో కాంగ్రెస్ విఫలమైందనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ గత ఎన్నికలతో పోలిస్తే ఓటింగ్ శాతాన్ని రానున్న ఎన్నికలలో గణనీయంగా పెంచుకోగలిగినా.. ఆ మేరకు సీట్ల సంఖ్య పెరిగే అవకాశాలు లేవన్నది సర్వే చెబుతోంది. దీంతో ఎన్నికల అనంతరం జీడీఎస్ మళ్లీ కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయి.  

మార్చేస్తారా? మందలించి సరిపెడతారా?

తెలంగాణ గవర్నర్ తమిళి సై  గురువారం (ఏప్రిల్ 13) హస్తినలో పర్యటించనున్నారు.  పెండింగ్ బిల్లుల వివాదం సుప్రీం కోర్టులో ఉన్న తరుణంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై హస్తిన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, రిపబ్లిక్ డే వేడుకల వివాదం, ఆ తర్వాత బడ్జెట్  ఆమోదం విషంయలో కేసీఆర్ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించటం, అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం తదితర విషయాలను ఆమె ఈ పర్యటనలో కేంద్ర ప్రభుత్వ పెద్దలకు వివరించే అవకాశాలు ఉన్నాయి. గత వారం రోజుల్లో తెలంగాణలో చోటు చేసుకున్న కీలక రాజకీయ పరిణామాల  ఆమె ఢిల్లీ పర్యటనపై రాజకీయ వర్గాలలో ఆసక్తి వ్యక్తమౌతోంది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై గవర్నర్ కేంద్రానికి నివేదిక ఇవ్వనున్నారు. అన్నిటికీ మించి  గత కొన్నేళ్లుగా  ప్రగతి భవన్ వర్సెస్ రాజ్ భవన్ అన్నట్లుగా ఉన్న పరిస్థితులు మారినట్లుగా అనిపించినా, ఆ గ్యాప్ అలాగే ఉందనడానికి   7 కీలక బిల్లులకు  గవర్నర్ ఇంకా ఆమోదం తెలపకుండా పెండింగ్ లో ఉంచడం, తాజాగా మంత్రి కేటీఆర్ గవర్నర్ వ్యవస్థ అవసరమా అంటూ కొత్త చర్చకు తెరలేపడం నేపథ్యంలో గవర్నర్ హస్తిన పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో భేటీ తర్వాత పెండింగ్ లో ఉంచిన బిల్లులపై  గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారో అన్న ఉత్కంఠ రాజకీయ వర్గాలలో నెలకొంది.   ఇదలా ఉంటే ఏడాది కిందట తెలంగాణ గవర్నర్ గా తమిళిసై మార్పు తప్పదన్న వార్తలు జోరుగా వినిపించాయి. చీటికీ మాటికీ గవర్నర్ తమిళిసై రాష్ట్ర  ప్రభుత్వంతో తగవుల కారణంగా కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రతిష్ట మసకబారుతోందన్న భావన కు వచ్చిన కేంద్రం ఆమెను తెలంగాణ గవర్నర్ గా తప్పించడమే మేలన్న భావనకు వచ్చిందని పరిశీలకులు అప్పట్లో విశ్లేషణలు చేశారు. ఇక ఇప్పుడు పెండింగ్ బిల్లుల విషయంలో తెలంగాణ సర్కార్ సుప్రీం కోర్టుకు వెళ్లడం.. సుప్రీం కోర్టు కేంద్రానికి నోటీసులు ఇవ్వడానికి సిద్ధపడటం నేపథ్యంలో ఆ కేసు కోర్టులో విచారణకు వచ్చే రోజున గవర్నర్ ఒక మెట్టు దిగి మూడు బిల్లులకు ఆమోదం తెలిపినా మిగిలిన వాటిని పెండింగ్ లోనే ఉంచడం వంటి పరిణామాల నేపథ్యంలో గవర్నర్ తమిళిసై తాజా హస్తిన పర్యటన రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. బిల్లుల విషయంలో అనవసర రగడ వద్దన్న మందలింపుతో సరిపెడతారా లేక ఆమెను మార్చే నిర్ణయం తీసుకుంటారా అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరందుకుంది.

పులివెందుల వైసీపీలో అసమ్మతి భగ్గు!

