విశాఖ ఉక్కు బీఆర్ఎస్ విజయమేనా?
posted on Apr 14, 2023 @ 10:16AM
తెలంగాణ ప్రభుత్వం, ‘విశాఖ ఉక్కు’ ప్రైవేటు పరం కాకుండా చూసేందుకు, నడుం బిగించింది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం, విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం చేసేందుకు సిద్దమై, పావులు కదుపుతుంటే, తెలంగాణ ప్రభుత్వం ఆ ప్రయత్నాలను అడ్డుకునేందుకు, ముందు కొచ్చింది. ఆంధ్రులకు జరుగుతున్న అన్యాయానికి మనసు చెదిరిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సాహసోపేతమైన సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రుల హక్కుగా కొట్లాడి తెచ్చుకున్న విశాఖ ఉక్కును ప్రధాని మోదీ ప్రభుత్వం ఏ ఆదానీకో, అంబానీకో ధారాదత్తం చేయకుండా అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం విశాఖ ఉక్కు ‘బిడ్’ ప్రకియలో పాల్గొనాలని నిర్ణయించింది.
కొద్ది రోజుల క్రితం తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ .ఈ ప్రకటన చేసినప్పటి నుంచి బీఆర్ఎస్ మంత్రులు, నాయకులు ఇదే పాట పాడుతున్నారు .రాజకీయ, మీడియా వర్గాల్లోనూ ఇదే చర్చ జరుగుతోంది. అంతే కాదు లేడికి లేచిందే పరుగు అన్నట్లుగా తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్పొరేషన్ అధికారులను విశాఖకు పంపింది. అక్కడి పరిస్థితులను పరిశీలించడంతో పాటుగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అధికారులతో చర్చలు జరుపుతోంది. మరో వంక విశాఖ ఉక్కును తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్లే బీఆర్ఎస్ వర్గాలు ప్రచారం చేసేస్తున్నాయి. ముఖ్యమంత్రి దొడ్డ మనసును ..ఆహా ఓహో అంటూ కీర్తిస్తున్నారు. మరో వంక విపక్షాలు తాదూర కంత లేదు మెడకో డోలు అని ఎగతాళి చేస్తున్నారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఏమైందని ప్రశ్నిస్తున్నాయి. రాష్త్రంలో మూత పడిన సిర్పూర్ పేపర్ మిల్లు, ఆజంజాహి మిల్లు, రేయాన్ ఫ్యాక్టరీలను తెరిపిస్తానని ఇచ్చిన హామీలను అమలు చేయడం చేతగాని కేసీఆర్ ప్రభుత్వం విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కాకుండా బిడ్డింగ్ దాఖలు చేస్తాననడం చూస్తుంటే ఆశ్చర్యమేస్తోందని విపక్షాలు విరుచుకు పడుతున్నాయి.
అయితే అసలు విషయం ఏమంటే, విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి సిద్దం గాలేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కొత్తగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇదే విషయాన్ని గురువారం(ఏప్రిల్ 13) విశాఖలో పర్యటించిన కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్‌సింగ్ కులస్తే మరో మారు స్పష్టం చేశారు. వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను ఇప్పటికిప్పుడు ప్రైవేటుపరం చేయాలని భావించడం లేదని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్‌సింగ్ కులస్తే స్పష్తం చేశారు. అయితే, ఈ ప్రకటనకు తెలంగానా ప్రభుత్వం చూపిన చొరవకు సంబంధం ఉండలేదా అనే విషయం పక్కన పెడితే తెలంగాణ మంత్రులు మాత్రం క్రెడిట్ ను తమ ఖాతాలో వేసుకున్నారు.
కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై గట్టిగా మాట్లాడింది ముఖ్యమంత్రి కేసీఆరేనని తెలిపారు. తెగించి కొట్లాడాం కాబట్టే కేంద్రం తాత్కాలికంగా వెనక్కి తగ్గిందన్నారు. కేసీఆర్ దెబ్బ అంటే అలా ఉంటుందని వ్యాఖ్యానించారు.అయితే నిజానికి కేంద్ర ఇంతవరకు తీసుకున నిర్ణయంలో వెనక్కి పోయిందా అంటే లేదు. ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకోలేదు.
నిజానికి, ఇటీవల కేంద్ర ప్రభుత్వం కేవలం ముడి పదార్థాలు లేదా మూలధనం సమకూర్చేందుకు ఆసక్తి వ్యక్తీకరణ (ఈవోఐ) ప్రకటన మాత్రమే చేసింది. వివరాలోకి వెళితే.. విశాఖ ఉక్కులో ‘కావేరి’ పేరుతో ఉన్న బ్లాస్ట్ ఫర్నేస్-3 ఏడాదిన్నర కాలంగా మూతపడి ఉంది. ముడి పదార్థాలకు అవసరమైన నిధులు లేక దానిని మూసేశారు. ఇప్పుడు పరిస్థితి మరింత దిగజారింది. మిగిలిన రెండు బ్లాస్ట్ ఫర్నే్‌సలు నడిపేందుకు అవసరమైన ముడిపదార్థాలూ సమీకరించలేని దుస్థితి ఏర్పడింది. అన్ని దారులూ మూసుకుపోవడంతో విశాఖ ఉక్కు యాజమాన్యం కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చింది.
