జగన్ కు చంద్రబాబు సెల్ఫీ చాలెంజ్!

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు ఏపీసీఎం జగన్ కు సెల్ఫీ చాలెంజ్ విసిరారు. నెల్లూరు పర్యటనలో ఉన్న చంద్రబాబు తన ప్రభుత్వ హయాంలో కట్టిన వేలాది టిడ్కో గృహాల సముదాయం వద్ద సెల్ఫీ దిగారు. నెల్లూరులో మా ప్రభుత్వ హయాంలో నెల్లూరులో పేదల కోసం కట్టిన  నెల్లూరులో టీడీపీ హయాంలో కట్టిన వేలాది టిడ్కో ఇళ్లు ఇవి అంటూ ట్వీట్ చేశారు. తెలుగుదేశం హయాంలో పేదల కోసం నిర్మించిన లక్షలాది ఇళ్లకు ఇది సజీవ సాక్ష్యం అని పేర్కొన్న చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో నువ్వు కట్టిన ఇళ్లెక్కడ జగన్ అంటూ చేసిన ఆ ట్వీట్ ను జగన్ కు ట్యాగ్ చేశారు. దానికి తాను దిగిన సెల్ఫీని జోడించారు.  చంద్రబాబు తన మెబైల్ పోన్ తో  నెల్లూరు టిడ్కో ఇళ్ల సముదాయం వద్ద సెల్ఫీ దిగి జగన్ కు చాజెంజ్ విసిరారు.  రాష్ట్రంలో నాటి అభివృద్ధి పనులపై ప్రభుత్వానికి సెల్ఫీ ఛాలెంజ్ విసరాలని  తెలుగుదేశం లీడర్లు, క్యాడర్ కు చంద్రబాబు పిలుపునిచ్చారు. 

కాంగ్రెస్ కిరణాలతో కమలం వికసిస్తుందా?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి  నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్ కు రాజీనామా చేసిన ఆయన, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, అరుణ్ సింగ్, బీజేపీ నేత లక్ష్మణ్ ఆధ్వర్యంలో శుక్రవారం (ఏప్రిల్ 7న) బీజేపీలో చేరారు. ఉమ్మడి ఏపీలో కిరణ్ కుమార్ రెడ్డి  నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2010 నవంబర్‌ 25 నుంచి 2014 మార్చి 1 వరకు సీఎంగా ఆయన పనిచేశారు.  అంతకుముందు అసెంబ్లీ స్పీకర్‌గా, ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. రాష్ట్ర విభజన అనంతరం జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించారు.  2014 ఎన్నికల్లో అదే పార్టీ తరఫున ఆయన బరిలో నిలిచారు.  ఆ ఎన్నికల్లో కిరణ్‌కుమార్‌రెడ్డి పార్టీ ఘోర ఓటమిని చవిచూసింది. ఆ తర్వాత కొద్ది కాలం రాజకీయాలకు దూరంగా ఆయన.. తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. ఇటీవలే కాంగ్రెస్ కు రాజీనామా చేసిన ఆయన చివరకు బీజేపీలో చేరారు. నిజానికి గత కొంతకాలంగా కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరుతున్నారనే వార్త తరచూ తెర మీదకు వస్తూనే వుంది. అలాగే ఆయన పీసీసీ అధ్యక్ష పగ్గాలు చేపట్టనున్నారనే కబుర్లు కూడా మీడియాలో షికార్లు చేశాయి. అయితే ఆ ఊహాగానాలన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ  నల్లారి కషాయి కండువా కప్పు కున్నారు. కాగా  నల్లారి  చేరికతో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ మరింత మెరుగుపడుతుందని ప్రహ్లాద్ జోషి ఆశాభావం వ్యక్తపరిచారు.  అలాగే కిరణ్ కుమార రెడ్డి 1952నుంచి తమ కుటుంబం కాంగ్రెస్ పార్టీలో ఉందని  అసలు తాను కాంగ్రెస్ ను వీడతానని ఎప్పుడూ అనుకోలేదని  చెప్పారు. కాంగ్రెస్ హైకమాండ్ తప్పుడు నిర్ణయాల వల్ల ఒక్కో రాష్ట్రంలో అధికారంలో కోల్పోయిందన్నారు.  దేశ నిర్మాణం, పేదరిక నిర్మూలనకు బీజేపీ  చేస్తున్న కృషి నచ్చడంతోనే ఆ పార్టీలో చేరినట్లు కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. బీజేపీలో చేరిన అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రహోంమంత్రి అమిత్‌షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పార్టీ కార్యకర్తల అమోఘమైన కృషి వల్లే బీజేపీ బలీయమైన శక్తిగా ఎదిగిందని చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో అలాంటి పరిస్థితి లేదన్నారు.  అక్కడ పార్టీ పటిష్ఠత, కార్యాచరణపై నాయకులతో కనీస చర్చ కూడా ఉండదని కిరణ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు.  తప్పనిసరి పరిస్థితుల్లోనే కాంగ్రెస్‌తో తమ కుటుంబానికి ఉన్న ఆరు దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకున్నట్లు చెప్పారు. అయితే కేంద్ర మంత్రి ప్రహ్లాద జోషీ ఆశించిన విధంగా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ఆఖరి ముఖ్యమంత్రి కిరణ్  కుమార్ రెడ్డి రాకతో ఉభయ తెలుగు రాష్ట్రాలలో బీజేపీ నిజంగా బలపడుతుందా? కమలం వికశిస్తుందా అంటే లేదు. ఆంధ్ర ప్రదేశ్ లో ఎవరొచ్చినా, ఏమి చేసినా బీజేపీ పుంజుకునే అవకాశం లేదు. తెలంగాణలో  కిరణ్ రెడ్డి ఎంట్రీ వలన ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ ఉంటుందని పరిశీలకులు అంటున్నారు.

వైసీపీ ముక్త ఏపీ కోసమే ఆ కలయిక: రఘురామ రాజు

వైసీపీ ముక్త ఏపీ లక్ష్యంగా ఆ మూడు  పార్టీలు కలిసి పని చేయడం ఖాయమని ఆ పార్టీ రెబల్ ఎంపీ రామకృష్ణంరాజు అన్నారు. రచ్చబండలో భాగంగా మీడియాతో మాట్లాడిన ఆయన జనసేనానిని పవన్ కల్యాణ్ పొత్తులపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎట్టి పరిస్థితుల్లోనూ చీల నివ్వను అని చెప్పడం కంటే ఇంకేం చెప్పాలని ప్రశ్నించారు.   పవన్ కళ్యాణ్ ఢిల్లీ లో బిజెపి పెద్దలతో జరిగిన సమావేశం లో ఏమి మాట్లాడారో నన్న టెన్షన్ జనసేన, తెలుగుదేశం శ్రేణులలో కంటే వైసీపీ నాయకత్వంలోనే ఎక్కువగా కనిపించిందన్న రఘురామ రాజు.. అది చాలదా జగన్ పార్టీలో ఓటమి భయం ఎంతగా గూడుకట్టుకుందో తెలియడానికి అని ప్రశ్నించారు.  టిడిపి తో పొత్తు గురించి బిజెపి పెద్దలతో మాట్లాడారా? అన్న మీడియా ప్రశ్నకు రాజకీయాలంటే అన్నీ మాట్లడుకుంటాంగా అన్న సమాధానం తరువాత కూడా పొత్తులపై అనుమానాలు వ్యక్తం చేసేవారు బుద్ధిహీనులూ ఔతారని రఘురామ అన్నారు.   ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి 40% ఓటు బ్యాంకు గతంలోనే ఉన్నది.  సరైన సమయం లో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ నాయకత్వం కూడా రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం స్పందిస్తుంది. జనాల సంక్షేమమే ముఖ్యం కానీ జగన్ సంక్షేమం కాదన్న విషయం ఆ పార్టీ నాయకత్వానికి కూడా తెలుసునని, అందుకే  వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో టిడిపి, జనసేన, బిజెపిలు కలిసి పోటీ చేస్తాయని బిజెపి పెద్దలు మురళీధరన్, శివ ప్రకాష్ జి , నడ్డాలతో నాదెండ్ల మనోహర్ , పవన్ కళ్యాణ్ భేటీ అనంతరం ప్రగాఢ విశ్వాసంతో , రెట్టించిన ఉత్సాహంతో చెబుతున్నానని రఘురామకృష్ణంరాజు తెలిపారు.  రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో టిడిపి, జనసేన లతో బిజెపి కలయికపై ఎటువంటి సందేహాలను పెట్టుకోవలసిన అవసరం లేదని   తెలిపారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కుటుంబ సమేతంగా కలిసే అవకాశం టిడిపి రాజ్యసభ సభ్యుడు కనకమెడల రవీందర్ కుమార్ కు లభించింది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అధ్వాన శాంతి భద్రతల పరిస్థితులను రవీంద్ర కుమార్ ప్రధానమంత్రి దృష్టికి తీసుకువెళ్లి, రాష్ట్రాన్ని కాపాడ వలసిందిగా కోరారు. దానికి ప్రధానమంత్రి స్పందిస్తూ ,అవును…ఆంధ్ర ప్రదేశ్ పరిస్థితి పంజాబ్ మాదిరి గానే ఉన్నదని వ్యాఖ్యానించడం ద్వారా రవీందర్ కుమార్ వాదనలతో ఆయన ఏకీభవించినట్లయిందన్నారు.   టిడిపి, జనసేన, బిజెపి కలిస్తే మాడు పగులుతుందని, బాక్స్ బద్దలవుతుందని, కొంప కొల్లేరవుతుందన్న ఆందోళనలో వైసీపీ అగ్రనాయకత్వం ఉందని అన్నారు.   