వైసీపీలో ఇంత కాలంగా నివురు గప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి, అసమ్మతి ఇప్పుడు ఆ నివురు తొలగించుకుని బయటపడుతోంది. ఇంత కాలంగా అంతర్గతంగా రగులుతున్న అసంతృప్తి జ్వాలలు ఇప్పుడు పెను మంటలుగా ప్రజ్వరిల్లుతున్నాయి. తాజాగా జగన్ సొంత నియోజకవర్గం పులివెందులకు చెందిన వైసీపీ నేత, శ్రీ వృషభలేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ వైసీపీకి రాజీనామా చేసి.. పార్టీ తరుపట్ల తన అసంతృప్తిని బహిర్గతం చేశారు. పార్టీలో కొనసాగి ఏం ప్రయోజనం లేదని, కార్యకర్తలకు న్యాయం చేయలేని పార్టీలో ఉండి ప్రయోజనం ఏముందని రాజీనామా చేసినట్లుఆయన ప్రకటించారు.  అసలు పార్టీలో అసమ్మతి, అసంతృప్తి రగులుతోందన్న విషయం ముఖ్యమంత్రి జగన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సమయంలోనే వెల్లడైంది. బహిరంగంగా, బాహాటంగా సీఎంకు వ్యతిరేకంగా నేతలూ, కార్యకర్తలూ అప్పట్లోనే రోడ్డెక్కారు. అప్పటి దాకా జగన్ మాటే శాసనం అన్నట్లుగా వైసీపీ పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ వ్యవహారాలు నడిచేవి. కానీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అనంతరం ఆ పరిస్థితి మారింది. జగన్ నిర్ణయాలను అప్పట్లో పలువురు నేతలు సూటిగానే ప్రశ్నించారు. సరే ఆ తరవాత బతిమాలో, బామాలో.. కొన్ని నిర్ణయాలను వెనక్కు తీసుకోవడం ద్వారాలో పరిస్థితిని చక్కదిద్దుకున్నారు. అసంతృప్తి అగ్నిని తాత్కాలికంగా చల్లార్చారు. అప్పటి నుంచీ పార్టీలో అంతర్గతంగా అసంతృప్తి జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేల భాగస్వామ్యంపై సమీక్షల పేరుతో జగన్ చేసిన వ్యాఖ్యలు, హెచ్చరికలు వాటికి అజ్యం పోశాయి. ఆ ఎఫెక్ట్ గ్యాడ్యుయేట్, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రస్ఫుటంగా కనిపించింది. మూడుకు మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలనూ కోల్పోయిన వైసీపీకి, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా పరాభవం తప్పలేదు. ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో జగన్ కు కంచుకోట లాంటి పులివెందులలో.. వైసీపీకి తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఓట్లలో సగం కూడా రాలేదంటే అధికార పార్టీ పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో అర్ధం చేసుకోవచ్చు. స్థానిక ఎన్నికలలో కుప్పంలో తెలుగుదేశం పరాజయం తరువాత జగన్ ఇప్పుడు చంద్రబాబు ముఖం చూడాలని ఉందని అని వ్యాఖ్యానించారు. అయితే సొంత నియోజకవర్గం పులివెందులలో జగన్ కు ఇంత గట్టి ఎదురు దెబ్బ తగిలిన పేపథ్యంలో ఆయన, ఆయన సలహాదారు అసలు వాళ్లు మా ఓటర్లే కాదని చేతులు దులిపేసుకున్నారు. సరే అదలా ఉంటే.. ఇప్పుడు తాజాగా అదే పులివెందుల నియోజకవర్గం నుంచి జగన్ కు ఆయన కుటుంబానికి సన్నిహితుడైన జయ చంద్రారెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. ఆయనేమీ నిన్న మొన్న పార్టీలోకి వచ్చిన నాయకుడు కాదు.. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం నుంచీ ఆయన కుటుంబానికి సన్నిహితంగా మెలిగిన వ్యక్తి. ఆయన రాజీనామా చేసి ఊరుకోలేదు.. పార్టీ మీదా, పార్టీ అధినేత మీదా విమర్శలు చేశారు. పులివెందుల నుంచి వైసీసీకి రాజీనామాల పర్వం తనతోనే ప్రారంభం అవుతుందని అన్నారు. ఇప్పటికే పలువురు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. ఎవరికి ఏ పని కావాలన్నా వాలంటీర్ ఉషాలక్ష్మి ఇంటికి వెళ్లాల్సిందేననీ, కానీ ఆమె ఒక్క పని కూడా చేయరనీ జయచంద్రారెడ్డి అన్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్ చెప్పిన పనులే పులివెందులలో జరిగే పరిస్థితి లేదన్నారు. ముందు ముందు పులివెందుల వైసీపీ నుంచి మరిన్ని రాజీనామాలు తధ్యమని జోస్యం చెప్పారు. అధికార పార్టీ నేతలకు భయపడి కొందరు బయటపడటం లేదు కానీ, పార్టీ కార్యకర్తలందరూ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని జయచంద్రారెడ్డి కుండబద్దలు కొట్టారు. 

