కమలం గూటికి ఏకే ఆంటోనీ కుమారుడు

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీ కమలం తీర్థం పుచ్చుకున్నారు. ఏకే ఆంటోనీ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, గాంధీ కుటుంబానికి అత్యంత విధేయుడు, సన్నిహితుడైన నాయకుడు. అటువంటి నాయకుడి కుమారుడు బీజేపీ గూటికి చేరడం ఒక విధంగా కాంగ్రెస్ ను ఊహించని ఎదురుదెబ్బ అనడంలో సందేహం లేదు. ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీ  కేరళ బీజేపీ  అధ్యక్షుడు కే సురేంద్రన్ తో కలిసి ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయానికి చేరుకుని అక్కడ గులాబీ కండువా కప్పుకున్నారు. నిన్న మొన్నటి వరకూ కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ డిజిటల్ మీడియా సెల్ కన్వీనర్ గా క్రియాశీలంగా వ్యవహరించిన అనిల్ ఆంటోనీ కొద్ది రోజుల కిందట కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు.   ప్రధాని మోడీపై బీబీసీ డాక్యుమెంటరీ విషయంపై ఆయన కాంగ్రెస్ అధిష్ఠానంతో విబేధించారు. ఆ కారణంతోనే ఆయన కాంగ్రెస్ పార్టీని వీడారు.  మోడీపై బీబీసీ డాక్యుమెంటరీ విషయంలో కాంగ్రెస్ తీరును తప్పుపట్టిన ఆయన వివరణను వినడానికి కూడా కాంగ్రెస్ అధిష్ఠానం ఇష్టపడకపోవడంతో ఆయన కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. ఆ సందర్భంగా ఆయన కాంగ్రెస్ లో కోటరీ గాళ్లదే రాజ్యం అయిపోయిందని ఘాటు విమర్శలు కూడా చేశారు. ఆయన కాంగ్రెస్ ను వీడటం ఒకెత్తయితే.. బీజేపీ గూటికి చేరడం మాత్రం కాంగ్రెస్ జీర్ణించుకోలేని అంశమేనని పరిశీలకులు అంటున్నారు. అంటోనీ కుమారుడు కమలం గూటికి చేరడం కాంగ్రెస్ ప్రతిష్టను మసకబారుస్తుందనడంలో సందేహం లేదని అంటున్నారు. అలాగే తాజాగా కాంగ్రెస్ మాజీ నేత గులాం నబీ ఆజాద్ కూడా తాను కాంగ్రెస్ లో ఉన్న సమయంలో కాంగ్రెస్ నాయకత్వం కంటే మోడీ అండ్ కో తనను ఎక్కువగా గౌరవించారని చేసిన వ్యాఖ్యలు కూడా దుమారం లేపుతున్నాయి. కాంగ్రెస్ లో పాతతరం నాయకులకు, సీనియర్లకు తగిన గౌరవం దక్కడం లేదంటూ వస్తున్న విమర్శలకు ఆంటోనీ కుమారుడు పార్టీ మారడం, ఆజాద్ వ్యాఖ్యలూ బలం చేకూరుస్తున్నాయని చెబుతున్నారు. 

దేశంలో మళ్ళీ కరోనా కలకలం

దేశంలో మరో మారు కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. రోజు రోజుకు కొత్త కేసుల సంఖ్య పెరగడంతో పాటుగా, మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడల చేసిన తాజా గణాంకాలే ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. ఒకే రోజులో ఇంచు మించుగా 50 శాతానికి పైగా హెచ్చు కేసులు నమోదవుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తాజా గణాంకాలను బట్టి తెలుస్తోంది. ఈ నేపధ్యంలోనే కేంద్ర ప్రభుత్వం  రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు కరోనా కట్టడి చర్యలకు సంబందించి స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది.    కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదలచేసిన  తాజా గణాంకాల ప్రకారం    బుధవారం(ఏప్రిల్ 5) ఒకే రోజు దేశవ్యాప్తంగా 5 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం యాక్టివ్ కేసులు పాతిక వేలు దాటాయి.  24 గంటల్లోనే 5 వేల 335 కేసులు నమోదు కావటంపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం అయ్యింది. 24 గంటల్లోనే కరోనాతో 15 మంది చనిపోయినట్లు ప్రకటించింది కేంద్రం. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ చేసింది. కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. దేశంలో రోజువారీ పాజిటివ్ రేటు 3.32 శాతానికి పెరగటం   ఆందోళన కలిగిస్తున్నదని   పేర్కొంది  కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ.  పాజిటివ్ రేటు వారాంతానికి తీసుకుంటే మాత్రం అది 2.79 శాతంగా ఉంది.  2023, ఏప్రిల్ ఒకటో తేదీన 2 వేల 994 కేసులు నమోదు కాగా.. ఏప్రిల్ 6వ తేదీ నాటికి అవి 5 వేలు దాటాయి. రోజువారీగా కొత్త కేసులు 500 పెరుగుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. దేశంలో ప్రస్తుతం కరోనా రోజువారీ పాజిటివిటీ రేటు 3.38 శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 2.79 శాతంగా నమోదైంది. ఇక దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతోంది.  దేశంలో ఇప్పటివరకు 220.66 కోట్ల డోసుల కోవిడ్ -19 వ్యాక్సిన్‌‌ను అందించారు.  మహారాష్ట్రలో ఒకే రోజులో కోవిడ్ కేసులు 186 శాతం పెరిగాయి.  గత 24 గంటల్లో 711 తాజా ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,792కి చేరుకుంది. మహారాష్ట్రతో పాటుగా తెలంగాణ సహా మొత్తం ఆరు రాష్త్రాలలో కేరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని కేంద్ర ప్రభుత్వం నెల రోజుల క్రితమే రాష్ట్ర ప్రభుతాలను హెచ్చరించింది. అందుకు కొనసాగింపుగా తెలంగాణ సహా ఆరు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. నిజానికి గత కొన్ని నెలలుగా భారత్ లో కొరోనా  కేసుల సంఖ్య చాలా తగ్గింది. కానీ గత నెలరోజులకు పైగా కొన్ని రాష్ట్రాల్లో మళ్లీ కొరోనా కేసుల సంఖ్యలో పెరుగుదల నమోదవుతున్నట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ గుర్తించింది. దాంతో, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచిస్తూ ఆయా రాష్ట్రాలకు లేఖ రాసింది సహా చాలా వరకు రాష్ట్రాలు కేంద్ర మార్గదర్శకాలను పట్టిచుకున్న దాఖలాలు కనిపించడం లేదు.

కాంగ్రెస్ ను వీడను బాబోయ్ అంటున్నా ఎవరూ నమ్మరేం.. కోమటిరెడ్డి

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి గుడ్ బై చెబుతున్నారనే వార్తలు కలకలం రేపాయి. కోమటిరెడ్డి రాజీనామాను అధికారికంగా ప్రకటించేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరిగింది. కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న  వెంకట్ రెడ్డికి పార్టీ నుంచి సరైన సహకారం లేకపోవడంతో పార్టీని విడిచి పెట్టేందుకు సిద్దమయ్యారని ప్రచారం జరిగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడుతారని ప్రచారం జరగడం ఇదే తొలిసారి కాదు. గతంలో మునుగోడు ఎన్నికల సమయంలో కూడా ఇదే తరహా ప్రచారం జరిగింది.  పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నియామకాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన కోమటిరెడ్డి, పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా బహిరంగంగానే విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో నాయకుల్ని చేర్చుకునే విషయంలో కూడా రేవంత్ రెడ్డితో కోమటిరెడ్డి విభేదించారు. చెరుకు సుధాకర్ ని చేర్చుకున్న సమయంలో  అలిగి.. బీజేపీ అగ్రనేత అమిత్ షా తో   సమావేశమై కలకలం రేపారు. గతంలో పీసీసీ అధ్యక్ష, ఏఐసీసీ పదవులు ఆశించిన వెంకట్ రెడ్డి,  ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్ అగ్ర నాయకులు సర్ది చెప్పడంతో సర్దుకుపోయారు. ఆ తర్వాత కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదనే అక్రోశం కోమటిరెడ్డిలో ఉంది. తనకు ఎలాంటి పదవులు రాకపోవడంతో వెంకట్ రెడ్డి మనస్తాపానికి గురయ్యారని అనుచరులు చెబుతున్నారు. కాంగ్రెస్ పెద్దలు ఎప్పటికప్పుడు సర్ధిచెప్పే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. ఎంపీ వెంకటరెడ్డి సోదరుడు రాజగోపాల్ పార్టీ వీడినప్పటి నుంచి కాంగ్రెస్ నేతలతో దూరం పెరిగింది. కాంగ్రెస్ అధిష్టానం ఊరడించడంతో వెంకటరెడ్డి తన నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వస్తున్నారని అనుచరులు చెబుతున్నారు. పార్టీ మార్పు వార్తలు దుమారం రేపడంతో ఎంపీ కోమటిరెడ్డి మీడియా ముఖంగా వాటిని ఖండించారు. ఉద్దేశ్య పూర్వకంగానే కొందరు తనను డ్యామేజ్ చేస్తున్నారని ఆరోపించారు. తనది కాంగ్రెస్ రక్తమని, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తనకు పార్టీ మారే ఉద్దేశం లేదు మొర్రో అని మొత్తుకుంటున్నా ఎవరూ ఎందుకు నమ్మడం లేదని ఆకోషం వ్యక్తం చేశారు.  రాజీనామా చేయాలన్న  నిర్ణయం తీసుకో లేదని చెప్పారు. రాహుల్ గాంధీ అనర్హతను నిరసిస్తూ గాంధీభవన్ లో చేసిన దీక్షలో పాల్గొన్నాననీ,  భువనగిరి నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు పాల్గొంటున్నానని వివరణ ఇచ్చారు. తన ముందు ఎలాంటి ఆప్షన్స్ లేవని తనది కాంగ్రెస్ రక్తమని చెప్పుకొచ్చారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంతలా చెబుతున్నా.. ఆయన పార్టీ మారతారన్న వదంతులు ఆగకుండా రావడానికి ఆయన వ్యవహార శైలే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. చిన్న చిన్న సమస్యలపై ప్రధాని మోడీతోనూ, హోంమంత్రి అమిత్ షాతోనూ భేటీ కావడంపై కోమటిరెడ్డి గతంలో ఇచ్చిన వివరణలు నమ్మశక్యంగా లేవు. పార్టీ క్రమశిక్షణ సంఘం ఇచ్చిన నోటీసులను చెత్తబుట్టలో పారేశానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు, ముందు ముందు కాంగ్రెస్, బీఆర్ఎస్ లు కలుస్తాయంటూ చేసిన కామెంట్స్ ఇవన్నీ కూడా ఆయన కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పనున్నారన్న వార్తలకు బలం చేకూర్చేవిగా ఉండటమే.. ఆయన తనది కాంగ్రెస్ రక్తం అని చెబుతున్నా.. ఎవరూ నమ్మకపోవడానికి కారణమని పరిశీలకులు అంటున్నారు. 