నల్లారి చేరిక.. బీజేపీకి లాభమేనా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ కీలక ఘట్టం. మాజీ ముఖ్యమంత్రి, సమైక్యాంధ్ర చివరి సీఎం అయిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరడం. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా చేసిన కిరణ్ కుమార్ రెడ్డి.. 2004-09 మధ్య అసెంబ్లీలో ప్రభుత్వ చీఫ్ విప్ పనిచేశారు. ఆ తర్వాత 2009- 10లో  ఉమ్మడి ఏపీలో అసెంబ్లీ  స్పీకర్ గా  ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2010-2014 మధ్య ఆంధ్రప్రదేశ్ 16వ ముఖ్యమంత్రిగా పని చేశారు.  ఆ సమయంలో... రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ.. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి సమైక్యాంధ్ర పార్టీ పేరుతో కొత్త పార్టీ పెట్టి.. ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత తిరిగి కాంగ్రెస్ లో చేరారు. 2014 తర్వాత యాక్టివ్ పాలిటిక్స్ కు  దూరంగా ఉంటూ వచ్చిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. మళ్లీ ఇప్పుడు యాక్టివ్ అయ్యారు. కొన్ని రోజుల కిందట కాంగ్రెస్ కు మళ్లీ  గుడ్ బై చెప్పిన ఆయన.. ఇప్పుడు బీజేపీలో చేరారు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి జనాదరణ దాదాపుగా శూన్యం. కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరడం వల్ల ఇప్పుడు ఆ పార్టీకి కొత్తగా ఒరిగేది ఏమీ లేదు.. ఉనికే లేని పార్టీలో కిరణ్ కుమార్ రెడ్డి చేరిక వల్ల ఎవరికీ ఏ విధంగానైనా లాభం లేదు.  ఆయనకు రెండు రాష్ట్రాలో కూడా ఎలాంటి క్యాడర్ లేదు. చాలా కాలంగా పాలిటిక్స్ కు దూరంగా ఉండటంతో ఆయనకు ప్రత్యేక వర్గం అంటూ లేదు. త్వరలో ఎన్నికలొస్తున్నాయి.. అందుకు ఏదో ఒక రాజకీయ పార్టీలో ఉండటం బెటర్ అని భావించి చేరితే.. అది వేరే విషయం..కానీ ఆయన చేరిక వల్ల బీజేపీకి ఒరిగేది మాత్రం ఏం లేదంటున్నారు పరిశీలకులు?

విడదల రజని మెరుపులు.. మరకలు

ఏ రోటి దగ్గర ఆ పాటే పాడాలి... అదీ ఏ పాట అయినా సరే...  ఏ ఎండకు ఆ గొడుగు పట్టాలి... అది ఏ రంగు గొడుగు అయినా సరే.. అలా అయితేనే రాజకీయం చేయగలం.. అలా అయితేనే.. ఇలా పార్టీ మారి... అలా ఎమ్మెల్యే టికెట్ చేజిక్కించుకోవడం కోసం అప్పటి వరకు సంవత్సరాలకు సంవత్సరాలుగా... క్యూలో నిలబడి వేచి చూస్తున్న వారిని సైతం వెనక్కి నెట్టి మరీ ఎమ్మెల్యే టికెట్.. అదీ కూడా పైసా ఖర్చు లేకుండా సంపాదించేయవచ్చు. అలా దశ మహా విద్యలను మించిన ఆ మహిమాన్విత విద్య తెలిస్తే... రాజకీయాల్లో రాణించవచ్చని... అందులో కూడా ఎక్కడ అడ్డు అదుపూ.. ఆపూ లేకుండా దూసుకుపోవచ్చు అనేందుకు తాజా ఉదాహరణ చిలకలూరిపేట ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినీ అని సోషల్ మీడియా సాక్షిగా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చిలకలూరిపేటలో ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి  జగన్ గురువారం (ఏప్రిల్ 6) ప్రారంభించారు. ఈ సందర్భంగా బీసీ మహిళనైన తనకు రాజకీయ భిక్ష పెట్టిన సీఎం జగన్‌కు జీవితాంతం రుణ పడి ఉంటానంటూ విడదల రజినీ భావోద్వేగంతో చేసిన వ్యాఖ్యలతో పాటు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుపై ఆమె సంధించిన వ్యంగ్యస్త్రాలను సైతం నెటిజన్లు తమ దైన శైలిలో విశ్లేషిస్తున్నారు.  అయితే జై జగనన్న.. జై జై జగనన్న.. మన చిలకలూరిపేటలో మనమంతా..జగనన్నా అని పిలిస్తే.. ఎక్కడో ఉన్న చంద్రబాబు ఉలిక్కిపడాలా.. అంటూ విడదల రజినీ చేసిన వ్యాఖ్యలు.. ఏదో సినిమా డైలాగ్‌ను కాపీ కొట్టినట్లుగా ఉందని వారు ఈ సందర్బంగా గుర్తు చేస్తున్నారు.  అదీకాక.. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటమి తప్పదని.. జగనన్న గెలుపు తథ్యమని ఆమె చెప్పిన జోస్యం పట్ల నెటిజన్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.   అయితే ఓ సారి గతాన్ని గుర్తు చేసుకోవాలని మంత్రి విడదల రజినీకి సోషల్ మీడియా ద్వారా నెటిజన్లు సూచిస్తున్నారు. 2014 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు తెలుగుదేశం పార్టీ  విజయం కోసం... సోషల్ మీడియాలో పని చేసేందుకు అమెరికా నుంచి వచ్చిన అతికొద్ది మందిలో   విడదల రజినీ ఒకరని వారు వివరిస్తున్నారు. ఆ క్రమంలోనే... అంటే 2017లో విశాఖపట్నంలో జరిగిన మహానాడు వేదికపై నుంచి విడదల రజినీ మాట్లాడుతూ.. నేను మీరు నాటిన మొక్క సార్..  సైబరాబాద్‌ మొక్క సార్ అంటూ చంద్రబాబు ఎదుటే మాట్లాడిన రజనీ..  అప్పట్లో నరకాసురులు ఎలా ఉంటారని ఎవరైనా అడిగితే.. ప్రతిపక్ష   జగన్,  ఆయన తండ్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిలాగా ఉంటారని ఉదాహరణగా చూపించాలంటూ.. మైక్ అదిరేపోయేలా చెప్పిన సంగతిని వారీ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.  అయితే ఆ తర్వాత టీడీపీ నుంచి చిలకలూరిపేట ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించడం.. ఆ ప్రయత్నాలు విఫలం కావడంతో చేసేది లేక.. 2018లో జగన్ పార్టీలోకి ఆమె ఇలా జంప్ కొట్టి.... అలా అసెంబ్లీ టికెట్ తీసుకొని.. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవడమే కాదు.. జగన్ మలి కెబినెట్‌లో అత్యంత కీలక శాఖల్లో ఒకటైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారని... అలాగే రాష్ట్రంలోనే అతి ముఖ్యమైన జిల్లా విశాఖపట్నం అని.... ఆ జిల్లాకే ఇన్‌చార్జ్ మంత్రిగా ఆమె కొనసాగుతున్నారని వారు వివరిస్తున్నారు.   ఇదే విడదల రజినీ... నాడు మహానాడు వేదికగా చంద్రబాబు సమక్షంలో అలా మాట్లాడితే.. నేడు జగన్న సభలో ఇలా మాట్లాడారంటూ.. నెటిజన్లు ఈ సందర్భంగా వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తున్నారు. అదీకాక ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో.. ఫ్యాన్ పార్టీ అభ్యర్థులు గెలుపొందాలని.. లేని పక్షంలో కేబినెట్‌లో మార్పులు చేర్పులు తప్పవంటూ ఇటీవల జరిగిన కెబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి  జగన్ క్లియర్ కట్‌గా స్పష్టం చేశారనే కథనాలు అయితే మీడియాలో హల్‌చల్ చేశాయి. అలాంటి వేళ.. రేపో మాపో జగన్ కేబినెట్‌ను మూడో సారి విస్తరించే అవకాశాలు ఉన్నాయని.... ఈ నేపథ్యంలో పార్టీ అధినేత  జగన్ ముందరి కాళ్లకు బంధం వేసేలా మంత్రి విడదల రజనీ మాటలు మంత్రించి వదిలారని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. అదీకాక 2019 ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యేగా విడదల రజినీని గెలిపిస్తే.. చిలకలూరిపేట నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జ్ మర్రి రాజశేఖర్‌ను ఎమ్మెల్సీగా గెలిపించి.. తన కేబినెట్‌లో మంత్రిని చేస్తానంటూ ప్రతిపక్ష నేతగా  జగన్ ప్రకటించారని.. అయితే ఆ ఎన్నికల్లో విడదల రజినీ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కూడా అయ్యారనీ, అయితే  మర్రి రాజశేఖర్‌కు నిన్న మొన్నటి వరకు ఎటువంటి పదవి  దక్కలేదు  కానీ ఇటీవల ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మర్రి రాజశేఖర్‌ ఎమ్మెల్సీగా గెలుపొందారని..  మరోవైపు  మర్రి రాజశేఖర్‌ సామాజిక వర్గానికి చెందిన వారు..  జగన్ మలి కెబినెట్‌లో ఒక్కరు కూడా లేరని.. ఈ నేపథ్యంలో ఒకే నియోజకవర్గంలో ఇద్దరికి కెబినెట్‌లో చోటు ఉండదు కాబట్టి.. మంత్రి పదవి నుంచి రజినీని తప్పించి... ఆ స్థానంలో మర్రి రాజశేఖర్‌ను తీసుకొనే అవకాశం అయితే ఉందనే ఓ చర్చ అయితే ప్రస్తుతం  నెట్టింట జోరుగా సాగుతోంది. మరోవైపు ఇదే చిలకలూరిపేట  నియోజకవర్గంలో అక్రమ తవ్వకాలకు సంబంధించి హైకోర్టు జారీ చేసిన నోటీసులు..  జగన్ సోదరుడు కడప ఎంపీ  అవినాష్ రెడ్డి బంధువులతోపాటు మంత్రి విడదల రజినీ కూడా అందుకోన్నారని వారు ఈ సందర్బంగా గుర్తు చేస్తున్నారు.  ఏదీ ఏమైనా ఎటువంటి అండ.. దండా..  హంగు.. ఆర్భాటం లేకుండా.. చాలా సింపుల్‌గా 2014లో టీడీపీ గెలుపు కోసం పని చేసి.. ఆ తర్వాత జగన్ పార్టీలోకి జంప్ కొట్టి... ఎమ్మెల్యేగా గెలుపొంది.. మంత్రి పదవి అందుకోవడం అంటే చాలా ప్రతిభ పాటవాలు ఉండాలని.. ఇంకా క్లియర్ కట్‌గా చెప్పాలంటే.. మహానటి అవతారం ఎత్తాలని అలా అయితేనే రాజకీయాల్లో రాణింపు ఉంటుందని స్పష్టమవుతోందని సోషల్ మీడియా సాక్షిగా నెటిజన్లు సెటైరికల్‌గా కామెంట్ చేస్తున్నారు.