తెలుగు రాష్ట్రాల మంత్రుల మధ్య మాటల యుద్ధం

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ బిడ్డింగ్‌ వ్యవహారంలో తెలుగు రాష్ట్రాల నడుమ చెలరేగిన మాటల మంటలు చల్లారకముందే తాజాగా తెలంగాణ మంత్రి హరీష్‌ రావు ఏపీలో అభివృద్ధి శూన్యమని, ఇక్కడ స్థిరపడ్డ ఆంధ్ర ప్రాంత ప్రజలు వారి రాష్ట్రంలో ఓటు- హక్కును రద్దు చేసుకుని తెలంగాణాలో నమోదు చేసుకోవాలని సూచించారు.  తెలంగాణ మంత్రి హరీష్‌ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు కారుమూరి నాగేశ్వర రావు, బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అసలు హరీష్‌ రావ్ ఏమన్నారంటే.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పాలన ఎలా ఉందో అక్కడి నుంచి తెలంగాణకు వచ్చి స్థిరపడిన కార్మికులను అడిగితే తెలుస్తుంది. అభివృద్ధిలో తెలంగాణకు- ఆంధ్రప్రదేశ్‌కు భూమికి -ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. సంగారెడ్డిలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన హరీష్‌ ఎంతో మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి తెలంగాణాలో స్థిరపడ్డారని ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఇక్కడ ఉంటున్నారన్నారు.  ఏపీ, తెలంగాణలను చూశారు.. ఏపీలో రోడ్లు, ఆస్పత్రుల పరిస్థితి దారుణంగా ఉంది. అక్కడ మీకు ఓటెందుకు ? అక్కడ ఓటును రద్దు చేసుకుని తెలంగాణాలో ఓటు నమోదు చేసుకోండని హితవు పలికారు. ఈ వ్యాఖ్యలే ఏపీ మంత్రులకు తీవ్ర ఆగ్రహం కలిగించాయి. దానిపైనే ఏపీ, తెలంగాణ మంత్రుల మధ్య మాటల యుద్ధానికి తెరతీశాయి.  తెలంగాణ మంత్రి హరీష్ రావు లక్ష్యంగా ఏపీ మంత్రులు ఎదురు దాడికి దిగుతున్నారు. వారి వ్యాఖ్యలపై హరీష్‌ రావు మరోసారి అదే స్థాయిలో విరుచుకుపడ్డారు, సంగారెడ్డి జిల్లా ఆందోల్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, తెలంగాణలో ఏముందని ప్రశ్నించిన ఏపీ మంత్రి ఇక్కడికి వచ్చి చూస్తే ఏముందో తెలుస్తుందని సవాల్‌ చేశారు. 56 లక్షల ఎకరాల్లో యాసంగి పంట ఉంది.. బోరు బావుల వద్ద 24 గంటల కరెంటు  ఉంది. కేసీఆర్‌ కిట్‌ ఉంది.. కల్యాణ లక్ష్మి ఉంది.  ఎకరానికి పదివేలు ఇచ్చే రైతు బంధు, రైతు బీమా ఉంది అంటూ రాష్ట్రంలో అమలు చేస్తోన్న పథకాల గురించి చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో.. ఏపీలోని రాజకీయ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు హరీష్‌రావు. ప్రత్యేక హోదాకు కేంద్రం ఎగబెట్టినా ఏమీ అడగరు. ఏపీలో ఏముంది.? అని ప్రశ్నించారు. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఎవరూ మాట్లాడటం లేదన్న ఆయన. విశాఖ ఉక్కును తుక్కు కింద అమ్మకానికి పెట్టినా నోరెత్తరు.. అధికార పార్టీ అడగదు, ప్రతిపక్షం ప్రశ్నించదని పరోక్షంగా తెలుగుదేశం పార్టీపై కూడా విమర్శలు గుప్పించారు. వైకాపా, తెదేపా రెండు పార్టీలు జనాన్ని గాలికి వదిలేసి స్వార్థం కోసం పనిచేస్తున్నాయని మండిపడ్డారు.  అనవసరంగా మా జోలికి రాకండి, మా గురించి ఎక్కువ మాట్లాడకండి. అది మీకే మంచిదని ఆంధ్ర మంత్రులకు హరీష్‌ హెచ్చరించారు. తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్‌ రావుపై ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు సీరియస్‌ అయ్యారు. హరీష్‌ రావు.. దౌర్భగ్యమైన మాటలు మాట్లాడకు అంటూ చురకలు అంటించారు. ధనిక రాష్ట్రాన్ని (తెలంగాణ) మీ చేతిలో పెడితే ఏం చేశారో తెలియదా? అంటూ వ్యాఖ్యలు చేశారు.  హైదరాబాద్‌లో వర్షం వస్తే ఇళ్ల మీద నుంచి నీళ్లు వెళ్తున్నాయి. హరీష్‌ మీ రాష్ట్రంలో స్కూళ్లు, మా రాష్ట్రంలో స్కూళ్ల తేడా చూసుకో. తెలంగాణలో సంక్షేమ పథకాలు మా సంక్షేమ పథకాలకు తేడా చూడు.  జీడీపీలో మేం దేశంలోనే నంబర్‌ వన్‌లో ఉన్నాం.  ముందు మీ రాష్ట్రం సంగతి చూసుకోండి. అంటూ విమర్శలు చేశారు. అలాగే, ఏపీలో జరుగుతున్న అభివృద్ధి గురించి తెలుసుకొని మాట్లాడాలని ఆయన హితవు పలికారు.   తెలంగాణాలో అభివృద్ధిపై భారాస ప్రభుత్వం దృష్టి సారిస్తే మంచిదని ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ హితవు పలికారు. హరీష్‌ రావుకు ఏం సంబంధం ఉందని ఏపీ గురించి మాట్లాడుతున్నారు. రాష్ట్ర అభివృద్ధిపై మాట్లాడడానికి హరీష్‌ రావు ఎవరు? బాధ్యత గల వ్యక్తులు బాధ్యత గుర్తెరిగి మాట్లాడాలన్నారు. మొత్తం మీద తెలంగాణ, ఆంధ్ర మంత్రులు మధ్య మాటల యుద్ధంతో  వాతావరణం హీటెక్కుతోంది. రానున్న రోజుల్లో ఇది ఏ మలుపు తిరుగుతోందనని ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.  మరి కొన్ని నెలలో రెండు రాష్ట్రాలలో ఎన్నికలు రానున్నాయి.. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకుల తమ వాగ్యుద్ధంతో వాతావరణం గరం గరం  అవుతోంది.

