కర్ణాటకలో మళ్ళీ హంగ్? సీఎం కుమారస్వామేనా?

కర్ణాటక శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. సహజం ఎన్నికల సమయంలో ప్రధాన రాజకీయ పార్టీలలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఏ పార్టీ అధికార పగ్గాలు చేపడుతుంది? అనే చర్చ జరుగుతుంది. కానీ, కర్ణాటకలో మాత్రం, పొలిటికల్ ఫోకస్ మొత్తం మూడో పార్టీ పైనే వుంది. అవును.. అధికార బీజేపీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ ఉంటుంది. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. అయితే కర్ణాటకలో మరో మారు హంగ్ తప్పదనే వ్యూహాగానాలు బలంగా వినిపిస్తున్న నేపధ్యంలో,  రేసులో ఉన్న మూడో పార్టీ జేడీఎస్ ఎటు మొగ్గు చూపుతుంది అనేది ఇప్పడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. నిజానికి కర్ణాటకలో హంగ్ అసెంబ్లీ, సంకీర్ణ ప్రభుత్వాలు కొత్త కాదు. అలాగే అలాంటి పరిస్థితి వచ్చిన ప్రతిసారీ జేడీఎస్ కింగ్ ఆర్  కింగ్ మేకర్ గా కీలకంగా మారుతోంది. 2018 ఎన్నికల తర్వాత కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. 224 మంది సభ్యులున్న సభలో బీజేపీ 106 స్థానాల్లో విజయం సాధించి, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది.  కానీ మేజిక్ ఫిగర్ (113) చేరుకోలేక పోయింది.  దీంతో  78 సీట్లున్న కాంగ్రెస్ పార్టీ మద్దతుతో కేవలం 37 సీట్లు మాత్రమే గెలిచిన జేడీఎస్ ముఖ్యమంత్రి కుర్చీ ఎగరేసుకుపోయింది.  హెచ్ డీ కుమార స్వామి ముఖ్యమంత్రిగా  జేడీఎస్, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కొలువు తీరింది. ఆ తర్వాత ఏం జరిగిందనేది చరిత్ర.  సంకీర్ణంలో చిచ్చు రేగింది. సర్కార్ కూలి పోయింది. ఈ లోగా 15 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బీజేపీలో చేరి ఉప ఎన్నికల్లో గెలిచారు. ఆ విధంగా ఏడాది తిరగక ముందే   యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా  బీజేపీ పూర్తి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది,  ఆ తర్వాత యడ్యూద్యూరప్ప స్థానంలో బ‌స‌వ‌రాజు బొమ్మై ముఖ్యమంత్రిగా వచ్చారు. సరే ఆ చరిత్రను అలా ఉంచితే, రానున్న అసెంబ్లీ ఎన్నికలలోనూ కర్నాటకలో  అదే హంగ్  స్థితి పునరావృతం అయితే .. ఏం జరుగుతుంది?  కింగ్ మేకర్ జేడీఎస్ ఏమి చేస్తుంది అనే విషయంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు, మాజీ ప్రధాన మంత్రి దేవేగౌడ ..  హంగ్ వచ్చినా తమ పార్టీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని స్పష్తం చేశారు.  తన కుమారుడు హెచ్‌డీ కుమారస్వామి ఎవరితోనూ పొత్తులు పెట్టుకోరాదని నిర్ణయించారని దేవెగౌడ వెల్లడించారు. ఎన్నికల ముందు కానీ, తర్వాత కానీ పొత్తులు వద్దనుకున్నామన్నారు. రెండు జాతీయ పార్టీలు, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలతో పొత్తు ఉండదని తేల్చి చెప్పారు.  సొంతంగా అధికారంలోకి రావడంపైనే దృష్టి సారించామని దేవెగౌడ చెప్పారు. సొంతంగా అధికారంలోకి వస్తేనే మ్యానిఫెస్టోలో ప్రకటించే అన్ని కార్యక్రమాలనూ దిగ్విజయంగా అమలు చేయగలుగుతామన్నారు. అయితే  జేడీఎస్ ఒంటరిగా అధికారంలోకి రావడం అయ్యే పనికాదని, హంగ్ అంటూ వస్తే, కాంగ్రెస్ లేదా బీజేపీ మద్దతుతో కుమార స్వామి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేందుకు ప్రయత్నిస్తారని  పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కాగా, మే 10న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 115 నుంచి 127 స్థానాలు గెలుచుకోవచ్చని ఏబీపీ ఒపీనియన్‌ పోల్‌ సర్వే తెలిపింది. ఇదే జరిగితే జేడీఎస్ అవసరం కాంగ్రెస్‌కు ఉండదు. అయితే పీపుల్స్ పల్స్’ తదితర సంస్థలు కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చినా, మేజిక్ ఫిగర్  కు డజను సీట్ల దూరంలో ఉండి పోతుందని, సో .. జేడీఎస్ కింగ్ మేకర్ గా కంటిన్యూ అవుతుందని అంటున్నారు.  మరో వంక బీజేపే నాయకులు 150 సీట్లు గెలుస్తామనే ధీమాతో ఉన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా మిషన్ 150 వ్యూహరచన చేశారనీ అంటున్నారు. అలాగే కాంగ్రెస్ కూడా సింగిల్ గానే అధికారంలోకి వస్తామనే ధీమాతో ఉంది. అయితే బీజేపీ, కాంగ్రెస్ మ్యాజిక్ నెంబర్ చేరుకోకపోతే గత అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే జేడీఎస్ కింగ్‌మేకర్ పాత్రలోకి వెళ్తుంది. కాగా  పస్తుతం 224మంది సభ్యులున్న కర్ణాటక అసెంబ్లీలో బీజేపీకి 119 మంది, కాంగ్రెస్‌‌కు 75 మంది, జేడీఎస్‌కు 28మంది సభ్యులుండగా 2సీట్లు ఖాళీగా ఉన్నాయి. కర్ణాటక లో మే 10న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు మే 13న జరుగుతుంది.

పవన్ హస్తిన పర్యటన..జరిగిందేమిటి? ఒరిగిందేమిటి?

జనసేనాని హస్తిన పర్యటన పై ఏపీలో ఉవ్వెత్తున ఎగసిన ఉత్కంఠ ఆయన హస్తినలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించిన విషయాలతో చప్పున చల్లారిపోయింది. హఠాత్తుగా రాజస్థాన్ హాలీడే ట్రిప్ నుంచి అటు నుంచి అటే హస్తినలో వాలిన జనసేన బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్ చార్జ్ మురళీ ధరన్ తోనూ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోనూ భేటీ అయ్యారు. ఆ తరువాత మంగళవారం (ఏప్రిల్ 4) రాత్రి హస్తినలో విలేకరులతో మాట్లాడారు. ఆయన మాటలలో ఒక్కంటే ఒక్క కొత్త మాట లేదు. గత కొన్నాళ్లుగా ఆయన చెబుతున్నదే మరోసారి చెప్పారు. ఏపీలో వైసీపీ రాక్షస పాలనను అంతం చేయడమే తన లక్ష్యం అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ లక్ష్యం కూడా అదేనని ఉద్ఘాటించారు. కానీ బీజేపీ లక్ష్యం ఏమిటన్నది బీజేపీ నేతల నోటి నుంచే చెప్పించి ఉంటే ఆ ఎఫెక్ట్ మరింతగా ఉండేది. జనసేన అధినేతగా బీజేపీ జాతీయ అధ్యక్షుడితో భేటీ తరువాత ఇరువురూ కలిసి సంయుక్తంగా విలేకరుల ముందుకు వచ్చి ఏపీలో తమ రెండు పార్టీల లక్ష్యం ఒక్కటే అని ప్రకటించి ఉంటే.. ఆ మాటకు విశ్వసనీయత మరింతగా ఉండేది. అలా కాకుండా పవన్ కల్యాణ్ మాత్రమే మీడియా ముందుకు వచ్చి బీజేపీ లక్ష్యాన్ని ప్రకటించడమేమిటని పరిశీలకులే కాదు.. జనసేన శ్రేణులు కూడా ప్రశ్నిస్తున్నాయి. ఏపీలో జగన్ పాలనను అంతం చేయడమే తన లక్ష్యమని పవన్ కల్యాణ్ గత కొంత కాలం నుంచీ చెబుతూనే ఉన్నారు. అదే సమయంలో ఏపీలో తాను మిత్రపక్షంగా ఉన్న బీజేపీ రాష్ట్ర నాయకులతో తనకు అంతగా పొసగడం లేదని కూడా ఆయన పలుమార్లు వెల్లడించారు. అదే సమయంలో కేంద్రంలోని మోడీ, అమిత్ షాలపై తనకు అపారమైన గౌరవం, నమ్మకం ఉందనీ, ఏపీలో రాజకీయ పరిస్థితులపై వారితో చర్చించి, అధికార వైసీపీకి వ్యతిరేకంగా తాను చేస్తున్న పోరాటంలో కలిసి వచ్చేలా వారిని ఒప్పిస్తాని పవన్ కల్యాణ్ గతంలో పలు మార్లు చెప్పారు. అయితే  అటువైపు నుంచి అంటే బీజేపీ నుంచి మాత్రం పవన్ కు అటువంటి గౌరవం మర్యాదా దక్కుతోందా? అంటే పరిశీలకులు అనుమానమే అంటున్నారు.  బీజేపీ ఏపీ విషయంలో అటు  వైసీపీ అధినేత జగన్ తోనూ.. ఇటు జనసేనాని పవన్ కల్యాణ్ తోనూ ఆడుతున్నది పొలిటికల్ గేమ్ మాత్రమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇటు రాష్ట్ర బీజేపీ నేతలు, అటు జాతీయ స్థాయి నేతలూ కూడా పవన్ కల్యాణ్ విషయంలో డబుల్ గేమ్ అడుతున్నారా అన్న అనుమానాలు సైతం పరిశీలకుల్లో వ్యక్తం అవుతున్నాయి.  అసలు ఇంతకీ పవన్ కల్యాణ్ ను హస్తినకు పిలిపించుకుని చర్చించిన విషయం కర్నాటక ఎన్నికలపైనేని అంటున్నారు.   