బాధ్యత లేని సలహా.. ఆలోచన లేని ఆచరణ

సలహాలు ఇచ్చే వారు బాధ్యతగా ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఆ సలహాలను పాటించి నిర్ణయాలు తీసుకునే ముఖ్యమంత్రి బాధ్యతగా లేకపోతే.. ప్రజలకు అష్టకష్టాలే. వారి వ్యతిరేకతా, ఆగ్రహం అన్నీ కూడా నేరుగా నిర్ణయాలు అమలు చేసే ప్రభుత్వం మీదకే వెళతాయి కానీ.. బాధ్యత లేని సలహాల మూటలు విప్పే వారిపై కాదు. ఇప్పుడు కొత్తగా వైసీపీ సర్కార్ ఆరంభించిన జగనన్నే మన భవిష్యత్ కార్యక్రమం కూడా అలాంటిదే. ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ కార్యక్రమ రూపశిల్పి అంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించి.. వచ్చే ఎన్నికలలో గెలుపు మంత్రంగా ఎంచి మరీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. అంతటి కీలకమైన ముఖ్యమైన కార్యక్రమానికి సంబంధించి ముఖ్యమంత్రి కాకుండా, ప్రభుత్వ ముఖ్య సలహాదారు మీడియా ముందుకు వచ్చి వివరించడంలోనే ఈ కార్యక్రమం ఎవరి బ్రెయిన్ చైల్డ్ అన్నది అర్ధమైపోతోంది. అసలింతకీ ఈ పథకం ఏమిటి? ప్రజలకు ఎలాంటి భరోసా ఇస్తుంది. జగనన్నే మా భవిష్యత్ అంటూ జనంలోకి వెళ్లడానికీ, గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమానికీ తేడా ఏమిటి? గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ వెళ్లిన ఎమ్మెల్యేలు, మంత్రులకు గడపగడపలోనూ పరాభవం ఎదురైంది. మరి ఇప్పుడు జగనన్నే మా భవిష్యత్ అంటూ జనం ముందుకు ఎవరు వెళతారు? వారిని జనం ఎందుకు స్వాగతిస్తారు అంటే.. ఎవరి వద్దా సమాధానం లేదు. కానీ దబాయింపు సెక్షన్ అని ఒకటి ఉంది. గత నాలుగేళ్ల జగన్ పాలనలో పకడ్బందీగా అమలు అవుతున్న సెక్షన్ ఇది ఒక్కటి మాత్రమేనని పరిశీలకులు అంటున్నారు. జగనన్నే మన భవిష్యత్ కార్యక్రమం ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడమే తప్ప మరొకటి కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటి వరకూ అధికారులతో గడపగడపకూ వెళ్లిన ప్రజాప్రతినిథులు ఇక నుంచీ వలంటీర్లు, గృహసారథులు, సచివాలయ కన్వీనర్లు వెడతారు. వీరంతా జగన్ గొప్పగా చెప్పుకుంటున్న సంక్షేమ పథకాల లబ్ధి దారులు ఎవరు ఉండాలి, ఎవరికి కొనసాగించాలి, ఎవరికి రద్దు చేయాలి అన్నది నిర్ణయించే వారు. వారి పని అదేనని జనం నమ్ముతున్నారు. వీరు ఇంటింటికీ తిరిగి మీకు అందుతున్న పథకాలు ఇవీ, దాని వల్ల నగదు రూపేనా మీరు తీసుకుంటున్న లబ్ధి ఇది అని వివరించి, జగనన్నే మీ భవిష్యత్ అని అంగీకరించకుంటే ఇవేవీ అందవు అని ఒక విధంగా వారిని బెదరిస్తారన్న మాట. అక్కడితో అది అయిపోలేదు. గతంలో తెలుగుదేశం పార్టీ పాలన, ప్రస్తుత జగన్ పాలన గురించి అధికార పక్షం వెర్షన్ తో ఒక కరపత్రం ఉంటుంది. ఇక తరువాత జగనన్నే మా భవిష్యత్ అని వారి చేత ఒప్పించి.. ఆ వచ్చిన వాళ్లు ఒక ఫోన్ నంబర్ కు మిస్డ్ కాల్ చేయిస్తారు. అంతే అలా మిస్డ్ కాల్ చేసిన వారంతా జగనన్నే మా భవిష్యత్ అని భావిస్తున్న వారైపోతారు.   అప్పుడు వారికి జగన్ సందేశం వినిపిస్తుంది. ఆ తరువాత ఇంటికి స్టిక్టర్ అతికించేస్తారు. అంటే ఆ ఇంట్లో ఓట్లన్నీ జగన్ పార్టీకే అని కన్ ఫర్మ్ చేసేసుకుంటారు.  ఈ తంతంతా ఇందుకు ఇష్టపడితేనే జరుగుతుందని ఘనత వహించిన సలహాదారు చెబుతున్నా.. అలా ఇంటి మీదకు వచ్చి మేం చేస్తున్న ఘనమైన సంక్షేమాన్ని అంగీకరించి, మిస్ట్ కాల్ చేయండి అంటే నో అనే ధైర్యం ఎవరైనా చేస్తారా అన్న సందేహాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. భయంతో అంగీకరించినా ఓట్లు వేసే టైమ్ కు జనం వారి నిర్ణయం మేరకే.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో జగన్ ను భయపెట్టిన ఆత్మ ప్రబోధానుసారమే నిర్ణయం తీసుకుని అమలు చేస్తారని పరిశీలకులు అంటున్నారు.   

నగదు ఊసే లేని రాముడి బ్యాంకు.. రామ్ రమాపతి బ్యాంక్

పుణ్యం బ్యాంకులో దాచుకున్న సొమ్ము లాంటిది.. కష్టం వచ్చినప్పుడు ఆ పుణ్యమే కాపాడుతుంది అని పెద్దలు సుద్దులు చెబుతుంటారు. కానీ నిజంగానే పుణ్యాన్ని దాచుకునేందుకు ఒక బ్యాంకు ఉంది. మీకు తెలుసా. ఇదేమీ అభూత కల్పన కాదు. నిజ్జంగా నిజం. ఉత్తర ప్రదేశ్ లోని ఓ బ్యాంకు మీ పుణ్యాన్ని డిపాజిట్ గా స్వీకరిస్తుంది. ఆ బ్యాంకు పేరు రామ్ రమాపతి బ్యాంకు. రామకోటి రాస్తే వేయి జన్మల పుణ్యం లభిస్తుందంటారు. రామనామాలు రాస్తే సకల సంపదలూ సిద్ధిస్తాయంటారు. రామ కోటి రాస్తే పుణ్య లోకాలు సంప్రాప్తిస్తాయంటారు. అంటే రామనామ రచన పుణ్యం అన్నమాట. అలా రాసిన రామనామాలను ఓ బ్యాంకు డిపాజిట్ గా స్వీకరిస్తోంది. అంటే పుణ్యాన్ని డిపాజిట్ చేసుకునే అవకాశం కల్పిస్తోందన్న మాట. ఉత్తర ప్రదేశ్ లోని వారణాసిలో రామ్ రమాపతి బ్యాంకు.. కార్యకలాపాలు పూర్తిగా రామ నామాలను డిపాజిట్ గా స్వీకరించడానికే పరిమితం. అంటే ఈ బ్యాంకుకు సొమ్ములతో సంబంధం లేదు. కేవలం మానవుడిలోని ఆధ్మాత్మిక భావనతోనే సంబంధం. అందుకే రామ్ రమాపతి బ్యాంక్ ఆధ్మాత్మిక బ్యాంకుగా ప్రసిద్ధం పొందింది. ఆ బ్యాంకులో ‘శ్రీరామ నామాలను’డిపాజిట్ చేసుకుంటారు. రామకొటి  రాసి వాటిని ఏ దేవాలయంలోనే సమర్పిస్తారు భక్తులు. కానీ వారణాశిలోని రామ్‌ రమాపతి బ్యాంక్‌ మాత్రం ఆ కోటి రామనామాలను డిపాజిట్ గా స్వీకరిస్తుంది.  అయితూ అలా డిపాజిట్ గా రామనామాలను జమ చేసుకోవడానికి కొన్ని కండీషన్స్ ఉన్నాయి. రామ కోటిని భక్తి శ్రద్ధలతో రాయాలి. అలా రాయడానికి ఆ బ్యాంకు వారే ఓ పెన్ను ఇస్తారు.  ఆ పెన్ను మామూలు పెన్ను కాదు..   ఓ ప్రత్యేకమైన చెట్టుతో తయారు చేసిన పెన్ను.  ఇక ఈ బ్యాంకు ఇప్పటి వరకూ  1,942.34 కోట్ల రామ నామాలను డిపాజిట్ గా స్వీకరించింది.  గత తొమ్మిదిన్నర దశాబ్దాలకు పైగా ఈ బ్యాంకును  మెహ్రోత్రా కుటుంబం గత     ఈ బ్యాంకులో దివంగత ప్రధాని లాలా బహదూర్ శాస్త్రి తల్లి రామనామాలు డిపాజిట్ చేశారు. డిపాజిట్ తీసుకున్నారని తెలిపారు.   ఉల్లి, వెల్లుల్లి వేసిన ఆహారంతోపాటు బయట తయారు చేసిన ఎటువంటి ఆహారం తినకూడదనే నియమం ఉంది. మాంసాహారం అస్సులు ముట్టుకూడదు. ఇలా నియమ నిబంధనలు పాటించి రామనామం రుణం తీర్చుకుంటే భక్తులు కోరిన కోరికలు నెరవేరతాయని భక్తుల నమ్మతారు. ఈ బ్యాంకకు భారతీయులే కాక కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్‌, జపాన్‌ దేశాల నుంచి కూడా వచ్చి ఖాతాలు తెరుస్తున్నారు. రామనామాలు రాసే సమయంలో సదరు భక్తులు ఆహార నియమాలనూ పాటించాలి. వెల్లుల్లి, ఉల్లిని పూర్తిగా దూరం ఉంచాలి. మాంసాహారమూ నిషేధమే. అంతేనా.. ఇక్కడ ఖాతా తెరిచిన తరువాత 8 నెలల పది రోజులలో రామనామాలు రాయడం పూర్తి చేసి బ్యాంకుకు డిపాజిట్ చేయాలి. బ్యాంకు వారు ఇచ్చిన పెన్నుతోనే రామనామాలు రాయాలి. అలాగే బ్రహ్మముహూర్తంలోనే రామనామ రచన చేయాలి. అంటే ఉదయం నాలుగు గంటలకు మొదలు పెట్టి 7 గంటల వరకూ రాయాలి. అదీ బ్యాంకు వారు ఇచ్చిన రెడ్ ఇంక్ తోనే రాయాలి.  ఒక్కో ఖాతాదారుడూ   లక్షా 25 వేల రామ నామాలు రాసి   బ్యాంకులో జమ చేయాలి. అవి సదరు వ్యక్తి ఖాతాలో జయ చేయబడతాయి. ఇలా నిబంధనలు పాటించి భక్తి శ్రద్ధలతో రామనామాలు రాసి బ్యాంకులో జమ చేస్తే కోరిన కోరికలు నెరవేరతాయని భక్తుల నమ్మకం. ఈ బ్యాంకకు భారతీయులే కాదు కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్‌, జపాన్‌ దేశాల నుంచి కూడా భక్తులు వచ్చి ఖాతాలు తెరుస్తున్నారు.