దేశంలో సంపన్న సీఎం జగన్‌రెడ్డి

సంపన్న ముఖ్యమంత్రుల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ సీఎం  జగన్‌మోహన్‌రెడ్డి మొదటి స్థానంలో ఉన్నారు. మన దేశంలో 30 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు.  28 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల (ఢిల్లి, పుదుచ్చేరి)   సీఎంలలలో అందరికంటే సంపన్నుడు ఏపీ సీఎం. (మరో కేంద్రపాలిత ప్రాంతమైన జమ్ము-కాశ్మీర్‌ గవర్నర్‌ పాలనలో ఉన్నందున అక్కడ ముఖ్యమంత్రి లేరు.)  కాగా, 30 ముఖ్యమంత్రుల్లో 29 మంది కోటీశ్వరులే. పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ మాత్రమే ఇందుకు మినహాయింపు. ఆమె ఆస్తుల విలువ కేవలం రూ.15 లక్షలు మాత్రమే.  ఎన్నికల సందర్భంగా ఆయా నేతలు సమర్పించిన అఫిడవిట్లలో పొందుపరిచిన వివరాల ప్రకారం, ముఖ్యమంత్రుల ఆస్తుల వివరాలను అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) విశ్లేషించింది. దీనిపై రూపొందించిన నివేదికను బుధవారం (ఏప్రిల్ 12)విడుదల చేసింది. దీని ప్రకారం, 29 మంది సంపన్న సీఎంల సగటు ఆస్తుల విలువ రూ.33.96 కోట్లు. అదే సమయంలో 30 మంది సీఎంలలో 13 మంది (43శాతం) పై తీవ్రమైన క్రిమినల్‌ కేసులున్నాయి. కొందరు ముఖ్యమంత్రులు హత్య, హత్యాయత్నం, కిడ్నాపింగ్‌ వంటి నేరాభియోగాలను ఎదుర్కొంటున్నారు. నాన్‌బెయిలబుల్‌ పరిధిలోకి వచ్చే తీవ్రనేరాపణలను ఎదుర్కొంటున్నారు. వీరు దోషులుగా తేలితే వీరికి కనీసం  ఐదేల్లు జైలుశిక్ష పడే అవకాశం ఉంది.  అత్యధిక ఆస్తులు కలిగిన మొదటి ముగ్గురు ముఖ్యమంత్రులలో వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి -ఆంధ్రప్రదేశ్‌ (రూ.510 కోట్లకుపైగా), పెమాఖండూ - అరుణాచల్‌ ప్రదేశ్‌ (రూ.163కోట్లు ఆపైన), నవీన్‌ పట్నాయక్‌ - ఒడిశా (రూ. 63.87కోట్లు) ఉన్నారు. నాగాలాండ్‌ ముఖ్యమంత్రి నెయిపియు రియో ఆస్తుల విలువ రూ.46 కోట్లు, పుదుచ్చేరి సీఎం రంగస్వామికి రూ.38 కోట్ల విలువైన స్థిర,చరాస్తులు ఉన్నాయి. అసోం సీఎం హిమంత బిశ్వ శర్మకు రూ.17 కోట్లు, మేఘాలయ సీఎం కన్రాడ్‌ సంగ్మాకు రూ.14 కోట్ల విలువైన ఆస్తులున్నాయి. ఇక బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఆస్తుల విలువ రూ.23.5 కోట్లు కాగా, ఆయనకు రూ.8.8 కోట్లు అప్పులు కూడా ఉన్నాయి. ఎక్కువ అప్పులున్న సీఎంల జాబితాలో కేసీఆర్‌ మొదటి స్థానంలోనూ, కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజ్‌ బొమ్మై రెండవ స్థానంలో