అన్నీ తెలిసీ మౌనమేల మోడీజీ!

ఏపీని పంజాబ్ తో పోలుస్తూ పరిస్థితులు అధ్వానంగా తయారయ్యాయని ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు, ఏపీలోని అస్తవ్యస్థ పరిస్థితులకు అద్దం పట్టడమే కాకుండా కేంద్రంలోని ఆయన సర్కార్ నిష్క్రియాపరత్వాన్ని కూడా ఎత్తి చూపేలా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. ఔను మరి అప్పులు, అరాచకలతో ఏపీ నానాటికీ దిగజారిపోతోందని మోడీ అన్నారని తెలుగుదేశం ఎంపీ కనకమేడల చెప్పారు. ఏపీలో పరిస్థితులపై   వివరిస్తున్న సందర్భంగా మోడీ కల్పించుకుని తన వద్ద సమాచారం ఉందని అన్నారని కనకమేడల మీడియా సమావేశంలో చెప్పారు. ఆ విషయంలో మోడీ జోక్యాన్ని కోరామని ఆయన అన్నారు. ఏపీ అప్పులు, అస్తవ్యస్థ పరిస్థితులు, గంజాయి ఆంధ్రప్రదేశ్ గా మారిన తీరు గురించిన సమాచారం మోడీ వద్ద ఉన్నప్పుడు చర్యలు తీసుకోవడానికి ఆయన ఎందుకు వెనుకాడుతున్నారని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. అన్నీ తెలిసినా పట్టనట్ల వ్యవహరించడంలో మోడీ స్థితప్రజ్ణత సాధించారు. సీబీఐ, ఐటీ, ఈడీ వంటి సంస్థల పని తీరు భేషుగ్గా ఉందని మెచ్చుకుంటూనే, ఎటువంటి ఒత్తిడులూ లేకుండా స్వేచ్ఛగా పని చేయాలని సలహా ఇస్తూనే.. విపక్షాలు వినా అధికార బీజేపీ నేతలపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు ఎందుకు చేయడం లేదని కేంద్ర దర్యాప్తు సంస్థలను ఆయన ప్రశ్నించిన పాపాన పోలేదు.  అలాగే ఏపీ ముఖ్యమంత్రి జగన్ సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తునకు అడుగడుగునా అడ్డు తగులుతున్న వారిని ఎందుకు ఉపేక్షిస్తున్నారని ప్రశ్నించలేదు.  ఇప్పుడు ఆయన ఏపీలో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయనీ, పంజాబ్ ను తలపిస్తున్నాయనీ చేసిన కామెంట్లు ఆయన స్వయంగా మీడియా ముందు చెప్పినవి కావు. ఏపీలో విపక్షానికి చెందిన ఎంపీ ఒకరు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేసిన సందర్భంగా చెప్పిన మాటలు. మోడీ ఆ మాటలు నిజంగా అని ఉండకపోయినా.. మీతో కనుక అన్నాను, ఈ మాటలు మీడియా ముందు వెల్లడించవద్దని ఆ ఎంపీకి సూచించినా ఆయన వాటిని బయటపెట్టే అవకాశం లేదు. అంటే మోడీ తాను ఏ విషయాన్నీ పట్టించుకోరు.. అన్నీ తెలిసినా చర్యలు తీసుకోరు. ఏదైనా విషయం తన దృష్టికి తీసుకురావడానికి ఎవరైనా ప్రయత్నిస్తే మాత్రం ఆ సమాచారం అంతా తన వద్ద ఉందని చెప్పి వారి నోరు మూయిస్తారు.  రాజకీయ లబ్ధి ఉందని భావిస్తే తప్ప ఆయన క్రియాశీలంగా వ్యవహరించరు. ఇప్పటి వరకూ మోడీ తీరుపై విపక్షాల నుంచి వస్తున్న విమర్శలివి. తాజాగా ఏపీ విషయంలో ఆయన చేసిన కామెంట్స్ చూస్తే విపక్షాల విమర్శలు అక్షర సత్యాలని అనిపించక మానవు.    ప్రధానమంత్రి మోదీ పంజాబ్‌తో ఏపీని పోల్చారు. పంజాబ్‌లో   డ్రగ్స్, రౌడీ గ్యాంగులు చెలరేగిపోతున్నాయి. శాంతి భద్రతల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఖలిస్తాన్ ఉద్యమం మళ్లీ పెచ్చరిల్లుతోంది. మొత్తంగా ఆ రాష్ట్రంలో పరిస్థితులు దేశాన్నే దెబ్బతీసేవిగా ఉన్నాయి. అటువంటి పంజాబ్ తో ఏపీలో మోడీ పోల్చారంటే ఏపీలో పరిస్థితులు కూడా దేశ ప్రయోజనాలకు భంగం వాటిల్లేవిగా ఉన్నాయనే అర్ధం. పరిస్థితులు అంత తీవ్రంగా ఉన్నా మోడీ ఎందుకు పట్టించుకోవడం లేదు.. పట్టించుకోకపోవడం, పట్టించుకోవడం పక్కన పెడితే.. ఏపీలో అధ్వాన పరిస్థితులకు కారణమైన రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు రెండు చేతులా సహకారం అందిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆ రాస్ట్రం చేస్తున్న అప్పులకు ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. అంటే ఆయన నుంచి సమాధానం రాకపోవచ్చుకు కానీ రాజకీయ పరిశీలకుల నుంచి, సామాన్య మానవుడి వరకూ అందరికీ కారణం ఏమిటన్నది తెలుసు. అది రాజకీయ ప్రయోజనం.  ఏపీలో వైసీపీ మూకలు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పై  దాడి చేశాయి.  పక్కా ప్రణాళికతో ఆ దాడి జరిగింది. ఆ దాడిని అడ్డుకోకుండా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. అయినా కూడా దాడి జరిగిన వారిపైనే కేసులు నమోదు చేశారు.  అయినా మోడీ మౌనంగా ఉండిపోయారు. ఇదంతా చూస్తుంటే.. ఆయనకు సమస్యల పరిష్కారం కంటే.. తప్పులను చక్కదిద్దడం కంటే, అవినీతిని, అక్రమాలను అరికట్టడం కంటే రాజకీయ ప్రయోజనమే ముఖ్యమన్న విపక్షాల విమర్శలు వాస్తవమేనని అనిపించక మానదు. 

ప్రతి ఆరుగురిలో ఒకరికి వంధత్వ సమస్య.. డబ్ల్యుహెచ్ఓ

ప్రపంచంలో ప్రతి ఆరుగురిలో ఒకరు వంధ్యత్వ సమస్యతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ ఓ) వెల్లడించింది. మొత్తం జనాభాలో 17.15 శాతం మందిలో ఈ సమస్య ఉందని, దీనిని అధిగమించడానికి   సంతాన సాఫల్య చికిత్సలు అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలని ప్రపంచ దేశాలకు సూచించింది. వంధ్యత్వ సమస్యలో ప్రాంతాల బేధం పెద్దగా లేదని డబ్ల్యుహెచ్ ఓ పేర్కొంది.  సంపన్న,అభివృద్ధి చెందుతున్న, పేద దేశాలన్నిటికీ  ఇదో పెద్ద సవాలుగా మారిందని సంస్థ విడుదల చేసిన తాజా నివేదికలో పేర్కొంది.  సంపన్న దేశాల్లో 17.8 శాతం, అభివృద్ధి చెందుతున్న, పేదదేశాల్లో 16.5 శాతం మందిలో వంధ్యత్వ సమస్య ఉందని సదరు నివేదిక వివరించింది. సంతానలేమి సమస్య అనేది ప్రతి ప్రాంతంలోనూ ఒకేలా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ  చెబుతోంది. ఇంత మంది ఎదుర్కొంటున్న ఈ సమస్యను అధిగమించడానికి సంతాన సాఫల్య సౌకర్యాలను విస్తరించాలని, అవి అందుబాటు ధరల్లో ఉండాలని, తక్కువ వ్యయం, భద్రతతో కూడిన విధానాలను తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నది. వరుసగా 12 నెలలు, అంతకంటే ఎక్కువ కాలం శృంగారంలో పాల్గొన్న దంపతులకు పిల్లలు కలగకపోతే దానిని వంధ్యత్వ సమస్యగా గుర్తిస్తారు. వంధ్యత్వ నివారణ, నిర్ధారణ, ఐవీఎఫ్ తదితర చికిత్సా విధానాలకు అతి తక్కువ నిధుల కేటాయింపు, పరిమితంగా చికిత్స అందుబాటులో ఉండటం ఇబ్బందిగా మారిందని  పేర్కొంది. ఐవీఎఫ్ కోసం భారీగా ఖర్చు చేస్తున్న కోట్ల మంది ప్రజలు పేదరికంలోకి జారిపోతున్నారని తెలిపింది. అత్యుత్తమ పాలసీలు, ప్రభుత్వ నిధుల కేటాయింపు ద్వారా ఈ సమస్య కారణంగా  ప్రజలు పేదరికంలోకి జారకుండా కాపాడవచ్చని సూచించారు.  ప్రపంచ జనాభా  విపరీతంగా  పెరుగిపోతందన్న ఆందోళన ఓ వైపు..  సంతాన లేమి పై ఆందోళన మరో వైపు ఒకే సమయంలో ఈ పరస్పర విరుద్ధ సమస్యలు మానవాళిని  ఆందోళనలోకి నెట్టడం గమనార్హం.