పేపర్ లీక్ కు, మాల్ ప్రాక్టీస్ కు తేడా లెలీదా?

టెన్త్ పరీక్షా పత్రం లీకేజీ కేసులో అరెస్టయిన బండి సంజయ్ శుక్రవారం (ఏప్రిల్ 7) బెయిలుపై విడుదలయ్యారు. ఆయనకు కోర్టు గురువారం (ఏప్రిల్6) బెయిలు మంజూరు చేసిన సంగతి తెలిసిందే.  జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ సర్కార్ పై మండిపడ్డారు. అలాగే తన అరెస్టు విషయంలో మీడియాకు అవాస్తవాలు చెప్పారంటూ సీపీ రంగనాథ్ పై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.   సీపీకీ ప్రశ్నపత్రం లీక్ కు, మాల్ ప్రాక్టీస్ కు కూడా తేడా తెలియదని దుయ్యబట్టారు. ఇక తన మీడియా సమావేశంలో బండి సంజయ్  ప్రధానంగా మూడు డిమాండ్లను సర్కార్ ముందు ఉంచారు.  కేటీఆర్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలని,  టీఎస్పీఎస్సీ పేపర్ల  లీక్ కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలనీ,  ఆ పేపర్ల లీకేజీ వ్యవహారం వల్ల నష్టపోయిన  యువతకు ఒక్కొక్కరికి రూ.లక్ష భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.  ఇక బండి సంజయ్ తన అరెస్టుపై వరంగల్ సీపీ చెప్పిన విషయాలన్నీ వాస్తవమేనని   పోలీసు టోపీపై ఉండే మూడు సింహాలపై ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. పేపర్ల లీక్ తో తనకు సంబంధం లేదని తాను ప్రమాణం చేయడానికి సిద్ధమేనన్నారు. అయినా టెన్త్ హిందీ పేపర్ ఎవరైనా లీక్ చేస్తారా అని ప్రశ్రించారు.  తెలుగు పేపర్ ను ఎవరు లీక్ చేశారో చెప్పాలన్నారు.  అలాగే కేసీఆర్ కుటుంబంపై కూడా విమర్శలు గుప్పించారు. అసలు కేసీఆర్ కుటుంబమే లిక్కర్, లీకర్ల కుటుంబమని దుయ్యబట్టారు.  ప్రశ్నాపత్రాన్ని వాట్సాప్ లో ఎవరో ఫార్వార్డ్ చేస్తే తనకేం సంబంధం అన్నారు. టెన్త్ పేపర్ లీక్‌పై కూడా సిట్టింగ్ జడ్జితో విచారణ చేసే దమ్ముందా అని ప్రభుత్వానికి బండి సవాల్ విసిరారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కేటీఆర్ ను బర్తరఫ్ చేసే దాకా ఊరుకునేది లేదన్నారు. వరంగల్ గడ్డపై భారీ ర్యాలీ, సభ నిర్వహిస్తామన్నారు. సింగరేణిలో 51శాతం వాటా ప్రభుత్వానిదని, ప్రైవేటీకరణ చేసే హక్కు కేంద్రానికి ఎక్కడిదన్నారు. 

హైదరాబాద్ కు మోడీ.. కేసీఆర్ మళ్లీ మొహం చాటేస్తారా?

ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ( ఏప్రిల్ 8) తెలంగాణ పర్యటనకు రానున్నారు.  సికిందరాబాద్ రైల్వే స్టేషన్ లో సికిందరాబాద్, తిరుపతి వందేభారత్ రైలును ప్రారంభించనున్నారు.  తరువాత మధ్యాహ్నం 12.15 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ కు చేరుకోనున్నారు. ఇది ప్రధాని అధికారిక పర్యటన కావడంతో  తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఆహ్వానం పంపారు. అలాగే పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే సభలో మధ్యాహ్నం 12.30 నుంచి 12.37  వరకు ఏడు నిముషాల సమయాన్ని కేసీఆర్ ప్రసంగానికి కేటాయించారు.  అనంతరం అరగంట సేపు మోడీ ప్రసంగిస్తారు. కార్యక్రమం షెడ్యూలు బానే ఉంది. అసలీ కార్యక్మానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరౌతారా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.  ఎందుకంటే గతంలో ప్రధాని మోదీ హైదరాబాద్ వచ్చినప్పుడు కేసీఆర్ స్వాగతం చెప్పలేదు. అలా ఒక సారి కాదు రెండు మూడు సార్లు జరిగింది.  గతంలో సరిగ్గా ప్రధాని రాష్ట్ర పర్యటన సమయంలో కేసీఆర్ పనిగట్టుకుని మరీ దేశ వ్యాప్త పర్యటన పెట్టుకున్నారు. అప్పట్లో ఆయన మోడీ రాష్ట్ర పర్యటన పూర్తికాగానే.. కేసీఆర్ తన దేశ వ్యాప్త పర్యటన షెడ్యూల్ ను కుదించుకుని మరీ స్వరాష్ట్రానికి తిరిగి వచ్చేశారు.   ప్రొటో కాల్ ప్రకారం ప్రధాని అధికారిక పర్యటలో రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరుకావాల్సి ఉంటుంది.  కేసీఆర్ గత మోడీ రాష్ట్ర పర్యటన సందర్భంగా ప్రొటోకాల్ ను పట్టించుకోలేదు.  హైదరాబాద్ లో ఇండియన్  స్కూల్ ఆఫ్ బిజినెస్ లో జరిగే ఒక కార్యక్రమంలో అప్పట్లో మోడీ పాల్లొన్నారు.  ప్రొటో కాల్ ప్రకారం కేసీఆర్ కూడా ఆ కార్యక్రమానికి హాజరు కావాలి.  అయినా కేసీఆర్ డుమ్మా కొట్టారు.  హైదరాబాద్ లో సమతా మూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రధాని మోడీ వచ్చినప్పుడూ కేసీఆర్ ఆ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. అదే విధంగా మోడీ  ఇక్రిశాట్ లో పాల్గొన్న కార్యక్రమానికీ కేసీఆర్  డుమ్మా కొట్టారు. మొత్తం మీద కేంద్రం, తెరాస మధ్య సంబంధాలు దెబ్బతిన్నప్పటి నుంచీ కేసీఆర్ మోడీకి ఎదురు పడటానికి ఇసుమంతైనా సుముఖత చూపడం లేదు.   మొత్తం మీద ఉద్దేశ పూర్వకంగానే కేసీఆర్ మోడీకి ఎదురుపడకుండా అవాయిడ్ చేస్తున్నారని పరిశీలకులు విశ్లేషించారు.  ఇక ఇప్పడు శనివారం (ఏప్రిల్8) కూడా కేసీఆర్ మోడీకి ఎదురు పడే అవకాశాలు ఇసుమంతైనా లేవనే అంటున్నారు. మోడీ పర్యటన షెడ్యూల్ లో కేసీఆర్ హాజరౌతున్నట్లుగా ఉన్నప్పటికీ, ఆయనకు ఆహ్వానం పంపినప్పటికీ కేసీఆర్ డుమ్మా కొట్టే అవకాశాలే మెండుగా ఉన్నాయని చెబుతున్నారు. టెన్త్ ప్రశ్నా పత్రాల లీకేజీ కేసులో బండి సంజయ్ అరెస్టుతో బీఆర్ఎస్, బీజేపీల మద్య మరోసారి పెచ్చరిల్లిన ఉద్రిక్తతలు, అలాగే బెయిలుపై బండి విడుదలైన సందర్భంగా ఆయన కేటీఆర్, కవితల అరెస్టు తధ్యం అంటూ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేసీఆర్ మోడీ సభలో ప్రసంగించే అవకాశాలు దాదాపు మృగ్యమని అంటున్నారు. అలా కాకుండా ఒక వేళ ప్రొటో కాల్ ను పాటించి కేసీఆర్ మోడీ పర్యటనలో కనిపిస్తే మాత్రం కచ్చితంగా ఆది రాజకీయంగా సంచలనమే ఔతుందని పరిశీలకులు చెబుతున్నారు.   అయితే ఏ విధంగా చూసినా అలాంటి సంచలనాలకు అవకాశం లేదన్న అభిప్రాయమే సర్వత్రా వ్యక్తమౌతోంది. అయితే కేసీఆర్ మోడీ సభకు హాజరైనా కాకపోయినా మాత్రం విమర్శలను ఎదుర్కొన వలసి వస్తుందని అంటున్నారు.  కేసీఆర్ హాజరు కాకపోతే.. ప్రొటో కాల్  ఉల్లంఘించారని బీజేపీ విమర్శిస్తుంది.   హాజరైతే..  బీజేపీతో కుమ్మక్కైపోయారు, బీఆర్ఎస్ బీజేపీ బీ టీమ్ అంటూ తాము మొదటి నుంచీ చెబుతూనే ఉన్నామని కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తుంది. అంతే కాకుండా కేసీఆర్ మోడీ పర్యటనలో పాల్గొంటే.. జాతీయ స్థాయిలో పలుచన అయ్యే అవకాశాలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఏం చేస్తారన్న ఉత్కంఠ మాత్రం రాజకీయ సర్కిల్స్ లో నెలకొని ఉంది.  

