బాలినేనికి పొమ్మన లేక పొగపెడుతున్నారా?
posted on Apr 13, 2023 7:13AM
బాలినేని శ్రీనివాసరెడ్డి.. మాజీ మంత్రి.. సీఎంకు సమీప బంధువు..ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అయితే ఆయన మాటే శాసనం అన్నట్లుగా వ్యవహారాలు నడుస్తాయి. అలాంటి నేతకు అవమానం జరిగింది. అదీ జగన్ అధికారిక కార్యక్రమం సందర్భంగా. సీఎం జగన్ మార్కాపురం పర్యటన సందర్భంగా వెళ్లిన బాలినేని శ్రీనివాసరెడ్డిని సీఎం హెలిప్యాడ్ దగ్గరకు వెళ్లకుండా పోలీసులు నిలిపివేశారు. పోలీసులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తానెవరో.. తన పవరేంటో చెప్పుకున్నారు. అయినా ససేమిరా అన్నారు.
అంతే.. ఆయనకు ఒళ్లు మండింది. ఆగ్రహించిన ఆయన సీఎం కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేసి వెళ్లిపోయారు. ఆయన అనుచరులూ అనుసరించారు. బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లాలో సొంత వర్గం ఉన్న నాయకుడు. అన్ని పార్టీల నేతలతో సత్సంబంధాలు ఉన్న నేత. అధికారదర్పం, అహంకారం పెద్దగా ప్రదర్శించరు. జిల్లాలో పేరుకు ఇద్దరు మంత్రులు ఉన్నా.. పలుకుబడి మాత్రం బాలినేనికే ఎక్కువ. అటువంటి ఆయన సీఎం హెలీపాడ్ వద్దకు వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకోవడాన్ని తట్టుకోలేకపోయారు. ఇంత అవమానం జరిగాకా తాను అక్కడ ఎందుకు ఉండాలనుకున్నారు. అంతే వెంటనే వెనక్కు వెళ్లిపోయారు. బాలినేనిని పోలీసులు ఇంతగా అవమానించడం ఏమిటని వైసీపీ వర్గాలే ఆశ్చర్యపోయాయి. బాలినేనికి ముఖ్యమంత్రి వద్ద ప్రాధాన్యత లేదనడానికి నిదర్శనమా అన్న అనుమానాలూ వ్యక్తమయ్యాయి.
కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో బాలినేనికి సీఎం ఉద్వాసన పలకడంతో ఆయన ఇప్పటికే అసంతృప్తితో ఉన్నారు. పునర్వ్యవస్థీకరణ సమయంలో ఆయన తన అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేశారు. ఆ తరువాత ఏదో సద్దుకుపోయినా, తాజాగా ఎదురయిన అవమానం పుండుమీద కారం చల్లినట్లుగా అయ్యిందని పార్టీ శ్రేణులే అంటున్నాయి. ఇక ముఖ్యమంత్రి మార్కాపురం వచ్చిన తరువాత బాలినేనిని పోలీసులు నిలిపివేయడంతో ఆయన వెనక్కు వెళ్లిపోయిన సంగతి తెలుసుకున్న జగన్ స్వయంగా బాలినేనికి ఫోన్ చేసి పిలిపించారు.
దాంతో ఆయన వెనక్కు వచ్చి సీఎంతో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. అయినా ఆయనలో పరాభవ భారం కనిపిస్తూనే ఉంది. కార్యక్రమం మొత్తం ముభావంగానే ఉన్నారు. తన అసంతృప్తిని దాచుకోలేదు. అది ఆయన ముఖంలో కనిపిస్తూనే ఉంది. ఇదే విషయాన్ని ఆయన అనుచరవర్గం కూడా చెబుతున్నారు. జరిగిన సంఘటన చూస్తుంటే పొమ్మనలేక పొగపెడుతున్నట్లుగా ఉందని అంటున్నారు.