రాహుల్ సారథ్యంలో విపక్షాల ఐక్యత సాధ్యమేనా?
posted on Apr 13, 2023 @ 3:05PM
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో ‘హస్త’ రేఖలు మారి పోయాయి. కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ మంచి రోజులు వస్తాయనే ఆశలు ఊపిరి పోసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీలో, పార్టీ అభిమానుల్లో జోష్ పెరిగింది. ముఖ్యంగా, కాంగ్రెస్ పట్ల ప్రేమ కంటే, కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ పట్ల వ్యతిరేకత కోణంలో రాజకీయాలను విశ్లేషించే రాజకీయ పండితులు ఆ ఆశలను సజీవంగా ఉంచే విధంగా విశ్లేషణలు వినిపించారు.
అదే సమయంలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా కాంగ్రెస్ ఫస్ట్ ఫ్యామిలీ బయటి వ్యక్తి, మల్లికార్జున ఖర్గే ఎన్నిక కావడం అంతవరకు పార్టీ భవిష్యత్ పట్ల ఆశలు వదులుకున్న జీ 23 నేతలు సహా, అంతవరకు స్తబ్దుగా ఉన్న నాయకులు, కార్యకర్తలు కూడా కొంత క్రియాశీలంగా మారారు. అదే క్రమంలో హిమచల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో కాంగ్రెస్ పార్టీలో నిజంగానే కొత్త ఉత్సాహం కనిపించింది.
అయితే భారత్ జోడో యాత్ర పూర్తిచేసుకుని విదేశీ యాత్రలకు వెళ్ళిన రాహుల్ గాంధీ, బ్రిటన్ లో చేసిన వ్యాఖ్యలు దేశంలో దుమారం లేపాయి. ముఖ్యంగా భారత దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, అయినా అమెరికా, యూరప్ దేశాలు పట్టించుకోవడం లేదని చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్నే రేపాయి. భారతీయ జనతా పార్టీ ( బీజేపీ) రాహుల్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పు పట్టింది. భారత అంతర్గత వ్యవహారాల్లోకి విదేశాల జోక్యాన్ని రాహుల్ గాంధీ ఆహ్వానించారని ఆరోపించింది. అందుకు ఆయన దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని పార్లమెంట్ లోపల వెలుపల కూడా డిమాండ్ చేసింది.
అదే సమయంలో కాంగ్రెస్ సారథ్యంలోని ప్రతిపక్ష పార్టీలు అదానీ- హిడెన్ బర్గ్ వివాదంపై జేపీసీకి డిమాండ్ చేయడంతో పార్లమెంట్ రెండవ విడత బడ్జెట్ సమావేశాలు, పూర్తిగా తుడిచి పెట్టుకు పోయాయి. రూ.45లక్షల కోట్ల బడ్జెట్ ఒక్క నిముషం చర్చ లేకుండానే ‘సభ’ ఆమోదం పొందింది.
అదలా ఉంటే.. అదే సమయంలో ప్రధాని మోడీ ఇంటి పేరుకు నేర చరితులకు సంబంధం అంటకడుతూ, ‘అందరు దొంగల ఇంటి పేరు మోడీనే ఎందుకుంటుందంటూ రాహుల్ గాంధీ ఎప్పుడో 2019లో చేసిన వ్యాఖ్యలు రాహుల్ గాంధీ మెడకు ఉచ్చు బిగించాయి. ఈ వ్యాఖ్యల పై దాఖలైన కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా నిర్దారిస్తూ తీర్పు నిచ్చింది. రెండేళ్ల జైలుశిక్ష విధించింది. రాహుల్ గాంధీ దోషిగా తేలిన పర్యవసానంగా, అయనపై అనర్హత వేటు పడింది. లోక్ సభ సభ్యత్వం రద్దయింది.
ఇప్పడు ఇందుకు సంబందించి సుప్రీం కోర్టులో కేసు నడుస్తోంది. సుప్రీం కోర్టు తీర్పు ఆధారంగా రాహుల గాంధీ వ్యక్తిగత, రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. సూరత్ కోర్టు విధించిన రెండేళ్ళ జైలు శిక్షను సుప్రీం కోర్టు థృవీకరిస్తే, రాహుల్ గాంధీ ప్రస్తుత సభ్యతం కోల్పోవడమే కాకుండా మరో ఎనిమిదేళ్ళ పాటు ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను కూడా కోల్పోతారు. సుప్రీం కోర్టు సూరత్ కోర్టు విధించన శిక్షను రెండు సంవత్సరాల కంటే తక్కువ కాలానికి తగ్గిస్తే, అనర్హత వేటు తొలిగి పోతుంది. ఆయన వాయనాడ్ ఎంపీగా కొనసాగుతారు. ఎన్నికల్లోనూ పోటీ చేసందుకు అర్హత పొందుతారు.
