కోడి కత్తి కేసులో కుట్ర లేదు.. కోర్టుకు చెప్పిన ఎన్ఐఏ
posted on Apr 13, 2023 @ 3:11PM
కోడికత్తి దాడి కేసులో కుట్ర కోణం లేదని జాతీయ దర్యాప్తు బృందం (ఎన్ఐఏ) స్పష్టం చేసింది. ఈ కేసులో లోతైన దర్యాప్తు జరపాలంటే జగన్ ఎన్ఐఏ కోర్టులో దాకలు చేసిన పిటిషన్ ను కొట్టివేయాలని కోరింది. ఈ కేసులో ఎలాంటి కుట్ర కోణం లేదనీ.. ఇదంతా సమయం వృధా వ్యవహారమనీ ఎన్ఐఏ కుండ బద్దలు కొట్టింది.
ఈ కేసులో నిందితుడిగా గత నాలుగేళ్లుగా జైల్లో ఉన్న జనపల్లి శ్రీను తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడు కాదని పేర్కొంది. దీంతో తన హత్యకు కుట్ర అంటూ విపక్ష నేతగా పట్టుబట్టి సాధించుకున్న ఎన్ఐఏ దర్యాప్తు జగన్ నాడు చెప్పిన దాంట్లో వాస్తవం లేదని తేల్చింది. కోడికత్తి కేసులో మరింత లోతైన దర్యాప్తు జరపాలంటే జగన్ దాఖలు చేసుకున్న పిటిషన్ కు ఎన్ఐఏ కౌంటర్ వేసింది. ఎయిర్ పోర్టులోని ఫ్యూజన్ రెస్టారెంట్ ఓనర్‌కు ఈ ఘటనతో సంబంధం లేదని స్పష్టం చేశారు. గత వాయిదాలో సీఎం జగన్ తరపు న్యాయవాది రెండు పిటిషన్ లు దాఖలు చేశారు. విచారణకు రాకుండా మినహాయింపు ఇవ్వాలని, అలాగే కోడి కత్తి కేసులో కుట్ర కోణాన్ని వెలికి తీయడంలో ఎన్ఐఏ విఫలమైందనీ, మరింత లోతైన విచారణ చేపట్టేలా ఎన్ ఐ ఏ ను ఆదేశించాలని ఆ పిటిషన్లలో కోరారు.
అయితే కుట్ర లేదని ఎన్ఐఏ తేల్చేసింది. అయితే విపక్షాలు మాత్రం కోడి కత్తి కేసు ఒక కుట్ర అంటూ ఆరోపణలు గుప్పిస్తున్నాయి. వాస్తవానికి నాడు విశాఖ విమానాశ్రయంలో అప్పటి విపక్ష నేత జగన్ పై ఎలాంటి దాడీ జరగలేదనీ, కేవలం సానుభూతి కోసం ఆడిన నాటకమని ఆరోపిస్తున్నాయి.
సానుభూతి కోసం కుట్ర పూరితంగా జరిగిన ఉత్తుత్తి దాడి అంటున్నాయి. ఇలా ఉండగా ఎన్ఐఏ కోర్టు కోడికత్తి కేసు తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.