ఉన్నారు. బొమ్మైకి రూ.4.9 కోట్ల అప్పులున్నాయి. బొమ్మై ఆస్తుల విలువ రూ.8.92కోట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండేకు రూ.11.6 కోట్ల ఆస్తులు, రూ.3.75 కోట్ల అప్పులు ఉన్నాయి. ఇక ఏడీఆర్‌ నివేదికపై ఆయా రాష్డ్రాలలోని ప్రతిపక్షాలు రాజకీయ కోణంలో  ఎలా స్పందించాలా అని ప్రణాళికలు రూపొందించడంలో తలమునకలవుతున్నట్టు సమాచారం.. సందు దొరకటమే మొదలు దీనిపై రాజకీయ వ్యాఖ్యలు, విమర్శలకు ఎలా పదును పెట్టాలి..? అని ఆలోచిస్తూ ఉన్నారని సమాచారం. రాజకీయాలలో క దేది విమర్శకులకు అనర్హం?

రైతు కొడుకును పెళ్లి చేసుకుంటే రూ. 2 లక్షల నజరానా!!

ఎన్నికల సమయంలో హామీలు ఆకాశానికి నిచ్చెనలేసేలా ఉంటాయి. పార్టీలన్నీ కూడా జనాల మద్దతు కూడగట్టుకోవడానికి హామీలను గుప్పిస్తూ ఉంటారు. అదిగో అదే దారిలో జేడీఎస్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఉభయతారకమనదగ్గ ఒక హామీ ఇచ్చారు.  కర్నాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో  కోలార్ లోని పంచరత్నలో జరిగిన ప్రచార ర్యాలీలో జెడిఎస్ నేత మాజీ సీఎం కుమారస్వామి రైతుల కొడుకులను పెళ్లి చేసుకునే మహిళలకు తమ పార్టీ తరపున  రెండు లక్షల రూపాయల నజరానా అందిస్తాం అంటూ హామీ ఇచ్చారు. రైతుల పిల్లలను ప్రోత్సహించేందుకు ఈ హామీ ఇచ్చినట్లు ఆయన చెప్పుకొచ్చారు. కాగా కర్ణాటకలో మే 10వ తేదీన ఎన్నికలు జరగనుండగా.. 13వ తేదీన కౌంటింగ్ జరగనుంది.  రైతు బిడ్డల పెళ్లిళ్లను ప్రోత్సాహించేందుకు ప్రభుత్వం ఆడపిల్లలకు ఈ నజరానా ఇవ్వాలి. అమ్మాయిలు రైతుల బడ్డలను పెళ్లి చేసుకునేందుకు ముందుకు రావడం లేదు. తమ పార్టీ ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని హస్తగతం చేసుకుంటే, రైతన్నల కుమారుల ఆత్మగౌరవంగా దీన్ని భావిస్తూ, ఈ పథకాన్ని అమలు చేస్తామని ఆయన అన్నారు. 224 స్థానాలున్న కర్నాటక అసెంబ్లిలో కనీసం 123 స్థానాలు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న జేడీ (ఎస్‌) ఇప్పటి వరకు 93 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది. విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్న జేడీఎస్ కొంచం భిన్నంగా ఆలోచించి ఈ హామీని ఇచ్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  చూడటానికి..ఇది రైతుల కుమారుల సంక్షేమం..కల్యాణం కోసంలా కనిపిస్తూనే మరో వైపు అమ్మాయిలకు లాభం చేకూరే పథకం అనడంలో సందేహం లేదు.  ఈ తాయిలం ఎలాంటి ఫలితం ఇస్తుందన్నది చూడాలి. 