కుటుంబ పాలనే కమల దళం అస్త్రం!

తెలంగాణ అసెంబ్లీ  ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ వేటికవి ఎన్నికల వ్యూహంతో ముందుకు సాగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్  తెర చాటు  వ్యూహరచన చేస్తుంటే, మరో ‘ముఖ్య’ నేత మంత్రి కీటీఆర్  క్షేత్ర స్థాయిలో ముందుండి యుద్ధానికి సేనలను సిద్దం చేస్తున్నారు. హరీష్ రావు వంటి ఇతర ముఖ్య నేతలను ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే వాడుకుంటూ కేటీఅర్ ఒంటి చేత్తో చక్రం తిప్పుతున్నారు.  అలాగే  బీఆర్ఎస్ ప్రభుత్వం ఎదుర్కుంటున్న సవాళ్ళను ముఖ్యంగా ముఖ్యమంత్రి కుటుంబం లక్ష్యంగా ఒకదాని వెంట ఒకటిగా వెంటపడుతున్నఅవినీతి ఆరోపణలను తిప్పి కొడుతూ కేటీఆర్ ముందుకు సాగుతున్నారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీపై పదునైన అస్త్రాలను సంధిస్తున్నారు. అలాగే, కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీని ఉద్దేశించి కేటీఆర్ చేస్తున్న విమర్శలు, ప్రయోగిస్తున్న భాష రోజు రోజుకు రాటు తేలుతోందన్న విమర్శలూ, ప్రశంసలూ కూడా వినవస్తున్నాయి.  భాష విషయంలో కేటీఆర్ కంటే కేసీఆరే కొంత నయం అనిపిస్తున్నారని బీజేపీ కార్యదర్శి ప్రకాశ్ రెడ్డి అన్నారంటే, కేటీఆర్  భాషాప్రయోగంలో ఎంతగా రాటుదేలారో అవగతమౌతుంది.   మరో వంక కాంగ్రెస్ పార్టీలో పాదయాత్రలు, అంతర్గత పంచాయతీలు  సమాంతరంగా సాగుతున్నాయి. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీనియర్ నాయకుల మధ్య సయోధ్య కుదిరినట్లే కుదిరి అంతలోనే మాయమై పోతోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ రేసులో  ఉందా లేదా అన్నది  అంతు చిక్కని ప్రశ్నగా ఉందని పరిశీలకులు అంటున్నారు. అయినా, నాయకుల తీరు ఎలా ఉన్నా, కాంగ్రెస్ పార్టీకి  ఉన్న సంస్థాగత బలం, ఓటు బ్యాంకు ఆ పార్టీకి శ్రీరామా రక్షగా పనిచేస్తుందని అంటున్నారు.  మరోవంక అంతిమ ఫలితాలు ఎలా ఉంటాయి అనేది పక్కన పెడితే, బీజేపీ మాత్రం బీఆర్ఎస్ కు ప్రధాన ప్రత్యర్ధిగా నిలిచేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా క్షేత్ర స్థాయిలో ఎన్నికల సన్నాహాలు సాగిస్తూ, మరో వంక అధికార పార్టీని ఆర్థిక అవకతవకల, అవినీతి కేసుల ఉచ్చులో అష్ట దిగ్బంధనం చేసేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందని పరిశీలకులు పేర్కొంటున్నారు. ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖర రావు కుటుంబ పాలన, కుటుంబ అవినీతిని ప్రధాన  ఎజెండాగా చేసుకుని పావులు కదుపుతోందని అంటున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ముఖ్యమంత్రి కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుట్ల కవితను, టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీక్ కేసులో ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి కల్వకుట్ల తాక రామా రావును ముద్దాయిలుగా చూపించి, వారి ఇమేజ్ ని డ్యామేజి చేసేందుకు శత విధాల ప్రయత్నిస్తోంది. ఇక ఇప్పడు తాజాగా, ప్రముఖ జర్నలిస్టు రాజ్దీప్ సర్దేశాయ్ బయట పెట్టిన రహస్యం  నేరుగా ముఖ్యమంత్రిని టార్గెట్ చేసేందుకు, సిద్దం చేసుకున్న అస్త్రంగా భావిస్తున్నారు. ఇదలా ఉంటే బీజేపీ... బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తుంది అనేందుకు ఆధారమా అనేట్లుగా, బీజేపీ సీనియర్ నాయకుడు కేంద్ర మంత్రి, కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ ను బ్రహ్మ దేవుడు కూడా కాపాడలేడని చేసిన వ్యాఖ్య రాజకీయవర్గాల్లో సంచలనంగామారింది.

ఏప్రిల్ లోనే భానుడి ప్రతాపం

వేసవి ప్రతాపం అప్పుడే కనిపిస్తోంది. మార్చి నెలలోనే మండిన ఎండలు, ఏప్రిల్ లొలి వారం నాటికి రోహిణి కార్తెను తలపిస్తున్నాయి. తెలంగాణలో సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి. తెలంగాణలో ఎండల ప్రభావం మరింత తీవ్రంగా ఉంది. మంగళవారం హైదరాబాద్ మహానగరంలో అసాధారణంగా 40.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. మండు వేసవిలో అంటే ఏప్రిల్ మూడో వారంలో హైదరాబాద్ లో సాధారణంగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ కు చేరువ అవుతాయి. అలాంటిది ఏప్రిల్ మొదటి వారంలోనే ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయంటే.. ముందు ముందు ఏ స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉంటాయా అన్న ఆందోళన వ్యక్తమౌతోంది.  రాత్రి ఉష్ణోగ్రతలు కూడా అధికంగా నమోదౌతుండటంతో జనం ఉక్కపోతతో అల్లాడుతున్నారు. ఇప్పటికే వాతావరణ శాఖ ఎల్ నినో కారణంగా ఈ ఏడు ఎండలు మండిపోతాయన్న హెచ్చరికలు జారీ చేసింది. ఆ ఎల్ నినో ప్రభావం ఇప్పుడే మొదలైపోయిందని వాతావరణ నిపుణులు అంటున్నారు. ఎండలు తీవ్రం అవ్వడంతో  విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది.

టీపీసీసీ చీఫ్ రేవంత్ రాజీనామా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొందరు సీనియర్ నాయకులు బీఆర్ఎస్ తో పొత్తుకు తహతహ లాడుతున్నారు. ఇందులో ఎలాంటి దాపరికం లేదు. కొద్ది రోజుల క్రితం కోమటి రెడ్డి వెంకట రెడ్డి, తరువాత తాజాగా  సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి కూడా బీజేపీని ఓడించడం కోసం అనే ట్యాగ్ లైన్ యాడ్ చేసి మరీ అవసరం అయితే  కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవచ్చని స్పష్టమైన సంకేతాలే ఇచ్చారు. సరే ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా  కాంగ్రెస్, బీఆర్ఎస్ సంబంధాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు. అధికారికంగా చేతులు కలిపినా కలపక పోయినా కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ అనుకూల వర్గం ఉందనేది కాదన లేని నిజం. గత ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ మీద గెలిచిన ఎమ్మెల్యేలో మూడింట రెండు వంతుల (12) మంది బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కేవలం ఒకొంతు మంది (6గురు) మాత్రమే కాంగ్రెస్ లో మిగిలారు.  సో .. కాంగ్రెస్ బీఆర్ఎస్ రక్త సంబంధం గురించి  కొత్తగా మళ్లీ చెప్పాల్సిన అవసరం ఏమీ లేదని పరిశీలకులు అంటున్నారు.     అదలా ఉంటే గత కొంత కాలంగా ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్  వర్గాలలో ఉభయ పార్టీల పొత్తు గురించిన చర్చ జరుగుతూనే వుంది. ముఖ్యంగా పరువు నష్టం కేసులో  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ళు జైలు శిక్ష విధించడం, ఆవెంటనే ఆయన లోక్ సభ సభ్యత్వం పై అనర్హత వేటు పడడం చకచకా జరిగిపోయిన  నేపధ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల బంధం మరింత బలపడిన సంకేతాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్  ముఖ్య నేతలు ఇద్దరూ రాహుల్  గాంధీకి ఓపెన్ గా మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ పోకడలపై పోరాటం చేసేందుకు ఆమోదం తెలిపారు.  అయితే, బీఆర్ఎస్ తో  కాంగ్రెస్ పొత్తును గట్టిగా వ్యతిరేకిస్తున్న ఒకే ఒక్కడు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఆయన మంగళవారం (ఏప్రిల్ 4) కాంగ్రెస్, బీఆర్ఎస్  పొత్తుకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక విధంగా ఆ విధమైన  కుట్ర జరుగుతోందనే విషయం చెప్పకనే చెప్పారు. మీడియాతో చిట్ చాట్ చేసిన రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పార్టీ  పొత్తు అనేది జరిగితే అది తన రాజీనామా తర్వాతనేని కుండబద్దలు కొట్టేశారు. అలాగే  తాను టీపీసీసీ అధ్యక్షుడిగా ఉండగా బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అంటే కాంగ్రెస్ పార్టీలో పొత్తు దిశగా కదలికలు జరుగుతున్నాయని రేవంత్ రెడ్డి చెప్పకనే చెప్పినట్లు అయిందని పరిశీలకులు అంటున్నారు.  అయితే  అదే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ తో కాంగ్రెస్ పొత్తు ఉండదని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మాఫీయాతో కాంగ్రెస్ ఎప్పటికీ చేతులు కలపదన్నారు. తెలంగాణలో ధృతరాష్ట్ర కౌగిలికి తాము సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. అయితే రేవంత్ రెడ్డి ఎంత ధీమాగా ఉన్నా రాష్ట్రంలో దేశంలో జరుగతున్న పరిణామాలను గమనిస్తే, రోజులు గడిచే కొద్దీ, బీజేపీ వ్యతిరేక పార్టీల ఐక్యత అనివార్యం అవుతున్నది. విపక్షాలు  చేతులు కలపడం మినహా మరో మార్గం లేకుండా కేసులు, అరెస్టులతో విపక్షాలను ఒకటిగా కట్టి పడేస్తోంది. ఈనేపధ్యంలో  మాజీ మిత్ర పక్షాల మధ్య  మళ్ళీ పొత్తు పొడవదని చెప్పలేమని పరిశీలకులు అంటున్నారు. అయితే అదే జరిగితే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వదిలి మళ్ళీ మాతృ సంస్థ (టీడీపీ) గూటికి చేరడమూ ఖాయమని అంటున్నారు.

