తెలుగు రాష్ట్రాల మంత్రుల మధ్య మాటల యుద్ధం
posted on Apr 13, 2023 @ 9:53AM
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ బిడ్డింగ్ వ్యవహారంలో తెలుగు రాష్ట్రాల నడుమ చెలరేగిన మాటల మంటలు చల్లారకముందే తాజాగా తెలంగాణ మంత్రి హరీష్ రావు ఏపీలో అభివృద్ధి శూన్యమని, ఇక్కడ స్థిరపడ్డ ఆంధ్ర ప్రాంత ప్రజలు వారి రాష్ట్రంలో ఓటు- హక్కును రద్దు చేసుకుని తెలంగాణాలో నమోదు చేసుకోవాలని సూచించారు. తెలంగాణ మంత్రి హరీష్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు కారుమూరి నాగేశ్వర రావు, బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
అసలు హరీష్ రావ్ ఏమన్నారంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలన ఎలా ఉందో అక్కడి నుంచి తెలంగాణకు వచ్చి స్థిరపడిన కార్మికులను అడిగితే తెలుస్తుంది. అభివృద్ధిలో తెలంగాణకు- ఆంధ్రప్రదేశ్‌కు భూమికి -ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. సంగారెడ్డిలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన హరీష్ ఎంతో మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి తెలంగాణాలో స్థిరపడ్డారని ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఇక్కడ ఉంటున్నారన్నారు. ఏపీ, తెలంగాణలను చూశారు.. ఏపీలో రోడ్లు, ఆస్పత్రుల పరిస్థితి దారుణంగా ఉంది. అక్కడ మీకు ఓటెందుకు ? అక్కడ ఓటును రద్దు చేసుకుని తెలంగాణాలో ఓటు నమోదు చేసుకోండని హితవు పలికారు.
ఈ వ్యాఖ్యలే ఏపీ మంత్రులకు తీవ్ర ఆగ్రహం కలిగించాయి. దానిపైనే ఏపీ, తెలంగాణ మంత్రుల మధ్య మాటల యుద్ధానికి తెరతీశాయి. తెలంగాణ మంత్రి హరీష్ రావు లక్ష్యంగా ఏపీ మంత్రులు ఎదురు దాడికి దిగుతున్నారు. వారి వ్యాఖ్యలపై హరీష్ రావు మరోసారి అదే స్థాయిలో విరుచుకుపడ్డారు, సంగారెడ్డి జిల్లా ఆందోల్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, తెలంగాణలో ఏముందని ప్రశ్నించిన ఏపీ మంత్రి ఇక్కడికి వచ్చి చూస్తే ఏముందో తెలుస్తుందని సవాల్ చేశారు. 56 లక్షల ఎకరాల్లో యాసంగి పంట ఉంది.. బోరు బావుల వద్ద 24 గంటల కరెంటు ఉంది. కేసీఆర్ కిట్ ఉంది.. కల్యాణ లక్ష్మి ఉంది. ఎకరానికి పదివేలు ఇచ్చే రైతు బంధు, రైతు బీమా ఉంది అంటూ రాష్ట్రంలో అమలు చేస్తోన్న పథకాల గురించి చెప్పుకొచ్చారు.
ఇదే సమయంలో.. ఏపీలోని రాజకీయ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు హరీష్‌రావు. ప్రత్యేక హోదాకు కేంద్రం ఎగబెట్టినా ఏమీ అడగరు. ఏపీలో ఏముంది.? అని ప్రశ్నించారు. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఎవరూ మాట్లాడటం లేదన్న ఆయన. విశాఖ ఉక్కును తుక్కు కింద అమ్మకానికి పెట్టినా నోరెత్తరు.. అధికార పార్టీ అడగదు, ప్రతిపక్షం ప్రశ్నించదని పరోక్షంగా తెలుగుదేశం పార్టీపై కూడా విమర్శలు గుప్పించారు. వైకాపా, తెదేపా రెండు పార్టీలు జనాన్ని గాలికి వదిలేసి స్వార్థం కోసం పనిచేస్తున్నాయని మండిపడ్డారు. అనవసరంగా మా జోలికి రాకండి, మా గురించి ఎక్కువ మాట్లాడకండి. అది మీకే మంచిదని ఆంధ్ర మంత్రులకు హరీష్ హెచ్చరించారు.
తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావుపై ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు సీరియస్ అయ్యారు. హరీష్ రావు.. దౌర్భగ్యమైన మాటలు మాట్లాడకు అంటూ చురకలు అంటించారు. ధనిక రాష్ట్రాన్ని (తెలంగాణ) మీ చేతిలో పెడితే ఏం చేశారో తెలియదా? అంటూ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో వర్షం వస్తే ఇళ్ల మీద నుంచి నీళ్లు వెళ్తున్నాయి. హరీష్ మీ రాష్ట్రంలో స్కూళ్లు, మా రాష్ట్రంలో స్కూళ్ల తేడా చూసుకో. తెలంగాణలో సంక్షేమ పథకాలు మా సంక్షేమ పథకాలకు తేడా చూడు. జీడీపీలో మేం దేశంలోనే నంబర్ వన్‌లో ఉన్నాం. ముందు మీ రాష్ట్రం సంగతి చూసుకోండి. అంటూ విమర్శలు చేశారు. అలాగే, ఏపీలో జరుగుతున్న అభివృద్ధి గురించి తెలుసుకొని మాట్లాడాలని ఆయన హితవు పలికారు.
తెలంగాణాలో అభివృద్ధిపై భారాస ప్రభుత్వం దృష్టి సారిస్తే మంచిదని ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ హితవు పలికారు. హరీష్ రావుకు ఏం సంబంధం ఉందని ఏపీ గురించి మాట్లాడుతున్నారు. రాష్ట్ర అభివృద్ధిపై మాట్లాడడానికి హరీష్ రావు ఎవరు? బాధ్యత గల వ్యక్తులు బాధ్యత గుర్తెరిగి మాట్లాడాలన్నారు.
మొత్తం మీద తెలంగాణ, ఆంధ్ర మంత్రులు మధ్య మాటల యుద్ధంతో వాతావరణం హీటెక్కుతోంది. రానున్న రోజుల్లో ఇది ఏ మలుపు తిరుగుతోందనని ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. మరి కొన్ని నెలలో రెండు రాష్ట్రాలలో ఎన్నికలు రానున్నాయి.. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకుల తమ వాగ్యుద్ధంతో వాతావరణం గరం గరం అవుతోంది.