పలువురు ఎమ్మెల్యేలు డుమ్మా.. పార్టీపై జగన్ పట్టు సడలిందా?
వైసీపీ బండారం బయటపడిపోయింది. పార్టీలో అసమ్మతి, అసంతృప్తి తారస్థాయిలో ఉన్నాయన్న విషయాన్ని ఇంత కాలం వైసీపీ జగన్ గుప్పెట్లో మూసి కప్పి పెట్టినా ఇప్పుడా బండారం బయటపడిపోయింది. ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ రెడ్డి సోమవారం (ఏప్రిల్ 3) నిర్వహించిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ చార్జిలు, ప్రాంతీయ సమన్వయ కర్తల సమావేశాలని పలువురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడమే ఇందుకు తార్కానంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఇలా డుమ్మా కొట్టిన వారిలో జగన్ కు గట్టి మద్దతుదారులుగా ముద్ర పడిన కొడాలి నాని, ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా కూడా గైర్హాజరయ్యారు. అలాగే మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ధర్మాన ప్రసాదరావు, విడదల రజని తదితరులు సైతం డుమ్మా కొట్టారు. అదే విధంగా సకల శాఖల మంత్రిగా గుర్తింపు పొందిన సజ్జల రామకృష్ణారెడ్డి సైతం ఈ భేటీలో కనిపించలేదు. ధర్మాన ప్రసాదరావు ఆసరా కార్యక్రమం చెక్కుల పంపిణీ ఉన్నందున రాలేకపోయారని ఆయన వర్గీయులు చెబుతున్నా ఆ మాటలు పెద్దగా నమ్మదగ్గవిగా లేవని పార్టీ శ్రేణులే అంటున్నారు.
ఇక మంత్రి బుగ్గన అయితే కోవిడ్ బారిన పడటం వల్ల సమావేశానికి రాలేకపోయారని అంటున్నారు. విడదల రజని త్వరలో తన నియోజకవర్గంలో సీఎం పర్యటన ఉన్నందున అందుకు సంబంధించిన ఏర్పాట్లలో బిజీగా ఉండి రాలేదని చెబుతున్నారు. వీరే కాక మరి కొందరు కూడా ఈ కీలక సమావేశానికి డుమ్మా కొట్టారు. ఎవరికి వారు ఏవేవో కారణాలు చెబుతున్నా, ఒక్క బుగ్గనకు తప్ప మరెవరికీ ఈ సమావేశానికి గైర్హాజరవ్వడానికి క్రెడిబుల్ కారణాలు లేవనే పరిశీలకులు అంటున్నారు. మొత్తం మీద ఎమ్మెల్యేలు, మంత్రులలో విస్పష్టంగా బయటపడుతున్న అసమ్మతి దెబ్బకు జగన్ దిగి వచ్చారు. అందుకే పార్టీ ఎమ్మెల్యేలూ, సమన్వయ కర్తలూ, నియోజకవర్గ ఇన్ చార్జిల సమావేశంలో ఆయన స్వరం పూర్తిగా మారిపోయింది.
గతంలో నిర్వహించిన గడపగడపకూ మన ప్రభుత్వం సమీక్షలలోలా ఈ సారి ఆయన నోటి వెంట హెచ్చరికలు రాలేదు. మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై విమర్శలు లేవు. రుసరుసలు లేవు. వచ్చే ఎన్నికలలో పార్టీ టికెట్లివ్వను జాగ్రత్త అన్న బెదరింపులు లేవు. అన్నిటికీ మించి టోన్ మారింది. హెచ్చరికల నుంచి బుజ్జగింపులకు దిగి వచ్చారు. ఎమ్మెల్యేలలో అసంతృప్తి, ధిక్కారం ఇవన్నీ విపక్షాల దుష్ప్రచారమన్నారు. ఎన్నికల సంవత్సరం కనుక మరింత కష్టపడి చేయాలని ఒక విధంగా బతిమలాడుతున్న స్వరంతె చెప్పారు. విపక్షాల ఉచ్చులో, వ్యూహంలో పడొద్దన్నారు. 60 మంది ఎమ్మెల్యేలలో అసంతృప్తి రగులుతోందన్నది పూర్తిగా దుష్ప్రచారం అని చెప్పుకున్నారు.
గడపగడపకూ బ్రహ్మాండంగా సాగుతోందనీ, అంతా చక్కగా పాల్గొంటున్నారనీ కితాబిచ్చారు. ముందస్తు ఎన్నికలనీ, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అనీ ఈ సమావేశానికి ముందు పార్టీ శ్రేణుల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన సమాచారం అంతా ఉత్తుత్తిదేనని జగన్ ఈ సమావేశం ద్వారా తేల్చేశారు. ఎన్నికలకు ఇంకా 14 నెలల సమయం ఉందనీ, ఈ కాలంలో కష్టించి పని చేసి ప్రభుత్వ, పార్టీ గ్రాఫ్ పడిపోకుండా చూడాలని ఎమ్మెల్యేలను కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో అసలు పార్టీకీ, ప్రభుత్వానికీ ఎలాంటి ఎదురు దెబ్బే తగలలేదని, బ్రహ్మాండంగా 17 స్థానాలలో గెలిచామనీ, ఓడింది కేవలం నాలుగు స్థానాలలో మాత్రమేనని చెప్పుకొచ్చారు. ఈ సమావేశంలో జగన్ ప్రసంగం, ఆయన తీరు పార్టీ నాయకులు, శ్రేణులనే కాదు, పరిశీలకులను సైతం నివ్వెరపరిచింది.
ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు పార్టీకి దూరం అయ్యారు. అత్యంత కీలకం అని చెబుతూ జగన్ సోమవారం (ఏప్రిల్ 3) నిర్వహించిన సమావేశానికి పలువురు డుమ్మా కొట్టారు. డమ్మా కొట్టిన వారిలో ఎక్కువ మంది పార్టీకి కానీ, అధినేతకు కానీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే గైర్హాజరయ్యారు. దీంతో జగన్ ప్రదర్శిస్తున్నది మేకపోతు గాంభీర్యమేననీ, ఆయనకు పార్టీపై పట్టు పూర్తిగా సడలిపోయిందనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ సమావేశం అనంతరం పార్టీలో అసమ్మతి మరింత పెచ్చరిల్లినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.