జగనన్నా నిన్ను నమ్మలేమన్నా!
రాజకీయ పార్టీల మనుగడకు సమర్ధ నాయకత్వం అవసరం. అది మోడీ కావచ్చు, రాహుల్ గాంధీ, చంద్రబాబు, కేసీఆర్, జగన్ రెడ్డి లేదా ఇంకైవరైనా కావచ్చును. ఒక రాజకీయ పార్టీ మనుగడ పార్టీ నాయకుల మీద ఆధారపడి ఉంటుంది. నాయకుడు ముందుండి పార్టీని నడిపిస్తేనే పార్టీ ముందుకు సాగుతుంది. అంతే కానీ, నాయకుడు అన్నవాడు ప్యాలెస్ లో కూర్చుని కొరడాతో అదిరిస్తాననే అహంకార ధోరణి ప్రదర్శిస్తే ఆ ఆట అట్టే కాలం సాగదు. అందులో సందేహం లేదు.
అలాగే అదే సమయంలో కేవలం సమర్ధ నాయకత్వం ఉంటే సరిపోతుందా? అంటే సరిపోదు. కింది నుంచి పైదాకా పార్టీ నిర్మాణం ఉంటేనే పార్టీ ముందుకు సాగుతుంది. నాయకుడుకి పార్టీ జెండామోసే కార్యకర్తలకు దూరం ఎంతగా పెరిగితే, పార్టీ అంతగా నష్ట పోతుంది. ఇప్పుడు ఏపీలో అధికార వైసీపీ విషయంలో అదే జరుగుతోంది. ఆ పార్టీకే చెందిన కార్యకర్తలు, నాయకులు. చివరకు, వైసీపీకి ఓటేసి తప్పు చేశామని సర్పచులు చెప్పుతో కొట్టుకునే పరిస్థితి వచ్చిందంటే, ఏపీలో వైసీపీ పరిస్థితి ఏమిటో వేరే చెప్పనక్కరలేదు.
నిజానికి ఈ రోజున అధికార పార్టీలో నాయకత్వానికి, కార్యకర్తలకు మధ్య దూరం అంతో ఇంతో కాదు, ఏకంగా ఏ లంగరుకు అందనంతగా పెరిగింది. అగాధంగా మారింది. అడ్డు గోడల ఎత్తు రోజురోజుకూ పెరిగిపోతోంది. అంతేకాదు వైసీపీ నాయకులు ఎవరిని అడిగినా కార్యకర్తలు, ఓటర్ల విషయం పక్కన పెట్టండి, మంత్రులు, ఎమ్మెల్యేలకు సైతం ముఖ్యమంత్రి దర్శన భాగ్యం కలగడం లేదనే మాటే సమాధానంగా వస్తోంది.
అయితే ఇటీవల ముఖ్యమంత్రి, రాజకీయాలంటే మానవ సంబంధాలు అంటూ చాలా గంభీర ప్రకటన చేశారు. అంతే కాదు ఈ గుణాన్ని, నాన్న నుంచి నేర్చుకున్నాను అని పెద్దాయన సెంటిమెంట్ ను ఉపయోగించుకున్నారు. అంతకు ముందుకు భిన్నంగా, ఎమ్మెల్యేలను ఛీ ..ఛా .. అనకుండా, బుజ్జగించే ప్రయత్నం చేశారు. అంత వరకు మీ పనితీరు మెరుగు పరచుకుంటారా.. మిమ్మల్నే పీకేయ మంటారా ? అంటి గర్జించిన జగన్ రెడ్డి స్వరం మార్చి, నేను ఎమ్మెల్యేలను వదులుకోను, కార్యకర్తలను పోగొట్టుకోవాలని అనుకోనుఅంటూ బుజ్జగింపులకు దిగారు.
అయితే ముఖ్యమంత్రిలో ఈ మార్పు ఎంతవరకు నిజమో, ఎంతవరకు నటనో అనే విషయాన్ని పక్కన పెడితే ముఖ్యమంత్రిలో ‘మార్పు’ వచ్చే సరికే పుణ్యకాలం పూర్తయిందని, ఇప్పుడు చేతులు కాలిన తర్వత ఆకులు పట్టుకున్నా ప్రయోజనం లేదని పార్టీ నేతలు గుసగుసలు పోవడం కాదు, గట్టిగానే అంటున్నారు.
ముఖ్యంగా ఈ నెల 7 నుంచి ప్రారంభమైన, ‘మా నమ్మకం నువ్వే జగనన్నా’ కార్యక్రమంలో వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నాయకత్వంపై, ఆ పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకుల్లో భగ్గుమంటున్న అసమ్మతి పార్టీకి, ప్రభుత్వానికి మధ్య ఏర్పడిన అగాధం లోతులకు అద్దం పడుతోందని అంటున్నారు. నిజానికి, ఏప్రిల్ 7 కార్యక్రమం కొంత ఉత్సాహంగానే మొదలైంది, అయితే ఇక అక్కడ నుంచి రోజు రోజుకు దిగజారి మూడు రోజులకే మొక్కుగ్గుబడి తంతుగా మారింది.
నిజానికి సంవత్సర కాలంగా సాగుతున్న గడప గడపకు కార్యక్రమంలోనే ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు, కార్యకర్తలకు జనం నాడి అర్థమైంది. అందుకే గడప గడపకు కార్యక్రమంపై ఎన్ని సమీక్షలు నిర్వహించినా ఫలితం లేక పోయింది. ఇప్పడు దానికి కొనసాగింపుగా, దింపుడు కళ్ళెం ఆశతో చేపట్టిన ‘మా నమ్మకం నువ్వే జగనన్నా’ కార్యక్రమంలోనూ అవమానలే ఎదురవుతున్నాయని వైసీపే నాయకులు వాపోతున్నారు.
నిజానికి ఫెయిల్ అయింది నిన్నటి గడప గడపకు, ఇప్పటి ‘మా నమ్మకం నువ్వే జగనన్నా’ కార్యక్రమాలు కాదు వైసీపీ ప్రభుత్వం, జగన్ రెడ్డి నాయకత్వం. ఈ వాస్తవాన్నిగుర్తించికుండా, ఐ ప్యాక్ ను నమ్ముకుని ఇప్పటి ‘మా నమ్మకం నువ్వే జగనన్నా’ వంటి ఎన్ని కార్యక్రమాలు చేసినా లక్షల సంఖ్యలో గృహ సారథులను నియమించినా అందులో ఒకరిని సచివాలయం పరిధిలో చైర్మన్ గా నియమించి .. లేదా ఇంకా ఇలాంటి చిల్లర నిర్ణయాలు ఎన్ని తీసుకున్నా ఫలితం ఉండదని పరిశీలకులు అంటున్నారు. చివరకు, ఇంతచేసినా ఇంతేనా అని వాపోక తప్పదని అంటున్నారు. అన్నిటినీ మించి అసలు లోపం ప్యాలెస్ లో పెట్టుకుని, ఎవరినో బాధ్యులను చేయాలను కుంటే ఎలా? అంటున్నారు. అందుకే, జనం జగనన్నా... నిన్ను నమ్మలేమన్నా అంటున్నారు .. వైసీపీ అభిమానులు. చెప్పులతో కొట్టుకుంటున్నారు.