ఎవరైనా ముడి పదార్థాలు సరఫరా చేస్తే… దానికి బదులుగా తయారుచేసిన స్టీల్‌ని ఇస్తాం అంటూ గత నెలలో ఈవోఐ జారీ చేసింది. తనకు అవసరమైన వనరులను సొంతంగా సమకూర్చుకునే క్రమంలో విశాఖ ఉక్కు యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పడు కూడా ఆ ప్రక్రియ కొనసాగుతుందనే కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. అంటే కేంద్రం వెనకడుగు వేసిందనే వాదనలో వాస్తవం లేదని అంటున్నారు.
నిజానికి ఈ బీడ్ లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొన్నా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తెలంగణ ప్రభుత్వానికి దక్కే ఆస్కారం లేదు. కేవలం కేంద్ర ప్రభుత్వంపై బురదజల్లి రాజకీయ లబ్ది పొందే ప్రయత్నంలో భాగంగానే బీఆర్ఎస్ డ్రామా ఆడుతోందని బీజేపీ, ఇతర ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. అంతే కాదు, ప్రతి నెలా ఉద్యోగుల జీతాలు ఇవ్వలేని దుస్థితిలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వానికి విశాఖ స్టీల్ ప్లాంట్ కొనుగోలు చేసే స్థోమత గాని, ఆర్ధిక వెసులుబాటుగాని లేదని విపక్షాలు, ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
వీటన్నటికీ మించి కేసీఆర్ ప్రభుత్వమే కాదు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థా కూడా పెట్టుబడుల ఉపసంహరణలో పాల్గొనే అవకాశం లేదు. 2022 ఏప్రిల్ 19న ఈ మేరకు కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. వ్యూహాత్మక రంగాలలోని ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణతో కేంద్ర, రాష్ట్ర, ఉమ్మడి రంగాలలోని ప్రభుత్వ రంగ సంస్థలు ఏవి కూడా పాల్గొనరాదని ఈ ఉత్తరువు స్పష్టం చేసింది. సో.. భవిష్యత్ సంగతి ఏమో కానీ ప్రస్తుతానికి అయితే తెలంగాణ ప్రభుత్వం కానీ, తెలంగాణ ప్రభుత్వం తరపున సింగరేణి కానీ, బిడ్ లో పాల్గొనే అవకాశమే లేదు.
భవిష్యత్ లో కేంద్రంలో భారాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేసేఆర్ ప్రధాన మంత్రి అయిన తర్వాత చట్టాన్ని సవరిస్తే ఏమో కానీ ప్రస్తుత చట్టాల ప్రకారం విశాఖ స్టీల్ ప్లాంట్ క్రయ విక్రయాల్లో తెలంగాణ ప్రభుత్వమే కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా వేలు పెట్టే అవకాశం లేదు. అయితే ఇవ్వన్నీ సుమారు నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉన్న కేసేఆర్ కు తెలియదా? ఎనిమిదేళ్ళుగా మంత్రిగా ఉన్న కేటీఆర్ కు తెలియదా అంటే తెలుసు. అందరికీ అన్నీ తెలుసు. అందుకే కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు, రాష్టంలో తమ ఇమేజ్ పెంచుకునేందుకు, తండ్రీ కొడుకులు సంయుక్తంగా ఆడుతున్న రాజకీయ డ్రామా గా విపక్షాలు ముఖ్యంగా బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు.
అంతేకాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కిరణ్‌కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖ ఉక్కుకు సొంత గనులు లేవని, బయ్యారం గనులు కేటాయించాలని కేంద్రాన్ని కోరారు. అప్పుడు ఎంపీగా ఉన్న కేసీఆర్ ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు.
తెలంగాణ బొగ్గును ఆంధ్రకు దోచి పెడతారా? బయ్యారం గనులు ఇచ్చేందుకు ఒప్పుకోం అని తేల్చి చెప్పారు. ఇప్పుడు అదే కేసీఆర్ ప్రభుత్వం సింగరేణి ద్వారా విశాఖ ఉక్కును కాపాడతామని చెబుతుండటం చూస్తే..ఒకదాని వెంట ఒకటిగా చుట్టుముడుతున్న సమస్యల సుడిగుండం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు చేసే ప్రయత్నంగానే విపక్షాలే కాదు, విజ్ఞత ఉన్న ప్రతి ఒక్కరు భావిస్తున్నారు.