పులివెందుల వైసీపీలో అసమ్మతి భగ్గు!
posted on Apr 13, 2023 @ 10:30AM
వైసీపీలో ఇంత కాలంగా నివురు గప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి, అసమ్మతి ఇప్పుడు ఆ నివురు తొలగించుకుని బయటపడుతోంది. ఇంత కాలంగా అంతర్గతంగా రగులుతున్న అసంతృప్తి జ్వాలలు ఇప్పుడు పెను మంటలుగా ప్రజ్వరిల్లుతున్నాయి. తాజాగా జగన్ సొంత నియోజకవర్గం పులివెందులకు చెందిన వైసీపీ నేత, శ్రీ వృషభలేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ వైసీపీకి రాజీనామా చేసి.. పార్టీ తరుపట్ల తన అసంతృప్తిని బహిర్గతం చేశారు.
పార్టీలో కొనసాగి ఏం ప్రయోజనం లేదని, కార్యకర్తలకు న్యాయం చేయలేని పార్టీలో ఉండి ప్రయోజనం ఏముందని రాజీనామా చేసినట్లుఆయన ప్రకటించారు. అసలు పార్టీలో అసమ్మతి, అసంతృప్తి రగులుతోందన్న విషయం ముఖ్యమంత్రి జగన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సమయంలోనే వెల్లడైంది. బహిరంగంగా, బాహాటంగా సీఎంకు వ్యతిరేకంగా నేతలూ, కార్యకర్తలూ అప్పట్లోనే రోడ్డెక్కారు. అప్పటి దాకా జగన్ మాటే శాసనం అన్నట్లుగా వైసీపీ పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ వ్యవహారాలు నడిచేవి. కానీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అనంతరం ఆ పరిస్థితి మారింది. జగన్ నిర్ణయాలను అప్పట్లో పలువురు నేతలు సూటిగానే ప్రశ్నించారు. సరే ఆ తరవాత బతిమాలో, బామాలో.. కొన్ని నిర్ణయాలను వెనక్కు తీసుకోవడం ద్వారాలో పరిస్థితిని చక్కదిద్దుకున్నారు. అసంతృప్తి అగ్నిని తాత్కాలికంగా చల్లార్చారు.
అప్పటి నుంచీ పార్టీలో అంతర్గతంగా అసంతృప్తి జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేల భాగస్వామ్యంపై సమీక్షల పేరుతో జగన్ చేసిన వ్యాఖ్యలు, హెచ్చరికలు వాటికి అజ్యం పోశాయి. ఆ ఎఫెక్ట్ గ్యాడ్యుయేట్, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రస్ఫుటంగా కనిపించింది. మూడుకు మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలనూ కోల్పోయిన వైసీపీకి, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా పరాభవం తప్పలేదు. ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో జగన్ కు కంచుకోట లాంటి పులివెందులలో.. వైసీపీకి తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఓట్లలో సగం కూడా రాలేదంటే అధికార పార్టీ పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో అర్ధం చేసుకోవచ్చు.
స్థానిక ఎన్నికలలో కుప్పంలో తెలుగుదేశం పరాజయం తరువాత జగన్ ఇప్పుడు చంద్రబాబు ముఖం చూడాలని ఉందని అని వ్యాఖ్యానించారు. అయితే సొంత నియోజకవర్గం పులివెందులలో జగన్ కు ఇంత గట్టి ఎదురు దెబ్బ తగిలిన పేపథ్యంలో ఆయన, ఆయన సలహాదారు అసలు వాళ్లు మా ఓటర్లే కాదని చేతులు దులిపేసుకున్నారు. సరే అదలా ఉంటే.. ఇప్పుడు తాజాగా అదే పులివెందుల నియోజకవర్గం నుంచి జగన్ కు ఆయన కుటుంబానికి సన్నిహితుడైన జయ చంద్రారెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. ఆయనేమీ నిన్న మొన్న పార్టీలోకి వచ్చిన నాయకుడు కాదు.. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం నుంచీ ఆయన కుటుంబానికి సన్నిహితంగా మెలిగిన వ్యక్తి. ఆయన రాజీనామా చేసి ఊరుకోలేదు.. పార్టీ మీదా, పార్టీ అధినేత మీదా విమర్శలు చేశారు.
పులివెందుల నుంచి వైసీసీకి రాజీనామాల పర్వం తనతోనే ప్రారంభం అవుతుందని అన్నారు. ఇప్పటికే పలువురు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. ఎవరికి ఏ పని కావాలన్నా వాలంటీర్ ఉషాలక్ష్మి ఇంటికి వెళ్లాల్సిందేననీ, కానీ ఆమె ఒక్క పని కూడా చేయరనీ జయచంద్రారెడ్డి అన్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్ చెప్పిన పనులే పులివెందులలో జరిగే పరిస్థితి లేదన్నారు. ముందు ముందు పులివెందుల వైసీపీ నుంచి మరిన్ని రాజీనామాలు తధ్యమని జోస్యం చెప్పారు. అధికార పార్టీ నేతలకు భయపడి కొందరు బయటపడటం లేదు కానీ, పార్టీ కార్యకర్తలందరూ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని జయచంద్రారెడ్డి కుండబద్దలు కొట్టారు.