బండి సంజయ్ అరెస్ట్.. భగ్గుమన్న బీజేపీ శ్రేణులు

ఓ వంక టీఎస్పీఎస్సీ ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మరీన నేపథ్యంలో పదో తరగతి పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారంలో ఏర్పడిన గందరగోళ పరిస్థితుల నడుమ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీం నగర్ ఎంపీ బండి సంజయ్ ను మంగళవారం (మంగళవారం) రాత్రి కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పదోతరగతి ప్రశ్న పత్రాల లీకేజికి బండి సంజయ్ అరెస్టుకు సంబంధం ఉందా లేదా అనే విషయంలో పోలీసులు క్లారిటీ ఇవ్వలేదు. అసలు ఎందుకు అరెస్టు చేస్తున్నమనేది చెప్పకుండానే పోలీసులు బలవంతంగా ఇంట్లో చొరబడి, ఎంపీని బలవంతగా తీసుకు పోయారని బండి సంజయ్ సతీమణి మీడియాకు తెలిపారు.   కాగా  బండి సంజయ్ అరెస్టు సందర్భంగా ఆయన నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.  అరెస్టును అడ్డుకునేందుకు బీజేపీ కార్యకర్తలు ఎంపీ ఇంటి ముందు భారీగా మోహరించారు. అదే సమయంలో పోలీసులు కూడా భారీగా మోహరించారు. వారిలో కరీంనగర్‌ అడిషనల్ డీసీపీ చంద్రమోహన్‌, ఏసీపీ  శ్రీనివాసరావు, కరుణాకర్‌రావు, సీఐలు లక్ష్మీబాబు, దామోదర్‌రెడ్డి, నటేష్ కూడా ఉన్నారు. ఈ క్రమంలో రెండువైపులా తోపులాట  జరిగాయి. ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులకు వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేశారు. అయినప్పటికీ ఇవన్నీ ముందే ఊహించిన పోలీసులు పక్కా ప్లాన్ ప్రకారం తమ పనిచేసుకుపోయారు. బండి సంజయ్‌ని అరెస్టు చేసి.. హైదరాబాద్ తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. బండి సంజయ్‌ని తిమ్మాపూర్‌ మీదుగా తరలిస్తుండగా పోలీస్ వెహికిల్‌కి మార్గమధ్యలో రిపేర్ వచ్చింది. పోలీసులు ఆయన్ని మరో బండిలోకి ఎక్కించారు. ఐతే.. బండి సంజయ్‌ని ఎక్కడికి తీసుకెళ్తున్నదీ పోలీసులు.. కుటుంబ సభ్యులకు చెప్పలేదు. దాంతో కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు. బుధవారం బండి సంజయ్‌ అత్త (సంజయ్‌ భార్య తల్లి) మరణించి తొమ్మిది రోజులు అవుతుండటంతో ఆయన కరీంనగర్‌ వచ్చారు. ఆ కార్యక్రమాల్లో ఉండగా.. పోలీసులు బలవంతంగా తీసుకు పోయారని బందువులు ఆరోపిస్తున్నారు.  కాగా  తన అరెస్టుపై బండి సంజయ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు.  బీఆర్ఎస్ లో భయం నిజం. మొదట నేను ప్రెస్‌మీట్ పెట్టకుండా నన్ను అడ్డుకున్నారు. తర్వాత నన్ను అర్థరాత్రి అరెస్టు చేశారు. తప్పులు చేస్తోందని దానిపై నేను బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మాత్రమే నేను చేసిన తప్పు. నన్ను జైలుకు పంపినా.. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఆపను అని బండి సంజయ్ ట్వీట్‌లో తెలిపారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అర్థరాత్రి ఇంటిపై దాడి చేసి ఎంపీని, జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని అరెస్ట్ చేయటం అంటే.. పోలీసులు హద్దు మీరి ప్రవర్తించినట్లే అంటున్నారు బీజేపీ నేతలు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పకుండా.. కనీసం 41 నోటీస్ ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారని నిలదీస్తున్నారు. ఓ ఎంపీని అరెస్ట్ చేయాలంటే లోక్ సభ స్పీకర్ కు సమాచారం ఇవ్వాలని.. అలాంటిది ఏమీ లేకుండా రాష్ట్ర పోలీసులు వ్యవహరించటం ఏంటని.. దీనిపై కోర్టుల్లో తేల్చుకుంటామని హెచ్చరిస్తున్నారు బీజేపీ నేతలు.  ఎంపీగా ఉన్న తనను నోటీసులు కూడా ఇవ్వకుండా.. ముందస్తు సమాచారం లేకుండా తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేయటంపై.. ఎంపీ బండి సంజయ్ లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. ఇంట్లోకి వచ్చి పోలీసులు ఏ విధంగా ప్రవర్తించినదీ, తన ప్రశ్నలకు  సమాధానం చెప్పకుండా దురుసుగా లాక్కెళ్లిన తీరును.. ఫొటోలు, వీడియోలతో సహా లోక్ సభ స్పీకర్ బండి సంజయ్ ఫిర్యాదు చేశారు.  బండి సంజయ్ అరెస్ట్ పై బీజేపీ అగ్రనేతలు కూడా ఆగ్రహంగా ఉన్నారు. బీజేపీ శ్రేణులు మండిపోతున్నాయి. ఆయన ఏమైనా సాధారణమైన వ్యక్తా అని ప్రశ్నిస్తున్నారు బీజేపీ కార్యకర్తలు. కరీంనగర్ పార్లమెంట్ నుంచి లోక్ సభకు ఎన్నికైన ఎంపీ.. అంతే కాకుండా జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు.. అలాంటి వ్యక్తిని కారణాలు చెప్పకుండా అర్థరాత్రి.. ఇంటి మీదకు వచ్చి.. బలవంతంగా అరెస్ట్ చేయటం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  బండి సంజయ్ అరెస్టు విషయంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు బీజేపీ నేతలు. ప్రశ్నాపత్రాల లీకేజీకీ, బండి సంజయ్‌కీ ఏంటి సంబంధం అని నిలదీస్తున్నారు. ఈ కేసులో ఆయన్ను అరెస్టు చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అర్థరాత్రి సమయంలో ఓ ఎంపీని అరెస్ట్ చేయటంపై పోలీసులు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఏది ఏమైనా అర్థరాత్రి సమయంలో బండి సంజయ్‌ని ఇంటికి వచ్చి మరీ బలవంతంగా అరెస్టు చెయ్యడం బీజేపీ వర్గాలను షాక్ కు గురి చేసింది. ఇది ఊహించని పరిణామంగా చెబుతున్నారు. బండి సంజయ్ అరెస్ట్ కు నిరసనగా.. ఏప్రిల్ బుధవారం (ఏప్రిల్ 5) తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు చేపట్టాలని బీజేపీ నిర్ణయించింది.

రాజ్ దీప్ పై పరవు నష్టం దావా వేస్తారా ?