హ్యాట్సాఫ్ మేడం కానిస్టేబుల్!

టెన్త్ పరీక్షా కేందంలోకి మొబైల్ ఫోన్ తో వెళుతున్న రాచకొండ సీపీని ఓ  మహిళా కానిస్టేబుల్ ఆపేసిన ఘటన   తోటి పోలీసు అధికారులనే కాదు, సామాన్య ప్రజలను సైతం దిగ్భ్రమాశ్చర్యాలకు గురి చేసింది. ఎల్‌బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్‌ కల్పన రాచకొండ కమీషనర్ ఆఫ్ పోలీస్  డీఎస్  చౌహాన్ కు ఎస్ఎస్ సీ పరీక్షా కేంద్రంలో అడుగు పెట్టకుండా నిలిపివేశారు. అందుకు కారణం ఆయన వద్ద మొబైల్ ఫోన్‌ ఉండటమే.  దీంతో సీపీయే కాకుండా అక్కడ ఉన్న పోలీసు అధికారులూ షాక్ అయ్యారు.   భద్రతా ఏర్పాట్లను పరిశీలించేందుకు చౌహాన్ టెన్త్  పరీక్షా కేంద్రాలను సందర్శిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.  మహిళ   కానిస్టేబుల్  చర్యను ఇతర పోలీసు అధికారులు దిగ్భ్రాంతితో చూస్తుండగా,  చౌహాన్ ఆమెను చూసి చిరునవ్వుతో మొబైల్ ఫోన్ ఇచ్చి, పరీక్ష కేంద్రంలోకి వెళ్లారు. అనంతరం చౌహాన్ ఆ మహిళా కానిస్టేబుల్‌ను అభినందించి, రూ. 500  నగదు బహుమతిని అందజేశారు.   పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండి నిజాయితీగా విధులు నిర్వహించాలని రాచకొండ సీపీ కోరారు. పరీక్షా కేంద్రంలోకి వచ్చే వ్యక్తులందరినీ క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, సెంటర్‌లోకి మొబైల్ ఫోన్‌లను అనుమతించవద్దని ఆయన పోలీసులను కోరారు. ప్రతి పోలీస్  ఇలానే తమ విధులను భయం, పక్షపాతం లేకుండా  క్రమశిక్షణతో నిర్వహిస్తే ఎంత బాగుండును అని జనం అంటున్నారు. ఏకంగా సీపీనే ఆపేసి మొబైల్ ఫోన్ తీసుకున్న తరువాత టెన్త్ పరీక్షా కేంద్రంలోనికి అనుమతించిన మహిళా కానిస్టేబుల్ కల్పనకు నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు. 

కర్నాటకలో బీఆర్ఎస్ పోటీ చేస్తుంది.. కానీ

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నిండా నెలరోజులు కుడా సమయం లేదు.  మే 10 పోలింగ్, మే 13 కౌంటింగ్ పూర్తవుతాయి. నిజానికి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను కేవలం ఆ రాష్ట్రానికే పరిమితమైన ఎన్నికలుగా చూసేందుకు లేదు. ఒక విధంగా 2024 సార్వత్రిక ఎన్నికల చిత్రానికి కర్ణాటక ఎన్నికలు ‘ట్రైలర్’ అనవచ్చునని పరిశీలకులు అంటున్నారు.  ఈ ఎన్నికలను బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. చావో రేవో అన్న రీతిలో తలపడేందుకు సిద్ధమయ్యాయి. నిజానికి ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి ముందు రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ మధ్య ముక్కోణపు పోటీ ఉంటుందని భావించినా, ఎన్నికల షెడ్యూలు విడుదలైన తర్వాత సమీకరణలు చకచకా మారిపోయాయి. బీజేపీ, కాంగ్రెస్ ఢీ అంటే ఢీ అంటున్న నేపథ్యంలో తృతీయ శక్తిగా చక్రం తిప్పే జేడీఎస్ కూడా చప్పబడినట్లు వార్తలొస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అయితే పూర్తి భరోసాతో ముందుకు సాగుతోంది. నిజానికి కాంగ్రెస్ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అందరికంటే ముందు సగానికి పైగా నియోజక వర్గాలకు అభ్యర్ధులను ప్రకటించింది. కొద్ది రోజుల క్రితం 124 మంది అభ్యర్ధులతో తొలి జాబితా విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ..  తాజాగా మరో 42 మందితో రెండో జాబితా ప్రకటించింది. దీంతో మొత్తం 224 స్తలకు గానూ, 166 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించింది.   అయితే మాజీ ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి రేసులో  నేను ఉన్నాను..నేను ఉన్నాను ..అని ఒకటికి రెండుసార్లు  బహిరంగంగా ప్రకటించుకున్న, సిద్ద్రరామయ్యకు ఆయన కోరుకున్నా కోలార్  నియోజక వర్గం టికెట్ దక్కలేదు.   కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాలోనే మాజీ సీఎం సిద్ధరామయ్యతో పాటు పీసీసీ అధ్యక్షుడు, మరో ముఖ్యమంత్రి పోటీదారు డీకే శివకుమార్ పోటీ చేసే నియోజకవర్గాల్ని ఖరారు చేసింది. ఈ క్రమంలో సిద్ధరామయ్యకు వరుణ సీటు కేటాయించింది. అయితే వరుణ కంటే కూడా కోలార్ లో ఈసారి పోటీ చేయాలని సిద్ధూ భావించారు. కానీ చివరి నిమిషంలో ఆయనకు షాక్ తప్పలేదు. ప్రస్తుతానికి అయితే ఆయన కూల్ గా ఉన్నా, ఆఖరి క్షణంలో ఏమి చేస్తారనేది చెప్పలేమని, పార్టీ కేటాయించిన వరుణ నియోజక వర్గంతో పాటు తాను కోరుకున్న కోలార్  నియోజక వర్గంలో  పోటీ చేసందుకు అంగీకరించక పోతే, సిద్దూ  పోటీ నుంచి పూర్తిగా తప్పుకుంటారని ఆయన అనుచరులు అంటున్నారు. అలాగే  సిద్దరామయ్య ను ముఖ్యమంత్రి రేసు నుంచి తప్పించేందుకే ఆయన్ని ఓడిపోయే నియోజక వర్గం నుంచి బరిలో దించుతున్నారా అనే అనుమానాలనూ వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సిద్దూ అసంతృప్తి వ్యక్త పరిచినా, అలక పూని ఎన్నికలకు దూరంగా ఉన్నా  కాంగ్రెస్ పార్టీకి కష్టమే అంటున్నారు. అలాగే  కర్ణాటక నుంచి జాతీయ రాజకీయ ప్రస్థానానికి శ్రీకారం చుట్టాలని భావించిన బీఆర్ఎస్ కూడా ఇంకా ఎటూ తేల్చుకోలేదని తెలుస్తోంది. పార్టీ పేరున పోటీ చేసి ఓడి పొతే, ఆ ప్రభావం ఇటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై, అటు లోక్ సభ ఎన్నికలపై కూడా ఉంటుందని  బీఆర్ఎస్ అధినేత కేసీఆర్  వెనకా ముందు అవుతున్నారని అంటున్నారు. అందుకే ఆయన ఫోకస్ మహారాష్ట్ర వైపు తిప్పారని, అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు గ్రౌండ్ సిద్ధం చేసుకుంటున్నారని అంటున్నారు.  అయితే  తెలంగాణ భవన్ లో మరో మాట కూడా వినిపిస్తోంది. బీఆర్ఎస్ ఎంపిక చేసిన నియోజక వర్గాల్లో బలమైన స్వతంత్ర అభ్యర్ధులను నిలబెట్టే ఆలోచనలో ఉన్నట్లు పార్టీ నేతల ‘లీకు’ ల ద్వారా తెలుస్తోంది. ఇందుకోసం బీఆర్ఎస్... నేతలు కొందరు  రాష్ట్ర సరిహద్దు నియోజక వర్గాలలో పర్యటించి అభ్యర్ధులను ఎంపిక చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ పార్టీలలోని టికెట్ రాని అసంతృప్తులను చేరే దీసి, గెలిచిన తర్వాత బీఆర్ఎస్ లో చేరే షరతుపై ఆర్థిక సహయం అందించే అలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే, కేసీఆర్ అంతిమంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చెప్పలేమని, బీఆర్ఎస్ నేతలు చెపుతున్నాయి.

బాబు సమక్షంలో తెలుగుదేశం గూటికి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి?!

గత ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ క్లీన్ స్వీప్ చేసిన జిల్లాల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లా ఒకటి.  జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలకు పది స్థానాల్లోనూ వైసీపీ విజయకేతనం ఎగురవేసింది. దీంతో నెల్లూరు పెద్దారెడ్లంతా జగన్ పార్టీ వైపే ఉన్నారని చెప్పకనే చెప్పినట్లు అయింది.  అయితే ఇటీవల చోటు చేసుకున్న వరుస పరిణామాల నేపథ్యంలో..  ఇంకా క్లియర్ కట్‌గా చెప్పాలంటే.. ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల అనంతరం అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డిలపై జగన్ పార్టీ సస్పెన్ష్ వేటు వేసింది. దీంతో ఆ జిల్లా రాజకీయ ముఖ చిత్రం ఒక్కసారిగా మారిపోయింది. అలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షడు చంద్రబాబు నాయుడు..  జోనల్ సమావేశంలో భాగంగా.. శుక్రవారం ( ఏప్రిల్ 7) నెల్లూరు నగరానికి విచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష టీడీపీ నేతల దృష్టి ఏమో కానీ... అధికార  వైసీపీ అగ్రనేతల ఫోకస్ అంతా నెల్లూరుమీదే కేంద్రీకృతమై ఉంది. ఈ జోనల్ సమావేశానికి 5 లోక్‌సభ నియోజకవర్గాల్లోని ఎంపీలు,  మాజీ ఎంపీలు, అలాగే 34 నుంచి 35 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతోపాటు పార్టీ ముఖ్యనేతలు హాజరువుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వీరందరికీ చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు.  అలాగే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధికీ, ప్రస్తుత జగన్ ప్రభుత్వంలో జరిగిన అభివద్దికి బేరీజు వేయడం, అదే విధంగా పలు అంశాలను  ఈ సందర్బంగా ప్రజలకు సోదాహణంగా వివరించే విధంగా పార్టీ నేతలకు చంద్రబాబు దిశా నిర్దేశం చేయనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  ఇదే సమయంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం గూటికి చేరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి  సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి   చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఇప్పటికే ఈ జోనల్ సమావేశాలు...  ఏప్రిల్ 5న ఉత్తరాంద్రలోని విశాఖపట్నంలో.. ఏప్రిల్ 6న రాయలసీమలోని కడపలో చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన విషయం విదితమే.  అదీకాక ఇటీవల జరిగిన గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో...  అలాగే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో  కలిపి  నలుగురు టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో  తెలుగుదేశం శ్రేణుల్లో నయా జోష్ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం విజయం  కోసం ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు  వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఆ క్రమంలో జోనల్ స్థాయిలో చంద్రబాబు అధ్యక్షతన సమావేశాలు ఏర్పాటు చేశారు. 

