కాంగ్రెస్ సారథ్యంలో విపక్ష కూటమి దిశగా తొలి అడుగు!
posted on Apr 12, 2023 @ 4:44PM
వచ్చే సార్వత్రిక ఎన్నికలలో బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాల ఐక్యతా యత్నాలలో ఒక ముందడుగు పడిందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీలు బీహార్ సీఎం, జేడీఎస్ అధినేత నితీష్ కుమార్ తో బుధవారం భేటీ అయ్యారు. ఈ బేటీలో ఆర్జేడీ నాయకుడు, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వియాదవ్ కూడా ఉన్నారు.
భేటీ అనంతరం ఖర్గే మీడియాతో మాట్లాడారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడిగా పోటీ చేయాలన్న నిర్ణయానికి వచ్చామని వెల్లడించారు. నితీష్, తేజస్విలతో భుటీ సామరస్య పూరిత వాతావరణంలో అర్థవంతంగా జరిగిందన్నారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చాయని ఖర్గే చెప్పారు.ముందు ముందు మరిన్ని పార్టీలు కలిసి వస్తాయన్న ధీమా వ్యక్తం చేశారు. నితీష్ కూడా ఈ భేటీ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఉన్న బీజేపీయేతర పార్టీలన్నిటినీ ఏకం చేస్తామన్నారు. కాగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సమదూరం పాటించాలన్న అభిప్రాయంతో ఉన్న విపక్ష పార్టీల నేతలతో మాట్లాడి వారిని కలుపుకునే బాధ్యతను ఈ భేటీ సందర్భంగా నితీష్ కుమార్ తీసుకున్నారు.
ఈ సమావేశంలో రాహుల్ గాంధీ, తేజస్వీ యాదవ్, జేడీ(యూ) చీఫ్ లాలన్ సింగ్, కాంగ్రెస్ ఎంపీ నసీర్ హుస్సేన్, రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ సుఖ్‌జీందర్ సింగ్ రంధావా, కాంగ్రెస్ నేతలు ముకుల్ వాస్నిక్, సల్మాన్ ఖుర్షీద్ లు పాల్గొన్నారు.
ఇటీవలే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మోడీ డిగ్రీ సర్టిఫికేట్, అదానీ వ్యాపార వ్యవహారాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో విపక్షాల ఐక్యతకు గండి పడినట్లే నంటూ వచ్చిన వ్యాఖ్యలను పూర్వ పక్షం చేస్తూ కాంగ్రెస్, జేడీఎస్, ఆర్జేడీ, జేడీయూ పార్టీల నాయకులు భేటీ అయ్యి వచ్చే ఎన్నికలలో ఐక్యంగా సాగాలన్న నిర్ణయాన్ని ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.