ఎవరో అంటే ఏమో అనుకోవచ్చును  కానీ, ఆ మాటన్నది ఎవరో దారిన పోయే దానయ్య,కాదు.. ఇండియా టుడే అంతటి ప్రతిష్టాత్మక టీవీ చానల్ కన్సల్టెంట్ ఎడిటర్ ...  రాజ్‌దీప్ సర్దేశాయ్. తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు  కల్వకుట్ల చంద్రశేఖర రావు ఆర్థిక స్థోమత గురించి ఆయన సంచలన విషయం బయట పెట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని గద్దెదించాలని కంకణం కట్టుకున్న కేసీఆర్   2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు అన్నీ ఒక్కటై, ప్రతిపక్ష ఐక్య కూటమి నాయకత్వ పగ్గాలు తన చేతికి అప్పగిస్తే  మరో పార్టీ, మరో అభ్యర్ధి జేబులో చెయ్యి పెట్టవలసిన అవసరం లేకుండా మొత్తం 545 లోక్ సభ నియోజక వర్గాల్లో ఎన్నికల ప్రచార వ్యయం మొత్తం తానే ( బీఆర్ఎస్) భరిస్తానని ప్రైవేటు సంభాషణల్లో చెప్పినట్లు రాజ్ దీప్  పబ్లిక్ గా  ప్రకటించారు.   రాజ్‌దీప్ తన వీక్లీ బ్లాగ్‌లో మోడీ వర్సెస్ ఆల్ అనే అంశం గురించి మాట్లాడారు. అందులో ఇటీవల రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసిన తర్వాత చోటుచేసుకున్న పరిణామాలపై మాట్లాడిన రాజ్‌దీప్, 2024 ఎన్నికల్లో మోడీ నేతృత్వంలోని బీజేపీకి అన్ని ప్రతిపక్ష పార్టీలకు మధ్య జరుగుతాయా? అనేది చూడాల్సి ఉందన్నారు. ఈ ప్రశ్నకు తన పాయింట్ ఆఫ్ వ్యూలో 10 ఫ్యాక్టర్స్ సమాధానం చెబుతాయని పేర్కొన్నారు. అదే క్రమంలో ఆయన ప్రాంతీయ పార్టీల నాయకుల ఈగోల గురించి కూడా  ప్రస్తావించారు. ప్రతి నేతా కూడా తనను తాము జాతీయ నేతగానే భావిస్తున్నారని అన్నారు.  కేసీఆర్‌ను తీసుకుంటే.. ఆయన తన టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్‌గా మార్చారు.  మహారాష్ట్రలో బీఆర్ఎస్ కోసం ప్రచారం మొదలుపెట్టారు. ప్రైవేట్ కాన్వర్సేషన్ లోకేసీఆర్.. తన  సహచరులతో ప్రతిపక్షాల కూటమికి తనను చైర్ పర్సన్‌ను చేస్తే 2024 ఎన్నికల ఖర్చు మొత్తం భరించడానికి   సిద్దంగా ఉన్నానని చెప్పాడు. అయితే ఇందుకు ప్రతిపక్షాలలో కేసీఆర్‌కు సమకాలీకులుగా ఉన్న నాయకులు అంగీకరిస్తారా? అని రాజ్‌దీప్ అనుమానం వ్యక్తం చేశారు. అంతే కాదు ప్రతిపక్షాల కూటమి ఉంటుందా? అనే దానికి సంబంధించి వివిధ అంశాలను ఆ వీడియోలో రాజ్‌దీప్ ప్రస్తావించారు. అయితే కేసీఆర్ ఇంత ఓపెన్ ఆఫర్ ఇచ్చినా, ప్రతిపక్ష పార్టీలు, నాయకులు అంగీకరిస్తారా లేదా చూడవలసి ఉందని  రాజ్‌దీప్  పేర్కొన్నారు.  అయితే ఇప్పుడు  ఇతర ప్రతిపక్ష పార్టీలు కేసీఆర్ ఆఫర్  అంగీకరిస్తాయా? ఆయన్ని కూటమి నేతగా, ప్రధాని అభ్యర్ధిగా అంగీకరిస్తాయా ? అనేది కాదు ప్రశ్న. ఆయనకు ఇంత పెద్ద మొత్తం సొమ్ములు ఎక్కడి నుంచి వచ్చాయి అన్నదే ప్రశ్న. ఈ ప్రశ్నకు సంధానం చెప్పాలని కేంద్ర మంత్రి, బీజేపీ నేత కిషన్  రెడ్డి సహా పలువురు డిమాడ్ చేస్తున్నారు. అదలా ఉంటే రాజ్‌దీప్ చెప్పినదాట్లో నిజం లేకుంటే, ఆయన వివరణ కోరాలి లేదా ఆయన పై పరువు నష్టం దావావేయాలని అంటున్నారు.  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన తన పార్టీ పేరు బీఆర్ఎస్‌గా మార్చి.. జాతీయ రాజకీయాల్లో అడుగులు వేస్తున్నారు. అయితే జాతీయ స్థాయిలో కొన్ని విపక్ష పార్టీలతో ఐక్యతను మెయింటెన్ చేస్తున్నారు.  అయితే జాతీయ స్థాయిలో బీజేపీని ఢీకొట్టేందుకు కేసీఆర్ వ్యుహాలు పక్కాగా ఉన్నాయని బీఆర్ఎస్ వర్గాలు చెబుతుంటాయి. అయితే తాజగా కేసీఆర్‌కు సంబంధించి సీనియర్ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్‌దేశాయ్‌ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.  

ఇంతకి జగన్ వైజాగ్ వెళ్లేది ఎప్పుడు?

ఏపీ సీఎం జగన్  వైజాగ్ నుంచి పాలన కొనసాగిస్తానని చెప్పి దాదాపు మూడు నెలలవుతోంది.  అసలు జగన్ నిజంగా వైజాగ్ వెడతారా..? అక్కడి నుంచే పాలన సాగిస్తారా..? అంటే అనుమానమే అంటున్నారు పరిశీలకులు.  ఎన్నికల ముందు సీఎం జగన్ వైజాగ్ వెళ్తున్నట్టు ఆయన కేబినెట్ మంత్రులు తెగ ప్రచారం చేశారు. త్వరలో తాను వైజాగ్ నుంచి పాలన సాగిస్తానని స్వయంగా జగన్ కూడా చెప్పారు. అయితే వైజాగ్ వెళ్లే విషయంపై జగన్  ఎందుకో ఇప్పుడు సైలెంట్ అయిపోయారు.   అయితే జగన్ వైజాగ్ వెళ్లేది ఇప్పుడు కాదు.. జులైలో అని టాక్ వస్తోంది.  మూడు రాజధానులు అంటూ తెగ హడావుడి చేసిన వారంతా ఇప్పుడు సైలెంట్ గా ఎందుకు ఉంటున్నారని జనం ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో విశాఖ నుంచి పాలన విషయంలో జగన్ ఇప్పుడంత ఇంట్రెస్ట్ గా ఉన్నట్లు కనిపించడం లేదు.  సుప్రీంకోర్టులో అమరావతి కేసు విచారణ జరుగుతోంది. విచారణను వీలైనంత త్వరగా పూర్తి చేయండని ఏపీ ప్రభుత్వం సుప్రీంకు అభ్యర్థనల మీద అభ్యర్థనలు పెట్టినా ఫలితం ఉండటం లేదు. మరో ఏడాదిలో ఎన్నికలు వచ్చేస్తున్నాయి . అందుకే జగన్.. మూడు రాజధానులు, వైజాగ్ అంశాలను  పక్కన పెట్టేశారా అన్న సంశయం పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.  ఎలా చేద్దాం..ఏం చేద్దామని  జగన్ కు ఎవరూ సలహా ఇవ్వలేరు..  ఎంతైనా ఆయన   మోనార్క్ కదా... సలహాదారులెంత మంది ఉన్నా ఆయనకు సలహా ఇచ్చే ధైర్యం ఎవరికీ లేదు మరి.!

కుక్కకేమి తెలుసు ఆయన అడిషనల్ కలెక్టరని!

ఇటీవల వీధి కుక్కల బారినపడి ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటన అందరినీ కలచి వేసింది.  ఆ తరువాత కూడా తెలంగాణలో వీధి కుక్క కాటుకు గాయపడిన వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. వీధి కుక్కల నియంత్రణకు చర్యలు చేపడుతున్నామని  ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తూనే ఉంది. తాజాగా జరిగిన ఓ ఘటనలో సాక్షాత్తు అదనపు కలెక్టరే కుక్క కాటు బాధితుడయ్యారు. అవును సిద్ధిపేట అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి వీధికుక్క కాటుకు గురయ్యారు. మూడు రోజుల క్రితం జరిగిన ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిద్ధిపేట కలెక్టర్ క్వార్టర్స్ దగ్గర వీధికుక్కలు వచ్చీపోయేవాళ్ల మీద దాడులకు తెగబడుతున్నా.. ఇంతకాలం మున్సిపల్ సిబ్బంది  పట్టించుకోలేదు. తాజాగా అదనపు కలెక్టర్ నే కుక్క కరవడంతో రంగంలోకి దిగారు.  రాత్రి సమయంలో క్వార్టర్స్ వద్ద వాకింగ్ చేస్తున్న అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రెడ్డిపై వీధికుక్క దాడి చేసింది. వాకింగ్ చేస్తున్న సమయంలో ఓ కుక్క ఆయన పిక్కలను పట్టేసి గాయపరిచింది. ఆయన కేకలు వేయడంతో అక్కడే ఉన్న కొందరు ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. ఇక ఆయనపై దాడి తర్వాత ఆ శునకం.. మరో బాలుడిపై, అలాగే కలెక్టర్ పెంపుడు కుక్కపైనా దాడి చేసి కరిచిందని స్థానికులు  చెబుతున్నారు.  కలెక్టర్ క్వార్టర్స్ వద్ద వీధికుక్కల సంచారంపై గతంలోనూ ఫిర్యాదు చేసినా ఏనాడూ పట్టించుకోలేదని, ఇప్పుడు ఉన్నతాధికారి మీద దాడి చేయడంతో ఆగమేఘాల మీద చర్యలకు  దిగారని  స్థానికులు అంటున్నారు.  అయినా మన పిచ్చి కానీ తాను కరిచింది అదనపు కలెక్టర్ ను అని ఆ కుక్కకేం తెలుసు. పిచ్చి జనానికి తెలుసు ఆయన కలెక్టర్ అని... పాపం ఆ శునకాని ఏం తెలుసు? అని సెటైర్లు వేస్తున్నారు. 