ఉమ్మడి వ్యూహం.. ఉత్తుత్తి కేసులు!

టెన్త్ ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారం ఢిల్లీ దాకా వెళ్ళింది. ఈ కేసులో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అరెస్టయిన నేపథ్యంలో నిబంధనల ప్రకారం లోక్ సభ సెక్రటేరియట్ బులిటెన్ రిలీజ్ చేసింది. 151 సీఆర్పీసీ  కింద ముందస్తు కస్టడీలోకి తీసుకున్నామని బొమ్మల రామారం  పోలీసులు తెలిపినట్లు బులిటెన్ లో తెలిపింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నందుకే బండి సంజయ్  ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కరీంనగర్ లో సంజయ్ ని అరెస్ట్ చేసి తర్వాత రాజకొండ పరిధిలోని బొమ్మల రామారం స్టేషన్ కు తరలించినట్లు బులిటెన్ లో వెల్లడించారు. అనంతరం కస్టడీ నుంచి విడిచిపెట్టినట్లు లోక్ సభ ప్రివిలేజ్ కమిటీకి కరీంనగర్ పోలీసులు తెలిపారు.  అదలా ఉంటే 10వ తరగతి పేపర్ లీకేజీ కేసులో అరెస్ట్‌ అయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ రిమాండ్‌ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్పై   తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు.... ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈలోపు బండి సంజయ్‌ బెయిల్‌ పిటిషన్‌ వేసుకోవచ్చని తెలిపింది. అయితే  విచారణ సందర్భంగా హై కోర్ట్,  టెన్త్ క్వశ్చన్‌ పేపర్ పబ్లిక్ డొమైన్‌లోకి వచ్చాక అది లీకేజ్ ఎలా అవుతుందని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అసలు బండి సంజయ్ చేసిన తప్పేంటని అడిగింది. పేపర్‌ బయటకు వచ్చాక వాట్సాప్‌లో ఫార్వార్డ్ మాత్రమే చేశారని.. కానీ పేపర్‌ లీకేజీలో బండి సంజయ్ పాత్ర లేదు కదా అని ప్రశ్నించింది. పేపర్ బయటకు వచ్చాక ప్రతిపక్ష నేతగా ఈ అంశాన్ని ఎలా అయినా వాడుకోవచ్చని పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం నెత్తిన మినీ మొట్టికాయలు వేసింది.  ఇప్పటికే కింది కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ వేశామని బండి సంజయ్ తరపు న్యాయవాది రామచంద్రరావు హైకోర్టుకు తెలిపారు. దానిపై ఏప్రిల్ 06వ తేదీనే తీర్పు వచ్చేలా ఆదేశాలని ఇవ్వాలని కోరారు. మార్చి8వ తేదీన ప్రధాని మోదీ పర్యటన ఉండటంతో ..  సంజయ్‌పై కింది కోర్టు ఇచ్చిన రిమాండ్ రిజెక్ట్ చేయాలని కోరారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ.. కింది కోర్టులో బెయిల్‌ రాకుంటే హైకోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ వేసుకోవాలని సూచించింది. రిమాండ్ క్వాష్ పిటిషన్‌పై విచారణను ఈనెల 10కి వాయిదా వేసింది. అయితే, ఈకేసుకు సంబంధించి అంతిమ తీర్పు ఎలా ఉంటుందనేది పక్కన పెడితే,  ఈ కేసు రాజకీయంగా మరింత సంచలనంగా మారే సంకేతాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.  రాష్ట్ర శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఢిల్లీ మద్యం కుంభకోణం కుసు, సుఖేష్ చంద్రశేఖర్ కేసు,  టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసును అస్త్రాలుగా చేసుకుని బీఆర్ఎస్ ను ఇరకాటంలో పెట్టేందుకు ఢిల్లీ నుంచి బీజేపీ పావులు కదుపుతుంటే, అందుకు ప్రతిగా  బీజేపీకి  దీటుగా సమాధానం చెప్పడానికి బిఆర్ఎస్ రెడీ అయింది.   రాష్ట్రంలో బిజెపి నాయకులను ఉక్కిరిబిక్కిరి చేయాలని నిర్ణయించుకున్న బీఆర్ఎస్ తన వ్యూహంలో భాగంగా బిజెపి స్లీపర్ సెల్స్ పై నిఘా పెట్టడమే కాకుండా, వారి వ్యూహాలను ఎప్పటికప్పుడు ముందే గుర్తించి ప్రజా క్షేత్రంలో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పేందుకు సిద్దమైంది. అయితే న్యాయస్థానాలు చేసే వ్యాఖ్యలు, ఇచ్చే తీర్పులు ఎలా ఉన్నా  అంతిమంగా ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారు  అనేదే కీలకమని అంటున్నారు.  నిజానికి ఈ మొత్తం వ్యవహారం కాంగ్రెస్ నాయకులు అభిప్రాయ పడుతున్నట్లుగా బీజేపీ, బీఆర్ఎస్  ఉమ్మడి వ్యూహంలో బాగంగా సాగుతున్న రాజకీయ క్రీడ అయిన కావచ్చు అనే అనుమానాలు లేక పోలేదు.

సుకేష్ చంద్రశేఖర్ లేఖలో అరుణ్ పిళ్లై పేరు!

మనీ లాండరింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ జైలు నుంచి గురువారం (ఏప్రిల్ 6) మరో లేఖ విడుదల చేశారు. రెండు పేజీలతో కూడిన ఈ లేఖలో కేజ్రీవాల్‌తో పాటు బీఆర్ఎస్ నేతల పేర్లను ప్రస్తావించారు. గత వారం ఏపీకి 15 కోట్ల రూపాయలు ఇచ్చానని షార్ట్ నేమ్ పేర్కొన్న సుఖేశ్, ఇప్పుడు   దానికి కొనసాగింపుగా   ఏపీ అంటే అరుణ్ పిళ్లై అని అతడికే తాను డబ్బులు ఇచ్చానని పేర్కొన్నాడు. కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్ సూచనలతోనే బీఆర్ఎస్ ఆ కార్యాలయంలో పిళ్లైకి రూ.15 కోట్లు ఇచ్చానని ఆ లేఖలో పేర్కొన్నాడు.   బీఆర్ఆర్ఎస్ కార్యాలయంలో  ఎమ్మెల్సీ స్టిక్కర్ ఉన్న 6060 బ్లాక్ కలర్, రేంజ్ రోవర్ స్పోర్ట్స్ మోడల్ కారులో ఈ డబ్బును ఇచ్చానని స్పష్టం చేశారు. తాను లేఖలో పేర్కొన్న అంశాలన్నింటికీ ఆధారాలు ఉన్నాయని అవసరం అయితే నార్కో టెస్ట్ కు సైతం సిద్ధమే అని పేర్కొన్నాడు. ఈ తాజా లేఖ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్ కు సౌత్ గ్రూప్ కు మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నాయనే విషయాన్ని సుకేష్ చంద్రశేఖర్ లేఖ బలపరుస్తోందని అంటున్నారు. మొత్తం మీద ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు డొంక కదులుతోందన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది.

టెన్త్ ప్రశ్న పత్రం లీక్ లో మరో ‘నలుపు’ విద్యార్ధి పై వేటు!

