విశాఖ స్టీల్ ప్రైవేటీకరణపై కేంద్రం వెనకడుగు
posted on Apr 13, 2023 @ 2:34PM
కేంద్రం బీఆర్ఎస్ కు ఝలక్ ఇచ్చిందో.. లేక టీఆర్ఎస్ దెబ్బకు వెనకడుగు వేసిందో కానీ మొత్తనికి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తాత్కాలికంగానైనా సరే పక్కన పెట్టేసింది. నిన్న మొన్నటి వరకూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అనివార్యం అంటూ.. పార్లమెంటు వేదికగా సైతం ప్రకటనలు గుప్పించిన కేంద్రంలోని మోడీ సర్కార్ ఇప్పుడు ఆ విషయాన్ని పక్కన పెట్టడానికి కారణం మాత్రం బీఆర్ఎస్ బిడ్డింగ్ అంటూ చేసిన హడావుడే అనడంలో సందేహం లేదు.
బీఆర్ఎస్ ఏపీలో అడుగుపెట్టడానికి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఒక అస్త్రంగా మారకూడదన్న ఉద్దేశమే కేంద్రం వెనక్కు తగ్గడానికి కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద విశాఖ స్టీల్ ను అడ్డంగా అమ్మేస్తున్నా కదలిక లేని జగన్ సర్కార్ అంటూ హరీష్ చేసిన విమర్శలకు కేంద్రం నిర్ణయం చెక్ పెట్టింది. బిడ్డింగ్ కోసం పరిశీలన అంటూ బీఆర్ఎస్ అధినేత చేసిన హడావుడి కూడా కేంద్రం నిర్ణయంతో చప్పబడిపోయేలా చేసింది. ప్రస్తుతానికి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో ముందుకు వెళ్లే ఉద్దేశం లేదంటూ కేంద్ర మంత్రి ఫగన్ సింగ్ కులస్తే విశాఖ వేదికగా విస్పష్ట ప్రకటన చేశారు.
ఇప్పటికిప్పుడు విశాఖ స్టీల్ ను ప్రైవేటు సంస్థలకు అమ్మే ప్రక్రియ చేయడం లేదనీ, ఆర్ఐఎన్ఎల్‌ను బలోపేతం చేస్తున్నామని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రస్తుతానికి ముడి సరకు పెంపొందించే ప్రక్రియపై ఫోకస్ చేసినట్లు వివరించారు . ఆ వివరణతో ఊరుకోకుండా పనిలో పనిగా తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. విశాఖ స్టీల్ కొనుగోలుకు బిడ్డింగ్ అంటూ తెలంగాణ సర్కార్ చేస్తున్న హడావుడి అంతా బూటకమని ఎద్దేవా చేశారు.