పిట్టా పోయి.. కుక్కా వచ్చే ఢాంఢాంఢాం..!

ఎలాన్ మస్క్ ట్విటర్లో మరో మార్పు చేశాడు. ఈ సారి లోగోపై  దృష్టి పెట్టాడు.  ఇప్పటి వరకూ ఉన్న పక్షి (బ్లూబర్డ్) లోగోను పీకేసి దాని స్థానంలో కుక్క (డాగీ) లోగోను పెట్టాడు. అయితే ఇది మొబైల్ యాప్ లో కాదు..  డెస్క్ టాప్  వెర్షన్లో మాత్రమే ఇలా  చేశాడు.  ట్విటర్ వెబ్ సైట్ లో  హోం బటన్ గా ఉన్న ఐకానిక్ బ్లూ బర్డ్ లోగో స్థానంలో డాగీ కాయిన్ (Dogecoin) క్రిప్టో కరెన్సీ లోగోకు చెందిన డాగ్ మీమ్ ప్రత్యక్షమైంది. ఏప్రిల్ 3న దాన్ని గమనించిన యూజర్లు అవాక్కయ్యారు. ప్రముఖ క్రిప్టోకరెన్సీ డాగీ కాయిన్ లోగోలో ఉపయోగించిన డాగీ (షిబా ఇను డాగ్) చిత్రం చాలా కాలంగా అనేక వైరల్ మీమ్స్ లో కనిపిస్తోంది.  ట్విటర్ లోగో మార్పుపై ఎలాన్ మస్క్ తనదైన శైలిలో ఓ హాస్యభరితమైన మీమ్ ను జోడిస్తూ ట్విటర్లో షేర్ చేశారు. అంతేకాదు. 2022 మార్చి 26 నాటి తన ట్విటర్ చాట్ స్క్రీన్ షాట్ ను కూడా పంచుకున్నారు. అందులో ఓ అజ్ఞాత యూజర్ ట్విటర్ బర్డ్ లోగోను 'డాగ్'గా మార్చమని అడగ్గా దానికి మస్క్ సరే అని బదులిచ్చారు. ఇప్పుడు మాట నిలబెట్టుకున్నట్లు ఆ స్క్రీన్ షాట్  షేర్ చేస్తూ పోస్ట్ చేశారు.  క్రిప్టోకరెన్సీ డాగీకాయిన్ కు మద్దతుగా పిరమిడ్ స్కీమ్ ను నిర్వహిస్తున్నారని ఎలాన్ మస్క్ పై   ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి కోర్టుల్లో పలు వ్యాజ్యాలు సైతం దాఖలయ్యాయి. మస్క్ ట్విటర్ లోగోను డాగీ లోగోగా మార్చిన తర్వాత  డాగీకాయిన్ విలువ 20 శాతం వరకు పెరగటం గమనార్హం..!

బీజేపీలో మున్నాభాయ్ ఎంబీబీఎస్ లు!

బీజేపీలో చాలా మంది మున్నాభాయ్ ఎంబీబీఎస్ లు ఉన్నారంటూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, తెలంగాణ మంత్రి  కేటీఆర్  సంచలన ట్వీట్ చేశారు.    తెలంగాణకు చెందిన ఇద్దరు బీజేపీ ఎంపీలవి కూడా పేక్ సర్టిఫికెట్లే అన్న ఆరోపణలు వస్తున్నాయన్నారు. అవి రాజస్థాన్, తమిళనాడు యూనివర్సిటీల నుంచి సంపాదించినట్లు తెలుస్తోందన్నారు.  ఎలక్షన్ అఫిడవిట్ లో తప్పుడు సర్టిఫికెట్ల వివరాలు తెలిపి,  గెలవడం నేరమే కదా  అన్నారు. దీని ఆధారంగా ఆ ఇద్దరు ఎంపీలను   డిస్క్వాలిఫై ఎందుకు  చేయరని ప్రశ్నిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం కేటీఆర్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్ పై.. అలాగే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేయడంపై దేశవ్యాప్తంగా పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఆ రెండింటినీ కూడా  కోడ్ చేసే విధంగా మంత్రి కేటీఆర్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. బీజేపీపై మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. తెలంగాణకు చెందిన ఫేక్ విద్యార్హత సర్టిఫికెట్ల మంత్రులెవరన్న దానిపై సామాజిక మాధ్యమంలో కూడా పెద్ద ఎత్తున కామెంట్లు వస్తున్నాయి. 

బీఆర్ఎస్ తో పొత్తా.. నో నెవ్వర్.. రేవంత్

తెలంగాణ కాంగ్రెస్ లో ఒక పక్క ఆ పార్టీ సీనియర్లు బీఆర్ఎస్ తో పొత్తుకు తహతహలాడుతుంటే.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాత్రం ఆ ప్రశక్తే లేదని నిర్ద్వంద్వంగా చెబుతున్నారు. మాఫియాతో కాంగ్రెస్ పార్టీ ఎన్నటికీ పొత్తు పెట్టుకోదని కుండబద్దలు కొడుతున్నారు. అసలు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ కాంగ్రెస్ సీనియర్లలో అసంతృప్తి జ్వలిస్తూనే ఉంది. అయితే హైకమాండ్ సీనియర్ల అసంతృప్తిని పెద్దగా పట్టించుకోకుండా రాష్ట్రంలో పార్టీ బలోపేతం చేసే బాధ్యతను రేవంత్ పై పెట్టింది. అధిష్ఠానం ఆదేశాలకు అనుగుణంగా రేవంత్ రెడ్డి రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలో పార్టీలో నూతనోత్సాహాన్ని తీసుకువచ్చారు. రేవంత్ టీపీసీసీ పగ్గాలు చేపట్టిన అనంతరం జరిగిన ఉప ఎన్నికలలో పార్టీ విజయాలు సాధించకపోయినా.. శ్రేణుల్లో మాత్రం కొత్త ఉత్సాహం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందన్నది మాత్రం నిర్వివాదాంశం. అయితే సీనియర్లు మాత్రం రేవంత్ గమనానికి అడుగడుగునా అడ్డుపడుతూ వస్తున్నారు.  అయితే మాణిక్యం ఠాకూర్ స్థానంలో బాధ్యతలు చేపట్టిన  మాణిక్‌రావు ఠాక్రే  సీనియర్ల అసంతృప్తికి చెక్ పెట్టడంలో చాలా వరకూ కృతకృత్యులయ్యారు. అసంతృప్తి జ్వాలలు పూర్తిగా చల్లారిపోయాయని చెప్ప లేకపోయినా.. పార్టీలో మాత్రం గణనీయమైన మార్పు కనిపించింది. విభేదాలు ఉన్నా సీనియర్లు, జూనియర్లు.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే రేవంత్ వర్గం, రేవంత్ వ్యతిరేక వర్గం కూడా ఎవరి దారిన వారు పార్టీ కార్యక్రమాలలో నిమగ్నమైపోయారు. దీంతో పార్టీలో ఆల్ ఈజ్ వెల్ అన్న వాతావరణం కనిపిస్తోంది.  కానీ అడపా దడపా సీనియర్లు మాత్రం ఏదో ఒక పుల్ల విరుపు మాట అయితే అంటూనే ఉన్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్నికల అనంతరం అయినా సరే రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తు అనివార్యమని వ్యాఖ్యలు చేసిన రేపిన సంచలనం ఇలా సర్దుమణిగిందో లేదో.. మరో సీనియర్ నేత, మాజీ మంత్రి జానా రెడ్డి  రాష్ట్రంలో బీజేపీని ఓడించేందుకు అవసరం అయితే కాంగ్రెస్  బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటుందని అన్నారు.  అంతేకాదు రాహుల్ గాంధీ అనర్హత విషయంలో బీఆర్ఎస్  బహిరంగంగా బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిందని సో ... శత్రువు, శత్రువు మిత్రుడు, థియరీ ప్రకారం కాంగ్రెస్  బీఆర్ఎస్ చేతులు కలపవచ్చని   వివరణ కూడా ఇచ్చారు.   అటు బీఆర్ఎస్ కూడా మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ దూకుడును అడ్డుకోవాలంటే.. కాంగ్రెస్ అండ కావాలి అన్నట్లుగానే వ్యవహరిస్తోంది. ఇటీవల పలు సందర్భాలలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ ఇటీవల ఢిల్లీ వేదికగా బీజేపీని ఓడించాలంటే బీజేపీయేతర పార్టీలతో కాంగ్రెస్ కలిసి రావాలని వ్యాఖ్యానించారు. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే రాహుల్ అనర్హత వేటుకు వ్యతిరేకంగా  సమష్టి పోరుకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే జానా రెడ్డి పోత్తు ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే టీపీసీసీ అధ్యక్షుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్‌తో కలిసే ప్రసక్తే లేదని చెబుతున్నారు.  తాను తెలంగాణ  ప్రదేశ్  కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండగా   బీఆర్ఎస్ తో పొత్తు ప్రసక్తే లేదని,  మాఫీయాతో కాంగ్రెస్ ఎప్పటికీ చేతులు కలపదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికలలో విజయం సాధించి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు.  టీఆర్ఎస్ పరాజయం తథ్యమని, బీజేపీ రాష్ట్రంలో సింగిల్ డిజిట్ కే పరిమితమౌతుందని రేవంత్ అన్నారు.  

ఆత్మరక్షణలో కమల దళం!