అయితే, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ కష్టాలు అక్కడితో తీరి పోతాయా అంటే అలాంటి సంకేతాలు కనిపించడం లేదు. రాహుల్ గాంధి పాదయాత్ర ‘సక్సెస్’ తర్వాత కూడా ఆయన నాయకత్వానికి ఇంటా బయట ఎక్కడా సంపూర్ణ ఆమోదం లభించడం లేదు. రాహుల్ నాయకత్వం పై ప్రజల విశ్వాసం సంగతి పక్కన పెట్టినా, కాంగ్రెస్ నాయకులకు, మిత్ర పక్షాలకు సైతం రాహుల్ నాయకత్వం పై పూర్తి భరోసా విశ్వాసం ఏర్పడలేదు.
నరనరాల్లో కాంగ్రెస్ రక్తం నింపుకున్నా కేంద్ర మాజీ మంత్రి ఏకే అంటోనీ కుమారుడు అనిల్ కె అంటోనీ, కాంగ్రెస్ పార్టీలో పుట్టి, కాంగ్రెస్ పార్టీలో ఎదిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, స్వాతంత సమర యోధుడు,రాజాజీగా పేరొందిన, స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త. స్వతంత్ర భారతదేశపు మొదటి, చివరి గవర్నర్ జనరల్. చక్రవర్తి రాజగోపాలాచారి మనవడు సి ఆర్ కేశవన్ ఒకే వారంలో రోజుల తేడాలో కాంగ్రెస్ ను వదిలి బీజేపీలో చేరారు.
నిజానికి ఇక్కడ కాంగ్రెస్ నాయకులు బీజేపీలో చేరటం విశేషం కాదు. బీజేపీ సిద్ధాంతాలు నచ్చి లేదా మోదీ పాలన బ్రహ్మాండం అనుకుని వారు బీజేపీలో చేరితే అది వేరే విషయం. అయితే, ఇక్కడ ఆ ముగ్గురిలో ఏ ఒక్కరు కూడా బీజేపీ నచ్చి బీజేపీలో చేరలేదు. కాంగ్రెస్ నచ్చక, రాహుల్ గాంధీ నాయకత్వం నచ్చక, ఇక కాంగ్రెస్ పార్టీని బతికించడం అయ్యే పని కాదని మరో గత్యంతరం లేక బీజేపీలో చేరారు. నిజానికి ఈ ముగ్గురు మాత్రమే కాదు, కపిల్ సిబల్, గులాన్ నబీ ఆజాద్, చౌదరి బీరేంద్ర సింగ్,కెప్టెన్ అమరీందర్ సింగ్, రావ్ ఇంద్రజిత్ సింగ్, జ్యోతిరాదిత్య సింధియా, జితిన్ ప్రసాద, ఆర్పీఎన్ సింగ్, హార్దిక్ పటేల్ ఇలా చెప్పుకుంటూ పోతే, ఈ స్కోర్ సెంచరీ దాటేస్తుంది. ఇంతమందిలో ఏ ఒక్కరూ కూడా కాంగ్రెస్ సిద్ధాంతాలు లేదా విధానాలు నచ్చక పార్టీని వదిలి పోలేదు. రాహుల్ గాంధీ నాయకత్వం నచ్చక, అయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవం సాధ్యం కాదన్న నిర్ణయానికి వచ్చి మనసు రాయి చేసుకుని మరీ కాంగ్రెస్ ను వదిలి పెట్టి పోయారు.
అలాగే, అదానీ వ్యవహారంలో రాహుల్ గాంధీ తీసుకున్న స్టాండ్ తో విభేదించి ఎన్సీపీ అధినేత శరద్ పవార్, తృణమూల్ అధినాయకురాలు మమతా బెనర్జీ కాంగ్రెస్ కు దూరంగా అడుగులు వేస్తున్నారు. అలాగే, సావర్కార్’ ను అవమానిస్తూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై శివసేన ( ఉద్దవ్ థాక్రే) భగ్గు మంది. ఇలా మిత్ర పక్షాలు రాహుల్ కారణంగా కాంగ్రెస్ కు దురమవుతున్నాయి. అందుకే, మళ్ళీ సోనియా గాంధీ తెరమీదకు వచ్చి, బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్ష్లాలు కలసిరావాలని పిలుపు నిచ్చారు. కానీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో పని చేసేందుకు ప్రతిపక్షాలు సిద్ధంగా లేవు. అందుకే, విపక్షాల ఐక్యతకు రాహుల్ గాంధీనే అవరోధం అనే అభిప్రాయం బలపడుతోందని పరిశీలకులు అంటున్నారు.