మరో చీతా పారిపోయింది..!

నమీబియా నుంచి తీసుకొచ్చిన ఆఫ్రికన్ జాతి చీతాలు నిర్దేశిత ప్రాంతం దాటి బయటకు వెళ్తున్నాయి. ఇటీవలే తప్పించుకుపోయిన ఒబాన్ ను అటవీ అధికారులు అనేక ప్రయత్నాల అనంతరం సురక్షితంగా పార్కుకు తీసుకువచ్చారు.   ఇటీవల ఒక చీతా మరణించింది. ఇప్పుడు మరో చీతా పారిపోయింది. ఆశా అనే చీతా కూనో నేషనల్ పార్కులోని రిజర్వ్ ఫారెస్ట్ దాటి వీరుర్ ప్రాంతంలోని బఫర్ జోన్లోని వెళ్లిపోయింది. అది నదుల వెంట సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఆశాకు.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఆ పేరు పెట్టారు. ఈ చీతాల వల్ల మనుషులకు ఎలాంటి ప్రమాదం లేదని అటవీ అధికాలు చెబుతున్నారు. చీతాలు జనావాస ప్రాంతాల్లో సంచరించవని తెలిపారు. అయితే, ఈ చీతా బఫర్ జోన్ పరిధిలోని గ్రామాల్లో సంచరిస్తూ.. ప్రజలను భయాందోళలకు గురిచేస్తున్నాయి. ప్రతిష్టాత్మకంగా ప్రధాని మోడీ చేతులమీద ప్రారంభించిన చీతాల పెంపక కార్యక్రమం.. అవి ఒక్కొక్కటిగా పారిపోతుండటంతో.. జూ అధికారులు ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు...

నెల నెల నివేదికలు ఇవ్వండి.. జగన్ సర్కార్ కు గవర్నర్ ఆదేశం

జగన్ సర్కార్ పై కేంద్రం నిఘా ఆరంభమైందా? ఇంత కాలం అన్ని విధాలుగా జగన్ సర్కార్ కు చేదోడు వాదోడుగా ఉన్న మోడీ సర్కార్ ఇకపై అలా ఉండదా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు.  ఏపీ ప్రభుత్వం ఇక నుంచి తనకు నెలవారీ నివేదికలు పంపాలని   గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆదేశాలు జారీ చేశారు.  గవర్నర్ ఇలా ఆదేశించడాన్ని కొందరు తప్పుపడుతుంటే.. మరి కొందరు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కు నెలవారీ నివేదికలు పంపడం సాధారణ ప్రక్రియలో భాగమేనంటున్నారు. ఆ సాధారణ ప్రక్రియను జగన్ సర్కార్ అమలు చేయడం లేదు కనుకనే గవర్నర్ ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చిందని చెబుతున్నారు.  అయితే వైసీపీ అనుకూలురు మాత్రం ఇది   కేంద్ర ప్రభుత్వ నిఘాగా అభివర్ణిస్తున్నారు.  విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు  గత నెల 29న గవర్నర్ కార్యాలయం నుంచి పాలనాపరమైన అంశాలపై ప్రతినెలా నివేదిక పంపాలంటూ సాధారణ పరిపాలన శాఖకు లేఖ అందింది.  రాష్ట్ర ప్రభుత్వ పాలన, ఆర్థిక అంశాలపై విపక్ష పార్టీలు తరుచూ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో కీలక శాఖల పనితీరుపై నెలవారి నివేదికలు పంపాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ కార్యాలయం ఆదేశించడం ప్రాధాన్యత సంతరించుకుంది.   జగన్ ప్రభుత్వంపై వస్తున్న  ఆరోపణల నేపధ్యంలో...రాష్ట్ర ప్రభుత్వ పాలనపై గవర్నర్  అబ్దుల్ నజీర్ దృష్టిసారించారు.  రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాలు,   ఆర్థిక పరిస్థితిపై ప్రతిపక్ష టీడీపీ, బీజేపీ, జనసేన సహా అన్ని పార్టీలు వేలెత్తి చూపుతున్నాయి. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందంటూ ఆయా పార్టీలు ప్రభుత్వంపై విమర్శులు సంధిస్తున్నారు. కొందరు ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఈ క్రమంలో రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం నిశితంగా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. మరో ఏడాదిలో ఎన్నికలు జరగ నున్న నేపథ్యంలో గవర్నర్ కార్యాలయం స్పందించడం కీలక పరిణామంగా చెబుతున్నారు. గత తెదేపా ప్రభుత్వంలో కూడా ఎన్నిలకు ముందు ఇదే తరహాలో గవర్నర్ కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లిన విషయాన్ని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. టీడీపీ, బీజేపీ కలిసి 2014లో ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఎన్నికలకు ఏడాది ముందు రెండు పార్టీల మధ్య సఖ్యత చెడింది. అటు కేంద్రం నుంచి టీడీపీ, ఇటు రాష్ట్రం నుంచి బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామ్యం నుంచి తప్పుకున్నాయి. ఈ క్రమంలోనే అప్పటి గవర్నర్ ప్రభుత్వ పాలనాంశాలపై నెలవారీ నివేదిక ఇవ్వాలంటూ ఆదేశించారు.   వివిధ రాజ కీయ పార్టీల నుంచి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పథకాలు దుర్వినియోగం కాకుండా కట్టడి చేయడంలో భాగంగానే గవర్నర్ నుంచి ఈ ఆదేశాలు వచ్చాయని భావిస్తున్నారు.  

గాంధీ పాఠం డిలీట్.. ఎన్సీఈఆర్టీ లీల!

 పన్నెండవ తరగతి పొలిటికల్ సైన్స్ పాఠ్య పుస్తకం నుంచి మహాత్మా గాంధీకి సంబంధించిన అంశాలను ఎన్సీఈఆర్టీ తొలగించింది.  ఎన్సీఈఆర్టీ వివాదస్పద నిర్ణయంపై విపక్షాలు, విద్యావేత్తలు భగ్గుమంటున్నాయి.  చరిత్రను తమకు అనుగుణంగా మార్చుకునేందు కేంద్రంలోని బీజేపీ చేసే ప్రయత్నంలో భాగమే ఈ నిర్ణయమని విమర్శలు గుప్పిస్తున్నాయి. కొత్తగా రూపొందించిన 12వ తరగతి పాఠ్య పుస్తకాల నుంచి గతంలో ఉన్న కొన్ని పాఠ్యాంశాలను ఎన్సీఈఆర్టీ ( నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ) తొలగించింది. ముఖ్యంగా రాజనీతి శాస్త్రం సబ్జెక్టులో నుంచి మహాత్మాగాంధీకి సంబంధించిన కీలక అంశాలను తొలగించింది. హిందూ, ముస్లిం ఐక్యత కోసం గాంధీజీ  పరితపించడం, ఆ కారణంగా హిందూ అతివాదులు మహాత్మాగాంధీని ద్వేషించడం, గాంధీ హత్య అనంతరం ఆరెస్సెస్ పై నిషేధం విధించడం.. మొదలైన అంశాలను  ఎన్సీఈఆర్టీ తొలగించింది. 12వ తరగతి రాజనీతి శాస్త్రం పాఠ్య పుస్తకంలోని  స్వాతంత్య్రం తరువాత భారతదేశంలో రాజకీయాలు అనే చాప్టర్ నుంచి ఈ అంశాలను తొలగించింది.  మహాత్మా గాంధీ త్యాగం   అనే సబ్ టాపిక్ ను పూర్తిగా డిలీట్ చేసింది. హిందూ ముస్లింల ఐక్యత కోసం గాంధీజీ కృషి చేయడం.. హిందూ అతివాదులకు నచ్చలేదు. వారు గాంధీజీ ముస్లింలకు, పాకిస్తాన్ కు అనుకూలంగా ఉన్నట్లు భావించారు. పాకిస్తాన్ ను ముస్లిం దేశంగా ప్రకటించినట్లుగా భారతదేశాన్ని కూడా హిందూ దేశంగా ప్రకటించాలని వారు ఆశించారు. అందుకు గాంధీజీ అడ్డుగా ఉన్నట్లు భావించారు. అందుకే ఆయనను హతమార్చడానికి పలుమార్లు ప్రయత్నించారని మహాత్మా గాంధీ త్యాగం అనే చాప్టర్ లోని ఒక పేరాగ్రాఫ్ లో ఉంది. ఆ పేరాగ్రాఫ్ ను పూర్తిగా తొలగించారు. గాంధీజీ హత్య అనంతరం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ను నిషేధించిన ప్రస్తావనను కూడా సిలబస్ నుంచి తొలగించారు.  మత విద్వేషాన్ని ప్రచారం చేస్తున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సంస్థలపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. వాటిపై నిషేధం విధించింది. దాంతో, కొంతవరకు మత రాజకీయాల ప్రభావం తగ్గిందని ఉన్న పేరాను కూడా ఎన్సీఈఆర్టీ తొలగించింది. 12వ తరగతి చరిత్ర పుస్తకంలోని థీమ్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ 3 లో గాంధీజీ హత్యకు సంబంధించిన ఒక పేరాగ్రాఫ్ లో కూడా మార్పులు చేసింది. గాంధీజీని 1948 జనవరి 30న హత్య చేసింది నాథూరాం గాడ్సే అని కొత్తగా ముద్రించిన పాఠ్య పుస్తకంలో ఒకే వ్యాక్యంలో తేల్చేశారు. గతంలో చెలామణిలో ఉన్న పాఠ్య పుస్తకాల్లో  జనవరి 30 ప్రార్థనల అనంతరం గాంధీజీని  పుణె కు చెందిన బ్రాహ్మణుడైన నాథూరాం గాడ్సే  తుపాకీతో కాల్పులు జరిపి హత్య చేశాడు. నాథూరాం గాడ్సే  ఒక హిందూ అతివాద పత్రికకు ఎడిటర్. గాంధీజీని ముస్లింల మద్దతుదారుగా ఇతడు గతంలో ప్రకటించాడని ఉంది. గత సంవత్సరం ఎన్సీఈఆర్టీ చేపట్టిన 30 శాతం సిలబస్ రేషనలైజేషన్ కు అదనంగా, ఇప్పుడు ఈ తొలగింపులను చేపట్టడం గమనార్హం. ఈ తొలగింపుల అనంతరం ముద్రించిన పాఠ్య పుస్తకాలు 2023 - 24 విద్యా సంవత్సరంలో విద్యార్థులకు అందుబాటులోకి రానున్నాయి. పాఠ్యపుస్తకాలలో విషయాన్ని మార్చి ఎట్టకేలకు బీజేపీ తన అసలు రంగును, ఉద్దేశ్యాన్ని చూపిందని పలువురు ప్రతిపక్ష నేతలతో సహా అనేక మంది విద్యావేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కొడాలి నాని అడ్డాలో చంద్రబాబు!