భారతీయ జనత పార్టీ ( బీజేపీ) ఆత్మరక్షణ  పడిందా? ఓ పక్క నుంచి అదానీ వ్యవహారం, మరో వైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విద్యార్హతల వివాదం అలాగే, ప్రతిపక్ష పార్టీలను ఏకం  చేస్తున్న కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అనర్హత వివాదం.. ఇలా ఒక్క సారిగా  ముప్పేట దాడి ముంచుకొస్తున్న సమయంలో  బీజేపీ ఆత్మ రక్షణలో పడిందా?  అందుకే, యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగినట్లు చెపుతున్న అవినీతి ఆరోపణలను మళ్ళీ మరో మారు తెర మీదకు తెస్తోందా అంటే రాజకీయ పరిశీలకులు అవుననే అంటన్నారు. ఈ నేపధ్యంలోనే  ‘కాంగ్రెస్ ఫైల్స్’ పేరిట పాత కథలను ఫ్రెష్  గా తెరపైకి ఎక్కిస్తోందని అంటున్నారు.  నిజానికి, 2014కు ముందు పదేళ్ళ పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ (యూపీఏ) ప్రభుత్వం ఎదుర్కోని అవినీతి ఆరోపణ ఏదీ లేదు.  కింద భూమి పైన ఆకాశం హద్దుగా ఇటు బొగ్గు నుంచి అటు స్పెక్ట్రమ్ వరకు అన్ని వ్యవహారాలలో అవినీతి జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. విచారణలు జరిగాయి.  ఆరోపణలలో నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ  ఈ ఆరోపణల కారణంగానే  2014 సార్వత్రిక  ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. భారీ మూల్యాన్ని చెల్లించింది. బీజేపీ మన్మోహన్ సింగ్ ప్రభుత్వపై వచ్చిన అవినీతి ఆరోపణలను ప్రధాన అస్త్రాలుగా చేసుకుని అధికారంలోకి వచ్చింది. అయితే  ఆ తర్వాత ఆ కేసులు   విచారణలు  ఏమయ్యాయో  ఎటు పోయాయో ఎవరికీ తెలియదు.  కానీ, ఇప్పడు బీజేపీ దాచేస్తే దాగని సత్యాలంటూ పాత అవినీతి కథలను కాంగ్రెస్ ఫైల్స్ పేరిట  వరస వీడియోలను విడుదల చేస్తోంది. అందులో భాగంగా  తాజాగా కాంగ్రెస్ ఫైల్స్  మూడో ఎపిసోడ్‌ను బీజేపీ  ట్విటర్ ఖాతాలో షేర్‌ చేసింది. అందులో 2012లో జరిగిన బొగ్గు కుంభకోణం గురించి ప్రధానంగా ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ  అవినీతి మరకలను మళ్ళీ మరోమారు గుర్తు చేసింది.  మన్మోహన్‌ సింగ్ రెండోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఆయన అనేక హామీలు కురిపించారు. కానీ  కాంగ్రెస్‌ కుంభకోణాలే అప్పుడు హెడ్‌లైన్లలో వచ్చాయి. అందులో ప్రధానమైనది బొగ్గు కుంభకోణం. దీని కారణంగా మన దేశం రూ.1.86లక్షల కోట్ల నష్టాన్ని చవిచూసింది. 2004-2009 మధ్య ఈ కుంభకోణం చోటుచేసుకుంది ఆ సయమంలో బొగ్గు మంత్రిత్వ శాఖ నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, శిబు సోరెన్‌ చేతుల్లో ఉంది. కాంగ్రెస్‌ రిమోట్‌ కంట్రోల్‌ ఆదేశాలతో ఈ ప్రధాని పనిచేశారు  అని బీజేపీ తాజా ఎపిసోడ్ లో వివరించింది. అదానీ స్టాక్ మార్కెట్ కుంభకోణం వెలుగు చూసినప్పటి నుంచి, ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ  మరీ ముఖ్యంగా ఆ పార్టీ అగ్రనేత రాహుల్  గాంధీ  అదానీ, మోడీ సంబంధాలను  ప్రశ్నిస్తున్న నేపధ్యంలో  బీజేపీ అందుకు కౌంటర్ గా గత మూడు రోజులుగా, కాంగ్రెస్‌ అవినీతి పై రోజుకో వీడియోను విడుదల చేస్తోంది. మొదటి ఎపిసోడ్‌ను ట్రైలర్‌ అని పేర్కొన్న బీజేపీ, కాంగ్రెస్‌ పాలనలో రూ.4.82 లక్షల కోట్ల మేర అవినీతి జరిగిందని ఆరోపించింది. అలాగే సెకండ్ ఎపిసోడ్ లో ఎంఎఫ్‌ హుస్సేస్‌ పెయింటింగ్స్‌ వివాదాన్ని ప్రస్తావించింది. ప్రియాంక గాంధీ నుంచి ఎంఎఫ్‌ హుస్సేన్‌ పేయింటింగ్‌ను రూ.2కోట్లకు కొనుగోలు చేయాలని కాంగ్రెస్‌ తనను బలవంతపెట్టిందని యస్‌బ్యాంక్‌ మాజీ సీఈఓ రాణా కపూర్‌ ఈడీకి ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను ఆ వీడియోలో చూపించింది. అందుకు బదులుగా పద్మభూషణ్‌ ఇప్పిస్తామని హస్తం పార్టీ తనకు హామీ ఇచ్చినట్లు రాణా కపూర్‌ ఆ వీడియోలో పేర్కొన్నారు. ఇప్పుడు తాజగా మనోమోహన్ సింగ్ మిస్టర్ క్లీన్ ఇమేజ్ కి మచ్చ తెచ్చిన బొగ్గు కుంభకోణం కేసును తెరకేక్కించింది. అదానీ గ్రూప్‌ కంపెనీల వ్యవహారం, రాహుల్‌ అనర్హత వంటి అంశాలపై విపక్షాలు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న తరుణంలో బీజేపీ ఈ వీడియోలు విడుదల చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే 2014కు ముందు ప్రతిపక్షంలో బీజేపీ ఆరోపణలు చేస్తే ప్రజలు విశ్వశించారు. కానీ  ఎనిమిదేళ్ళకు పైగా అధికారంలో ఉండి ఎమీ చేయని బీజేపీ ఇప్పడు పాత ఫైల్స్ కు దుమ్ము దులిపి,  కాంగ్రెస్ ఫైల్స్  అంటూ కాంగ్రెస్ పార్టీ పై బురద చల్లితే  ప్రజలు నమ్ముతారా? నవ్వుకుంటారా?

దస్తగిరి బెయిల్ రద్దు చేయండి.. తెలంగాణ హై కోర్టులో భాస్కర్ రెడ్డి పిటిషన్

వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ భాస్కర్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు.  ఈ కేసులో ఏ4గా ఉన్న దస్తగిరిని అప్రూవర్ గా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ ఆయన పిటిషన్ వేశారు. దస్తగిరి వాంగ్మూలం ఆధారంగా తమపై నేరాన్ని మోపడం సరికాదని ఆ పిటిషన్ లోపిటిషన్ లో పేర్కొన్నారు. సీబీఐ అధికారులు చెప్పిన విధంగానే దస్తగిరి వాంగ్మూలం ఇస్తున్నాడని,  వాస్తవానికి వివేకా హత్య కేసులో దస్తగిరిదే కీలక పాత్ర అని ఆయన పేర్కొన్నారు.   వివేకా హత్య కేసులో కీలకమైన ఆయుధాన్ని కొనుగోలు చేసింది కూడా దస్తగిరేనని, అలాంటి దస్తగిరికి బెయిల్ విషయంలో సీబీఐ సహకరించిందని పేర్కొన్నారు. దస్తగిరి బెయిల్ ను రద్దు చేయాలని ఆ పిటిషన్ లో కోరారు.

తెలుగు వన్ చెప్పిందే జరిగింది!

