విశాఖ ఉక్కు సరే తెలంగాణలో మూతపడిన పరిశ్రమల మాటేంటి?..లక్ష్మణ్
posted on Apr 12, 2023 @ 5:02PM
తెలంగాణలో మూతపడిన పరిశ్రమలను తెరిచే దిక్కులేదు కానీ, విశాఖ ఉక్కు పరిశ్రమ గురించి మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. వంద రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తామని చెప్పారని, ఆ హామీ ఇచ్చి ఇన్నేళ్లయినా ఎందుకు అమలు చేయడం లేదని ఎంపీ లక్ష్మణ్ నిలదీశారు. హెచ్‌ఎంటీ, ఐడీపీఎల్, అజంజాహీ మిల్ మాటేమిటని ప్రశ్నించారు. ఈ భూములపైన బీఆర్‌ఎస్ నేతలు కన్నేశారని అందుకే వాటిని తెరిపించే విషయంలో మౌనం వహిస్తున్నారని లక్ష్మణ్ ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో డిమాండ్ కు తగ్గ బొగ్గు ఉత్పత్తి లేకపోవడంతో దిగుమతి చేసుకునే వారని, వారికి కావాల్సిన వారికి బొగ్గు నిక్షేపాలు ఇచ్చేసి బొగ్గు కుంభకోణంలో కాంగ్రెస్ కూరుకుపోయింది. బయ్యారం ప్రమేయం లేకుండానే కడప స్టీల్ ప్లాంటు నడుస్తోందని, కడపలో జిందాల్ స్టీల్ ప్లాంటు ఏర్పాటు చేసిందని ఆయన గుర్తు చేశారు.
నల్లగొండలో యురేనియం పుష్కలంగా ఉంది, అక్కడ నిక్షేపాలను వెలికి తీస్తే అనేక మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. వీటికి దిక్కు లేదు కానీ , వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు వెళ్తారా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్.. తన చుట్టూ పది మందిని పెట్టుకుని నోటికి హద్దూ అదుపూ లేకుండా మాట్లాడుతున్నారని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని కొల్లగొడుతుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరని లక్ష్మణ్ హెచ్చరించారు.
తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్ వాడిన భాషను ఆంధ్ర ప్రజలు ఎన్నటికీ మర్చిపోరని, ఇప్పుడు విశాఖ స్టీల్ అంటూ మోసం చేయాలని చూస్తున్నారనీ, అయితే జనం నమ్మరని అన్నారు. జాతీయ పార్టీ అని చెప్పుకునే కేసీఆర్ కు ఏపీలో పార్టీ సింబల్‌కే దిక్కు లేని పరిస్థితి ఉందన్నారు. ముందు మన ఇల్లు చక్కదిద్దుకుని... తర్వాత పక్కోడి ఇల్లు గురించి తీరిగ్గా ఆలోచించాలని లక్ష్మణ్ కేసీఆర్ కు సూచించారు.