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు..  వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఆ క్రమంలో ఓ వైపు  జోనల్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఉత్తరాంధ్ర జోనల్  సమావేశాలు.. విశాఖపట్నం వేదికగా జరుగుతున్నాయి. ఎన్నికల వేళ.. పార్టీ శ్రేణులకు ఆయన కీలక దిశా నిర్దేశం చేస్తున్నారు.  అలాగే ఏప్రిల్ 11న చంద్రబాబు.. రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. అనంతరం అంటే 12వ తేదీన ఆయన ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆ క్రమంలో 13వ తేదీన గుడివాడలో జరిగే భారీ బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొనున్నారు. అనంతరం ఎన్టీఆర్ జన్మ స్థలం నిమ్మకురు చేరుకుని.. ఆ రాత్రి ఆయన అక్కడే బస చేయనున్నారు. అ మరునాడు అంటే 14న మచిలీపట్నంలో జోనల్ సమావేశం జరగనుంది. ఆ సమావేశంలో కీలక నేతలతో ఆయన భేటీ కానున్నారు.   అయితే కొడాలి నాని ఇలాకా అంటే.. గుడివాడలో చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న భారీ బహిరంగ సభపైనే అందరూ దృష్టి సారించారు. తెలుగుదేశం పార్టీ ద్వారా కొడాలి నాని..  రాజకీయ అరంగేట్రం చేసి... ఆ తర్వాత జగన్ పార్టీలోకి జంప్ కొట్టి.. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేశ్‌ల లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. కొడాలి నాని ఆరోపణలు  శృతిమించాయి.  దీంతో అతడి వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  అలాంటి వేళ.. గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు  చంద్రబాబు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. అదీకాక.. 2019 ఎన్నికల తర్వాత గుడివాడలో చంద్రబాబు పాల్గొంటున్న తొలి సభ ఇదే కావడంతో.. ఈ సభపై అందరి ఫోకస్ పడింది. మరోవైపు గతంలో గుడివాడలో మినీ మహానాడు జరుగుతుందని అంతా భావించినా.. ఎందుకో అది కార్యరూపం దాల్చలేదు.  ఇక ఇప్పుడు చంద్రబాబు గుడివాడలో భారీ బహిరంగ సభలో పాల్గొనడమే కాకుండా   ఇదే సభ వేదికపై నుంచి గుడివాడ అసెంబ్లీ అభ్యర్థిని చంద్రబాబు ప్రకటించే అవకాశం ఉందన్న చర్చ తెలుగుదేశంలో జోరుగా సాగుతోంది. దీంతో ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం టికెట్ ఆశావహులు   రావి వెంకటేశ్వరరావు,  వెనిగండ్ల రాము వర్గీయులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే  తెలుగుదేశం చేపట్టిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి, బాదుడే బాదుడు కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. నారా లోకేశ్ పాదయాత్ర యువగళం పేరుతో దూసుకుపోతోంది. నారా లోకేశ్.. తన పాదయాత్రలో వివిధ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థుల పేర్లను సైతం  ప్రకటిస్తు ముందుకు సాగుతోన్నారు.  అలాగే ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ రాయలసీమలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం  తెలుగుదేశం అభ్యర్థులు విజయ దుందుభి మోగించారు. అదే విధంగా ఎమ్మెల్యే కోటా  ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ బరిలో దింపిన   అభ్యర్థి పంచుమర్తి అనురాధ   సునాయాసంగా గెలుపొందారు.  దీంతో జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత.. ఇటు సైకిల్ పార్టీపై ప్రజల్లో ఆదరణ ఉందని పక్కాగా స్పష్టమైంది. ఇటువంటి పరిస్థితుల్లో మరికొద్దిగా కష్టపడితే.. కొడాలి నాని కంచుకోటను బద్దలు కొట్టడం ఖాయమన్న భావన తెలుగుదేశంలో బలంగా వ్యక్తమౌతోంది.

రికార్డింగ్ డ్యాన్స్ లో ఎమ్మెల్సీ చిందులు!

మనిసన్నాక కూసింత కళాపోషణ ఉండాలి.. లేకుంటే మడిసికీ గొడ్డుకూ తేడా ఏటుంటాది.. ముత్యాల ముగ్గు సినిమాలో కాంట్రాక్టర్ రావుగోపాలరావు చెప్పిన డైలాగొకటి భలేగా పేలింది.  ఆ మాటలను అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని పలువురు ప్రజా ప్రతినిధులు కరెస్టుగా అంది పుచ్చుకున్నారని నెటిజనులు తెగ ట్రోల్ చేస్తున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయల్.. రికార్డింగ్ డ్యాన్స్‌లో అమ్మాయిలతో వేసిన చిందుల వీడియో ఒకటి  సోషల్ మీడియాలో   తెగ ట్రెండ్ అవుతోంది.  దీనిపై నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు నడి రోడ్డుపై వేసిన డ్యాన్స్‌లు.. మరో మంత్రి ఆర్కే రోజా.. పలు సందర్బాల్లో వివిధ వేదికలపై వేసిన చిందులు.. జనం మరిచి పోకముందే.. అదే పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ‌బొమ్మి ఇజ్రాయిల్... ఇలా రికార్డింగ్ డ్యాన్స్ లో అమ్మాయిలతో కలిసి చిందులు  వేయడం పట్ల   తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అధికార పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు.. హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేసిన సంఘటనతో అధికార పార్టీ పరువు నడి బజార్లో పోయింది. అలాంటి వేళ.. అదే ఉమ్మడి జిల్లాలోని మరో ఎమ్మెల్సీ.. ఇలా అమ్మాయిలతో రికార్డింగ్ డ్యాన్సులు చేయడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.  శాసన మండలి అంటే... రాష్ట్రాల్లోని పెద్దల సభ అని.. అలాంటి సభకు ఎమ్మెల్సీలు.. ప్రాతినిధ్యం వహించి.. సమాజంలోని వివిధ వర్గాల సమస్యలను ఈ సభ వేదికగా గళం విప్పి.. ప్రశ్నలు సంధిస్తారని వారు పేర్కొంటున్నారు. అంతటి ప్రాశస్త్యం ఉన్న శాసనమండలికి ఇలాంటి వాళ్లనా?.. అదీ ఎమ్మెల్యే కోటాలోనా?.. వైసీపీ పంపిందని నెటిజన్లు ముక్కున వేలేసుకొంటున్నారు.  అయినా అటు ఎమ్మెల్యేలు కానీ.. ఇటు ఎమ్మెల్సీలు కానీ హుందాగా ఉండాలి.. హుందాగా వ్యవహరించాలని.. అంతే కానీ..ఎక్కడి పడితే అక్కడ.. ఇలా స్థాయిని మరిచి డ్యాన్సులు వేయడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే వైసీపీఅధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ తొలి కేబినెట్‌లోని మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, అనిల్‌కుమార్ యాదవ్, కురసాల కన్నబాబు, వెల్లంపల్లి శ్రీనివాసరావు.. అలాగే జగన్ మలి కేబినెట్‌లో మంత్రులు అంబటి రాంబాబు, ఆర్కే రోజా, జోగి రమేష్ తదితరులు ప్రెస్ మీట్ పెట్టి వాడే భాష సంగతి అందరికీ తెలిసిందేనని నెటిజన్లు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.  