తెలుగు వన్ ఏమి చెప్పిందో అదే జరిగింది.  సోమవారం(ఏప్రిల్ 3) నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం సమీక్ష సమావేశంలో, ‘తెలుగు వన్’ ముందుగా చెప్పిన విధంగానే, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి స్వరం మారిపోయింది. గర్జింపులు లేవు, గాండ్రింపులు లేవు. హెచ్చరికలు లేవు. ఏ ఎమ్మెల్యే ఎన్ని రోజులు ,ఎన్ని గంటల ఎన్ని నిముషాలు ... ఎన్నెన్ని గడపలు తొక్కారు, ఏ గడపలో ఎంత సేపు కూర్చున్నారు.. అంటూ గంటల పంచాంగం విప్పలేదు.  బెత్తం పట్టుకుని, బెంచీ ఎక్కించలేదు. పద్దతి మార్చుకుని చెప్పినట్టు చేస్తారా?  మిమ్మల్నే మార్చ మంటారా అంటూ  కళ్ళెర్ర చేసింది లేదు. అవును గతంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం  సమీక్షకు, సోమవారం(ఏప్రిల్ 3) నిర్వహించిన సమీక్షకు ఎక్కడా పొంతన లేదు పోలిక లేదు.  అంతేకాదు, ఢిల్లీ పెద్దల ఆదేశం మేరకే, ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకే, ముఖ్యమత్రి గడప గడపకు మన ప్రభుత్వం సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారని, తెలుగు వన్ ముందుగా చెప్పినట్లే ముఖ్యమంత్రి నిన్నటి సమావేశంలో ఎవ్వరినీ నొప్పించలేదు. ఒక విధంగా గతంలో తన ప్రవర్తన ఎవరినైనా నొప్పించే ఉంటే, క్షమించండి అన్న ధోరణిలో మాట్లాడారు.  నేను ఎమ్మెల్యేలను వదులుకోను, కార్యకర్తలను పోగొట్టుకోవాలని అనుకోను.. రాజకీయాలంటే మనవ సంబంధాలని ‘నాన్న’ నుంచి నేర్చుకున్నాను అంటూ   కొత్త స్వరాన్ని వినిపించారు.  అందుకే , ఎమ్మెల్యేలు హా..శ్చర్య పోయారు . అవాక్కాయారు.  నిజమా... ఇంత సౌమ్యంగా , నేను ఇంతగా ఎందుకు కష్టపడుతున్నాను. మిమ్మల్ని పిలిపించి ఎందుకు చెపుతున్నాంటే, కారణం, మీతో పనిచేయించి మిమ్మల్ని మళ్లీ గెలిపించాలానే కదా అంటూ చాలా ప్రేమగా, ‘పాథెటిక్’  టోన్’లో వివరణ ఇవ్వడం ఎమ్మెల్యేలకు ఎంత వినసొంపుగా ఉందో, అంతే కంగు తినిపించాయి. అందుకే, ఎమ్మెల్యేలు అవాక్కయ్యారు.  అందుకే ఇప్పుడు ముఖ్యమంత్రిలో ఒక్కసారిగా ఈ మార్పు ఏమిటి? ఎందు కొచ్చింది? అనే చర్చ వైసీపీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. నిజానికి సోమవారం (ఏప్రిల్ 24) సమీక్షా సమావేశంలోనూ షరా మాములుగా  ముఖ్యమంత్రి గణాంకాలు చదివి వినిపించి అందరి ముందు పరవు తీస్తారనే కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, సమావేశానికి డుమ్మా కొట్టారు. గత సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి చదివి వినిపించిన, మొద్దబ్బాయిల జాబితాలో ఉన్న ఇద్దరు మంత్రులతో సహా, ఓ పది నుంచి పదిహేను మంది వరకు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. కానీ, అవేవీ లేక పోగా, రాజకీయాలంటే మానవ సంబంధాలంటూ ముఖ్యమంత్రి పేర్కొనడం అందరినీ ఆశ్చర్య పరిచింది. అయితే ఈ మార్పుకు కారణం, ఏమిటో తెలుగు వన్  ‘అసంతృప్తిని చల్లార్చడమే జగన్ అసలు ఎజెండా’ కథనంలో ముందుగానే చెప్పింది. అదే జరిగింది. అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు  వైసీపీ ఎమ్మెల్యేలలో అసంతృప్తి  తీవ్ర స్థాయిలో ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హెచ్చరించిన నేపథ్యంలో, అయన సుచన మేరకే  జగన్ రెడ్డి బుజ్జగింపు ధోరణికి వచ్చారు.  అసంతృప్తిని చల్లార్చడమే జగన్ అసలు ఎజెండా?!

ఏపీలో ముందస్తు తథ్యం.. వైసీపీ ఎంపి జోస్యం!

ఆంధ్రప్రదేశ్ లో గడువు మేరకే ఎన్నికలు జరుగుతాయి అంటూ ముఖ్యమంత్రి జగన్ విస్పష్టంగా చెప్పిన మరుసటి రోజే అధికార పార్టీ రెబల్ ఎంపీ ఏపీలో ముందస్తు తథ్యం అని జోస్యం చెప్పారు. ఏపీ సీఎం చెప్పినదేదీ చేయరనీ,  చేసేదేదీ చెప్పరనీ ఆయన ఈ నాలుగేళ్ల పాలనలో పదే పదే రుజువౌతూ వస్తున్న నేపథ్యంలో రఘురామ జోస్యం నిజమయ్యే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు.  తన ముఖం చూసే జనం ఓట్లేస్తారనీ, ఎమ్మెల్యేలు ఉత్సవ విగ్రహాలు మాత్రమేనని చాటుతూ వచ్చిన జగన్ కు హఠాత్తుగా ఇప్పుడు ఎమ్మెల్యేల వైఫల్యం వల్లే తన ప్రభుత్వ గ్రాఫ్ పడిపోయిందని ఆక్రోశం వ్యక్తం చేయడానికి ప్రజల్లో వైసీపీ పట్ల పెల్లుబుకుతున్న ఆగ్రహమే కారణమని పరిశీలకులు అంటున్నారు. రఘురామకృష్ణం రాజు సోమవారం హస్తినలోని తన నివాసంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ముందస్తు ఎన్నికలు ఈ ఏడాది  జరుగుతాయనీ, అందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని చెప్పారు.  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి… ఇప్పుడు తీరిగ్గా నాలుగేళ్లు గడిచిన తరువాత  ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదనడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు  ఉత్సవ విగ్రహాలకూ తేడా లేకుండా పోయిందన్నారు. బటన్ నొక్కాను, అభివృద్ధి పనులన్నీ తానే చేస్తున్నానని ఇంత కాలం చెప్పుకుంటూ వచ్చిన జగన్ ఇప్పుడు ఒక్క సారిగా మాటతప్పి, మడమ తిప్పి తాను బాగా చేస్తున్నా ఎమ్మెల్యేలు పని చేయడం లేదని నిందలు మోపుతున్నారని విమర్శిచారు.  తన ముఖమే చూసి ఓట్లు జనం ఓట్లేస్తారంటూ వచ్చిన జగన్ రెడ్డి.. ఇప్పుడు 30 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదంటూ ఎత్తి చూపడం.. తన పాలన పట్ల ప్రజలలో తీవ్ర వ్యతిరేకతను గుర్తించడమే కారణమని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో పరాభవానికి ముందు వరకూ వైనాట్ 175 అంటూ వచ్చిన జగన్ ఇప్పుడు ఎమ్మెల్యేలు గ్రాఫ్ పెంచుకోకుంటే మరోసారి అధికారం కష్టమన్నట్లుగా మాట్లాడుతుండటమే రాష్ట్రంలో వైసీపీకి, జగన్ కు కౌంట్ డౌన్ ప్రారంభమైందనడానికి నిదర్శనమని వివరించారు.  పార్టీ ఎమ్మెల్యేలంతా గడపగడపకూ తిరిగి తీరాల్సిందేనంటున్న జగన్ తాను మాత్రం ప్రజలకు ముఖం చాటేసి పరదాల మాటున ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నించారు.   డాక్టర్ సుధాకర్ పై దాడి ద్వారా మొదలైనవైసీపీ ఉన్మాదం  తన పైనుంచి, అచ్చన్న మీదుగా ఇప్పుడు కేంద్రంలో అధికారం లో ఉన్న పార్టీ నాయకుల వరకూ వెళ్లిందని రఘురామ అన్నారు.   సత్య కుమార్ పై జరిగిన దాడి గురించి కేంద్ర ప్రభుత్వంలోని ఒక పెద్ద వ్యక్తితో తాను మాట్లాడినప్పుడు పిచ్చి పరాకాష్టకు చేరినప్పుడు ఇలాంటి పనులు చేస్తారని, ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని  అన్నారని రఘురామ అన్నారు.   రాజధాని అమరావతి ప్రాంతంలో మాస్టర్ ప్లాన్ కు భిన్నంగా కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్ల అభ్యర్థనతో 24 గంటల వ్యవధిలో 1100  ఎకరాల భూమిని జగనన్న ఇళ్ల స్థలాల పంపిణీకి సి ఆర్ డి ఏ కమిషనర్ శ్రీలక్ష్మి కేటాయించడం ప్రభుత్వ  కడుపు మంట తప్ప మరొటి కాదన్నారు. సుప్రీం కోర్టులో రాజధాని కేసు వాదించడానికి వందల కోట్లు వెచ్చించి న్యాయవాదులను నియమించుకొని, కేంద్ర పెద్దల కాళ్లు పట్టుకొని కూడా తమ పంతాన్ని నెగ్గించుకోలేకపోయామనే అక్కసుతోనే రైతులను వేధించాలనే ఉద్దేశ్యంతోనే రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలను కేటాయించాలని నిర్ణయించారని విమర్శించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హస్తిన పర్యటన విజయవంతం అయి, పొత్తులపై ఒక స్పష్టత రావాలని రఘురామకృష్ణంరాజు ఆకాంక్షించారు.  

