మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది!
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం విడుదల చేసిన గణాంకాల మేరకు దేశంలో గత 24 గంటలలో 5 వేల 676 కొత్త కొవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో మొత్తం 3 వేల 761 మంది కొవిడ్ నుండి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో ప్రస్తుతం 37 వేల 93 యాక్టివ్ కొవిడ్ కేసులు ఉన్నాయి.
కాగా జాతీయ కొవిడ్ రికవరీ రేటు ప్రస్తుతం 98.73 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 220 కోట్ల 66 లక్షలకు పైగా వ్యాక్సిన్ డోస్‌లను అందించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే బుధవారం నాటికి 24 గంటల్లో దేశంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్క రోజే దేశవ్యాప్తంగా 7,830 మందికి వైరస్ సోకిందని అధికారులు తెలిపారు. ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఏడు నెలల తర్వాత మళ్లీ ఇప్పుడేనని వివరించారు. దీంతో దేశంలో ప్రస్తుతం ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య 40,215 కు చేరిందని వివరించారు. ఒక్క ఢిల్లీలోనే 980 కరోనా కేసులు బయటపడ్డాయని తెలిపారు. ఇక రోజువారీ పాజిటివిటీ విషయానికి వస్తే మంగళవారం నాటికి ఇది 3.65 శాతానికి, వీక్లీ పాజిటివిటీ రేట్ 3.83 శాతానికి చేరింది. వైరస్ నుంచి కోలుకుంటున్న వారి శాతం (రికవరీ రేటు) 98.72 శాతానికి చేరుకుందని అన్నారు. వైరస్ తో మంగళవారం 11 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.
దీంతో దేశంలో కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 5,31,016 కు చేరిందని తెలిపింది. రాష్ట్రాల్లో చూస్తే.. కేరళలో అత్యధికంగా 13,745 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఆ తర్వాత మహారాష్ట్ర (4,667), ఢిల్లీ (2,338), తమిళనాడు (2,099), గుజరాత్ (1932), హర్యానా (1928), కర్ణాటక (1673), ఉత్తరప్రదేశ్ (1282) ఉన్నాయి. మిగతా రాష్ట్రాల్లో 1000 కంటె తక్కువగా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
గత 24 గంటల్లో ఇండియాలో కరోనా వల్ల 15 మంది చనిపోయారు. వారిలో ఢిల్లీలో ముగ్గురు, పంజాబ్‌లో ముగ్గురు, రాజస్థాన్‌లో ముగ్గురు చనిపోయారు. కేరళలో ఇద్దరు చనిపోగా... గుజరాత్, హర్యానా, మహారాష్ట్ర, తమిళనాడులో ఒక్కొక్కరు చనిపోయారు.
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా నిన్న దేశవ్యాప్తంగా జరిగిన కరోనా మాక్ డ్రిల్‌ను సమీక్షించారు. ఢిల్లీలోని RML ఆస్పత్రికి వెళ్లి.. అక్కడి కరోనా ఏర్పాట్లను పరిశీలించారు. మాక్ డ్రిల్ ఇవాళ కూడా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా ప్రిపరేషన్ ఎలా ఉందో ఇందులో గమనిస్తారు. తద్వారా కరోనా పేషెంట్లు ఎక్కువగా వస్తే.. ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు.
ప్రస్తుతం ఇండియాలో కరోనా కేసులు పెరుగుతూ ఉండటానికి ఎక్స్ బిబి.1.16 అనే వేరియంట్ కారణంగా కనిపిస్తోంది. ఇది గత వేరియంట్ల కంటే వేగంగా వ్యాపిస్తోంది. ఇది ప్రాణాంతకమైనది కాదు అని చెబుతున్నారు నిపుణులు. ఐతే... దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి కరోనా సోకితే మాత్రం ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది అంటున్నారు.