బాలినేనికి పొమ్మన లేక పొగపెడుతున్నారా?

బాలినేని శ్రీనివాసరెడ్డి.. మాజీ మంత్రి.. సీఎంకు సమీప బంధువు..ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అయితే ఆయన మాటే శాసనం అన్నట్లుగా వ్యవహారాలు నడుస్తాయి. అలాంటి నేతకు అవమానం జరిగింది. అదీ జగన్ అధికారిక కార్యక్రమం సందర్భంగా. సీఎం జగన్‌ మార్కాపురం పర్యటన సందర్భంగా వెళ్లిన బాలినేని శ్రీనివాసరెడ్డిని   సీఎం హెలిప్యాడ్‌ దగ్గరకు వెళ్లకుండా పోలీసులు నిలిపివేశారు. పోలీసులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తానెవరో.. తన పవరేంటో చెప్పుకున్నారు. అయినా ససేమిరా అన్నారు. అంతే.. ఆయనకు ఒళ్లు మండింది. ఆగ్రహించిన ఆయన సీఎం కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేసి వెళ్లిపోయారు. ఆయన అనుచరులూ అనుసరించారు.   బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లాలో సొంత వర్గం ఉన్న నాయకుడు. అన్ని పార్టీల నేతలతో సత్సంబంధాలు ఉన్న నేత. అధికారదర్పం, అహంకారం పెద్దగా ప్రదర్శించరు. జిల్లాలో పేరుకు ఇద్దరు మంత్రులు ఉన్నా.. పలుకుబడి మాత్రం బాలినేనికే ఎక్కువ. అటువంటి ఆయన సీఎం హెలీపాడ్ వద్దకు వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకోవడాన్ని తట్టుకోలేకపోయారు. ఇంత అవమానం జరిగాకా తాను అక్కడ ఎందుకు ఉండాలనుకున్నారు. అంతే వెంటనే వెనక్కు వెళ్లిపోయారు.   బాలినేనిని పోలీసులు ఇంతగా అవమానించడం ఏమిటని వైసీపీ వర్గాలే ఆశ్చర్యపోయాయి. బాలినేనికి ముఖ్యమంత్రి వద్ద ప్రాధాన్యత లేదనడానికి నిదర్శనమా అన్న అనుమానాలూ వ్యక్తమయ్యాయి. కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో బాలినేనికి సీఎం ఉద్వాసన పలకడంతో ఆయన ఇప్పటికే అసంతృప్తితో ఉన్నారు. పునర్వ్యవస్థీకరణ సమయంలో ఆయన తన అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేశారు. ఆ తరువాత ఏదో సద్దుకుపోయినా,  తాజాగా ఎదురయిన అవమానం పుండుమీద కారం చల్లినట్లుగా అయ్యిందని పార్టీ శ్రేణులే అంటున్నాయి. ఇక ముఖ్యమంత్రి మార్కాపురం వచ్చిన తరువాత బాలినేనిని పోలీసులు నిలిపివేయడంతో ఆయన వెనక్కు వెళ్లిపోయిన సంగతి తెలుసుకున్న జగన్ స్వయంగా బాలినేనికి ఫోన్ చేసి పిలిపించారు. దాంతో ఆయన వెనక్కు వచ్చి సీఎంతో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. అయినా ఆయనలో పరాభవ భారం కనిపిస్తూనే ఉంది. కార్యక్రమం మొత్తం ముభావంగానే ఉన్నారు. తన అసంతృప్తిని దాచుకోలేదు. అది ఆయన ముఖంలో కనిపిస్తూనే ఉంది. ఇదే విషయాన్ని ఆయన అనుచరవర్గం కూడా చెబుతున్నారు.  జరిగిన సంఘటన చూస్తుంటే పొమ్మనలేక పొగపెడుతున్నట్లుగా ఉందని అంటున్నారు. 