తెలంగాణలో పదో తరగతి ప్రశ్న పత్రాల లీకేజీ  వ్యవహారం పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. బీఆర్ఎస్, బీజేపీల మధ్య రాజకీయ యుద్దానికి ఈ లీకేజీ మరో అస్త్రంగా మారింది. అయితే  ఇప్పటికే 30 లక్షల మంది నిరుద్యోగ యువత భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మార్చిన, టీఎస్పీఎస్సీ లీకుల బాగోతానికి  తోడు ఇప్పడు ఈ పదో తరగతి ప్రశ్న పత్రాల లీకేజీ పరీక్ష ఇంకెంత మంది చిన్నారుల భవిష్యత్ ను ప్రశ్నార్ధకం చేస్తుందో అనే ఆందోళన తల్లి తండ్రులలో వ్యక్త మవుతోంది. ముఖ్యంగా  హిందీ పేపర్ లీకేజికి నువ్వే  కారణమంటూ అభం శుభం తెలియని ఓ విద్యార్ధిని ఏకంగా ఐదేళ్ళ పాటు డిబార్ చేసిన అధికారుల నిర్ణయం ఇటు విద్యార్ధులు, అటు తల్లి తండ్రులను కూడా తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.  ఇక విషయంలోకి వస్తే అసల్యంగా వెలుగులోకి వచ్చిన సమాచారం మేరకు, హనుమకొండ జిల్లాలోని కమలాపూర్ ప్రభుత్వ బాలుర పాఠశాలలో పరీక్ష రాస్తున్న ఒక విద్యార్ధిని  లీకేజీకి కారణం అని ఆరోపిస్తూ ఎగ్జామ్ హాల్ నుంచి బయటికి పంపించేశారు. ఎగ్జామ్ రాస్తుండగా అధికారులు వచ్చి, డీబార్ అయ్యావని చెప్పి హాల్ టికెట్ తీసుకున్నారని విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు.  తాను పరీక్ష రాస్తుండగా వేరే సర్ తో పిలిపించి, తన హాల్ టికెట్ తీసుకుని బయటికెళ్లమని డీఈవో సర్ చెప్పారని విద్యార్థి తెలిపాడు. అప్పుడే తనను డీఈవో సర్ సంతకం చేయమన్నారని, అక్కడ అందరూ ఉండడంతో భయపడి సంతకం చేశానని చెప్పాడు. ఎందుకు సైన్ చేయించుకుంటున్నారని అడిగితే.. నీ వల్లే పేపర్ లీకైందని, వైరల్ అయిందని చెప్పినట్టు విద్యార్థి తెలియజేశాడు. తనను ఐదు సంవత్సరాలు డిబార్ చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఏప్రిల్ 4న హిందీ ఎగ్జామ్ జరుగుతుండగా ఓ వ్యక్తి తనను పిలిచి, తన పేపర్ ఇవ్వమని బెదిరించాడని, అయినా తాను ఇవ్వలేదన్నాడు. ఆ వ్యక్తి కాసేపయ్యాక సడెనా గా వచ్చి కిటికీలోనుంచి చేయి పెట్టి తన పేపర్ గుంజుకుని, ఫొటోలు తీసుకున్నాడని తెలిపాడు. ఆ తర్వాత ఏమైందో కూడా తనకు తెలియని చెప్పాడు. అసలు ఆ వ్యక్తి ఎవరో  కూడా తనకు తెలియదని చెప్పాడు. ఈ రోజు జరిగిన ఇంగ్లీష్ ఎగ్జామ్ రాయలేదని, ఆ విద్యార్థి వాపోయాడు.  జీవితంలో చేయని తప్పుకు శిక్షను అనుభవిస్తున్నానని, ఈ రోజు జరిగిన ఎగ్జామ్ మినహాయిస్తే.. సప్లిమెంటరీలోనైనా ఎగ్జామ్ రాస్తానని, తనపై విధించిన డిబార్ తీసేయాలని కోరాడు. తన హాల్ టికెట్ తనకు ఇవ్వాలని, మిగతా ఎగ్జామ్స్ రాసేందుకు పర్మిషన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశాడు.  మరో వంక విద్యార్థి తల్లి ఇప్పటి వరకూ తన కొడుకుపై ఎలాంటి రిమార్కు రాలేదని చెప్పారు. ఒకబ్బాయి వచ్చి తన కొడుకును చంపుతా, పొడుస్తానంటూ బెదిరించాడని ఆమె తెలిపారు. ఎవరికైనా చెబితే చంపుతానన్నాడని చెప్పారు. తమ క్కూడా ముందుగా చెప్పలేదని, ఈ రోజు ఇంగ్లీష్ ఎగ్జామ్ రాయనివ్వలేదని, ఎవరో చేసిన పనికి తన కొడుకును బలిపశువును చేయొద్దని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాము తప్పు చేసే మనుషులం కాదన్న ఆమె.. తన కొడుకు బంగారు భవిష్యత్తును ఆగం చేయకండంటూ వేడుకున్నారు. తెలియక భయపడి సంతకం పెట్టాడని, హాల్ టికెట్ ఇచ్చి రేపట్నుంచి ఎగ్జామ్ కు అనుమతించండి అని ఆమె కోరారు.  నిజానికి, పదవ తరగతి ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంలో అటు విద్యా శాఖ అధికారులు, ఇటు విచారణ చేస్తున్న పోలీసు యంత్రాంగం వ్యవహారం చూస్తే గుడ్డెద్దు చేలో పడినట్లు ఉందని పరీక్ష నిర్వహణలో అనుభవం ఉన్న రిటైర్డ్ అధికారులు, ఉపాధ్యాయులు అంటున్నారు. ఈ వ్యవహారంలో సంబంధిత అధికారాలు ఎవరికీ కొంచెం కూడా క్లారిటీ లేనట్లే ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హిందీ పేపర్ లీక్ కాలేదని స్వయంగా విద్యాశాఖ మంత్రి ప్రకటించిన తర్వాత, అర్థరాత్రి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను అరెస్ట్  చేయడంతో కథ మారిపోయింది. అంటే  పేపర్ లీక్ గురించి తెర వెనక ఏమి జరుగుతుందో మంత్రి గారికి కూడా తెలియదా? తెలియకుండానే ఆమె  హిందీ పేపర్ లీక్ కాలేదని ప్రకటించారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అదెలా ఉన్నా, ఎవరో ఆగంతకుడు పరీక్ష కేంద్రలోకి సెల్ ఫోన్ తో వచ్చి విద్యార్ధి నుంచి ప్రశ్న పత్రం బలవంతంగా తీసుకుని, ఫోన్ లో ఫోటోలు తీసుకున్నాడంటే, అందుకు బాధ్యత విదార్ధిది అవుతుందా? ఒక వేళ ఆ విద్యార్ధి,ఆ అగంతకునికి ముందే బేరం కుదుర్చుకుని సహకరించాడని అనుకున్నా, ఆగంతకుడు పరీక్ష కేంద్రంలోకి ఎలా వచ్చారు? అందుకు ఎవరు సహకరించారు? ఎవరు బాధ్యత వహించాలి,అనే ప్రశ్న  కు ఎవరు సమాధానం చెపుతారు?

ఒడిశా, ఏపీ సరిహద్దు వివాదం బీజేపీ రాజకీయమేనా?

ఒడిశా, ఆంధ్రప్రదేశ్ మధ్య సరికొద్ద సరిహద్దు వివాదం మొలకెత్తింది. అయితే ఈ వివాదానికి కేంద్రం రాజకీయమే కారణమన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ చేసిన ఒక ప్రకటన ఈ వివాదానికి కారణమన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాల మధ్య  కోరాపుట్‌ జిల్లాలో ఉన్న కోటియా అనే ప్రాంతంనుంచి  ఏపీ పోలీసులు వైదొలగాలంటూ చేసిన ప్రకటన ఈ సరికొత్త సరిమద్దు వివాదానికి కారణమైంది.   కోటియా   ప్రాంతంలోని 21 గ్రామాల నుంచి ఏపీ పోలీసులు వెనక్కు వెళ్లాలని ప్రధాన్ ఒడిశా అవతరణ దినోత్సవం వేదికగా ఒక ప్రకటన చేశారు. ప్రస్తుతం ఈ ప్రకటనే సరికొత్త వివాదానికి కారణమైంది.  వాస్తవానికి సరిహద్దు వివాదం సుప్రీం కోర్టులో ఉండగా  సరిగ్గా ఒడిశా అవతరణ దినోత్సవం నాడు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ వివాదాస్పద ప్రకటన చేశారు. ఇది రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. సహజంగానే  ప్రదాన్ ప్రకటనను బీజేపీ ఒడిశా శాఖ సమర్ధించింది. అదే సమయంలో ప్రధాన్ వ్యాఖ్యలను అధికార బీజు జనతాదళ్ ఖండించింది.  దీంతో బిజూ జనతాదళ్‌, బీజేపీల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరుగుతోంది.  బిజూ జనతా దళ్‌ నాయకురాలు, రాష్ట్ర రెవెన్యూ  మంత్రి ప్రమీలా మల్లిక్‌ ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలంటూ ఎన్‌.డి.ఏ ప్రభు త్వాన్ని డిమాండ్‌ చేశారు.  ఇది సుప్రీం కోర్టు విచారణలో ఉండగా కేంద్ర మంత్రి దీని గురించి వ్యాఖ్యానించవచ్చా, ఈ విధంగా వ్యాఖ్యానించడం కోర్టు ధిక్కరణ కిందకు రాదా అన్న చర్చ మొదలైంది. రెండు రాష్ట్రాలు చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవాలంటూ కొద్ది కాలం కిందట కేంద్ర మంత్రి ధర్మేంద్ర పధాన్ స్వయంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకూ లేఖ రాశారు. ఇంతలోనే ఈ విషయంలో ఆయన వివాదాస్పద ప్రకటన చేయడం రాజకీయ లబ్ధి కోసమేనన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో   బీజేడీని ఇరకాటంలో పెట్టడమే లక్ష్యంగా ఆయనీ వ్యాఖ్యలు చేసినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   కోరాపుట్‌ జిల్లా గత ఇరవై ఏళ్లుగా బీజేడీ ఓటు బ్యాంకుగా, పటిష్ఠమైన కంచుకోటగా ఉంది. ఇప్పుడు ఈ జిల్లాపై   బీజేపీ కన్ను వేసింది. దేశవ్యాప్తంగా ఆదివాసీ లేక గిరిజన ప్రాంతాలను చేజిక్కించుకోవడంలో భాగంగా కేంద్రంలోని పాలక బీజేపీ ప్రభుత్వం ఒడిశాలో కూడా ఆదివాసీల అభివృద్ధికి, సంక్షేమానికి అనేక పథకాలను, కార్యక్రమాలను చేపట్టినప్పటికీ,  ఒడిశా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పోటీగా స్వయంగా కొన్ని పథకాలను ప్రారంభించి, విజయవంతంగా అమలు చేస్తోంది. దీంతో నవీన్‌ పట్నాయక్‌ ప్రభుత్వాన్ని   ఇరకాటంలో పెట్టి పబ్బం గడుపుకోవాలనే ఉద్దేశంతోనే ప్రధాన్‌ సరిహద్దు ఉరుములేని పిడుగులా సరిహద్దు వివాదానికి తెరతీశారని అంటున్నారు.  