కరోనా కాషన్.. జాగ్రత్తలు తప్పని సరి

దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రత ఆందోళన కలిగిస్తోంది. 2019 నాటి పరిస్థితి మళ్లీ పునరావృతమౌతుందా అన్న సందేహాలూ వ్యక్తమౌతున్నాయి. ఇటీవలి కాలంలో రోజు వారీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య స్థిరంగా పెరుగుతోంది. అదే సమయంలో మరణాలూ చోటు చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో తొలి నుంచీ దేశంలో ఎన్ని కరోనా కేసులు నమోదయ్యాయి? పాజిటివిటీ రేటు ఎలా ఉంది? రికవరీ రేటు అంటూ ప్రకటనలు గుప్పించడంతో సరిపెట్టకుండా కోవిడ్ ప్రొటోకాల్ కచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం కోవిడ్ వ్యాప్తి విజృంభణపై అప్రమత్తమైన కేంద్రం కేవలం సూచనలు, హెచ్చరికలకే పరిమితమౌతోంది. ఇదే వ్యాప్తి తీవ్రత కొనసాగితే.. దేశంలో మళ్లీ లాక్ డౌన్ పరిస్థితులు తప్పవేమోనన్న ఆందోళనను వైద్య నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. అయితే దేశంలో అత్యధికులకు వ్యాక్సినేషన్ పూర్తి అయ్యింది కనుక అలాంటి పరిస్థితి తలెత్తే అవకాశాలు లేవన్న వాదనా వినిపిస్తోంది. ఏది ఏమైనా కరోనా మహమ్మారి మరో సారి విజృంభిస్తోందన్న మాట అయితే వాస్తవమని అందరూ అంగీకరిస్తున్నారు. వాస్తవానికి ఈ ఏడాది జనవరిలోనే కరోనా డేంజర్ బెల్స్ మెగాయి.  అప్పట్లోనే అధికార వర్గాలు, వైద్య నిపుణులు కోవిడ్ జాగ్రత్తలు కొనసాగించడం తప్పని సరి అని  హెచ్చరికలు జారీ చేశాయి.  కేసుల  పెరుగుదలను ఎదుర్కోవడానికి దేశం యొక్క సంసిద్ధతను అంచనా వేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ, ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా సమావేశాలు నిర్వహించారు. ఇక తాజాగా కోవిడ్ కేసుల విజృంభణ దృష్ట్యా తమిళనాడు ప్రభుత్వం దేశంలోని మిగిలిన అన్ని రాష్ట్రాల కంటే ముందుగా అప్రమత్తమైంది. థియోటర్లలో మాస్కులను తప్పని సరి చేసింది. మిగిలిన రాష్ట్రాలు కూడా అప్రమత్తమై కోవిడ్ నియంత్రణకు చర్యలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా థియోటర్లు, కార్యాలయాలలో ఏసీల కింద కూర్చుని పని చేసే వారు తప్పనిసరిగా మాస్కులు ధరించాల్సి ఉంటుంది. అలాగే భౌతిక దూరం పాటించడం, శుభ్రతకు పెద్ద పీట వేయడం వంటి చర్యలు తీసుకోవాలి. 

తెలంగాణలో ప్రశ్న పత్రాల లీకేజీల జాతర? రెండో రోజూ టెన్త్ ప్రశ్న పత్రం లీక్

తెలంగాణలో ప్రస్తుతం ప్రశ్నపత్రాల లీకేజీల జాతర నడుస్తోంది. పరీక్ష ఏదైనా. పేపర్ ఏదైనా, పోటీ పరీక్షలైనా, పబ్లిక్ ఎగ్జామ్స్ అయినా ప్రశ్నపత్రం లీక్ అయి తీరాల్సిందే అన్నట్లుగా పరిస్థితి విరాజిల్లుతోంది. ఇటీవల టీఎస్పీఎస్పీ ప్రశ్న పత్రాల లీకేజీ సృష్టించిన సంచలనం ఇంకా కొనసాగుతుండగానే.. టెన్త్ పరీక్షలు ప్రారంభమైన తొలి రోజు నుంచీ ఆ ప్రశ్న పత్రాల లీకేజీ మొదలైంది. తొలి రోజు సోమవారం టెన్త్ ప్రశ్నపత్రం లీకైంది. వాట్సాప్ గ్రూపులో ప్రత్యక్షమైంది. ఇందుకు బాధ్యులుగా కొందరిపై చర్య తీసుకోవడమూ జరిగింది. పరీక్షలు వాయిదా వేయాల్సిన అవసరం లేదు.. యథాతథంగా జరుగుతాయని ప్రభుత్వం ప్రకటించింది. అంతలోనే మరో సంచలనం నమోదైంది. ఈ సారి ఏకంగా ప్రశ్న పత్రాలు లీక్ కావడం కాదు, విద్యార్థులు రాసిన జవాబు పత్రాలు మాయమయ్యాయి. ఎలాగంటే ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో టెన్త్ పరీక్ష రాసిన విద్యార్థుల ప్రశ్నపత్రాలు మాయమయ్యాయి.   పరీక్షా కేంద్రం నుంచి ఓ ఆటోలో ఆన్సర్ పేపర్ల బండిల్స్ తరలిస్తుండగా..  పోస్టాఫీస్‌కు చేరుకునేలోపు అందులోంచి ఒక బండిల్ మిస్ అయింది. ఆ బండిల్‌లో దాదాపు 30 మంది విద్యార్థుల జవాబు పత్రాలు ఉన్నట్లు సమాచారం. దీనిపై ఊట్నూరు మండల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ఇక మంగళవారం కూడా టెన్త్ పరీక్ష పత్రం లీకైంది. తొలి రోజు తెలుగు ప్రశ్న పత్రం లీకైతే.. రెండో రోజు హిందీ ప్రశ్నపత్రం లీకైంది. పరీక్ష ప్రారంభమై అరగంట గడిచిందో లేదో ప్రశ్నపత్రం వాట్సప్ లో ప్రత్యక్షమైంది. ఈ సంఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. దీంతో తెలంగాణ ప్రభుత్వానికి అసలు  పరీక్షలు నిర్వహించే సత్తా ఉందా అని విపక్షాల ప్రశ్నిస్తున్నాయి టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవహారంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ విపక్షాలు  పరీక్ష పత్రాల లీకేజీ సాధారణమే అన్నట్లుగా ఆయన మాట్లాడారని విమర్శిస్తున్నాయి. ఆయన మాటలకు తగ్గట్టుగానే తెలంగాణలో ప్రశ్న పత్రాల లీకేజీ జాతర జరుగుతోందా అన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయని విమర్శిస్తున్నారు.  

జగన్ తానే మారెనా.. తీరే మారెనా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ లో మార్పు స్పష్టంగా కనిపిస్తోందా అంటే.. సోమవారం జరిగిన పార్టీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, నియోజకవర్గ ఇన్ చార్జిలతో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగం విన్న వారంతా ఔననే సమాధానమిస్తున్నారు. వైనాట్ 175 నుంచి గ్రాఫ్ పెంచుకోకపోతే గెలుపు సులభ సాధ్యం కాదు అనే స్థాయికి ఆయన ధీమా దిగజారిపోయిందంటున్నారు.  దీంతో ఆయన అసంతృప్త ఎమ్మెల్యేలు, నాయకులను బుజ్జగించడానికి త్వమేవ శరణం నాస్తి అన్నట్లుగా మాట్లాడుతున్నారని చెబుతున్నారు. గెలుపు గుర్రాలకే టికెట్లు అంటూ ఇంత కాలం ఎమ్మెల్యేలకు, మంత్రులకు హెచ్చరికలు మాత్రమే జారీ చేసిన జగన్ ఇప్పుడు పూర్తిగా మారిపోయారు. ఇటీవలి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో తెలుగుదేశం అభ్యర్థి పంచుమర్తి అనూరాథ విజయానికి తమ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగే కారణమంటూ కనీసం వారి సంజాయిషీ కూడా కోరకుండా సస్పెన్షన్ వేటు వేసిన ఆయన ఇప్పుడు స్వయంగా తన నోటితోనే పార్టీలో దాదాపు 60 మంది వరకూ ఎమ్మెల్యేలలో అసంతృప్తి గూడుకట్టుకుని ఉందన్న విషయాన్ని వెల్లడించారు. సరే ఇది విపక్ష తెలుగుదేశం ఆరోపణగా చెప్పారనుకోండి అది వేరే విషయం. అయినా అసంతృప్త ఎమ్మెల్యేల సంఖ్య భారీగానే ఉందని ఆయన అంగీకరించినట్లుగానే భావించాల్సి ఉంటుందని అందుకు ఆయన ఎవరినీ వదులు కోవడం తన అభిమతం కాదన అనడంతోనే తేటతెల్లమైందని పరిశీలకులు అంటున్నారు.   చాలాకాలం తర్వాత జగన్‌ ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశంలో ఎలాంటి క్లాసులూ, హెచ్చరికలు, బెదరింపులూ లేకుండా.. బుజ్జగింపు మాటలు, బతిమలాడుకునేలా జగన్ ప్రసంగం ఉండటంతో జగన్ లో మార్పు ప్రస్ఫుటంగా కనిపించిందనీ,   గతంలో పనిచేయకపోతే టికెట్లు ఇచ్చేది లేదని, మీకు అనేక అవకాశాలు ఇచ్చానని   బెదిరింపు ధోరణితో మాట్లాడిన జగన్‌.. ఈసారి మాత్రం చాలా సాత్వికంగా, ప్రశాంతంగా ‘నేను మీ వాడిని’, ‘మిమ్మల్ని మళ్లీ గెలిపించడమే నా లక్ష్యం’ అంటూ మాట్లాడటంపై ఎమ్మెల్యేలలోనే ఎమ్మెల్సీ ఎన్నికల దెబ్బకు తమ అధినేత దిగి వచ్చాడన్న చర్చ మొదలైంది. ఇక ఎమ్మెల్యేలు ఏళ్ల తరబడి చేస్తున్న పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ కూ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.  అన్నిటికీ మించి ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు ఆయన సిట్టింగులందరికీ టికెట్లిస్తానని చెప్పారు.  ఈ సమావేశం అనంతరం పలువురు ఎమ్మెల్యేలు జగన్ దిగి వచ్చేశారనీ, గతంలోలా ఆయనలో వైనాట్ 175 ధీమా ఇసుమంతైనా కనిపించడం లేదనీ, బొటాబొటీగానైనా మెజారిటీ స్థానాలు సాధించి మళ్లీ అధికారంలోకి వస్తే అదే పదివేలు అన్న భావన వ్యక్తమైందని అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. అధికార పగ్గాలు చేపట్టిన నాలుగేళ్ల తరువాత ఆయనకు ఎమ్మెల్యేల విలువ ఏంటో తెలిసినట్లుందని కూడా వ్యాఖ్యానిస్తున్నారు.