విశాఖ ఉక్కు సరే తెలంగాణలో మూతపడిన పరిశ్రమల మాటేంటి?..లక్ష్మణ్

తెలంగాణలో మూతపడిన పరిశ్రమలను తెరిచే దిక్కులేదు కానీ, విశాఖ ఉక్కు పరిశ్రమ గురించి మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్  ఎద్దేవా చేశారు. వంద రోజుల్లో నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ తెరుస్తామని చెప్పారని,  ఆ హామీ ఇచ్చి ఇన్నేళ్లయినా ఎందుకు అమలు చేయడం లేదని ఎంపీ లక్ష్మణ్‌ నిలదీశారు.  హెచ్‌ఎంటీ, ఐడీపీఎల్‌, అజంజాహీ మిల్‌ మాటేమిటని ప్రశ్నించారు. ఈ భూములపైన బీఆర్‌ఎస్‌ నేతలు కన్నేశారని అందుకే వాటిని తెరిపించే విషయంలో మౌనం వహిస్తున్నారని లక్ష్మణ్   ఆరోపించారు. కాంగ్రెస్‌ హయాంలో డిమాండ్ కు తగ్గ బొగ్గు ఉత్పత్తి లేకపోవడంతో దిగుమతి చేసుకునే వారని, వారికి కావాల్సిన వారికి బొగ్గు నిక్షేపాలు ఇచ్చేసి బొగ్గు కుంభకోణంలో కాంగ్రెస్‌ కూరుకుపోయింది.  బయ్యారం ప్రమేయం లేకుండానే  కడప స్టీల్‌ ప్లాంటు నడుస్తోందని, కడపలో జిందాల్‌ స్టీల్‌ ప్లాంటు ఏర్పాటు చేసిందని ఆయన గుర్తు చేశారు.   నల్లగొండలో యురేనియం పుష్కలంగా ఉంది, అక్కడ నిక్షేపాలను వెలికి తీస్తే అనేక మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు.  వీటికి దిక్కు లేదు కానీ , వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌కు వెళ్తారా..? అని  ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్‌.. తన చుట్టూ పది మందిని పెట్టుకుని నోటికి హద్దూ అదుపూ లేకుండా మాట్లాడుతున్నారని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని కొల్లగొడుతుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరని లక్ష్మణ్ హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్‌ వాడిన భాషను ఆంధ్ర ప్రజలు ఎన్నటికీ మర్చిపోరని, ఇప్పుడు విశాఖ స్టీల్‌ అంటూ మోసం చేయాలని చూస్తున్నారనీ, అయితే జనం నమ్మరని అన్నారు.  జాతీయ పార్టీ అని చెప్పుకునే కేసీఆర్‌ కు  ఏపీలో పార్టీ సింబల్‌కే   దిక్కు లేని పరిస్థితి ఉందన్నారు.   ముందు మన ఇల్లు చక్కదిద్దుకుని... తర్వాత పక్కోడి ఇల్లు గురించి తీరిగ్గా ఆలోచించాలని లక్ష్మణ్ కేసీఆర్ కు సూచించారు. 

కాంగ్రెస్ సారథ్యంలో విపక్ష కూటమి దిశగా తొలి అడుగు!

