బీఆర్ఎస్‌లోకి జేడీ!
posted on Apr 13, 2023 @ 8:20PM
సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వి.వి.లక్ష్మీనారాయణ భారత రాష్ట్ర సమితిలో చేరనున్నారా? ఆ దిశగా ఆయన అడుగులు పడుతున్నాయా? అంటే తాజా పరిణామాల నేపథ్యంలో అవుననే ఓ చర్చ అయితే పోలిటికల్ సర్కిల్‌లో ఊపందుకొందని తెలుస్తోంది.
తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గింది. ఇది తెలంగాణ సీఎం కేసీఆర్ చేపట్టిన చర్యల వల్లేనంటూ జేడీ లక్ష్మీనారాయణ ట్విట్టర్ వేదికగా గులాబీ బాస్‌కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్‌లో పాల్గొనాలంటూ సీఎం కేసీఆర్‌కు ఆయన సూచించారు. ఈ నేపథ్యంలో జేడీ లక్ష్మీనారాయణ.. కారు పార్టీలో చేరనున్నారనే కథనాలు అయితే పోలిటికల్ సర్కిల్‌లో తెగ షికారు చేస్తున్నాయి.
మరోవైపు ఆంధ్ర్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ పార్టీని నడిపించేందుకు కాపు సామాజికవర్గాన్ని లక్ష్యంగా చేసుకొని ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఆ క్రమంలో ఇప్పటికే అదే సామాజిక వర్గానికి చెందిన ఐఏఎస్ మాజీ అధికారి తోట చంద్రశేఖర్‌కి ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా నియమించారీ కేసీఆర్. ఇక వివి లక్ష్మీనారాయణ సైతం అదే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో.. ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే గతంలో ఏపీ బీజేపీ చీఫ్‌గా కన్నా లక్ష్మీనారాయణ ఉన్న సమయంలో జేడీ లక్ష్మీనారాయణ కమలం పార్టీలో చేరేందుకు ప్రయత్నించారు. కానీ నాటి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని అగ్రనేతలు.. దేశ రాజధాని హస్తినలోని కమలం పార్టీ నేతలపై తీవ్ర ఒత్తిడి తీసుకు వచ్చి.. జేడీ లక్ష్మీనారాయణ చేరికను అడ్డుకున్నారు.
కానీ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో చేరతారని భావిస్తున్న జేడీ లక్ష్మీనారాయణకు... బీఆర్ఎస్ పార్టీ నేతలు స్వాగతం పలుకుతారా? ఓ వేళ.. ఆయనకు స్వాగతం పలికేందుకు వారు సిద్దంగా ఉన్నా.. ఏపీలోని అధికార జగన్ పార్టీలోని అగ్రనేతలు మళ్లీ రంగంలోకి దిగి టీఆర్ఎస్ పార్టీ అధినేతపై తీవ్ర ఒత్తిడి తీసుకు రావడం ద్వారా జేడీ లక్ష్మీనారాయణ రాకను అడ్డుకుంటారా? అంటే మాత్రం వేచి చూడాల్సిందే అనే అభిప్రాయం అయితే పోలిటికల్ సర్కిల్‌లో వ్యక్తమవుతోంది.