బండికి 14 రోజుల రిమాండ్.. ఖమ్మం జైలుకు తరలింపు

టెన్త్ పేపర్ లీకేజీ కేసులో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కు పోలీసులు అరెస్టు చేసి వరంగల్ సీపీ రంగనాథ్ ధృవీకరించారు. పేపర్ లీకేజీ కంటే ముందే బండి సంజయ్ తో నిందితుడు ప్రశాంత్ చాట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. బండి సంజయ్ తో ప్రశాంత్ వందకు పైగా కాల్స్ మాట్లాడినట్లు పోలీసులు క్లారిటీకి వచ్చారు.  తెలంగాణ బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్ ను వరంగల్ సీపీ రంగనాథ్ ధృవీకరించారు. 10 వ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ, ఆ తర్వాత ప్రచారాల్లో బండి సంజయ్ హస్తం ఉందని అన్నారు. బండిపై 5 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. 420, 120B, సెక్షన్ 5 ఆఫ్ మాల్ ప్రాక్టీస్, సీఆర్పీసీ 154, 157 కింద  నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.  కాగా బండి సంజయ్ ను హనుమకొండ ప్రిన్సిపల్ మేజిస్ట్రేట్ ఎదుట పోలీసులు హాజరు పరిచారు. ఆయన బండి సంజయ్ కు 14 రోజుల రిమాండ్ విధించారు.  దీంతో పోలీసులు బండి సంజయ్ ను ఖమ్మం జైలుకు తరలించారు. కాగా బండి సంజయ్ పోలీసులు తన పట్ల వ్యవహరించిన తీరును బీజేపీ లీగల్ సెల్ ప్రతినిథులకు వివరించారు.  పోలీసులు దురుసుగా వ్యవహరించి తనకు గాయపరిచారని చెబుతూ  చొక్కా విప్పి లాయర్లకు గాయాలను చూపారు. ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

అనుకున్నదొకటి.. అయినది మరొకటి

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. అంతకు ముందు కేంద్ర మంత్రి, బీజేపే ఏపీ వ్యవహారాల ఇంచార్జి మురళీధరన్ తోనూ సమావేశమయ్యారు. కేంద్ర హోంశాఖ మంత్రి  అమిత్ షా, ప్రధాని మోదీతో కూడా పవన్ కళ్యాణ్ సమావేశమవుతారని వార్తలు వచ్చినా, ఆయన రెండు రోజులు ఢిల్లీలో ఉన్నా, అలాంటిదేమీ జరగ లేదు. మురళీధరన్, నడ్డాతో సమావేశమై పవన్ కళ్యాణ్ రిటర్న్ ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ చేరుకున్నారు.  ఒక విధగా చూస్తే ఈ సమావేశానికి బీజేపీ నాయకత్వం పెద్దగా ఆసక్తి చూపినట్లు లేదు. ఓ మొక్కుబడి తంతుగానే ముచ్చట్లు ముగిశాయి. రాష్ట్రంలో బీజేపీ నాయకులు ఎలాగైతే జన సేనతో అంటీముట్టనట్లు వ్యవహరిస్తారో అదే విధంగా ఢిల్లీ నేతలు వ్యవహరించారు. బీజేపీ రాష్ట్ర నాయకులు తనను పట్టించుకోక పోయినా, ఢిల్లీ నాయకులు తనకు సముచిత గౌరవం ఇస్తారనే భ్రమల్లో ఉన్నపవన్ కళ్యాణ్ కు ఈ పర్యటనలో బీజేపే తత్త్వం బోధ పడేలా వారు ట్రీట్ చేశారని, చూసినవారికి అర్థమైంది. పిలవని పేరంటానికి వచ్చిన పెద్ద ముత్తయిదువును ట్రీట్ చేసిన విధంగానే, ఢిల్లీ పెద్దలు పవన్ కళ్యాణ్ తో వ్యవహరించారని మీడియా కథనాలను బట్టి తెలుస్తోంది.  అదలా ఉంటే  నడ్డాతో  సమావేశం అనతరం పవన్ కళ్యాణ్  స్వయంగా పలికిన పలుకులలోని అస్పష్టతను గమనిస్తే  ఆయన ఢిల్లీ వచ్చిన కార్యం నెరవేరలేదని స్పష్టమైందని  అంటున్నారు. అలాగే  మీడియాతో మాట్లాడే సమయంలో పవన్ కళ్యాణ్, ఆయన పక్కన నిలుచున్న నాదెండ్ల మనోహర్ బాడీ లాంగ్వేజ్  గమనిస్తే  పవన్ కళ్యాణ్ నటించిఃన జల్సా సినిమాలోని  కామెడీ సీన్  గుర్తుకొస్తోందని అంటున్నారు.  నిజానికి  పవన్ ఢిల్లీ యాత్రపై జనసేన వర్గాల్లోనే కాదు, సామాన్య ప్రజలలో కూడా చాలానే అంచనాలున్నాయి. ముఖ్యంగా సంవత్సర కాలానికి పైగా ఎటూ తేలకుండా గాలిలో తేలుతున్న ఎన్నికల పొత్తులపై స్పష్టత వస్తుందని ఆశించారు.ఈ నేపధ్యంలోనే ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితులు  రానున్న ఎన్నికల్లో  పొత్తులపై  అనుసరించాల్సిన వ్యూహంపై  బీజేపీ అగ్రనేతలతో  చర్చించేందుకే  పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లినట్టుగా  ప్రచారం జరిగింది. నిజంగా కూడా పవన్ కళ్యాణ్ ఉద్దేశం అదే కావచ్చు. కానీ  బీజేపీ పెద్దల ఆలోచన మరో విధంగా వుందో ఏమో కానీ పొత్తుల విషయం పక్కన పెట్టి కర్ణాటక ఎన్నికల్లో ప్రచారం గురించి మాట్లాడి పంపించారు. అంటే బీజేపీ ఏపీ రాజకీయాలపై కనీసం ప్రస్తుతానికి ఎలాంటి  నిర్ణయం తీసుకునేందుకు సిద్దంగా లేదనే విషయం స్పష్టమైందని అంటున్నారు.  ఇతర విషయాలు ఎలా ఉన్నా పవన్ కళ్యాణ్ కు రెండు విషయాల్లో క్లారిటీ వుంది. రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలనను అంతమొందించవలసిన చారిత్రక అవశరాన్ని పవన్ కళ్యాణ్ గుర్తించారు. అలాగే  వైసేపీ అరాచక పాలన అంతమొందించేందుకు  ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదనే విషయంలోను పవన్ కళ్యాణ్ కు ఫుల్ క్లారిటీ వుంది. కమిట్మెంట్  వుంది. అందుకే  2014 పొత్తులను పునరుద్ధరించి  వైసీపీ అరాచక పాలన అంతమొందించాలనే  ఆలోచనతో బీజేపీతో పొత్తును కొనసాగిస్తున్నారు. అయితే, బీజేపీ లెక్కలు వేరుగా ఉన్నట్లున్నాయి .. అందుకే,  పొత్తుల విషయం పక్కన పెట్టి కాలయాపన చేస్తోందని అంటున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా బీజేపీ ఉచ్చులోంచి బయటకు రావాలని పరిశీలకులు అంటున్నారు. ఇంకా జాప్యం చేస్తే మొదటికే మోసం వస్తుందని అంటున్నారు.

బండి అరెస్టుపై బీజేపీ హై కమాండ్ సీరియస్!

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అరెస్ట్  వ్యవహారం రాష్ట్రంలోనే కాదు, దేశంలోనూ సంచలనంగా మారింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనకు మూడు రోజుల ముందు చోటు చేసుకున్న ఈ పరిణామాన్ని, బీజేపీ జాతీయ నాయకత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. బండి సంజయ్ అరెస్ట్  పై స్పందించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా  అరెస్ట్ ను బీజేపీ హైకమాండ్ తీవ్రంగా పరిగణిస్తోందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై రాష్ట్ర ముఖ్యనేతలతో నడ్డా ఫోన్‌లో మాట్టాడారు. న్యాయపరమైన అవకాశాలను పరిశీలించాల్సిందిగా   సూచించారు.  అంతకు ముందు, దేశంలోని రాజకీయ పరిణామాలు, పార్లమెంట్ సమావేశాలపై చర్చించేందుకు బీజేపీ హై కమాండ్ సమావేశమైంది. ఈ సమావేశం ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడుజేపీ నడ్డా ప్రత్యేకంగా సమావేశమై బండి అరెస్ట్ విషయాన్ని చర్చించారు. ఈ సందర్భంగా బండి అరెస్ట్ సందర్భంగా జరిగిన పరిణామాలను ప్రధాని మోడీ అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో మోడీ పర్యటనకు ముందు ఇలా జరగటంపై చర్చించారు.   బండి సంజయ్ అరెస్టుకు కారణాలు ఏంటీ.. ఏయే సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు.. అరెస్ట్ చేసిన తీరును ప్రధాని మోడీకి వివరించారు నడ్డా, అమిత్ షా.మరో రెడ్నురోజుల్లో 8వ తేదీన ప్రధాని రాష్ట్రంలో పర్యటించాల్సిన ఉన్న క్రమంలో.. ఏర్పాట్లు చేస్తున్న సమయంలోనే రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను అరెస్ట్ చేయటం.. చేసిన తీరును ప్రధాని మోడీకి నడ్డా, అమిత్ షా వివరించారు. ఈ క్రమంలోనే ప్రధాని మోడీ సైతం స్పందించినట్లు తెలుస్తుంది. న్యాయపరమైన అన్ని అంశాలను పరిశీలించాలని.. బండి సంజయ్ కు పార్టీ శ్రేణులు అండగా ఉండాలని స్పష్టం చేశారని పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర నేతలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ.. పరిస్థితులను తెలుసుకోవాలని మోడీ సూచించారు.  మరోవంక బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల బాధ్యులు, తరుణ్ చుగ్   బండి అక్రమ అరెస్ట్ ను బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని పేర్కొన్నారు. ఈమేరకు ఆయన ఒక ప్రకటన్ విడుదల చేశారు. ఈ సంధర్భంగా ఆయన బండి సంజయ్ అక్రమ అరెస్ట్ ను బీజేపీ జాతీయ నాయకత్వం చాలా సీరియస్ గా తీసుకుందని, ఇందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదని అన్నారు.     కాగా, స్వార్థ రాజకీయాల కోసం బీజేపీ నాయకులు విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. పదో తరగతి ప్రశ్నపత్రాల లీక్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అరెస్టు తదనంతర పరిణామాల నేపథ్యంలో ఆయన ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘పిచ్చోడి చేతిలో రాయి ఉంటే వచ్చి పోయేటోళ్లకే ప్రమాదం.. అదే పిచ్చోడి చేతిలో ఒక పార్టీ ఉంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదం. స్వార్థ రాజకీయాల కోసం ప్రశ్నపత్రాలు లీక్‌ చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు’’ అని కేటీఆర్‌ మండిపడ్డారు.