వచ్చే సార్వత్రిక ఎన్నికలలో బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాల ఐక్యతా యత్నాలలో ఒక ముందడుగు పడిందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీలు బీహార్ సీఎం, జేడీఎస్ అధినేత నితీష్ కుమార్ తో బుధవారం భేటీ అయ్యారు. ఈ బేటీలో ఆర్జేడీ నాయకుడు, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వియాదవ్ కూడా ఉన్నారు. భేటీ అనంతరం  ఖర్గే మీడియాతో మాట్లాడారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడిగా పోటీ చేయాలన్న నిర్ణయానికి వచ్చామని వెల్లడించారు. నితీష్, తేజస్విలతో భుటీ సామరస్య పూరిత వాతావరణంలో అర్థవంతంగా జరిగిందన్నారు.   2024 ఎన్నికలే లక్ష్యంగా పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చాయని ఖర్గే చెప్పారు.ముందు ముందు మరిన్ని పార్టీలు కలిసి వస్తాయన్న ధీమా వ్యక్తం చేశారు.  నితీష్ కూడా ఈ భేటీ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఉన్న బీజేపీయేతర పార్టీలన్నిటినీ ఏకం చేస్తామన్నారు. కాగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సమదూరం పాటించాలన్న అభిప్రాయంతో ఉన్న విపక్ష పార్టీల నేతలతో మాట్లాడి వారిని కలుపుకునే బాధ్యతను ఈ భేటీ సందర్భంగా నితీష్ కుమార్ తీసుకున్నారు.   ఈ సమావేశంలో రాహుల్‌ గాంధీ, తేజస్వీ యాదవ్‌, జేడీ(యూ) చీఫ్‌ లాలన్‌ సింగ్‌, కాంగ్రెస్‌ ఎంపీ నసీర్‌ హుస్సేన్‌, రాజస్థాన్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ సుఖ్‌జీందర్‌ సింగ్‌ రంధావా, కాంగ్రెస్ నేతలు ముకుల్ వాస్నిక్, సల్మాన్ ఖుర్షీద్ లు పాల్గొన్నారు. ఇటీవలే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మోడీ డిగ్రీ సర్టిఫికేట్, అదానీ వ్యాపార వ్యవహారాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో విపక్షాల ఐక్యతకు గండి పడినట్లే నంటూ వచ్చిన వ్యాఖ్యలను పూర్వ పక్షం చేస్తూ కాంగ్రెస్, జేడీఎస్, ఆర్జేడీ, జేడీయూ పార్టీల నాయకులు భేటీ అయ్యి వచ్చే ఎన్నికలలో ఐక్యంగా సాగాలన్న నిర్ణయాన్ని ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో చాటింగ్.. సుఖేష్ చంద్రశేఖర్ లేఖతో సంచలనం

సుఖేష్ చంద్రశేఖర్ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారాడు. మనీ ల్యాండరింగ్ కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఇప్పటికే పలువురితో తాను చేసిన చాటింగ్ ను బయటపెట్టిన సుఖేష్ చంద్రశేఖర్ తాజాగా తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో చేసిన చాటింగ్ ను బయటపెట్టాడు. ఈ మేరకు జైలు నుంచి విడుదల చేసిన లేఖలో సుఖేఖ్ చంద్రశేఖర్ కల్వకుంట్ల కవితతో తన వాట్సాప్ చాట్ ను బయటపెట్టాడు.  ఇప్పటి వరకూ ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సహా ఆ పార్టీ నాయకులతో చాట్ ను బయటపెట్టిన సుఖేష్ చంద్రశేఖర్ తాజా  లేఖతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో తన  వాట్సాప్ చాట్‌ను   బయటపెట్టడం సంచలనం సృష్ఠించింది. రాజకీయంగా కలకలం రేపింది.  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో తాను చేసిన చాట్ ఇదేనంటూ సుఖేష్ కొన్ని స్క్రీన్ షాట్‌లను బయటపెట్టాడు. కవితక్క - టీఆర్ఎస్ అని సేవ్ చేసుకున్న నంబర్ తో సుఖేష్ చంద్రశేఖర్ చాట్ చేశాడు. ఏకే, ఎస్‌జే, ఏపీ, సిస్టర్ పేర్లతో కోడ్ భాషలో కల్వకుంట్ల కవితతో చాట్ చేసినట్లు సుఖేష్ ఆ లేఖలో పేర్కొన్నాడు.  15కేజీల నెయ్యి డెలివరీ చేశానని కోడ్ భాషలో సుఖేష్  పేర్కొన్నట్లు ఆ చాట్ స్క్రీన్ షాట్ ద్వారా తెలుస్తోంది. అలాగే   ప్యాకెట్  అందజేస్తానని ఏజే చెప్పారని చాట్‌లో సుఖేష్ పేర్కొన్నాడు.  98101 54102 నెంబర్‌తో సుఖేష్ చాటింగ్ చేశాడు. సుఖేష్ లేఖ మొత్తం 6 పేజీలు ఉంది.