కమలం గూటికి ఏకే ఆంటోనీ కుమారుడు

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీ కమలం తీర్థం పుచ్చుకున్నారు. ఏకే ఆంటోనీ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, గాంధీ కుటుంబానికి అత్యంత విధేయుడు, సన్నిహితుడైన నాయకుడు. అటువంటి నాయకుడి కుమారుడు బీజేపీ గూటికి చేరడం ఒక విధంగా కాంగ్రెస్ ను ఊహించని ఎదురుదెబ్బ అనడంలో సందేహం లేదు. ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీ  కేరళ బీజేపీ  అధ్యక్షుడు కే సురేంద్రన్ తో కలిసి ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయానికి చేరుకుని అక్కడ గులాబీ కండువా కప్పుకున్నారు. నిన్న మొన్నటి వరకూ కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ డిజిటల్ మీడియా సెల్ కన్వీనర్ గా క్రియాశీలంగా వ్యవహరించిన అనిల్ ఆంటోనీ కొద్ది రోజుల కిందట కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు.   ప్రధాని మోడీపై బీబీసీ డాక్యుమెంటరీ విషయంపై ఆయన కాంగ్రెస్ అధిష్ఠానంతో విబేధించారు. ఆ కారణంతోనే ఆయన కాంగ్రెస్ పార్టీని వీడారు.  మోడీపై బీబీసీ డాక్యుమెంటరీ విషయంలో కాంగ్రెస్ తీరును తప్పుపట్టిన ఆయన వివరణను వినడానికి కూడా కాంగ్రెస్ అధిష్ఠానం ఇష్టపడకపోవడంతో ఆయన కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. ఆ సందర్భంగా ఆయన కాంగ్రెస్ లో కోటరీ గాళ్లదే రాజ్యం అయిపోయిందని ఘాటు విమర్శలు కూడా చేశారు. ఆయన కాంగ్రెస్ ను వీడటం ఒకెత్తయితే.. బీజేపీ గూటికి చేరడం మాత్రం కాంగ్రెస్ జీర్ణించుకోలేని అంశమేనని పరిశీలకులు అంటున్నారు. అంటోనీ కుమారుడు కమలం గూటికి చేరడం కాంగ్రెస్ ప్రతిష్టను మసకబారుస్తుందనడంలో సందేహం లేదని అంటున్నారు. అలాగే తాజాగా కాంగ్రెస్ మాజీ నేత గులాం నబీ ఆజాద్ కూడా తాను కాంగ్రెస్ లో ఉన్న సమయంలో కాంగ్రెస్ నాయకత్వం కంటే మోడీ అండ్ కో తనను ఎక్కువగా గౌరవించారని చేసిన వ్యాఖ్యలు కూడా దుమారం లేపుతున్నాయి. కాంగ్రెస్ లో పాతతరం నాయకులకు, సీనియర్లకు తగిన గౌరవం దక్కడం లేదంటూ వస్తున్న విమర్శలకు ఆంటోనీ కుమారుడు పార్టీ మారడం, ఆజాద్ వ్యాఖ్యలూ బలం చేకూరుస్తున్నాయని చెబుతున్నారు. 

దేశంలో మళ్ళీ కరోనా కలకలం

దేశంలో మరో మారు కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. రోజు రోజుకు కొత్త కేసుల సంఖ్య పెరగడంతో పాటుగా, మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడల చేసిన తాజా గణాంకాలే ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. ఒకే రోజులో ఇంచు మించుగా 50 శాతానికి పైగా హెచ్చు కేసులు నమోదవుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తాజా గణాంకాలను బట్టి తెలుస్తోంది. ఈ నేపధ్యంలోనే కేంద్ర ప్రభుత్వం  రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు కరోనా కట్టడి చర్యలకు సంబందించి స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది.    కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదలచేసిన  తాజా గణాంకాల ప్రకారం    బుధవారం(ఏప్రిల్ 5) ఒకే రోజు దేశవ్యాప్తంగా 5 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం యాక్టివ్ కేసులు పాతిక వేలు దాటాయి.  24 గంటల్లోనే 5 వేల 335 కేసులు నమోదు కావటంపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం అయ్యింది. 24 గంటల్లోనే కరోనాతో 15 మంది చనిపోయినట్లు ప్రకటించింది కేంద్రం. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ చేసింది. కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. దేశంలో రోజువారీ పాజిటివ్ రేటు 3.32 శాతానికి పెరగటం   ఆందోళన కలిగిస్తున్నదని   పేర్కొంది  కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ.  పాజిటివ్ రేటు వారాంతానికి తీసుకుంటే మాత్రం అది 2.79 శాతంగా ఉంది.  2023, ఏప్రిల్ ఒకటో తేదీన 2 వేల 994 కేసులు నమోదు కాగా.. ఏప్రిల్ 6వ తేదీ నాటికి అవి 5 వేలు దాటాయి. రోజువారీగా కొత్త కేసులు 500 పెరుగుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. దేశంలో ప్రస్తుతం కరోనా రోజువారీ పాజిటివిటీ రేటు 3.38 శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 2.79 శాతంగా నమోదైంది. ఇక దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతోంది.  దేశంలో ఇప్పటివరకు 220.66 కోట్ల డోసుల కోవిడ్ -19 వ్యాక్సిన్‌‌ను అందించారు.  మహారాష్ట్రలో ఒకే రోజులో కోవిడ్ కేసులు 186 శాతం పెరిగాయి.  గత 24 గంటల్లో 711 తాజా ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,792కి చేరుకుంది. మహారాష్ట్రతో పాటుగా తెలంగాణ సహా మొత్తం ఆరు రాష్త్రాలలో కేరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని కేంద్ర ప్రభుత్వం నెల రోజుల క్రితమే రాష్ట్ర ప్రభుతాలను హెచ్చరించింది. అందుకు కొనసాగింపుగా తెలంగాణ సహా ఆరు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. నిజానికి గత కొన్ని నెలలుగా భారత్ లో కొరోనా  కేసుల సంఖ్య చాలా తగ్గింది. కానీ గత నెలరోజులకు పైగా కొన్ని రాష్ట్రాల్లో మళ్లీ కొరోనా కేసుల సంఖ్యలో పెరుగుదల నమోదవుతున్నట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ గుర్తించింది. దాంతో, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచిస్తూ ఆయా రాష్ట్రాలకు లేఖ రాసింది సహా చాలా వరకు రాష్ట్రాలు కేంద్ర మార్గదర్శకాలను పట్టిచుకున్న దాఖలాలు కనిపించడం లేదు.

కాంగ్రెస్ ను వీడను బాబోయ్ అంటున్నా ఎవరూ నమ్మరేం.. కోమటిరెడ్డి

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి గుడ్ బై చెబుతున్నారనే వార్తలు కలకలం రేపాయి. కోమటిరెడ్డి రాజీనామాను అధికారికంగా ప్రకటించేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరిగింది. కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న  వెంకట్ రెడ్డికి పార్టీ నుంచి సరైన సహకారం లేకపోవడంతో పార్టీని విడిచి పెట్టేందుకు సిద్దమయ్యారని ప్రచారం జరిగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడుతారని ప్రచారం జరగడం ఇదే తొలిసారి కాదు. గతంలో మునుగోడు ఎన్నికల సమయంలో కూడా ఇదే తరహా ప్రచారం జరిగింది.  పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నియామకాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన కోమటిరెడ్డి, పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా బహిరంగంగానే విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో నాయకుల్ని చేర్చుకునే విషయంలో కూడా రేవంత్ రెడ్డితో కోమటిరెడ్డి విభేదించారు. చెరుకు సుధాకర్ ని చేర్చుకున్న సమయంలో  అలిగి.. బీజేపీ అగ్రనేత అమిత్ షా తో   సమావేశమై కలకలం రేపారు. గతంలో పీసీసీ అధ్యక్ష, ఏఐసీసీ పదవులు ఆశించిన వెంకట్ రెడ్డి,  ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్ అగ్ర నాయకులు సర్ది చెప్పడంతో సర్దుకుపోయారు. ఆ తర్వాత కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదనే అక్రోశం కోమటిరెడ్డిలో ఉంది. తనకు ఎలాంటి పదవులు రాకపోవడంతో వెంకట్ రెడ్డి మనస్తాపానికి గురయ్యారని అనుచరులు చెబుతున్నారు. కాంగ్రెస్ పెద్దలు ఎప్పటికప్పుడు సర్ధిచెప్పే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. ఎంపీ వెంకటరెడ్డి సోదరుడు రాజగోపాల్ పార్టీ వీడినప్పటి నుంచి కాంగ్రెస్ నేతలతో దూరం పెరిగింది. కాంగ్రెస్ అధిష్టానం ఊరడించడంతో వెంకటరెడ్డి తన నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వస్తున్నారని అనుచరులు చెబుతున్నారు. పార్టీ మార్పు వార్తలు దుమారం రేపడంతో ఎంపీ కోమటిరెడ్డి మీడియా ముఖంగా వాటిని ఖండించారు. ఉద్దేశ్య పూర్వకంగానే కొందరు తనను డ్యామేజ్ చేస్తున్నారని ఆరోపించారు. తనది కాంగ్రెస్ రక్తమని, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తనకు పార్టీ మారే ఉద్దేశం లేదు మొర్రో అని మొత్తుకుంటున్నా ఎవరూ ఎందుకు నమ్మడం లేదని ఆకోషం వ్యక్తం చేశారు.  రాజీనామా చేయాలన్న  నిర్ణయం తీసుకో లేదని చెప్పారు. రాహుల్ గాంధీ అనర్హతను నిరసిస్తూ గాంధీభవన్ లో చేసిన దీక్షలో పాల్గొన్నాననీ,  భువనగిరి నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు పాల్గొంటున్నానని వివరణ ఇచ్చారు. తన ముందు ఎలాంటి ఆప్షన్స్ లేవని తనది కాంగ్రెస్ రక్తమని చెప్పుకొచ్చారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంతలా చెబుతున్నా.. ఆయన పార్టీ మారతారన్న వదంతులు ఆగకుండా రావడానికి ఆయన వ్యవహార శైలే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. చిన్న చిన్న సమస్యలపై ప్రధాని మోడీతోనూ, హోంమంత్రి అమిత్ షాతోనూ భేటీ కావడంపై కోమటిరెడ్డి గతంలో ఇచ్చిన వివరణలు నమ్మశక్యంగా లేవు. పార్టీ క్రమశిక్షణ సంఘం ఇచ్చిన నోటీసులను చెత్తబుట్టలో పారేశానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు, ముందు ముందు కాంగ్రెస్, బీఆర్ఎస్ లు కలుస్తాయంటూ చేసిన కామెంట్స్ ఇవన్నీ కూడా ఆయన కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పనున్నారన్న వార్తలకు బలం చేకూర్చేవిగా ఉండటమే.. ఆయన తనది కాంగ్రెస్ రక్తం అని చెబుతున్నా.. ఎవరూ నమ్మకపోవడానికి కారణమని పరిశీలకులు అంటున్నారు.