రైతు కొడుకును పెళ్లి చేసుకుంటే రూ. 2 లక్షల నజరానా!!
posted on Apr 13, 2023 7:20AM
ఎన్నికల సమయంలో హామీలు ఆకాశానికి నిచ్చెనలేసేలా ఉంటాయి. పార్టీలన్నీ కూడా జనాల మద్దతు కూడగట్టుకోవడానికి హామీలను గుప్పిస్తూ ఉంటారు. అదిగో అదే దారిలో జేడీఎస్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఉభయతారకమనదగ్గ ఒక హామీ ఇచ్చారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కోలార్ లోని పంచరత్నలో జరిగిన ప్రచార ర్యాలీలో జెడిఎస్ నేత మాజీ సీఎం కుమారస్వామి రైతుల కొడుకులను పెళ్లి చేసుకునే మహిళలకు తమ పార్టీ తరపున రెండు లక్షల రూపాయల నజరానా అందిస్తాం అంటూ హామీ ఇచ్చారు.
రైతుల పిల్లలను ప్రోత్సహించేందుకు ఈ హామీ ఇచ్చినట్లు ఆయన చెప్పుకొచ్చారు. కాగా కర్ణాటకలో మే 10వ తేదీన ఎన్నికలు జరగనుండగా.. 13వ తేదీన కౌంటింగ్ జరగనుంది. రైతు బిడ్డల పెళ్లిళ్లను ప్రోత్సాహించేందుకు ప్రభుత్వం ఆడపిల్లలకు ఈ నజరానా ఇవ్వాలి. అమ్మాయిలు రైతుల బడ్డలను పెళ్లి చేసుకునేందుకు ముందుకు రావడం లేదు. తమ పార్టీ ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని హస్తగతం చేసుకుంటే, రైతన్నల కుమారుల ఆత్మగౌరవంగా దీన్ని భావిస్తూ, ఈ పథకాన్ని అమలు చేస్తామని ఆయన అన్నారు.
224 స్థానాలున్న కర్నాటక అసెంబ్లిలో కనీసం 123 స్థానాలు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న జేడీ (ఎస్) ఇప్పటి వరకు 93 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది. విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్న జేడీఎస్ కొంచం భిన్నంగా ఆలోచించి ఈ హామీని ఇచ్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. చూడటానికి..ఇది రైతుల కుమారుల సంక్షేమం..కల్యాణం కోసంలా కనిపిస్తూనే మరో వైపు అమ్మాయిలకు లాభం చేకూరే పథకం అనడంలో సందేహం లేదు. ఈ తాయిలం ఎలాంటి ఫలితం ఇస్తుందన్నది చూడాలి.