సలహాల్రావులు.. సర్వాధికారులు!

నూరు పూలు వికసించనీ..  వేయి ఆలోచనలు సంఘర్షించనీ అంటాడు మావో. అలాగే ప్రజా క్షేత్రంలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు తమ ఆలోచనలూ, ఆచరణా మరింత మెరుగ్గా ప్రజా సేవకు, సంక్షేమానికి, అభివృద్ధికీ దోహదపడేందుకు సలహాదారులపై ఆధారపడటం కద్దు. ఆ విధంగానే ముఖ్యమంత్రులు కొందరు సలహాదారులను నియమించుకుని.. పాలన మరింత సమర్ధంగా సాగేందుకు వీలుగా వారి సహకారం తీసుకుంటారు. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో   రాజకీయాలలో సంచలనం సృష్టించిన తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావుకు కూడా ఒక సలహాదారుల బృందం ఉండేది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడూ, విపక్ష నేతగా ఉన్నప్పుడూ ఈ బృందం ఆయనకు చేదోడు వాదోడుగా నిలిచింది. ఆ సలహాదారుల బృందం రాజకీయ సర్కిల్స్ లో గండిపేట మేధావులుగా గుర్తింపు పొందింది. వీరు కేవీ సత్యనారాయణ, అట్లూరి వెంకటేశ్వరరావు, మింటె పద్మనాభం, నందివాడ సాంబశివరావు, ప్రొఫెసర్ ఎఫ్ డీ వకీల్, ప్రొఫెసర్ ఆర్వీఆర్ చంద్రశేఖరరావు, తుమ్మల చౌదరి. ఎన్టీఆర్ పాలనలో తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులు, అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాల వెనుక వీరి సలహాలే ఉన్నాయని చెబుతారు. కానీ వీరెన్నడూ తెరదాటి ముందుకు రాలేదు.    అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డికి కూడా చంద్రమౌళిరెడ్డి అనే సలహాదారు ఉండేవారు. సీపీఐఎంఎల్ పీపుల్స్ వార్ (ఇప్పటి మావోయిస్టు పార్టీ)పై నిషేధం ఎత్తివేత, ప్రజాయుద్ధ నౌక గద్దర్ కు స్వేచ్ఛ వంటి మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వ నిర్ణయాల వెనుక ఉన్నది చంద్రమౌళిరెడ్డి సలహాలే అని చెబుతారు. ఆయన కూడా తెర వెనుకే ఉన్నారు తప్ప బయటకు వచ్చి అంతా తన ఘనతే అని చాటుకోలేదు. అలాగే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి కేవీపీ సలహాదారుగా వ్యవహరించారు. పాలనాపరమైన, పార్టీ పరమైన అన్ని వ్యవహారాలలోనూ  వైఎస్ రాజశేఖరరెడ్డికి కేవీపీ చేదోడు వాదోడుగా ఉండేవారు. కేవీపీ ఆమోదం లేకుండా వైఎస్ ఏ నిర్ణయం తీసుకునే వారు కాదని చెబుతారు. సలహాదారుగానే కాకుండా కేవీపీ వైఎస్ కు ఆత్మబంధువుగా కూడా చెబుతారు. అయినా కూడా ఆయన వైఎస్ వెనుక కనిపించేవారే కానీ ఎన్నడూ ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలపై మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన దాఖలాలు లేవు.   కేవీపీ ప్రత్యక్ష రాజకీయాలలో కూడా చురుకుగా ఉండేవారు కనుక ఆయన జనాలకు   సుపరిచితులే. అయితే ఎన్నడూ సర్వం తానేనన్నట్లుగా మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వ నిర్ణయాలను ప్రకటించిన దాఖలాలు లేవు. ఇక చంద్రబాబు సలహాదారు కుటుంబరావు అయితే విభజిత ఆంధ్రప్రదేశ్ లో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా  పని చేశారు. ఆ హోదాలో ప్రభుత్వ ఆర్థిక విధానాలపై మీడియాతో మాట్లాడేవారే కానీ ఆ పరిధిని దాటలేదు. ఇక ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఎందరో సలహాదారులు ఉండొచ్చు కానీ ప్రస్ఫుటంగా అందరికీ తెలిసిన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రభుత్వ, పార్టీ పరంగా అన్నిటా ఆయనే అన్నట్లుగా సజ్జల తీరు ఉంటుంది. సకల శాఖల మంత్రిగానే కాకుండా డిఫాక్టో సీఎంగా కూడా ఆయనే ప్రభుత్వ విధానాలు, పార్టీ నిర్ణయాలను మీడియాకు వెల్లడిస్తుంటారు. జగన్ కేబినెట్ లోని ఏ మంత్రీ కూడా తమ తమ శాఖలకు సంబంధించిన వివరాలు మీడియా సమావేశం పెట్టి వెళ్లడించే అవకాశం ఇవ్వకుండా సజ్జలే వెల్లడించేస్తారు. ఇక ప్రభుత్వ అభివృద్ధిపై సాధారణంగా ఆయా శాఖల బాధ్యతలు చూస్తే ఐఏఎస్ లు మీడియాకు వెళ్లడిస్తారు. కానీ ఆ విషయాలను మీడియా ముఖంగా చెప్పే పని కూడా సజ్జలే సొంతం చేసేసుకున్నారు. జగన్ సర్కార్ లో జగన్ ను మించి నిర్ణయాలు తీసుకునేదీ, అమలు చేసేదీ కూడా సజ్జలేనని వైసీపీ వర్గాలే చెబుతుంటాయి. సలహాదారుగా కంటే సజ్జల సర్వాధికారిగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  అలాగే పార్టీ శ్రేణుల్లో కూడా సజ్జల తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతున్నది. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సలహాదారు కేవీపీకి  ప్రస్తుత సీఎం సలహాదారు సజ్జలకు ఉన్న బేధాన్ని ఎత్తి చూపుతున్నారు. 

ఏపీ డిప్యూటీ సీఎంకు అసమ్మతి సెగ??|

 ఆంధ్ర ప్రదేశ్  రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీలో  అంతర్గత కుమ్ములాటలు, జిల్లా నుంచి జిల్లాకు, నియోజక్ వర్గం నుంచి నియోజాక వర్గానికి విస్తరిస్తున్నాయి. ఇంతవరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, తమ మాటే, శిలాశాసనం అన్నట్లుగా వ్యవహరించిన వారు, అలాగే, యథా సీఎం తథా మంత్రి, యథా మంత్రి తథా ఎమ్మెల్యే అన్నట్లుగా, పై నుంచి కింది వరకు ఎవరికి వారు, తమ తమ పరిధిలో నేనే రాజు నేనే మంత్రి అన్నట్లుగా వ్యవహరించారు. అయితే, ఇప్పడు సీన్ రివర్స్ అయ్యింది. తాడేపల్లి ప్యాలెస్ మొదలు పంచాయతీ స్థాయి వరకు ఎక్కడి క్కడ అసమ్మతి బుసలు కొడుతోంది.  కాగా, తాజగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి కి సొంత పార్టీలో అసమ్మతి మొదలైంది. పెనుమూరు మండలానికి చెందిన ఆయన వ్యతిరేక వర్గం సమావేశమై నారాయణ స్వామిపై ఘాటుగా విమర్శలు చేశారు. నారాయణస్వామి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని.. ఎవరిని అడిగి మండల పార్టీ కన్వీనర్లను మార్చేశారని సొంత పార్టీ వారే నిలదీస్తున్నారు.   ‘గడప, గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమానికి జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లను ఆహ్వానించడం లేదనీ,  పార్టీ కోసం కష్టపడిన వారిని పక్కన పెట్టారని.. టీడీపీ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నారాయణస్వామి నియమించిన కన్వీనర్లను అంగీకరించేది లేదని గట్టిగా ధిక్కార స్వరం విమర్శించారు. నారాయణస్వామి అధికారులు, పోలీసుల్ని అడ్డుగా పెట్టుకుని అక్రమంగా కేసులు పెట్టిస్తున్నారని సొంత పార్టీ శ్రేణులే చెబుతున్నాయి, ఇదిలా ఉంచితే తనపై అసమ్మతీయులు చేిస తీరుపై నారాయణ స్వామి ఆగ్రహం వ్య్తం చేశారు,. అసమ్మతి వర్గం తీరుపై నారాయణ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడూ పార్టీ అభివృద్ధికి పనిచేయనివారు టీడీపీ నేతలతో కలిసి తిరుగుతున్నారని.. సొంత పార్టీకి నష్టం చేసేవాళ్లను వదిలేసే ప్రసక్తేలేదన్నారు. పెనుమూరు మండలంలో కొందరు సొంత పార్టీ నాయకులే కుట్ర రాజకీయాలు చేస్తున్నారని, అలాంటి వాటిని సహించేదిలేదని హెచ్చరించారు. కొందరు భూ ఆక్రమణదారులకు నోటీసులు అందాయని.. తప్పు చేయకుంటే ఆ నోటీసులకు సమాధానం ఇవ్వాలి కానీ తన మీద నిందలు మోపడం ఎంతవరకు సమంజసమని నారాయణ స్వామి అసమ్మతి నేతలపై ఎదురు ది చేస్తున్నారు.అసమ్మతి నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పార్టీ కోసం కష్టపడినవారికి కచ్చితంగా ప్రాధాన్యం ఉంటుందన్నారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం తీరుపై సొంత పార్టీ నేతలే విమర్శలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. మరోవైపు నారాయణ స్వామికి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఊహించని పరిణామం ఎదురైంది. సొంత నియోజకవర్గం గంగాధర నెల్లూరు కార్వేటినగరం పంచాయతీలో పర్యటిస్తున్న సందర్బంగా యువకుల నుంచి డిప్యూటీ సీఎంను యువకులు నిలదీశారు.  డీఎస్సీ నిర్వహణ,  నిరుద్యగోగ యువతకు ఉద్యోగావకాశాలు.  జాబ్ క్యాలెండరక తదితర అంశాలపై జనం డిప్యూటీ సీఎంపై ప్రశ్నల వర్షం కురిపించారు.  రోడ్లు, డ్రైనేజీ సమస్యలను కూడా వారీ సందర్భంగా ప్రస్తావించారు.   నిజానికి ఇది ఒక్క ఉప ముఖ్యమంత్రి సమస్య కాదు ... మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరికీ వారు అసమ్మతి సెగల తాకిడికి ఉక్కపోతకు గురవుతున్నారు. అంతే కాదు,మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డ, ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా పేర్కొనే ఎమ్మెల్యేలు కూడా పార్టీలో ఎదురవుతున్న అవమానాలను భరించలేక పోతున్నారు. అందుకే ఆయన గడప గడకు మన ప్రభుత్వం సమీక్షకు కూడా హాజరు కాలేదని, అలాగే, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి రికెట్ ఇవ్వక పోతే రాజకీయాలకు స్వస్తి చెప్పి వ్యవసాయం చేసుకుంటానని అన్నారు . అనే ఆయన ఎంతగా హర్ట్’ అయ్యారో వేరే చెప్పవలసిన అవసరం లేదు. వైసీపీ ఇలాంటి ఎమ్మెల్యేలు ఒకరో ఇద్దరో కాదు చాలా పెద్ద సంఖ్యలోనే ఉన్నారని అంటున్నారు. అందుకే ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. అయితే చేతులు కాలిన తర్వాత ఆకులూ పట్టుకుని ప్రయోజనం ఏముందని అంటున్నారు,

ఆసియా కుబేరుడు అంబానీయే!

ఆసియాలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా ముకేశ్  అంబానీ మళ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీ 24వ స్థానానికి పడిపోయాడు.  83.4 బిలియన్ డాలర్ల నికర సంపదతో ముకేశ్ అంబానీ ఆసియాలోనే సంపన్నులలో అగ్రస్థానంలో నిలిచారు.   గౌతమ్ అదానీ 128 బిలియన్ డాలర్ల సంపదతో గత జనవరి వరకూ  ప్రపంపచ ఫోర్బ్స్ అగ్రగామి పాతిక మంది జాబితాలో మూడో  స్థానంలో ఉన్నారు. అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్ బర్గ్ అదానీ గ్రూప్  ఆఫ్ కంపెనీ అక్రమాలపై నివేదిక సమర్పించడంతో.. అదానీ షేర్లు భారీగా  పతనమైన నేపథ్యంలో అదానీ సంపద భారీగా తరిగి.. ప్రపంచ కుబేరుల జాబితాలో 24 వ స్థానానికి పడిపోయాడు.   అమెజాన్ అధినేత జెఫ్ బెజోఫ్ మూడవ స్థానంలో, ఎలన్ మస్క్ రెండవ స్థానంలో ఉన్నారు.  ఫ్రాన్స్ విలాస వస్తువుల వ్యాపారవేత్త  ఎల్పీఎం హెచ్ ఆధిపతి బెర్నార్డ్ ఆర్నాల్ట్ 211 బిలియన్ డాలర్ల సంపదతో అగ్రస్థానంలో ఉన్నారు. మస్క్ (180 డాలర్లు) బెజోస్ (114 బీ డాలర్లు) వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచారు.  ఫోర్బ్స్ 2023 జాబితాలో 169 మంది భారతీ యులు చోటు దక్కించుకున్నారు. గత ఏడాది ఈ  సంఖ్య 160గా ఉండింది.  

తెలంగాణకు కర్నాటక లింకేమిటి?

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయన్న ఉత్కంఠ ఆ రాష్ట్రంలో కంటే తెలంగాణలో ఎక్కువగా కనిపిస్తోంది. పరిశీలకుల విశ్లేషణల మేరకు ఆ రాష్ట్రంలో ఫలితాలు కచ్చితంగా ఆ తరువాత జరగబోయే తెలంగాణ ఎన్నికలపై ప్రభావం చూపుతాయని చెబుతున్నారు. పొరుగు రాష్ట్రం కనుక ఆ ప్రభావం ఉంటుందని కాదు.. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో విజయం కోసం, విజయం సాధించి అధికారం చేపట్టడం కోసం బీజేపీ, కాంగ్రెస్ లు హోరాహోరీ పోరులో ఉన్నాయి. ఇక్కడ తెలంగాణలో కూడా ఈ రెండు పార్టీలూ అధికారమే లక్ష్యంగా ఎత్తులు, పై ఎత్తులు, వ్యూహాలు, ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాయి. తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కూడా పోటీలో బలంగా ఉంది. అక్కడ కర్నాటకలో మాత్రం బీడీఎస్.. పోటీలో ఉన్నా.. ఆ పార్టీకి సొంతంగా అధికారంలోకి వచ్చే బలం లేదన్నది పరిశీలకుల మాట. అందుకే బీడీఎస్ కర్నాటకలో హంగ్ కోరుకుంటోంది. అలా హంగ్ వస్తే..కింగ్ మేకర్ రోల్ పోషించాలన్నది ఆ పార్టీ అభిమతం. ఇక్కడ తెలంగాణలో మూడు పార్టీలో హోరాహోరీ తలపడుతుండటంతో హంగ్ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని పరిశీలకులు చెబుతున్నారు.  అయితే ఆ అంచనాలు, పరిశీలనలూ పక్కన పెడితే.. కర్నాటక ఎన్నికలలో బీజేపీపై కాంగ్రెస్ పై చేయి సాధిస్తే మాత్రం ఆ ప్రభావం తెలంగాణలో కచ్చితంగా ఉంటుందనీ, కాంగ్రెస్ అవకాశాలు మెరుగుపడతాయనీ చెబుతున్నారు. ఎందుకంటే కర్నాటక ఫలితాల ప్రభావం రాష్ట్రంలో ఓటర్లను కాంగ్రెస్ వైపు మొగ్గు చేపేలా చేస్తుందని చెబుతున్నారు. అదీ కాక తెలంగాణలో గతంతో పోలిస్తే.. ఆ పార్టీ బాగా పుంజుకుందని సర్వేలే చెబుతున్నాయి. ఎనిమిదేళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సహజంగానే ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ఇక దాదాపు అంతే కాలంగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కూడా యాంటీ ఇంకంబెన్సీని ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో  ఓటర్లు బీజేపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపితే.. ఆ ప్రభావం నిస్సందేహంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపైనా పడుతుంది. ఇప్పటికే పుంజుకున్న బలం పొరుగురాష్ట్రంలో విజయంతో మరింతగా పెరిగే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. అలా కాకుండా ఒక వేళ కర్నాటకలో హంగ్ ఏర్పడితే.. ఇక ఇప్పటికే తెలంగాణ సీనియర్ నేతలు చెబుతున్న జోస్యాలు, చేస్తున్న ప్రకటనలకు అనుగుణంగా బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ బీజేపీతో జట్టుకట్టక తప్పని పరిస్థితి ఎదురౌతుంది. అయితే టీపీసీసీ చీఫ్ రేవంత్ మాత్రం తెలంగాణలో, కర్నాటకలో అధికారం చే జిక్కించుకునేది కాంగ్రెస్సేనని ధీమాగా చెబుతున్నారు. కర్నాటకలో కాంగ్రెస్ విజయం కోసం తెలంగాణ నుంచి ఎటువంటి సహకారం అయినా చేయడానికి సిద్ధమని చెబుతున్నారు. పైగా కర్నాటక పీసీసీ చీఫ్ తో రేవంత్ కు తొలి నుంచీ మంచి సంబంధాలే ఉన్నాయి. ఇక బీజేపీ విషయానికి వస్తే దక్షిణాదిన ఆ పార్టీకి ఏమైనా స్టేక్ అంటూ ఉందంటే ఇప్పటి వరకూ కర్నాటకలోనే.. ఇటీవలి కాలంలోనే తెలంగాణలో ఒకింత పుంజుకున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణలో అధికారం దక్కించుకోవాలంటే కర్నాటకలో గెలవక తప్పని అనివార్య పరిస్థితి ఆ పార్టీది. కానీ కర్నాటక ఆనవాయితీ ప్రకారం ఏ పార్టీకి ఆ రాష్ట్ర ప్రజలు వరుసగా రెండో సారి అధికారం ఇవ్వరు. ఇప్పుడు కూడా అదే పునరావృతమైతే.. తెలంగాణపై ఆశలు కూడా వదిలేసుకోవలసిందేనని ఆ పార్టీ అగ్రనాయకత్వం భావిస్తోంది. అందుకే ఎలాగైనా కర్నాటకలో అధికారాన్ని  చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. అలాగే కాంగ్రెస్ కూడా తమ పార్టీ అధ్యక్షుడి సొంత రాష్ట్రంలో ఎలాగైనా విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న పట్టుదలతో ఉంది. 

కర్ణాటకలో మళ్ళీ హంగ్? సీఎం కుమారస్వామేనా?

కర్ణాటక శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. సహజం ఎన్నికల సమయంలో ప్రధాన రాజకీయ పార్టీలలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఏ పార్టీ అధికార పగ్గాలు చేపడుతుంది? అనే చర్చ జరుగుతుంది. కానీ, కర్ణాటకలో మాత్రం, పొలిటికల్ ఫోకస్ మొత్తం మూడో పార్టీ పైనే వుంది. అవును.. అధికార బీజేపీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ ఉంటుంది. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. అయితే కర్ణాటకలో మరో మారు హంగ్ తప్పదనే వ్యూహాగానాలు బలంగా వినిపిస్తున్న నేపధ్యంలో,  రేసులో ఉన్న మూడో పార్టీ జేడీఎస్ ఎటు మొగ్గు చూపుతుంది అనేది ఇప్పడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. నిజానికి కర్ణాటకలో హంగ్ అసెంబ్లీ, సంకీర్ణ ప్రభుత్వాలు కొత్త కాదు. అలాగే అలాంటి పరిస్థితి వచ్చిన ప్రతిసారీ జేడీఎస్ కింగ్ ఆర్  కింగ్ మేకర్ గా కీలకంగా మారుతోంది. 2018 ఎన్నికల తర్వాత కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. 224 మంది సభ్యులున్న సభలో బీజేపీ 106 స్థానాల్లో విజయం సాధించి, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది.  కానీ మేజిక్ ఫిగర్ (113) చేరుకోలేక పోయింది.  దీంతో  78 సీట్లున్న కాంగ్రెస్ పార్టీ మద్దతుతో కేవలం 37 సీట్లు మాత్రమే గెలిచిన జేడీఎస్ ముఖ్యమంత్రి కుర్చీ ఎగరేసుకుపోయింది.  హెచ్ డీ కుమార స్వామి ముఖ్యమంత్రిగా  జేడీఎస్, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కొలువు తీరింది. ఆ తర్వాత ఏం జరిగిందనేది చరిత్ర.  సంకీర్ణంలో చిచ్చు రేగింది. సర్కార్ కూలి పోయింది. ఈ లోగా 15 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బీజేపీలో చేరి ఉప ఎన్నికల్లో గెలిచారు. ఆ విధంగా ఏడాది తిరగక ముందే   యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా  బీజేపీ పూర్తి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది,  ఆ తర్వాత యడ్యూద్యూరప్ప స్థానంలో బ‌స‌వ‌రాజు బొమ్మై ముఖ్యమంత్రిగా వచ్చారు. సరే ఆ చరిత్రను అలా ఉంచితే, రానున్న అసెంబ్లీ ఎన్నికలలోనూ కర్నాటకలో  అదే హంగ్  స్థితి పునరావృతం అయితే .. ఏం జరుగుతుంది?  కింగ్ మేకర్ జేడీఎస్ ఏమి చేస్తుంది అనే విషయంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు, మాజీ ప్రధాన మంత్రి దేవేగౌడ ..  హంగ్ వచ్చినా తమ పార్టీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని స్పష్తం చేశారు.  తన కుమారుడు హెచ్‌డీ కుమారస్వామి ఎవరితోనూ పొత్తులు పెట్టుకోరాదని నిర్ణయించారని దేవెగౌడ వెల్లడించారు. ఎన్నికల ముందు కానీ, తర్వాత కానీ పొత్తులు వద్దనుకున్నామన్నారు. రెండు జాతీయ పార్టీలు, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలతో పొత్తు ఉండదని తేల్చి చెప్పారు.  సొంతంగా అధికారంలోకి రావడంపైనే దృష్టి సారించామని దేవెగౌడ చెప్పారు. సొంతంగా అధికారంలోకి వస్తేనే మ్యానిఫెస్టోలో ప్రకటించే అన్ని కార్యక్రమాలనూ దిగ్విజయంగా అమలు చేయగలుగుతామన్నారు. అయితే  జేడీఎస్ ఒంటరిగా అధికారంలోకి రావడం అయ్యే పనికాదని, హంగ్ అంటూ వస్తే, కాంగ్రెస్ లేదా బీజేపీ మద్దతుతో కుమార స్వామి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేందుకు ప్రయత్నిస్తారని  పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కాగా, మే 10న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 115 నుంచి 127 స్థానాలు గెలుచుకోవచ్చని ఏబీపీ ఒపీనియన్‌ పోల్‌ సర్వే తెలిపింది. ఇదే జరిగితే జేడీఎస్ అవసరం కాంగ్రెస్‌కు ఉండదు. అయితే పీపుల్స్ పల్స్’ తదితర సంస్థలు కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చినా, మేజిక్ ఫిగర్  కు డజను సీట్ల దూరంలో ఉండి పోతుందని, సో .. జేడీఎస్ కింగ్ మేకర్ గా కంటిన్యూ అవుతుందని అంటున్నారు.  మరో వంక బీజేపే నాయకులు 150 సీట్లు గెలుస్తామనే ధీమాతో ఉన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా మిషన్ 150 వ్యూహరచన చేశారనీ అంటున్నారు. అలాగే కాంగ్రెస్ కూడా సింగిల్ గానే అధికారంలోకి వస్తామనే ధీమాతో ఉంది. అయితే బీజేపీ, కాంగ్రెస్ మ్యాజిక్ నెంబర్ చేరుకోకపోతే గత అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే జేడీఎస్ కింగ్‌మేకర్ పాత్రలోకి వెళ్తుంది. కాగా  పస్తుతం 224మంది సభ్యులున్న కర్ణాటక అసెంబ్లీలో బీజేపీకి 119 మంది, కాంగ్రెస్‌‌కు 75 మంది, జేడీఎస్‌కు 28మంది సభ్యులుండగా 2సీట్లు ఖాళీగా ఉన్నాయి. కర్ణాటక లో మే 10న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు మే 13న జరుగుతుంది.

పవన్ హస్తిన పర్యటన..జరిగిందేమిటి? ఒరిగిందేమిటి?

జనసేనాని హస్తిన పర్యటన పై ఏపీలో ఉవ్వెత్తున ఎగసిన ఉత్కంఠ ఆయన హస్తినలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించిన విషయాలతో చప్పున చల్లారిపోయింది. హఠాత్తుగా రాజస్థాన్ హాలీడే ట్రిప్ నుంచి అటు నుంచి అటే హస్తినలో వాలిన జనసేన బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్ చార్జ్ మురళీ ధరన్ తోనూ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోనూ భేటీ అయ్యారు. ఆ తరువాత మంగళవారం (ఏప్రిల్ 4) రాత్రి హస్తినలో విలేకరులతో మాట్లాడారు. ఆయన మాటలలో ఒక్కంటే ఒక్క కొత్త మాట లేదు. గత కొన్నాళ్లుగా ఆయన చెబుతున్నదే మరోసారి చెప్పారు. ఏపీలో వైసీపీ రాక్షస పాలనను అంతం చేయడమే తన లక్ష్యం అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ లక్ష్యం కూడా అదేనని ఉద్ఘాటించారు. కానీ బీజేపీ లక్ష్యం ఏమిటన్నది బీజేపీ నేతల నోటి నుంచే చెప్పించి ఉంటే ఆ ఎఫెక్ట్ మరింతగా ఉండేది. జనసేన అధినేతగా బీజేపీ జాతీయ అధ్యక్షుడితో భేటీ తరువాత ఇరువురూ కలిసి సంయుక్తంగా విలేకరుల ముందుకు వచ్చి ఏపీలో తమ రెండు పార్టీల లక్ష్యం ఒక్కటే అని ప్రకటించి ఉంటే.. ఆ మాటకు విశ్వసనీయత మరింతగా ఉండేది. అలా కాకుండా పవన్ కల్యాణ్ మాత్రమే మీడియా ముందుకు వచ్చి బీజేపీ లక్ష్యాన్ని ప్రకటించడమేమిటని పరిశీలకులే కాదు.. జనసేన శ్రేణులు కూడా ప్రశ్నిస్తున్నాయి. ఏపీలో జగన్ పాలనను అంతం చేయడమే తన లక్ష్యమని పవన్ కల్యాణ్ గత కొంత కాలం నుంచీ చెబుతూనే ఉన్నారు. అదే సమయంలో ఏపీలో తాను మిత్రపక్షంగా ఉన్న బీజేపీ రాష్ట్ర నాయకులతో తనకు అంతగా పొసగడం లేదని కూడా ఆయన పలుమార్లు వెల్లడించారు. అదే సమయంలో కేంద్రంలోని మోడీ, అమిత్ షాలపై తనకు అపారమైన గౌరవం, నమ్మకం ఉందనీ, ఏపీలో రాజకీయ పరిస్థితులపై వారితో చర్చించి, అధికార వైసీపీకి వ్యతిరేకంగా తాను చేస్తున్న పోరాటంలో కలిసి వచ్చేలా వారిని ఒప్పిస్తాని పవన్ కల్యాణ్ గతంలో పలు మార్లు చెప్పారు. అయితే  అటువైపు నుంచి అంటే బీజేపీ నుంచి మాత్రం పవన్ కు అటువంటి గౌరవం మర్యాదా దక్కుతోందా? అంటే పరిశీలకులు అనుమానమే అంటున్నారు.  బీజేపీ ఏపీ విషయంలో అటు  వైసీపీ అధినేత జగన్ తోనూ.. ఇటు జనసేనాని పవన్ కల్యాణ్ తోనూ ఆడుతున్నది పొలిటికల్ గేమ్ మాత్రమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇటు రాష్ట్ర బీజేపీ నేతలు, అటు జాతీయ స్థాయి నేతలూ కూడా పవన్ కల్యాణ్ విషయంలో డబుల్ గేమ్ అడుతున్నారా అన్న అనుమానాలు సైతం పరిశీలకుల్లో వ్యక్తం అవుతున్నాయి.  అసలు ఇంతకీ పవన్ కల్యాణ్ ను హస్తినకు పిలిపించుకుని చర్చించిన విషయం కర్నాటక ఎన్నికలపైనేని అంటున్నారు.